గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, అక్టోబర్ 2010, సోమవారం

శారదా దరహాసం.(అంతర్జాల భువన విజయం)

ప్రియ పాఠకులారా! 
తే.02 - 10 - 2010నశ్రీ భైరవభట్ల కామేశ్వర రావుగారి అధ్యక్షతన శారదా దరహాసము పేరుతో అంతర్జాల భువన విజయము జరిగినది. అందు పూరణలకై 12 సమస్యలు; 11 దత్తపదులు; వర్ణనలకై 7 అంశములు అధ్యక్షులవారు ఇచ్చి యుండిరి. అనేకమంది ఆసక్తిపరులైన కవి పండితులు; కవితాభిమానులు పాల్గొని యుండిరి. తమ వాక్ చమత్కారముతో రచనా సామర్థ్యముతో సభను రంజింపఁ జేసిరి. 
అధ్యక్షుల వారికి; ప్రత్యక్షముగాను; పరోక్షముగాను పాల్గొనిన కవి పండితులకు ఆసక్తితో పాల్గొని; చూచి; ఆనందించినవారికీ; ఈ కార్యక్రమమును నిర్వహించుటకు మూలమైన ప్రొద్దు పత్రికా నిర్వాహకులకు; ముఖ్యముగా యఱ్ఱపురెడ్డి రామనాథ రెడ్డి గారికీ ఆంధ్రామృతం తరపున పాఠకుల తరపున అభినందన పూర్వక ధన్యవాదములు చ్తెలియఁ జేస్తున్నాను. 
ప్రస్తుతం మనం ఆ సభలోప్రస్తావింపఁబడిన సమస్యలను; దత్తపదులను; వర్ణనీయాంశములను ఒక్కొక్కటిగా చూచి పూరించడానికై ప్రయత్నిస్తే ఆ ఆనందం మనమూ పొందవచ్చునని భావిస్తూ అందలి మొదటి సమస్యను మీ ముందుంచుతున్నాను.
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్
ఈ సమస్యకు నా పూరణ చూడండి.
భీకరమైన యుద్ధములు విశ్వ జనీనత, నీతి, నిల్పగా
శ్రీకరమైన భావనలఁ జేసిరొకప్పుడు. నేడు గాంచితే?
లోక విరుద్ధ దుష్కృతులు లుబ్ధతఁ జేయుచు నుండె నెందరో!
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్!
చూచితిరి కదా? మీ అభిప్రాయములను  తెలియఁ జేస్తూ; మీ పూరణలను కూడా వ్యాఖుఅగా పంపంపగలరని ఆశిస్తున్నాను.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అందమైన వాగ్దేవి చిత్రం తో పాటు " సమస్యా పూరణ కుడా మనో రంజకం గా ఉంది.అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.