గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, అక్టోబర్ 2009, బుధవారం

భారత యుద్ధంలో పాల్గున్న 18 అక్షౌహిణీ లంటే ఎంత సైన్యం?

పాఠకావతంసులారా!
మహాభారతంలో పర్వాలు 18.
మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీలు.
అసలు అక్షౌహిణి అంటే ఎంత సైన్యం?
దీనిని గూర్చి సప్రమాణికంగా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది కదా! అందు నిమిత్తం
మహాభారతం ఆది పర్వంలో ప్రథమాశ్వాసంలో 80 వ నన్నయ వివరించిన అక్షౌహిణీ స్వరూపాన్ని యథా తథంగా చూద్దాం.

సీ:-
వర రథమొక్కండు, వారణ మొక్కండు, - తురగముల్ మూఁడు, కాల్వురును నేవు
రను సంఖ్య గలయది యగుఁబత్తి, - యది త్రిగుణంబైన సేవా ముఖంబు,
దీని త్రిగుణంబు గుల్మంబు,దీని మమ్మడుగగు - గణము,తద్గణము త్రిగుణితమైన
వాహిని యగు,దాని వడి మూఁట గుణియింపఁ - బృతననాఁబరగుఁ,దత్‍పృతన మూఁట
ఆ:-
గుణితమైనఁజమునగున్, మరి దానిము - మ్మడుఁగనీకినీ సమాఖ్యనొనరు,
నదియుఁబది యడుంగులైన నక్షౌహిణి - యౌ నిరంతర ప్రమాను సంఖ్య.

వివరణ:-
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱాలు, ఐదుగురు కాల్బలములు కలిసిన సైన్యము "పత్తి".
దానికి మూడు రెట్లు సైన్యమును "సేనాముఖము"
దానికి మూడు రెట్లున్న"గుల్మము"
గుల్మానికి మూడు రెట్లున్న "గణము"
గణానికి మూడు రెట్లున్న "వాహిని"
వాహినికి మూడు రెట్లున్న " పృతన"
పృతనకు మూడు రెట్లున్న "చమురు"
చమురుకు మూడు రెట్లున్న "అనీకిని"
అనీకినికి పది రెట్లున్న "అక్షౌహిణి"

అంటే
{రథము+ఏనుగు+3గుఱ్ఱాలు+5 కాల్బలమును}పత్తి
ఇంటూ 3=సేనాముఖము
ఇంటూ3=గుల్మము
ఇంటూ3=గణము,
ఇంటూ3=వాహిని
ఇంటూ3=వృతము
ఇంటూ3=చమురు
ఇంటూ3=అనీకిని
ఇంటూ10=అక్షౌహిణి.

అనగా అక్షౌహిణిలో
రథాలు 21,870
ఏనుగులు 21870
గుఱ్ఱాలు 65,610
కాల్బలము 1,09,350
ఉండును.

18 అక్షౌహిణీలలో
రథాలు 3,93,660
ఏనుగులు 3,93,660
గుఱ్ఱాలు 11,80,980
కాల్బలము 19,68,300

అంతే కాదండోయ్.
దీనికి అదనంగా రథానికొక సారథి చూపున, ఏనుగుకొక మావటివని చొప్పున అదనంగా కలుపుకోవాలి.
అలా కలుపుకుంటే
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గున్నవారు 47,23,920 మంది.

ఈ 18 అక్షౌహిణీలలో పాండవుల బలం 7 అక్షౌహిణీలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

జైహింద్.
Print this post

3 comments:

Anil Dasari చెప్పారు...

సుమారు ఇరవై లక్షలమంది దాకా సైనికులు పాల్గొన్నారంటే అప్పట్లో భరతఖండంలో జనాభా ఎంతుండేదో.

రవి చెప్పారు...

అబ్రకదబ్ర గారు, భరతఖండం విస్తృతి కూడా చూడాలి. ఇప్పటి పాకిస్తాను, నేపాల్, భూటాను, ఇరాన్, ఆఫ్ ఘనిస్తాను ఇవన్నీ కూడా కలుపుకోవాలి!

Sravan Kumar DVN చెప్పారు...

aunu, burma,bangladesh kuda bharatakhandame

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.