గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మార్చి 2011, సోమవారం

సప్తతి పూర్తి అభినందనలు.

పూజ్యులైన మా బావగారు శ్రీ లింగాల శ్రీనివాసరావు, సప్తతి పూర్తి మహోత్సవము సందర్భముగా
మా అక్కగారు శ్రీమతి లింగాల జానకి,బావగారు శ్రీ లింగాల శ్రీనివాస్ దంపతులకు అభినందనలు.
శ్రీరస్తు                                         శుభమస్తు                                     అవిఘ్నమస్తు.
స్వస్తి శ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ తదియా సోమ వారం అనగా తే.07 - 03 - 2011నాటికి 
సప్తతి వర్ష ప్రాయులు అయిన సందర్భముగా పూజ్యులు శ్రీ లింగాల జానకీ శ్రీనివాస్ పుణ్య దంపతులకు
( హైదరాబాదు ) వనస్థలిపురం పంచముఖ ఆంజనేయ స్వామి వారి కోవెల సమీపం లో
సప్తతి పూర్తి మహోత్సవము జరుపుచున్న సందర్భముగా బంధు మిత్రులు సమర్పించిన  
"అభినందన మందార మాల  "
రచన:- చింతా రామ కృష్ణా రావు
ఉ:- శ్రీ కమనీయ భావ పరి సేవిత పాద సహస్ర మూర్తి, జ్ఞా
నైక సువేద్య మూర్తి, శుభమెన్ని యొసంగెడి శ్రీనివాసు డీ
శ్రీకర పూర్ణ సప్తతి విశేష మహోత్సవ మూర్తి, జానకిన్
జే కొని గొల్చు వేళను విశేష ఫలంబు లనంత మిచ్చుతన్.
ఉ:- జానకిఁ బత్నిగా బడసి, చక్కని జీవన మార్గమందు సు
జ్ఞాన కళా నిధానులగు చక్కని బిడ్డలఁ గాంచి, వారికిన్
ప్రాణముగా చరించి, వర భాగ్య నిధాన మనంగ నొప్పు శ్రీ
జానకి శ్రీనివాసులకు సప్తతి పూర్తి శుభంబుఁ గూర్చుతన్.
మ:- వర లింగాల సుధాంబుధిన్ వెలసి, శోభల్ గూర్చి  సుబ్బమ్మకున్,
గురు వర్యుండుగ పేరుఁ గన్న విల సద్గోత్రుండు సన్యాసికిన్,
చెరియించే మిముఁ జూడ మాకు శుభల్ చేకూరు నిత్యంబు. సుం
దరభావాశ్రయ సమ్మదుల్ కలిగి యౌదార్యంతో వెల్గుడీ!
క:- లక్ష్మియు రామేశమ్మును - లక్ష్మీ సాయిలును మిమ్ము లక్ష్యము తోడన్
లక్ష్మీ ప్రదముగ చూచును - సూక్ష్మ జ్ఞత కలిగి సతము. శోభిలఁ జేయున్.
క:- పౌత్రీమణి యగు మేఘన - పౌత్రీమణి స్ఫూర్తి, గొలుపు ప్రాశస్త్యము. దౌ
హిత్రుఁడు చైతన్యయు, దౌ - హిత్రుఁడు చందనయు, మీకు హితమును గూర్చున్.
సీ:- ఏ నాడు పుణ్యంబు నెలమిఁ జేసిరొ మీర -  లింత చక్కని బిడ్డ లిటులఁ గలిగె.
సప్తతి పూర్ణంబు సమయంబుఁ గణియించి -  తృప్తినీ యుత్సవ స్ఫూర్తిఁ గొలిపె.
ఈనాటి మీ యోగ మెన్న నెవ్వరికబ్బు? -  ఆది దంపతు లన నలరుచుండ్రి.
పుత్రుఁడు, కోడలు, పుత్రిక, యల్లుండు, -  మనుమలు, మీదగు మనుమరాండ్రు,
గీ:- భక్తి భావాన మిముఁ జేరి పరవశించి, - శక్తి కొలది మీ సేవలు రక్తి తోడ
చేయు చుండిరి, క్షేమంబు సిరులు గొలుప. - మీకు శ్రీనివాస్ జానకీ! మేలు కలుగు.
పంచచామరము:-
మహాత్ములార! దైవ భక్తి, మాన్య వర్తనంబులన్ 
మహేశుడే గణింప నుండి, మాకు మార్గ దర్శమై
మహిన్ వసించు చుండుడీ! మరిన్ని వత్సరంబులున్. 
సహస్ర చంద్ర దర్శనంబు చక్క నౌత మీకికన్.
( మత్తకోకిల గర్భ ) సీసము:-
మూడు కోట్ల సురల్, ప్ర పూజ్యుఁలు, ముఖ్యులున్, -  మిము నెల్లెడన్ బ్రేమ మీర దయను
తోడుగా నడయాడి వేడుక తోడ మి -  మ్ములఁ గాచుచున్ శుభ మూర్తు లగుచు,
వాడిపోని వసంత భాగ్యము పాదుకొ -  ల్పుత నిత్యమున్ మీకు స్తుతము గాను.
జాడకైనను నష్ట మేడను సల్పకుం -  డను గాంచెడున్, సుధల్ గనగఁ జేయు.
గీ:- మంగళం బగు జానకీ ! మంగళంబు. -  మంగళం బగు శ్రీనివాస్ ! మంగళంబు.
మంగళం బగు సంతుకు మంగళంబు. - మంగళం బగు జగతికి మంగళంబు. 
మంగళం                      మహత్                   శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ


Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

మీ బావ గారికి సమర్పించిన పద్య మందారాలు మనోహరంగా ఉన్నాయి. వారికి నా శుభాకాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్యగారూ! ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.