జైశ్రీరాం.
సహృదయులారా!
నిన్నను నామనసును బాధ పెట్టిన ఒక సంఘటనను మీతో చెప్పి మిమ్మల్ని కూడా బాధపెట్టడం సరి కాదు. ఐనా పరిష్కారం సూచించడానికి మీకంటే ఎవరుంటారు చెప్పండి. అందుకే మీకా విషయ తెలియ జేయ లేకుండా ఉండలేకపోతున్నాను. తప్పైతే మన్నించండి.
నిన్నను సాయంత్రం నడుచుకొంటూ గుడికి వెళ్ళుతున్న సమయంలో ఒక చెరువు ఒడ్డున చక్కటి దేవుళ్ళ పటాలు అద్భుతమైనవి అద్దాలతో చక్కని పటాలుగా ఉన్నవాటిని
పెంట కుప్పలమీద పడేసారు. ఎవరో తెలియదు. నాకైతే చాలా బాధనిపించింది.
కడుపులో చేయిపెట్టి కెలికేసినట్టనిపించింది. మనం ఎంతో భక్తిభావంతో ఆరాధించే దేవతల ప్రతిరూపాలుగా భావించే పటాలు, ఎంతో పవిత్రంగా మనం చూసుకొనే చిత్రపటాలు
దుర్గంధ భరితమైన ఒక అపవిత్ర ప్రదేశంలో అలా విసిరివేయబడ్డాయి.
ఒకటి కాదు రెండు కాదు కనీసం పదిహేనో ఇరవయ్యో అక్కడ అలా విసిరి పారవేయబడి ఉన్నాయి. అందులో రాతి బొమ్మలు కూడా ఉన్నాయి.
నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. వాటిని చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోవడానికి కాళ్ళు రాలేదు. నా అర్థాంగి కూడా కన్నీళ్ళపర్యంతమయింది ఆపరిస్థితి చూసి.
తప్పో ఒప్పో నాకు తోచిన పని నేను చేయకుండా ఉండలేకపోయాను.
ఆ పటాలను ఆ ఒడ్డున ఉన్న కుళ్ళు పెంట కుప్పల మీదనుండి తీసి ఆ చెరువులోనికి పడవేసాను. పాపమో, తప్పో, ఒప్పో అనే విచారణ నేనప్పుడు చేయ దలచుకో లేదు.
ఆ పని నేను నా అర్థాంగి చేస్తూ ఉంటే బాటసారులు
మమ్మల్ని వింత పసువుల్ని చూసినట్టు చూడడం కొసమెఱుపు.
విన్నారు కదా? చెప్పండి. మేమప్పుడేం చెయ్యాలి? మేము చేసినది తప్పా?
ఈ సంఘటన ద్వారా నేను సమాజానికి నామనోభావాలని వివరించి నా అభిప్రాయాన్ని సూచించ దలిచాను.
ప్రకృతిలో సృష్టింప బడిన ప్రతీ వస్తువుకీ అంతం ఉంటుంది.
మనం ప్రతీ సంవత్సరం అనేకమైన క్రొత్తక్రొత్త దేవుళ్ళ చిత్ర పటాలు, విగ్రహాలు సేకరిస్తూ ఉంటాము. వద్దన్నా మనకి అవి ప్రాప్తిస్తుంటాయి.
కొంత కాలం గడిచే సరికి అవి మాసిపోతుంటాయి, ఛిద్రమైపోతుంటాయి. అలాంటి వాటిని మనం కసవుగా భావించి నిర్లక్ష్యంగా అలా విసిరివేయడం అనేది మన నమ్మకాన్ని మనమే చెరిపేసుకున్నట్టౌతుంది.
ఈ బొమ్మలని కాబట్టి మనం అంత నిర్లక్శ్యంగా పారవేయ గలుగుతున్నాము. అదే మన తల్లిదో, తండ్రిదో, బంధులదో ఆఖరికి మనకత్యంత ప్రీతిపాత్రమైన కుక్కదో పటమై ఉంటే అలా పారవేయగలమా చెప్పండి? దేవుళ్ళ పటాలకి ఆమాత్రం విలువ కూడా యివ్వని మనకోసం దేవుడెందుకు మన బరువు తన నెత్తిని వేసుకోవాలి?
మనం క్లిష్ట పరిస్థుల్లో ఉంటే పాపం ఆ దేవుళ్ళే మనకు సహాయపడాలి. మనకే సమస్యా లేకపోతే మాత్రం ఆ దేవుళ్ళెక్కడున్నా మనకి పట్టదు. ఇదేం న్యాయం?
అర్ధ రహితమైన పనులు చేసి అనర్ధాలను కొనితెచ్చుకోవడం ఎంతవరకూ న్యాయమంటారు?
నా హృదయం ఎంత ఆవేదనకు గురికాకపోతే నేను మీతో ఇలా విన్నవించుకుంటానో మీరూ ఆలోచించండి.
ఈ విషయంలో నేను సూచించే పరిష్కారం ఆమోదయోగ్యమో కాదో మీరు చెప్పండి.
౧) కళ తప్పిన దేవుని చిత్రపాటాలు మనకు అక్కర లేదనుకొంటే వాటిని ఆ అగ్నిహోత్రునకు సమర్పించడం ఒకపద్ధతి.
౨) ఆ పటాలను గంగా మాత ఒడిలో ఉంచడం మరొక పద్ధతి.
అంతేకాని అక్కరలేదని చెప్పి పెంట కుప్పలమీద, అపవిత్ర ప్రదేశాలలోను, పడవేయరాదు.
మనం చేసే పని మన మనస్సుకెలాగున్నా ఇతరుల మనసుకు నొప్పి కలిగించ కూడదు. ఇతరుల నమ్మకం పాడు చేయరాదు.
ఇక చెప్పండి. మీరేమంటారు?
జైహింద్.