గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, నవంబర్ 2013, గురువారం

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం మూడవ అధ్యాయం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ వివరించిన శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం మూడవ అధ్యాయం పఠించండి.
కార్తీక పురాణం మూడవ అధ్యాయం
వశిష్ఠ మహర్షి ఇట్లు పలికెను ’ ఓ రాజా! కార్తీక మాసములో స్నాన, దాన, జపాదులైన పుణ్య కార్యములలో ఏ స్వల్పము చేసినను ఆ అల్పమే అనంత ఫలప్రదాత యగును. స్త్రీలైనా పురుషులైనా సరే అశాశ్వతమైన ఈ శరీర మునకు కలిగే కష్టమునకు భయపడి కార్తీక వ్రతము చేయనిచో వంద మార్లు కుక్కగా జన్మించవలసి వచ్చును. కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానాలు ఉపవాసము చేయని మనుష్యుడు కోటి మార్లు చండాలుడై పుట్టును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై యుండును. ఈ విషయమై పూర్వమొక కథ గలదు ఆ విషయము చెప్పెదను వినుము.

ఆ ’ఇతిహాసము’ ఒక తత్త్వనిష్ఠునిదైయున్నది గనుక దానిని చక్కగా వినుము. ఓ రాజా! పూర్వము ఆంధ్ర దేశమున తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, ప్రాణులయందు దయ గలవాడు, తీర్థయాత్రలందు అనురక్తి కలవాడు. రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోతూ గోదావరీ తీరంలో ఆకాశాన్ని ముద్దుపెడుతున్నవా అన్నట్లుండు మఱ్ఱిచెట్లమీద ఉన్న 3బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పెకి నిక్కి, నోరు వికటముగా, శరీరము నల్లగా, ఉదరము కృశించి, నేత్రములు గడ్డము ముఖము ఎఱ్ఱగా, దంతములు పొడుగుగా ఉండి వారి చేతులలో ఖడ్గములున్నవి, కాపలములను ధరించి ఉన్నవారు సమస్త జంతువులను భయపెట్టుతున్నవారైరి.

ఆ రాక్షసుల భయముచేత ఆ మఱ్ఱిచెట్టుకు చుట్టూ చాలా దూరము (కొన్ని మైళ్ళ) వరకు  మనుష్యులే కాదు, మృగములు, పశుపక్ష్యాదులు కూడ సంచరించవు. ఆ వట వృక్షం దగ్గర నిత్యమూ పర్వత సమాన శరీరులు అగు పశు పక్ష్యాదులు (తెలియక వెళ్ళినవి) ప్రాణములను గూర్చి భయపడి భయంకరమగు బిగ్గరయగు శబ్దలు చేయుచుండెడివి.

అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవ ప్రేరణచేత ఆ మార్గమునపోతూ మఱ్ఱిచెట్టుమీది ఆ బ్రహ్మరాక్షసులను చూసెను. వారిని చూసి భయపడి, మనస్సు చికాకు పొంది హృదయము చలించినవాడై భయముతో శోకించుచు శ్రీ హరి పాదారవిందములను స్మరించుచూ ’ఓ దేవేశా, లోకేశా, నన్ను రక్షింపుము, ఓ నారాయాణా నన్ను పాలింపుము, నా భయమంతయూ తొలగతోయుమో దేవేశా, నీకన్న నాకు దిక్కెవరు శరణు శరణు’

ఈ ప్రకారము స్తుతించుచూ వారి భయమున పరిగెత్తుతున్న బ్రాహ్మణునిచూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించవలెనని ఎంచి అతని వెంబడి పరిగెత్తసాగిరి. కొంత దూరము పోగానే బ్రాహ్మణుని సమీప స్థితి దర్శనమువల్ల బ్రహ్మరాక్షసులకు స్వస్మృతి కలిగినది. తరవాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందుగ భూమిమీద పడి సాష్ఠాంగ ప్రణామము లాచరించి నమస్కరించి అనేక వాక్యములతో స్తుతించిరి.

ఆ రాక్షసులు ఏక కంఠమున ’బ్రాహ్మణోత్తమా మీదర్శనము వల్ల మేము పాపరహితులమైనాము. మీరాక మాకు ఉపకారమైనది. అది నిజమే కదా, మహాత్ములు జీవించుటు జంతువులకుపకారమే కదా! మహాత్ములు యాత్రచేయుట లోకమునుద్ధరించుటకే కదా!’ అని స్తుతించిరి. ఈ మాటలను విన్న బ్రాహ్మణుడు భయముని వదిలి స్థిమిత పడ్డ మనసుతో ఇట్లు పలికెను ’ మీరెవరు? ఏ దుష్కర్మ చేత ఇలాంటి వికృతరూపము కలిగింది. లోకనింద్యమైన ఏకర్మమును మీరు పూర్వము చేసియున్నారు? మీకు భయముపోవు కాలము సమీపించినది కనుక సందేహములేకుండ సర్వమూ నాకు తెలియ జేయుము’. అంత ఆ రాక్షసులు తాము చేసిన నింద్య కర్మలను వేరు వేరుగా జ్ఞప్తితెచ్చుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లు పలికిరి.

మొదటి వాడు ఇట్లు చెప్పెను ’అయ్యా! నేను పూర్వ జన్మములో ద్రావిడదేశములో మందర గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడనై కఠినమైన మాటలు. ఇతరులను వంచించు మాటలు మాట్లాడడంలో నేర్పరిని. నాకుటుంబ లాభముకొరకు ఇతర బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గానీ సాటి బ్రాహ్మణులకు గానీ ఒక్కనాడునూ అన్నము పెట్టనైతిని, బ్రాహ్మణుల సొమ్ము నా స్నేహితులచేత హరింపబడి నాకుటుంబ నాశనము జరిగినది. బ్రాహ్మణుల ధనమును అపహరించిన సూర్య చంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరవాత మృతినొంది యమబాధలను ఎన్నిటినో పొందొ రౌరవాది నరకబాధల పొంది తరవాత ఆదోషముచేతనే భూమి యందు బ్రహ్మరాక్షస జన్మనెత్తితిని. కనుక ఓ బ్రాహ్మణోత్తమా ఈ నా దోషము పోవు ఉపాయము తెల్పుము’

అందులో రెండవ రాక్షసుడు తనగురించి ఇలా చెప్పుచున్నాడు. ’ అయ్యా! నేను ఆంధ్రదేశమందుండేవాడను, నేను రోజూ తల్లిదండ్రులతో కలహిస్తూ వారందరినీ దూషిస్తూ ఉండేవాడిని. ఇంతేకాక నేను నాభార్యాపిల్లలు షడ్రసోపేతమైన భోజనము చేయుచూ, నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నం పెట్టేవాడిని. బంధువలను, బ్రాహ్మణులను ఏనాడూ ఆదరించలేదు, ఒకనాడైననూ అన్నము పెట్టలేదు. నేను ఎంతో సంపాదించితిని కానీ నా తల్లిదండ్రులకు సరియైన భోజనమును పెట్టి ఎరుగను. తరవాత నేను మృతిని పొంది యమలోకమున 8 యుగములు బాధలను పొంది తరవాత బ్రహ్మరాక్షసుడనై భూమి మీద జన్మనెత్తితిని. ఓ బ్రాహ్మణోత్తమా! నాకీ పాపముతొలగే ఉపాయము చెప్పి నన్ను మీరే ఉద్ధరించవలెను.’

ఇట్లు రెండవ రాక్షసుడుచెప్పగానే, మూడవ రాక్షసుడు కూడ నమస్కరించి తన స్థితిని చెప్పసాగెను. ’అయ్యా! నేను ఆంధ్రదేశ వాసిని, బ్రాహ్మణుడను, విష్ణ్వాలయమునందు అర్చకుడను. స్నానసంధ్యావందనాదులను విడిచి స్వామి పూజనొదిలి పరనిందలను చేయుచు. విశేషముగా మాట్లాడుచు, కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచుండెడివాడను. దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యా గృహమందు దీపములను బెట్టించి ఆనేతిని వేశ్యానుభవమునకు వెచ్చించి, దేవతానివేదాన్నము అపహరించి వేశ్యకు బెట్టి ఆమెతో నేను సంభోగించేవాడిని. ఆదోషములచేత మరణానంతరము నరకమున అనేక యాతనములు పొంది పిమ్మట భూమిమీద నానాయోనులందు జన్మించి ఇప్పుడు బ్రహ్మరాక్షసునిగా జన్మించితిని. అయ్యా! సమస్త భూతములందు అపార కరుణాపూర్ణుడవైన బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించి నాకు ముక్తిని ప్రసాదించు మార్గము తెలుపుము.

తత్త్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్య చకితుడై ఇట్లనెను ’ మీరు ఏమాత్రము అధైర్య పడవలదు. మీ దుఃఖము పోగొట్టుటకై నేను కార్తీక స్నానమునకు పోయెదను, మీరూ నాతో రండి.’ అని వారిని తనతో తీసుకొని పోయి బ్రహ్మరాక్షసుల కొరకు తాను స సంకల్ప స్నానము చేసి వారితోనూ స సంకల్ప స్నానము చేయించి వారి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను.  ఆ బ్రాహ్మణుడి విధిగా స్నానమాచరించి ఆరాక్షసులకొరకు ఫలితము ఇవ్వగా, ఆ ముగ్గురు దోషరహితులై దివ్య రూపములను ధరించి వైకుంఠమును చేరిరి.

ఓ జనక మహారాజా! విను, మోహముచేతగానీ, అజ్ఞానము చేతగానీ, కార్తీక మాసమున సూర్యోదయ కాలములో కావేరియందు స్నానము చేసి తరవాత శ్రీ హరి పూజను చేసిన వారికి వాజపేయాది యజ్ఞములు చేసిన ఫలితము కలుగును, ఎటువంటి సందేహము లేదు. కార్తీక మాసములో ఏదో ఒక ఉపాయముచేత ప్రయత్నించి కావేరీ స్నానము తప్పక చేయవలెను. కార్తీక మాసమున ప్రాతస్నానం చేయనివారు పది జన్మలందు ఛండాలుడై జన్మించి తరవాత పందిగా జన్మించును. కాబట్టి స్త్రీ పురుషులను బేధములేక  కార్తీక స్నానము తప్పక చేయవలెను, ఈ విషయమై విచారణ అవసరం లేదు.
ఇది సాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి మూడవ అధ్యాయము సమాప్తము.
జైహింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ ఆధునిక యుగంలో కార్తీక మాస విశిష్టతను , స్నాన ఫలితములు ,దీపారాధన వైభవములను గురించి తెలుసు కోవలసిన విషయములను చక్కగా వివరించి నందుకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.