గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2009, ఆదివారం

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ మన్మహనీయ భావనా పటిమా ప్రకాశితులైన సహృదయ శిరో మణు లైన ఆంధ్ర పాఠక మహాశయులకు, తెలుగు భాషాభిమానులకు, ఆంధ్రామృతాస్వాదనాభిలాషులకు
  " తె లు గు భా షా ది నో త్స వ శు భా కాం క్ష లు "

ఉ:- శారద, సర్వ సద్గుణ విశారదగా మన తెల్గు భాషలో
కోరుచు కావ్య రూపమున కూర్మిని దర్శన మిచ్చుఁ  గాదె! యె
వ్వారలు గాంచ కుండెదరు? వాఙ్మయ రాశిగ నాంధ్ర మాతయై
చేరువయై తెనుంగులకుఁ  క్షేమముఁ  గూర్చెడు నెల్ల వేళలన్.

చ:- తెలుగు కవిత్వమన్న యల తేనెల సోనయటంచు మెచ్చగా,
సలలిత భావగుంభనల సత్ కవి కావ్య మనోజ్ఞ రూప సం
కలిత కవిత్వ తత్వ గుణ గణ్యముగా మదులందు వెల్గుచున్
తెలుగు పఠించు వారలకు తేనెల వాగయి సంతసంబిడున్.

ఉ:- తేనెల తెల్గు భాషకును, దివ్యుల బోలు తెలుంగు వారికిన్,
జాలము నందు కావ్య గుణ జాలము చాలగ చూపు వారికిన్,
మేలగు తెల్గు వెల్గులను మెచ్చుచు వ్రాసెడి పాఠకాళికిన్,
మేలగుఁ గాత! తెల్గుల కమేయ మహోద్ధతి కల్గుఁ  గావుతన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.