గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2009, శనివారం

అంతర్ జాల భువన విజయంలో అందరూ పాల్గొనండి.

6 comments

adacall
శా:-
అంతర్ జాలము నందు సత్ కవులు తామంతా ప్రయత్నంబుతో
యెంతో కొంత సమస్య పూరణల తో యింపైన సద్వర్ణనల్
భ్రాంతిన్ వ్రాయుచు పాల్గొనన్, కరుణతో పాండిత్య సద్భూషణుల్
సాంతంబున్ తమ కండనుండి నడుపున్. సఖ్యత్వ మొప్పారగన్.

ఉ:-
ఛందము తోడ పద్యములు చక్కగ వ్రాయుట పుట్టినప్పుడే
యెందును పుట్టబోదు. మనమెంతటి గొప్ప కవిత్వ మల్లినన్
ముందుగ నేర్చుకొన్నదియు ముద్దుగ సద్ గురు వందజేయగా
నందినదింత పూర్వమది . ఆర్యుల సత్కృప నబ్బినట్టిదౌన్.

సీ:-
భువిని యంతర్ జాల భువన విజయ మిది.
కవి వతంసులు తాము కలియు నెలవు.

పదువురొకనికిని, పదిమంది కొకరును,
సదవగాహన గొల్పు మృదుల గతిని.

ఎవరు నెక్కుడు కాదు. ఎవరు తక్కుడు కాదు.
ఎవరికి వారు తా మెఱుక నొందు.

ఎంత నేర్చిన గాని యెంత వినిన గాని
ఎంతయో కొంత తా మెఱుగు నిచట.

గీ:-
కాన కవులెల్ల నొకటయి కలియు నిచట.
భువిని యంతర జాలపు భువ విజయ
కవుల ప్రఖ్యాతి కాదను కవులు లేరు.
కలియు డందరు సాహిత్య విలువ లెఱిగి.

జైహంద్.

26, ఫిబ్రవరి 2009, గురువారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా 6

6 comments

సమస్యా పూరణం చేయడంలో కించిత్ అలసత్వానికి కారణం బహుశా పనుల వొత్తిడై వుండ వచ్చు.
మన మేధస్సు చా లా తమాషా ఐనది. నిరంతరం సాధన చేస్తుంటేనే ఆ కవితా ధార కొనసాగుతుంటుంది.
ఇప్పుడు మరొక సమస్య పూరణ కొఱకు మీ ముందుంచుతున్నాను.

సమస్య:-
అన్న పెండ్లాము అత్తను గన్న తల్లి.

మీకు నచ్చిన విధంగా పూరణ చేయండి. వెంటనే పంప గలందులకు మనవి.
జైహింద్.

23, ఫిబ్రవరి 2009, సోమవారం

శివ శివ యనరాదా! మనసా!

1 comments

జన్మకో శివరాత్రంటారు.
అరుదైన ఆ శివరాత్రి పర్వ దినం రానే వచ్చింది.
పరమ శివ రాత్రి సందర్భంగా భక్తి తత్పరులందరికీ అభినందనలు.

:-
శివ మన శుభమగు. మనమున
శివుని కలిగి నడచు మనము శివ భరితులమే.
సువిలసిత జగము పరమ
శివుని కలిత మనగ దగును.శివ శివ యనుడీ.

తే.గీ:-
శివుని తన మది కనుగొని భవుని మహిమ
తెలియు మహితుని తెలివియె తెలివి యగును.
తెలియ దగు శివ మహిమను తెలియ కునికి
శివము విడిచిన కలుషిత శవము మనము.

తే.గీ:-
ధనము శివుడు. మనము శివుడనగఁ దగును.
ప్రణవము శివుడు. జగమన పరమశివుడు.
సుగుణము శివుడు.సకలము లగు ను శివుడు.
శివ మహిమ మెఱిగి మనము శివుని గనుత.

క:-
నిన్నే నిత్యం బర్ధిన్
గన్నన్ ముక్తే లభించు గాదే దేవా!
నన్నున్ నీవే తోడై
కన్నప్పన్ గన్నదేవ! కావన్ రావా.

తే.గీ:-
భక్త కోటిని ప్రార్థింతు. పరమ శివుని
ముక్తి దాతను మరువక, శక్తి కొలది
భక్తి తోడుత చేయుడు భజన నేడు.
శక్తి కలిగించు పరమ శివ శక్తులీకు.

ఆ పరమ శివుని కరుణా కటాక్షం మనందరికీ లభించును గాక.
జైహింద్.

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా 5

10 comments

సాహితీ బంధువులారా! మీ యుత్సాహానికి తగినంత వేగంగా మీరు పూరించడానికి సమస్యలను మీ ముందుంచలేక పోవడానికనేక కారణలు. క్షంతవ్యుడను.

ఈ పర్యాయం మనం పూరించ వలసిన సమస్య గమనించండి.

--------> మంద బుద్ధికి ప్రాప్తించు మన్నన లిల <---------

చూచారుకదా ! ఆలస్యమెందుకు? వెంటనే పూరించి కామెంట్ ద్వారా పంపగలందులకు మనవి.
జైహింద్.

21, ఫిబ్రవరి 2009, శనివారం

మాతృ భాషా దినోత్సవ మనవి వినుడు.

5 comments

క:-
కల్లా కపటము నెఱుగని
తల్లియె దీటైన గురువు తలపగ , నటులే!
ఉల్లాసము నుత్సాహము
వెల్లిఁ గొలుపు మాతృ భాష వేయి విధములన్.

క:-
మన జీవన మార్గంబును,
మన దగు సహ జాతమైన మహిమాదికముల్
మన రూపము మన సంపద
మనఁ దగు మనమైన మనము మనగనె యెపుడున్.

క:-
పుట్టుక తోడుత చర్మము,
పుట్టుకతో మాతృ భాష పుట్టిన యపుడే
పుట్టుచునుండును మనమది
ఎట్టుల మఱువంగ నగును యిల మన భాషన్?

తే.గీ:-
నేల విడిచిన సామది యేల మనకు?
మాతృ భాషను మఱచిన మార్గమేది?
మనకు గుర్తుగ నుండెడి మతృ భాష
మనము గుర్తింపకుండుట మంచి కాదు.

తే.గీ:-
మాతృ భాషాభిమానము మనము కలిగి
భాషణమునందు, మన పరిపాలనమున
నిత్యముపయుక్తమౌనట్లు నిండు మదిని
యత్న మొనరింపఁ దగునయ్య. అసదృశమది.

జైహింద్.

18, ఫిబ్రవరి 2009, బుధవారం

రుద్ర కవచము.

4 comments

మానవుడు నిరంతర జీవన పోరాటంతో చాలా అలసట చెందుతూ తనకు ఊరటనిచ్చే మార్గం కోసం
నిరీక్షిస్తూ వుంటాడు. ముఖ్యంగా తాను అన్ని విధముల రక్షణ పొంద గలిగితే తాను జీవన పోరాటంలో ధైర్యం గా పాల్గొంటాడు.
ఐతే అన్ని విధములా ఆ పరమాత్మ తనకు రక్షణ కవచమై నిలిచేలా చేసే ఒక చక్కని ప్రక్రియ వుంది.
అదే రుద్ర కవచ పఠనము. ఆ విధంగా పఠనయోగ్యంగా వుండే రుద్ర కవచమ్ ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.

దీనిని
నమ్మమని నేను కోఱ లేదు.
చదవమని ప్రార్ధించడం లేదు.

దీనిని విశ్వసించే వారు , కావాలని దీని కొఱకై తపించే వారు చాలా మంది నన్ను అడిగిన కారణంగా అట్టి వారికుపకరిస్తుందని వ్రాస్తున్నాను.

అక్కర లేనివారు దయచేసి చదవడం మానేయండి. అనవసరమైన విపరీత వ్యాఖ్యలు చేయ నవసరం లేదని సవినయంగా విన్నవించుకొనుచున్నాను.

రుద్ర కవచం.
దుర్వాస ఉవాచ:-
శ్లో:-
ప్రణమ్యామి శిరసా దేవం స్వయం భుం పరమేశ్వరం.
ఏకం సర్వ గతం దేవం సర్వ దేవ మయం విభుం.

భావము:-
తనకు తానుగా ఉద్భవించిన వాడును, అంతటను నిండి యున్న యేకైక దైవమును,
సకల దేవతా స్వరూపుడును, అగు పరమేశ్వరునకు శిరసు వంచి నమస్కరింతును.

శ్లో:-
రుద్ర వర్మ ప్రవక్షామి అంగ ప్రాణస్య రక్షయే.
అహో రాత్ర మయం దేవం రక్షార్థం నిర్మితం పురా.

భావము:-
అంగ ప్రాణముల రక్షణ కొఱకు రుద్ర కవచమును - అహో ర్త మయుడైన దేవ దేవుని చేత రక్షణ కొఱకు అతి పురాతన కాలములోనిర్మింప బడిన రుద్ర కవచమును అంగ ప్రాణ రక్షణ కొఱకు చెప్పు చున్నాను.

శ్లో:-
రుద్రో మే చాగ్రతః పాతు ముఖం పాతు మహేశ్వరః
శిరో మే యీశ్వరః పాతు లలాటం నీలలోహితః

భావము:-
రుద్రుడు ముందు నన్ను రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా శిరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా లలాటమును నీలలోహితుడు రక్షించు గాక.

శ్లో:-
నేత్రయోస్త్రయంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతుమే శంభుర్నాసికాయాం సదాశివః.

భావము:-
నా నేత్రములను త్ర్యంబకుడు రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక.
నా చెవులను శంభుడు రక్షించు గాక. నా ముక్కును సదా శివుడు రక్షించు గాక.

శ్లో:-
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠా పాతంబికాపతిః
శ్రీ కంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాక ధృత్.

భావము:-
నా నాలుకను వాగీశుడు రక్షించు గాక. నా పెదవులను అంబికా పతి రక్షించు గాక.
నా కంఠమును శ్రీ కంఠుడు రక్షించు గాక. నా బాహువులను పినాక ధారి రక్షించు గాక.

శ్లో:-
హృదయం మే మహా దేవ ఈశ్వరో వ్యాత్ స్తనాంతరం
నాభిం కటిం వక్షశ్చ పాతుస్ఛర్వ ఉమాపతిః

భావము:-
నా హృదయమును మహా దేవుడు రక్షించు గాక. నా స్తనాంతరమును ఈశ్వరుడు రక్షించు గాక.
నా నాభిని, కటిని, వాటితో పాటు వక్ష స్తలమును ఉమా పతి రక్షించు గాక.

శ్లో:-
బాహు మధ్యాంతరంచైవ సూక్ష్మ రూపస్సదా శివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రానిచ యధా క్రమం

భావము:-
బాహు మధ్యాంతరమును కూడా సూక్ష్మ రూపి యైన సదా శివుడు రక్షించు గాక.
నా శరీరమును యధా క్రమముగా అన్నిటినీ సర్వేశ్వరుడు రక్షించు గాక.

శ్లో:-
వజ్ర శక్తి ధరంచైవ పాశాంకుశధరం తధా.
గండ శూల ధరం నిత్యం రక్షతు త్రి దశేశ్వరః

భావము:-
వజ్ర శక్తిని ధరించిన వాడును, పాశమును అంకుశమును ధరించిన వాడును
గండ శూల ధారియు నగు త్రిదశేశ్వరుడు నన్ను నిత్యము రక్షించు గాక.

శ్లో:-
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీ తటే
సంధ్యాయాం రాజ భవనే విరూపాక్షస్తు పాతు మాం.

భావము:-
ప్రయాణముల యందును, మార్గముల యందును, వృక్ష మూలమునందు, నదీ తటముల యందు,
సంధ్యా సమయము లందు, రాజ భవనముల యందు, నన్నా విరూపాక్షుడు రక్షించు గాక.

శ్లో:-
శీతోష్ణాదధ కాలేషు తుహిన ధ్రుమ కంటకే
నిర్మానుష్యే సమే మార్గే త్రాహి మాం వృషభ ధ్వజ.

భావము:-
సీతా కాలమునందు, వేసవి కాలము నందు, మంచునందు, వృక్ష కంటకములయందు,
నిర్మానుష్య ప్రదేశములయందు,సమ మార్గమునందు, వృషభ ధ్వజుడు నన్ను రక్షించు గాక.

శ్లో:-
ఇత్యేతద్రుద్ర కవచం పవిత్రం పాప నాశనం
మహాదేవ ప్రసాదేవ దుర్వాసో ముని కల్పితం.

భావము:-
అను యీ విధమైనటువంటి రుద్ర కవచము పవిత్రమైనదియు, పాప నాశనమును కూడ.
మహా దేవుని ప్రసాదము చేత దుర్వాస మునిచే కల్పింప బడినది.

శ్లో:-
మమాఖ్యాతం సమాసేన భయం విందతే క్వచిత్.
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్య వర్ధనం

భావము:-
నా చేత సంక్షిప్తముగా చెప్ప బడిన దీనిని భయ భక్తులతో యెవరు వింటారో
పరమ ఆరోగ్యము పొందుతారు.పుణ్యము, ఆయుర్దాయము, పెరుగును.

శ్లో:-
విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం.
కన్యార్థీ లభతే కన్యాం భయం విందతే క్వచిత్.

భావము:-
విద్య కోరు వారికి విద్య లభించును. ధనము నాశించు వారికి ధనము లభించును.
కన్య నాశించు వారికి కన్య లభించును.భయ రహితులై యుందురు.

శ్లో:-
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహా దేవ త్రాహి త్రాహి త్రయీ మయ.

భావము:-
సంతానము లేని వారికి సంతానము కలుగును. మోక్షము కోరు వారికి మోక్షము లభించును.
రక్షించు మహాదేవా రక్షించు. రక్షించు త్రయీమయా రక్షించు.

శ్లో:-
త్రాహి మాం పార్వతీ నాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రి శూలం రుద్రమేవచ.

భావము:-
పార్వతీ పతీ! నన్ను రక్షించుము. త్రిపురాంతకా! నన్ను రక్షించుము.
పాశము, ఖట్వాంగ దివ్యాస్త్రము, త్రిశూలము ధరించిన రుద్రునకు నమస్కరింతును.

శ్లో:-
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రు మధ్యే సభా మధ్యే గ్రామ మధ్యే గృహాంతరే.

భావము:-
దేవేశా! నమస్కరిస్తున్నాను. జగదీశ్వరా! శత్రు మధ్యమున, సభా మధ్యమున, గ్రామ మధ్యమున, గృహాంతరమున, నన్ను రక్షించుము.

శ్లో:-
గమనాగమనేచైవ త్రాహి మాం భక్త వత్సల
త్వం చిత్తం త్వం మానసంచ త్వం బుద్ధిస్త్వం పరాయణం.

భావము:-
భక్త వత్సలా! ప్రయాణ సమయములలో వెళ్ళి వచ్చే సమయములందు నన్ను కాపాడుము.
నీవే చిత్తము, నీవే మనస్సు, నీవే బుద్ధి. సర్వము నిన్నే పరాయణుడిగా కలవాడను.

శ్లో:-
కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యధా సదా
జ్వర భయం ఛింది సర్వ జ్వర భయం ఛింది గ్రహ భయం.

భావము:-
కర్మ చేత, మనసు చేత, బుద్ధి చేత ఎల్లప్పుడూ నాకు నీవే సుమా.
జ్వరభయము నశించు గాక, సమస్త జ్వర భయము నశించు గాక. గ్రహ భయము నశించు గాక.

శ్లో:-
ఛింది సర్వ శత్రూన్నివత్యాపి సర్వ వ్యాధి నివారణం.
అస్య రుద్ర లోకం గచ్ఛతి శ్రీ రుద్ర లోకం గచ్ఛతి.

భావము:-
నమస్త శత్రువులను నశింపఁ బడును సమస్త వ్యాధులు నివారింపఁ బడును.
ఇది పఠించిన వారు రుద్రలోకమును చేరుదురు. అట్టి వారు తప్పక రుద్ర లోకమును చేరుదురు.

ఓం నమః ఇతి
స్వస్త్యస్తు.

ఈ పోష్టులో చాలా దోషాలుండ వచ్చు. తెలియని కారణంగాను, నిపుణతా లోపం వలనను, దోషాలు చోటు చేసుకొని వుండ వచ్చు. సహృదయులు అట్టి దోషములను సరి చేసి కామెంట్ పంపగలిగితే దోషములను సరిచేయ గలనని సవినయంగా మనవి చేసుకోంటున్నాను.
జైహింద్ .

16, ఫిబ్రవరి 2009, సోమవారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా? 4

9 comments

tensionఆర్యులారా!నమస్తే
మనమింతవరకు ఆటవెలది తేట గీతి కందము పద్యాలనే వ్రాసాము.
ఇప్పుడు మనం వృత్త పద్యాలు వ్రాసే ప్రయత్నం చేద్దామా?
ఐతే యీ క్రింది సమస్యా పురాణ చేసి చూద్దాం.

- - - - - - -> శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే <- - - - -- - -

చూచారు కదా సమస్యా పూరణ కీయబడిన ఉత్పలమాల పద్య పాదం.
ఐతే ఇక ఆలస్యం చేయక పూరిద్దామా?
జైహింద్.
babai

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

ఎందరికిది వచ్చును మన వందే మాతరము గీతి.

4 comments

కందము:-
ఎందరికిది వచ్చును మన
వందే మాతరము గీతి
భారత భువిపై.
కొందరికిది రాదు. నిజము
నిందరిలో చెప్పుచుంటి నెఱుగుట కొఱకై .


సహోదర సహోదరీమణులారా! మన మాతృ దేవత భరత మాత ముద్దు బిడ్డలమైన మనమందరం భిన్నత్వంలో ఏకత్వమనే సిద్ధాంతానికి కట్టుబడి సహ జీవనం సాగిస్తున్నాం.
ఎవరిది ఏ కులమైనా ఏ మతమైనా అందరం యీ తల్లి బిడ్డలమే కదా! మనం దైవ ప్రార్థనలు చేసేటప్పుడు దైవారాధన చేసే టప్పుడు ఎవరి అభిమతానికి వారు కట్టుబడినా, మాతృదేవతైన భారతమాత విషయంలో మాత్రం అంతా ఒక్కటే కదా! అందరం కలిసికట్టుగా వందే మాతరాన్నే ఆలపిస్తాము కదా? మరి ఈనాడు మనలో ఎంతమంది లక్ష్యం కలిగి కార్యక్రమారంభ సమయంలో తప్పని సరిగా వందే మాతర గీతాన్నాలాపిస్తున్నారు? ఎందరికీ పూర్తి పాట పాడడం వచ్చు?

నేనీమధ్య రిపబ్లిక్ దినోత్సవం రోజునా సామాజిక సంస్థల ఉత్సవాలలోను యీ గీతాన్ని మరచిన సంఘటనలను చూచి చాలా మానసికవేదనకు గురయ్యాను.

అసలా పాటని మీరూ గమనించండి. పూర్తి పాఠం యిదేనా? లేక యింకా ఏమైనా ఉందా? అనే విషయాల్ని చెప్పడం విషయంలో నిర్లక్ష్యం చేయ వలదని మనవి.

వందే మాతరం-----గీతం.
వందే మాతరం---------వందే మాతరం.
సుజలాం- సుఫలాం----మలయజ సీతలాం
సస్య శ్యామలాం----మాతరం-------వందే మాతరం.-----వందే మాతరం.-------------------------1

శుభ్రజ్యోత్స్నా, పులకిత యామినీం,
ఫుల్లకుసుమిత దృమదళ శోభినీం,
సుహాసినీం,
సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం, మాతరం------వందే మాతరం----- వందే మాతరం.------------------------2

కోటీ కోటీ కంఠ కలకల నినాద కరాలే
కోటీ కోటీ భుజైధృత ఖర కరవాలే
అబలా కేనో మాం ఎతో బలే
బహు బల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం------వందే మాతరం------వందే మాతరం.---------------------------3

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే-----వందే మాతరం----వందే మాతరం.-----------------4

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమల దళ విహారిణీ
వాణి విద్యా దాయినీ, నమామి త్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం, మాతరం-----వందే మాతరం-----వందే మాతరం.-----5

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం, భరణీం, మాతరం,------వందే మాతరం,------ --వందే మాతరం. -----------------------6

ప్రియ పాఠకులారా! మీరు తప్పక దేశభక్తి విషయంలో స్పందిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను..ఈ గీతాన్ని తప్పక సందర్భం వచ్చినప్పుడు అవకాశం జారవిడువక తప్పక పాడేలాగ మనం చేయగలగాలి.
క్రమశిక్షణ దేశ భక్తి ఎక్కడ లోపించదో దేశ రక్షణ అక్కడ ఉంచకనే ఉంటుంది. మనకి జన్మనిచ్చి, రక్షణ భారం వహిస్తున్న మన తల్లి భరత మాతకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ, దేశ భక్తిప్రపూర్ణులైన మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను.
జైహింద్. babai

14, ఫిబ్రవరి 2009, శనివారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా? 3

6 comments

ఆర్యులారా! నమస్తే.
క్రిందటి పర్యాయం ఇవ్వ బడిన మూడు సమస్యలకు చక్కని పూరణ లందించిన రచయిత లందరికీ హృదయ పూర్వక అభినందనలు మరియి ధన్య వాదములు.
ఇప్పుడు మరొక సమస్య మన ముందుకొస్తోంది. దానిని కూడా చక్కగా పూరించడంద్వారా మనం ఆత్మ విశ్వాసాని పెంపొందించుకొందాం. మరి సమస్య చూద్దామా?

--------> కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్. <--------

ఈ సమస్య కంద పద్య పాదమని మనకు చెప్ప కుండానే తెలిసిపోతోంది కాబట్టి ఇంక ఆలస్యమెందుకు? పూరణకి ఉపక్రమీద్దాం!
మీ పూరణలను వెన్వెంటనే కామెంట్ ద్వారా పంప బోతున్న మీకు నా కృతజ్ఞతలు.
జైహింద్.

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

గ్రంథావిష్కరణ మహోత్సవ దృశ్యాలు.

0 comments

మత్తేభ - కంద - గీతి గర్భ సీసము అను శీర్షికతో వ్రాసిన అంశములకు సంబంధించిన చ్ఛాయా చిత్రములను ఈ పుటలూ ఉంచితిని.

శ్రీ వల్లభ వఘల నరసిమ్హ మూర్తి గారు రచించిన " జుత్తాడ శ్రీ రామ చంద్ర శతకము. - మనీషా పంచకం అనే పుస్తకావిష్కరణ కార్య క్రమంలో వివిధ సందర్భములలో చూప బడిన ఛాయా చిత్రములు ఔత్సాహికులు గమనింప గలందులకు పొందుపరచడమైనది.
జైహింద్.












11, ఫిబ్రవరి 2009, బుధవారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా? 2.

20 comments

ప్రియ బ్లాగ్ మిత్రులారా!
మీలో చాలామంది సమస్యా పూరణలను చాలా చక్కగా సునాయాసంగా చేయ గలుగుతున్నందుకు మీ అందరికీ నా అభినందనలు.

కొందరైతే సమస్యా పూరణ కొంతవరకూ చేసి సరిపోదేమోననే భావనతో నిరాశతో ఉపేక్షిస్తున్నారు.
నామనవిని కాస్త వినండి. విషయాన్ని గ్రహించండి. అదేంటంటే తప్పో ఒప్పో మనం ప్రయత్నం చేసి వ్రాసేయాలి. తప్పైతే ఎక్కడ తప్పు, రైటెలాగ, అని ఆరా తీయడంద్వారా సరిగా నేర్చుకొనే అవకాశముంటుంది. అది మనం వ్రాసినతరువాతనే కదా ఆ అవకాశం కలిగేది. వ్రాయకుండా ఆ అవకాశం మనకు రాదు కదా. అందుకని ఉత్సాహాన్ని పెంచుకోండి. ఒక చిన్న ప్రయత్నం చేయండి చాలు. అద్భుతంగా మీరూ పద్యాలు వ్రాసేయగలుగుతారు.

ఈ రోజు మరో సమస్యాపూరణ కొఱకు అంశాన్ని ఎప్పుడిస్తానా అని ఎదురు చూస్తున్నారా? ఐతే చూడండి
మనం పూరించ వలసిన విషయం లౌకికమే.

----->మణులు మాటలాడె మనసు కరుగ.<----- చూచారు కదా సమస్యని? ఆలస్య మెందుకు పూరించెద్దాం ! మీరు కామెంట్ ద్వారా పంపిన పూరణలు ప్రత్యేకంగా ఒక పోష్టులో వుంచే ప్రయత్నం చేయగలను. మరి మీ కామెంట్ కొఱకు ఎదురు చూడనా?
జైహింద్.