గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జూన్ 2011, మంగళవారం

కవితలో నారికేళ పాకంలోను, స్వయం పాకంలోను దిట్ట మన కవిసామ్రాట్.

ఆంధ్రామృత పాన లోలులారా! చూచారా మన కవిసామ్రాట్ ని?  కనిపించాఁడు కాబట్టి అతనితో ప్రస్తావించడానికి తెగిస్తున్నాను.

ఆ.  విశ్వ నాధుఁడైన పృథ్వీశు రాముని,
కల్పవృక్షమందు గాంచ చేసి,
కవి వతంసు లెన్న కమనీయ కావ్యాన
వెలుగు చుంటివయ్య విశ్వనాధ.

చ. భరమగు నారికేళ పరిపాక కవిత్వ సుధా పయోధిగా
గురుతరమైన రామ కథ కోరి రచించిన భాగ్యశాలివే.
స్తిరముగ కీర్తి చంద్రికలు చిందులు వేయుచు భూ నభంబులన్.
సురుచిరమై వెలుంగును. విశుద్ధ కవిత్వ ఝరీస్వరూపుఁడా!

ఉ. పాకము నారికేళమది బ్రహ్మయు మెచ్చు విధాన గొల్పుటన్
నీకిక సాటి లేరనుట నిక్కము. కాంచగ చిత్రముల్. స్వయం
పాకము లోన కూడ సరి వారలు గల్గిరె? యన్న యట్లు యీ
లోకులు మెచ్చుతీరున సులోచన మైనను లేక చేయుదే?
( సులోచనము=కళ్ళజోడు)
ఆ. మనుమరాలు నేర్వ మహనీయ మగు వంట
చేయుచుంటి వీవు చేవ చూపి.
కవులు నేర్చునట్లు కల్పవృక్షము వ్రాసి
అంద జేసి తీవు విందు చేయ.
నశ్యం పండిత లక్షణం.
ఉ. నశ్యము పీల్చు పండితులు. నశ్యము కాని కవిత్వ సృష్టిచే
నశ్యము పీల్చ నీకగును నాసరి పండితు లేరటంచు. నీ
వశ్యము వాణి. పల్కెడిది బంగరు పల్కయి కావ్య రూపమై
దృశ్య కవిత్వమై పఱగు. దివ్య కవిత్వ విశిష్ట తేజుఁడా!
విశ్వ నాథ మనకు ఎదురుగానే ఉన్నారు కదా! మీరూ మీ అభిప్రాయాలను పద్యంలో గాని, గద్యంలో గాని తెలియ జేయండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

7 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విశ్వ నాదుని చక్కని చిత్రములతో మహనీయుని ప్రస్తావన మధురంగా ఉంది.

Pandita Nemani చెప్పారు...

ayyaa! kavi saarvabhaumuni sahitee viswanaathuni paaka viseshaalu cakkagaa slaaghistoo vraasina padyaalu baagunnaayi. dhanyavaadamulu.
itlu - sanyaasiraavu nemaani

కథా మంజరి చెప్పారు...

విశ్వనాథ వారి అపురూప ఛాయా చిత్రాలు అందించి నందుకు మీకు నా అభినందనలండీ.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా!కవి సమ్రాట్టుల అపురూపమైన చిత్రాలను అందించిన మీకు నమోవాకములు

నలభీముల్ సరిరారు మీ పదనుకున్, నాణ్యంపు మీ వంటకున్!
తెలుగుం బద్యపు నారికేళ రుచులన్ దీటైన పాకంబులో
కలగల్పీయరె యాంధ్ర వాణికి నమోఘంబైన నైవేద్యముల్
పలుమారుల్! భళి! విశ్వనాథ సుకవీ! భాసించు విద్వద్రవీ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మన్నన చేయుచున్ సుజన మాన్యులు మిత్రులు జ్ఙాన పూర్ణ మి
స్సన్న రచించు పద్యములు సత్కవి పండిత రంజకంబు.మీ
రన్నది సత్యమే. సుకవిరాణ్మణి నిక్కమె పాక శాసనుల్.
మన్నిక గొల్పి యెన్నితిరి మాన్యుని, సత్కవి విశ్వ నాధునిన్.

Sanath Sripathi చెప్పారు...

అపురూపమైన చిత్రాలను అందించిన మీకు నెనర్లు.

చంద్రశేఖర్ చెప్పారు...

చింతావారికి శతకోటివందనాలు. మా తాతగారి అరుదైనఫోటోలు చూపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.