ప్రియ సాహితీ బంధువులారా ! సుమనర్నమస్సులు. నిన్నటితో ఆంధ్రామృతం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొన్నదని తెలియ జేయుటకు సంతోషంగా ఉంది.
శ్రీ మహనీయ శక్తి యుత శ్రీకర పాఠక బాంధవాళికిన్,
Print this post
క్షేమము యోగమున్ గొలుపు కేశవు సన్నిభ పండితాళికిన్,
ప్రేమ దలిర్పగా పిలుచు, ప్రేమను పంచెడు సోదరాళికిన్,
నే మనసార వందనలు నీమముతో చరియింతు భక్తితోన్.
ఉ:-
నేటికి వత్సరంబయె. వినీతులు సద్గుణ పుణ్య మూర్తు లే
పాటి మనోజ్ఞభావనలు ప్రస్ఫుటమొప్పగ గుమ్మరించిరో !
మేటిగ తీర్చి దిద్ది, కడు మేలగు బ్లాగని పల్కుచుండి, యీ
నాటి మనోజ్ఞ భావకులు నన్ గణుతింపగ జేసి రందరున్.
ఉ:-
నమ్రత తోడ పల్కెదను. నాదగు శక్తికి మీర హేతువై
కమ్ర కవిత్వ వాహినిని గౌరవ మొప్పగ కల్గ జేయ, నాం
ధ్రామృత నామ ధేయ మది యద్భుత సార్థక నామమై, సతం
బామ్రపు తోరణమ్ములలరారగ జేసిన దాంధ్ర వాకిటన్.
ఉ:-
ఇందరు పాఠకోత్తములు, యెంతటి ప్రేమను, జ్ఞాన తేజమున్,
ఇందరి లోన నాపయిన యేలికలట్టుల గ్రుమ్మరింపగా
సుందరమైన సత్ కవిత సొంపుగ చెప్పితి. వింత కాదు. మీ
రందరు ప్రోత్సహింప కడు హాయిగ నిన్నియు వ్రాయ గల్గితిన్.
మత్త:-
ఇన్ని నాళ్ళును నన్ను మీ దయ నెన్న జేయుచు బ్లాగుకున్
మన్నికన్ కలిగించుచున్ తల మానికమ్మను నట్లుగా
నున్న మీ కృప నెల్ల వేళల నొప్పిదంబుగ గొల్పు మీ
రున్న చాలును చేయ జాలుదు నుజ్వలంబగు సత్కృతుల్.
మహనీయులతో మహిమాన్విత స్నేహ భావము, సంభాషణా భాగ్యము, సదసద్జ్ఞాన సముపార్జన, సత్సంగము, నిరుపమానందము, అవ్యాజానురాగ సంపన్నత, ప్రాశస్త్యము, ఆనంద సామ్రాజ్యాధిపత్యము, మున్నగునవి దైవ దత్త మై సంప్రాప్తించిన వన్న కేవలము మీ అందరి రూపములో వ్యాఖ్యా ప్రవాహమై అందిన ఆంధ్రామృతము నాకు లభించినందుననే కాని వేరు కారణము కాదని సవినయముగా మనవి చేసుకొను చున్నాను. సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు ఐన మీ అందరికీ నా కృతజ్ఞతాభివందము లర్పించుకొనుచున్నాను. మీ అందరి అండదండలతో ఆంధ్రామృతము నిరంతర వాహినిగా ఆంధ్రులకానందామృత సాగరమై భవిష్యత్తులో కూడా ఒప్పార గలదని ఆశిస్తూ అవ్యాజానురాగము చూపుచు, అనన్య సామాన్య జ్ఞాన జ్యోతి ప్రసరణ నాకు కలుగ జేయుచు, అశక్తుడనైన నన్ను సహితం నడిపిన మీ అందరి ఆదరాభిమానాలకూ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకొంటూ అనితర సాధ్యమైన జ్ఞానము మీ వాదోడుతో మైత్రితో పొందగలననే ఆకాంక్షతో మీ ఆదరణకై అర్థిస్తున్నాను.
జైహింద్.
9 comments:
"కడు హాయిగ నిన్నియు వ్రాయ గల్గితిన్"
నిజం. చాలా హాయిగా వ్రాశారు. అభినందనలు.
ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
మీరు బ్లాగు వ్రాయటం మా అదృష్టం
చాలా సంతోషమండీ. శుభాకాంక్షలు, నమస్కారాలు. :)
హార్దిక శుభాకాంక్షలు
psmlakshmi
అంతర్జాల మహాపయోధి జనితంబాంధ్రామృతమ్మిద్ది మా
కెంతో ప్రీతిగ పంచుచుండిరి కడున్ హృద్యమ్ములౌ పద్యముల్
శాంతాకార! మృదు స్వభావ! చిరు హాసస్మేర ముగ్ధాననా!
చింతా రామ! శుభాభినందన నమశ్శ్రీలన్ దగన్ గ్రోలుమా
పుల్లాయన said...
శుభాకాంక్షలు మీ తాత గారికి. ఇంత చిన్న వయసులోనే బ్లాగులు రాస్తున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు.
August 28, 2009 1:01 AM
కొత్త పాళీ said...
అభినందనలు మరియూ శుభాకాంక్షలు మేష్టారూ.
August 28, 2009 4:05 AM
శరత్ 'కాలమ్' said...
చింతా గారు మీ తాతయ్యా? నాకు ఇప్పుడే తెలిసింది. సంతోషం. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు వారిని తప్పక కలుస్తాను. అప్పటికి ఇలా ఎన్ని వార్షికోత్సవాలు చేసుకుంటారో ఏమో!
August 28, 2009 6:30 AM
శ్రీ రవి గారు - శ్రీమతి జ్యోతి గారు - శ్రీఊకదంపుడు గారు - శ్రీ రాఘవగారు - సహృదయులులక్ష్మిగారు - శ్రీ భైరవ భట్ల కామేశ్వర రావుగారు - శ్రీపుల్లాయనగారు - శ్రీకొత్త పాళీగారు - సుహృజ్జన రంజక శరత్ కాలం మున్నగు సాహితీ సన్మితృలు, మదీయ శ్రేయోభిలాషులు, ఆంధ్రామృత బ్లాగభిమానులు చూపుచున్న అవ్యాజానురాగానికి, అభిమానానికి ఆనంద పరవశుడనైనాను.
సుహృన్మితృలారా! మీ ఆకాంక్షలే నన్ను పురోగమనానికి పురికొల్పుతాయి.
జీవించి యున్నంత కాలం మీ వంటి సహృదయుల సాన్నిహిత్యానికి మించిన ఆనంద దాయకమైన విషయం మరొకటుందదని నా భావన.
మీ అందరికీ నా హౄదయ పూర్వక ధన్యవాదములు.
మీ బ్లాగు రెండోయేట అడుగుపెట్టినవేళ నా శుభాకాంక్షలు కూడా అందుకోండి సార్!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.