గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2012, ఆదివారం

నవ విధ భక్తులు.

జైశ్రీరాం.  
శ్లోll
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పాద సేవనం,
అర్చనం వందనం ధ్యానం, సఖ్య మాత్మ నివేదనం.
ఆ.వెః-
విష్ణు కథలు వినుట, విష్ణుఁ గీర్తించుట,
స్మరణ, సేవ, యర్చన, రహిఁ గొల్పు
వందనంబు, ధ్యాన, సుందర స్నేహంబు
నాత్మనొసగుట, హరి నరయు గతులు.
భావముః- 
విష్ణు కథా శ్రవణము,  విష్ణు కీర్తనము,  విష్ణు స్మరణము, విష్ణు పాద సేవనము, విష్ణు అర్చనము, విష్ణువుకు వందనము, విష్ణు ధ్యానము, విష్ణ్వుతో స్నేహము, విష్ణువుకు ఆత్మ నివేదనము అను తొమ్మిదిన్నీ నవ విధ భక్తులనబడును. ఇందేది అనుసరించియైనను విష్ణు సాన్నిధ్యము పొంద సాధ్యము.

This was drawn in 2004 by  as part of Sphurthi- a 2 day Summer Camp for the children of age 7-14. The children were explained each bhakti with the help of story related to the great ones, who stood as the role model, demonstrating that particular aspect of Devotion and importantly what does it means now for us to practice in day-to-day life ...
(1)శ్రవణం  --> ఆదిశేషుడు,
(2) కీర్తనం --> అన్నమాచార్యుడు, 
(3) విష్ణోః స్మరణం --> నారదుడు,
(4) పాద సేవనం --> హనుమంతుడు, 
(5) అర్చనం  --> సుదాముడు (కుచేలుడు),
(6) వందనం --> గరుత్మంతుడు, 
(7) దాస్యం  --> లక్ష్మణుడు, 
(8) సఖ్యం --> మైత్రేయుడు, 
(9) ఆత్మ నివేదనం --> గోపికలు.
జైహింద్.
Print this post

6 comments:

అజ్ఞాత చెప్పారు...

my sister has done m.phil from telugu university on the same subject. it is nice to see the sloka here.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! అభినందనలు. మంచి శ్లోకమును వ్రాసేరు. అనువాదమును చేసేరు. అందులో దాస్యమునకు బదులుగా ధ్యానము అని అన్నారు. అయినా పాఠాంతరములు ఉండ వచ్చును.
మా ప్రయత్నమును తిలకించండి.

శ్రవణమును, కీర్తనమ్మును, సంస్మరణము,
పాదసేవయు, పూజయు, వందనమ్ము,
దాస్య, మాత్మనివేదన దైవమునకు
ననగ తొమ్మిది విధముల దనరు భక్తి

Kottapali చెప్పారు...

బావుంది మాస్టారు. భక్తి ఏవిటి అనే విషయాన్ని గురించి చాలా ఆలోచనలు రేగుతున్నాయి. పప్పు వేనుగోపాలరావుగారి ఉపన్యాసం ఒకదానిలో ఈ శ్లోకాన్ని ప్రస్తావించారు కానీ విశదీకరించలేదు. మీరు దీని నేపథ్యాన్ని గురించి, వివిధ భక్తి రూపాల్ని గురించి ఇంకొంచెం వివరంగా చెబితే చదవాలని ఉంది.

Pandita Nemani చెప్పారు...

భాగవతములో 9 విధముల భక్తిని చెప్పేరు. అవి:
శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం,
అర్చనం, వందనం, దాస్యం, సఖ్య మాత్మ నివేదనం.
తాత్పర్యము: (1) భాగవత కథలను, వేద శాస్త్ర పురాణాలను వాటి వ్యాఖ్యలను వినుట; (2) భగవంతుని కళ్యాణ గుణములను లీలలను కీర్తించుచు వివిధ స్తోత్రములను పద్య, గద్య, గేయ, గాన రూపములలో నొనరించుటయును, (3) సర్వ కాల సర్వ అవస్థలందును భవంతుని స్మరించుటయు; (4) భగవంతుని పాద పద్మములను కొలుచుటయును, (5) భగవంతుని పూజించుటయు, (6) భగవంతుని ముందు మోకరిల్లి వందనములను చేయుటయు, (7)ఆ పరమాత్మునికి దాసునిగా ఎల్లప్పుడు భజించుటయును, (8)ఆ దేవునితో స్నేహ భావముతో
నుండుటయు, మరియు (9)ఆ పరాత్పరునికి తనను సంపూర్ణముగా సమర్పించుకొనుటయు అని తెలిసికొని త్రికరణ శుద్ధితో (మనో వాక్ కాయముల శుద్ధితో) ఆచరించుటయునూ భాగవతము మనకు బోధించెను. స్వస్తి

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శ్రీమద్భాగవతములో పోతన రచించిన పద్యరాజము ( నవవిధ భక్తితత్వముల గురించి..... )


తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా.

Sanath Sripathi చెప్పారు...

2004వ సంవత్సరంలో వేసవి సెలవులలో పిల్లలకు రెండ్రోజుల 7-0 14 సంవత్సరముల పిల్లలకు సమ్మర్ క్యాంపు నిర్వహించినప్పుడు ఈ నవ విధ భక్తులనూ ఒక్కోక్క భక్తిమార్గంలో తమ తమ జీవితాలను మహోన్నతంగా సాగించి నడచిన భగవత్ భక్తుల కథలనాధారముగా చేసికొని పరిచయం చేయడం జరిగింది. అప్పుడు చిత్రించినవే ఈ బొమ్మలు. గమనించగలరు

http://raata-geeta.blogspot.com/2012/01/pictorial-representation.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.