గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2009, ఆదివారం

మత్తేభము + కందము = సీసము.

sembah
మన ఆంధ్ర సహిత్యం ఒక క్షీర సాగరం అనడంలో యేమాత్రం సందేహించనక్కరలేదు. ఎన్నెన్ని తమాషాలు, యెన్నెన్ని చమక్కులు, ఆహా! ఎంతటి అనుపమ సాహితీ ఖని మన ఆంధ్రామృతము? ఎంత జుఱ్ఱినా తనివి తీరనిది.

నిజానికి మనం తెలుసుకొన గలుగుతున్నవి, తెలిసేసుకున్నాం అనుకొంటున్నవి చాలా, చాలా చాలా తక్కువ అనే అనిపిస్తుంది తెలుసుకొనెకొద్దీ కాడా.

ఒక
మత్తేభాన్ని ఒక సీస గర్భంగాను, ఒక కందాన్ని ఒక తేటగీతి గర్భంగాను రచించి ఆ సీస గీతాలను సీస పద్యంగా రచించబడింది.

అత్యద్భుతమైన సాహితీ ప్రక్రియ కనపరచ గలిగేది ఒక్క ఆంధ్రమే అండంలో ఏమాత్రం
సందేహించనక్కరలేదనడానికి ఈ క్రింది పద్యాల్ని పరిశీలించి ఉదాహరణగా చెప్పవచ్చు.


మత్తేభము:-
నయ సంపన్న! రవి ప్రభూత రమణీనాధా! పయోజేక్షణా!
భయదాకార! హవిర్భుగాయత రిపుప్రాణానిలాహీశ్వరా!
లయ కాలానల విక్రమ ప్రథిత సాల్వగ్రావ వృద్ధశ్రవా !
జయశీలా! యదువీర! కౌస్తుభ ధరా! !యశోదాత్మజా!

కందము:-
కరి వరద! పూతనాంతక !
గరుడ గమన! సత్వ సహిత! కామ జనక! శం
కర సఖ! కనక వసన! సుం
దర దేహ! వనధి శయన! సనకముని వినుత(తా)!

సీసము:-
వి
నయ సంపన్న! రవి ప్రభూత! రమణీ
నాధాపయోజేక్షణా! నరాప్త
వి
భయదాకార! హవిర్భుగాయత! రిపు
ప్రాణానిలాహీశ్వరా! రమేశ!
వి
లయ కాలానల విక్రమ ప్రథిత సా
ల్వగ్రావ వృద్ధశ్రవా! వరేణ్య!
వి
జయశీలా! యదువీర! కౌస్తుభ ధరా !
చక్రీ! యశోదాత్మజా! ముకుంద.
తేటగీతి:-
కరి వరద! పూతనాంతక! గరుడ గమన!
సత్వ సహిత! కామ జనక! శంకర సఖ !
కనక వసన ! సుందర దేహ! వనధి శయన !
సనకముని వినుత/(తా)/ చరణ సరసిజయుగ!

చూచారు కదా ఎంతటి అద్భుత ప్రక్రియో!
మనకు తెలిసినదెంతో తెలియదుకాని తెలియనిది మాత్రం చాలా వుందని నాకనిపిస్తోంది. మఱి మీకో?

జైహింద్.
babai
Print this post

14 comments:

అజ్ఞాత చెప్పారు...

ఇలాంటి ’గర్భిత’ పద్యాలు, ఇంకా అనేక ’బంధ’, ’చిత్ర’ కవిత్వ లక్షణాలతో కూడిన పద్యాలెన్నో కల ’రసస్రువు’ అన్న అమూల్య కావ్యాన్ని ప్రొ|| వి.యల్.యస్. భీమ శంకరం గారు ఒక దశాబ్దం క్రితం రచించి ప్రచురించారు. వీరు ప్రస్తుతం హైదరాబాదులో ’తార్నాకా’లో నివసిస్తున్నారు.
- డా.ఆచార్య ఫణీంద్ర

అజ్ఞాత చెప్పారు...

బ్లాగు అంతా ఎరుపు రంగులో ఉంది చదువుటకు కష్టముగా ఉన్నది

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

డా.ఆచార్య ఫణీంద్రా! నమస్తే.
శార్దూలము:-
ప్రాచీనాద్భుత చిత్ర బంధ కవితా ప్రాభవ్యముల్ పొందగా
నాచార్యా! ఘనమౌ "రసస్రువు" ను నే నాసక్తితో గోరగా,
సూచింపంగదె? భీమ శంకరునిదౌ సూక్ష్మంబైన సెల్ నెంబరున్.
ధీ చేత్స్కుల సత్కవిత్వ పఠనా ధ్యేయబుతో నుంటినోయ్.

అజ్ఞాతా! నమస్తే.
కందము:-
అజ్ఞాతా! కనుగొంటిని
వీజ్ఞానవిహీనునౌట , వివరించినచో
సుజ్ఞాతముగా నలుపు ర
సజ్ఞులు పఠియింపనవగ చక్కగ నుంతున్.
చంపకమాల:-
ఎఱుపది యేల వచ్చినదొ? ఎట్టుల పోవునొ? తెల్వదాయె. ఈ
యెఱుపును బాపి నల్లనగు నీప్సితవర్ణము నెట్టులుంచుటో?
అఱయగ నున్నవాడ. కరుణార్ద్ర మనస్కుడ తెల్పుమయ్య. నిన్
మఱిమఱి వేడుచుంటి. గుణ మాన్యడ! తెల్పెదవంచు చూచెదన్.

రాఘవ చెప్పారు...

౧ సీసంలో ప్రతి పాదం "వి"కారం తో ప్రారంభమవ్వడం మరో విశేషం :D

౨ మీరు ఇది చూసారా?

౩ నేను చిత్రకవిత్వమైతే ఏదో ప్రయోగం చేసాను కానీ బంధగర్భకవిత్వాలు ఇప్పటి వఱకూ ప్రయత్నించలేదు. ఇపుడివి చూస్తూంటే అవి కూడా ప్రయత్నిద్దామన్న కుతూహలం వస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

ఏదో మాట్లాడుతున్నట్టే "చంపకమాల" చెప్పేశారు. అంత అవలీలగా ఎలా చెప్పగలుగుతున్నారండి? ఇది అందరికీ సాధ్యమేనా? తెలుగు పద్యం చెప్పాలంటే ఏ రకమైన పరిశ్రమ చేయాలి? మాకు పాఠాలు (వారానికో, నెలకో ఒకటి చొప్పున) చెప్పరాదా మాస్టారు?

అజ్ఞాత చెప్పారు...

Phone No.s of Prof.V.L.S.Bhima Shankaram :9849563500;040-27018500

-from :Dr.Acharya Phaneendra
( Pl. visit my blog -
"Dr.Acharya Phaneendra"
in www.wordpress.com )

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంద గర్భ తేటగీతి:-
సురుచిరపు బంధకవితను సరగున కవి
వ్రాయ బూన సాధ్యమగును ! ప్రాయ రుచుల
నిలచును తన సుందర శోభ విలసితమవ
గ , నవనవ మగుచున్ వచ్చు . కవి వరేణ్య!

కందము:-
సురుచిరపు బంధకవితను
సరగున కవి వ్రాయ బూన సాధ్యమగును! ప్రా
య రుచుల నిలచును తన సుం
దర శోభ విలసితమవగ, నవనవ మగుచున్!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాఘవగారూ! తేటగీతిలో కందాన్నుంచి వ్రాశాను ఆ పద్యం మిమ్ములనుద్దేశిచేనండి. చిరునామా { ఎడ్రసింగ్} మర్చిపోయాను.
గమనించ గలందులకు వినతి..

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Dr. Acharya Phaniindragaaruu!
Thank you very much.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవిగారూ!
కందము:-
ఛందో భాషణ చేసిన
యందంబుగ పద్యములను అల్లగ వచ్చున్.
సుందర సుగుణాన్వితులగు
నందరికీ వచ్చు. నిజము. ఆసక్త్యున్నన్.
ఉత్పలమాల:-
ఎట్టుల మీకు చెప్పనగు? ఏవిధి మీకడ నుండనౌను? నా
కెట్టుల సాధ్యమౌను. తమ కే పగిదిన్ వివరింపనౌను? రా
కెట్టుల యుండు వేగమది. యీప్సితమొప్ప గ్రహించువారికిన్.
జట్టుగనుండి బ్లాగుననె చక్కగ నేర్చిన, చెప్ప నేర్తు, నే.

వేగిరముతో గూడిన మనస్సు గలవారికి రాకుండా యేవిధంగా వుంటుంది?అని 1 వ అర్థం.
ఆ వేగము రాకెట్టులందే వుండును సుమా! అని 2 వ అర్థం.మీకు నే నేవిధాంగా నేర్పగలవాడనో మీరు సూచిస్తే తప్పక ఆ విధంగా నేర్ప గలను.
ధన్య వాదాలు.

అజ్ఞాత చెప్పారు...

పరిశ్రమ చేస్తే వస్తుందంటారు, అంతేనా?

ఇదివరకు రాఘవ గారు పొద్దులో మౌలికంగా కొన్ని పాఠాలు చెప్పారు.అలానే మీరు, మీ తరహాలో చెబితే బావుంటుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీజీ!
కందము:-
తప్పక చెప్పెద నికపయి.
ముప్పాతిక పాలు మీరు పూర్ణ హృదయులై
చెప్పెడిదొననరిచి చూడుడు .
తప్పక పద్యంబు వ్రాసి ధన్యత గనుడీ.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

'రాకెట్టుల యుండు వేగమది.'అయ్యా! అద్భుతం. ఇలాంటి బహు అర్థాల కవిత్వము గురించి ఒక టపాలో(లేక కొన్ని టపాలలో)ప్రస్తావిస్తే చక్కగా ఉంటుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! ఫణీజీ!
తప్పకుండా మీ సూచనను పాటించే ప్రయత్నం చేయగలను. నా పాత టపాలలో కొన్ని మీరు కోఱిన విధంగా ఉన్నట్టున్నాయి. గమనించగలందులకు మనవి.
ధన్య వాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.