గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, నవంబర్ 2013, సోమవారం

న కార్తిక సమో మాసః ప్రథమోధ్యాయః.

జైశ్రీరామ్.
ఆర్యులారా! పవిత్రమైన భక్తిభావ రంజితమైన హృదయోల్లాస జనకంగా పవిత్ర కార్తీక మాసమును్ కాలపురుషుఁడు మన ముందుకు తెచ్చాడు. ఈ మాసము చాలా పవిత్రమైన మాసము.
స్కాంద పురాణమున కార్తీక మాసము నిరుపమానమైనదిగా ఈ విధంగా చెప్పబడింది.
శ్లో: న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్
గీ: లేదు కార్తీక మును మించి లేదు లేదు.
లేదు కృతయుగ సమమెంచ లేదు లేదు.
లేదు వేదమున్ బోలగ లేదు లేదు.
లేదు గంగమ్మనే మించ లేదు లేదు.
భావము: కార్తీక మాస సమమైన మాసము, కృత యుగమునకు సమమైన యుగము, వేదమునకు సమమైన శాస్త్రము, గంగకు సమమైన తీర్థము లేదనితాత్పర్యము.

శ్రీ స్కాందపురాణమునందలి కార్తికమహాత్మ్యమున 
ప్రథమాధ్యాయము.
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం. 
శ్లో! వాగీశాద్యస్సుమనస స్సర్వార్థానాముపక్రమే!
యన్నత్వాకృతకృత్యాస్స్యుస్తంనమామి గజాననమ్!
నైమిశారణ్యములో సత్ర యాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు మహానుభావుడైన 
సూతమహర్షిని ఉద్దేశించి " ఓ సూత మహర్షీ! జనక మహారాజు కోరిక మేరకు వశిష్ఠ మహర్షిచేత చెప్పబడిన   కార్తీక మహాత్మ్యమును విస్తరముగా మేము మీవలన తెలుసుకొనగోరితిమి, కనుక దయతో సెలవీయండి " అని అడిగిరి. అంత సూత మహాముని " ఓ శౌనకాది మహామునులారా! వినండి, ఈ కార్తీక మాహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుగారికి చెప్పెను, అలానే ఇతః పూర్వము చతుర్ముఖ బ్రహ్మగారు నారదునికి, పార్వతీ దేవికి మహాదేవుడు, లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పెను. దీనివలనసమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ సంసార బంధనమును త్రెంచుకొని మోక్షమును పొందుటకు అర్హుడగును. ఒకానొకప్పుడు దైవ వశము చేత  సిద్ధాశ్రమమునకు వెళుతున్నటువంటి వశిష్ఠ మహర్షి జనకమహారాజు గృహమునకేగెను. అంత జనక నృపుడు వచ్చిన బ్రహ్మర్షిని చూసి సింహాసనమునుంచి త్వరగా దిగి దండప్రణామము చేసి సంతోషముతో పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సునందుంచుకొని బంగారపు ఆసనమును ఇచ్చి ’వికసించిన తామరలవంటి కన్నులు కలిగి, సమస్త జీవులయందుని దయగలిగి, అంతరింద్రియనిగ్రహముగలవాడై సదాచారవంతుడై బాలసూర్యుని పగిది కాంతి కలిగి సమస్తగుణ సంపన్నుడగు ఆ బ్రహ్మర్షితో భక్తిభావముతో ఇట్లడిగెను. జనకమహారాజు ’ బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువల్ల నేను ధన్యుడనైతిని, నేను చేయతగిన పుణ్యమింకేమీలేదు. మాపితృదేవతలందరూ ఇప్పుడు తృప్తిని పొంది ఉన్నారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, గనుక ఇప్పుడు మీరు మాయింటికి విచ్చేయడం వల్ల నాకు శుభములు సమకూరును’ అని పలికెను.సూతమహర్షి ’జనకుడిట్లు పలికిన తరవాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖముకలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వు నవ్వుతూ రాజుతో ఇట్లు పలికె’ నని శౌనకాది మహామునులతో చెప్పెను. ఓ రాజోత్తమా! నీకు క్షేమమగుగాక, నేను మాఆశ్రమమునకు బోవుచున్నాను, రేపు ఆశ్రమమందు యజ్ఞము జరుగవలెను, దానికి ఇప్పుడు ద్రవ్యముని నీవు ఇచ్చుటకు తగి ఉన్నావు.అంత రాజు బ్రహ్మర్షి వశిష్ఠునుద్దేశించి ఇలా పలికుచున్నాడు ’ ఓ మహర్షీ ! మీ యజ్ఞమునకు దాసుడనై ద్రవ్యమునివ్వగలవాడను. నాకు మీ వలన వినువారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను  వినగోరుచున్నాను. మీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలమిచ్చెడి సూక్ష్మ ధర్మము చెప్పుమా. ఓ మునీశ్వరా! కార్తికమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లు అధికమైనదో దానిని వినగోరుచున్నాను. నాకు తెల్పుము మీ కంటే ధర్మమును చెప్పువారెవ్వరూలేరు.అంత వశిష్ఠమహర్షి ఇలా పలుకుచున్నాడు ’ ఓ రాజా! పూర్వమందు పుణ్యకార్యములాచరించినందుకు సత్వశుద్ధిగలుగును, సత్వ శుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును, కనుక లోకోపకారార్థమై ఇప్పుడు నీవడికిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము, విన్నంతనే పాపములు నశించును.రాజా! సూర్యుడు తులాసంక్రమణమందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో యేవి చేసినా అవి అక్షయమగును అని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులాసంక్రమణము మొదలుకొనిగాని, కార్తీక శుక్ల పాడ్యమి మొదలుకొని గానీ ఆరంభించవలెను.కార్తీక వ్రతము మొదలు పెట్టేముందు ఓ దామోదరా! నేను కార్తీక వ్రతమారంభించుచున్నాను దానిని నిర్విఘ్నంగా పూర్తిచేయించుము అని సంకల్పించి కార్తీక స్నానమారంభించాలి.కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించుటచే అట్టి వారికి ఇట్టిట్టిదని చెప్పలేని మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశియందు కార్తీకమందు చెరువులలోనూ, బావులలోను, నీటిగుంటలలోను, కాలువలలోనూ నిత్యమూ వసించి ఉండును.రాజా! సదాచారపరులైన సకల వర్ణమువారునూ ఈ కార్తీక మాసమున గంగకు వెళ్ళి నమస్కరించి ఆ శ్రీ హరిని స్మరించి కాళ్ళూ చేతులు కడుక్కొని, ఆచమించి భైరవుని ఆజ్ఞ గైకొని మొలలోతునీటిలో మునిగి గంగాస్నానం చేయవలెను.దేవ, ఋషి, పితృదేవతా గణములకు తర్పణము ఇచ్చి, శ్రీ హరి మీద భక్తితో అఘమర్షణ మంత్రములు చదువుతూ బొటనవేలితో ఆలోడనము చేసుకొని, భూమి మీదకు వచ్చి యక్ష్మ తర్పణము చేసి (ఉదకాంజలి) వస్త్రమును విడచి యధా శాస్త్ర ప్రమాణం పొడి వస్త్రం ధరించవలెను.తరవాత ఊర్ధ్వపుండ్ర ధారణమును చేసికొని, సంధ్యావందనము, గాయత్రి, బ్రహ్మ యజ్ఞము ఇత్యాది నిత్య కర్మానుష్ఠానములు చేసుకొనవలెను. స్వంత తోటలోని పువ్వులతో శంఖ చక్రములు ధరించిన శ్రీ హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.తరవాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తరవాత పురాణ శ్రవణం చేయవలెను.
సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములనన్నిటినీ ఆపి విష్ణ్వాలయమునకు గానీ, శివాలయమునకు గానీ వెళ్ళి తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణువు యొక్క గానీ శివుని యొక్కగానీ స్త్రోత్ర, జప, ధ్యానాదులను చేసుకొని నమస్కారము చేయవలెను.ఈ ప్రకారం ఎవరు ఈ కార్తీకమాసమందు భక్తితో వ్రతము చేయుచున్నాడో వాడు పునరావృత్తి రహితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వ జన్మార్చితములూ, ఈ జన్మార్జితములూ అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన యెడల నశించును.
బ్రాహ్మణుడుగానీ, క్షత్రియుడుగానీ, వైశ్యుడుగానీ, శూద్రూడు గానీ, తపస్విగానీ, స్త్రీలు గానీ, ఎవరైనా సరే భక్తిశ్రద్ధలతో కార్తీకవ్రతమును చేసిన వారికి పునరావృత్తిలేదు. ఏవరు కార్తీక వ్రతవంతుని జూచి సంతోషించునో అంత మాత్రమునకే ఆ దినమున వానికి కల్గిన పాపములు నశించును. ఇందుకు సందేహములేదు.శ్రీ స్కాందపురాణమందలి కార్తీకమాహాత్మ్యమున మొదటి అధ్యాయము సమాప్తము.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.