గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మే 2023, ఆదివారం

శ్రీ శివ సహస్ర నామములకు చంద్రికా భాష్యము వ్రాసిన శ్రీ అంబాళం పార్థ సారథిగారు మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేశారు.

జైశ్రీరామ్. 

ఓం నమో నారాయణాయ.

అంబాళాన్వయ! పార్థసారథి మహాత్మా! స్వాగతమ్మీకు, జ్ఞా
నం బాశంకర దత్తమై శివుని శ్రీ నామాళి సాహస్రమున్
సాంబుండే పులకింపగా వివరణన్ సంస్తుత్యమానంబుగా
శంభోశంకరయంచు వ్రాసిరికదా, శర్వాణియుప్పొంగగా.

మీ రాకన్ శుభ సంహతుల్ గలుగు సామీ! జ్ఞాన వారాశియే
మీ రూపంబున వచ్చి నన్ గృపగనెన్, మేలున్ సదా గొల్పగా,
ధీరోదాత్త శివంకరుండు దయతో దీర్ఘాయువున్ గొల్పుచున్
శ్రీరమ్యాక్షరసేవ చేయగ మిమున్ జిజ్ఞాసతోఁ బ్రోచుతన్.

చక్కని గ్రంథమునిచ్చిరి
మక్కుతో నన్ను గనిరి మహనీయుండా!
నిక్కముగా మీ ప్రేమను
వక్కాణింపంగ చాల, భద్రము మీకున్.

చింతా రామకృష్ణారావు.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.