గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, అక్టోబర్ 2009, శుక్రవారం

కొత్త పాళీ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

1 comments

శ్రీయుతులైన కొత్తపాళీ గారికి జన్మ దిన శుభా కాంక్షలు.

ఆనందామృత సాగరా! గురువరా! ఆంధ్రామృతాస్వాదనా
జ్ఞానోద్భాసిత! కొత్తపాళి! తమకున్ కాంక్షింతు దీర్ఘాయువున్.
ఏనాడైనను మీకృపామృతము మా కీయంగ వర్ధిల్లుతన్.
ఈనాడే తమ పుట్టినట్టి దినమౌన్. ఈశుండు కాచున్ మిమున్.

మీరు కలకలం శుభప్రదంగా వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

జైహింద్.

16, అక్టోబర్ 2009, శుక్రవారం

ఆంధ్రామృతం అందిస్తున్న దీపావళి శుభాకాంక్షలు

4 comments

స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విరోధి నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ అమావాశ్య పర్వ దినమున నిత్య నూతన కాంతులు విరజిమ్ముతూ వచ్చిన ఈ నాటి దీపావళి సందర్భంగా మీ అందరికీ నా తరపున మన సుహృన్మిత్రుల తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు.

ఉ:-
ఆంధ్రుల కీర్తి చంద్రికలు హాయిగ నెల్లలఁ దాటిపోవ నీ
యాంధ్రులు జ్ఞాన తేజము నయాచిత రీతిని పంచు నెల్లెడన్.
ఆంధ్రులదెచ్చటైనను మహాద్భుత రీతిని వృద్ధి గాంచు. ఓ
యాంధ్రుడ జ్ఞాన దీపసుమహాద్భుత పంక్తులు మీకు మేలనెన్.

శా:-
జ్ఞాన జ్యోతుల పంక్తు లెల్లెడల నజ్ఞానంబు పోకార్ప, సు
జ్ఞానంబీయగ యింటి ముంగిటకు తా కాంతుల్ ప్రకల్పించుచున్
నీ, నా భేదము లేక వచ్చె.కనితే? నెయ్యంబునో యాంధ్రుడా!
జ్ఞానాంధ్రామృత పానలోలుడ! లసత్ కల్యాణ సద్భాగ్యుడా!

శా:-
దీపాలంకృతమై వెలుంగుత సదా దేదీప్యమానంబుగా
ప్రాపై నిల్చుత మీ గృహాళి కృపతో భవ్యాత్ములన్ గాచుతన్.
పాపాళిన్ బరిమార్చుచుండి విలసత్ భాగ్యాళి చేకూర్చుతన్.
దీపాలన్ వెలుగొందు లక్ష్మి మిములన్ దివ్యాత్ములంజేయుతన్.

మీ గృహం నిత్య కల్యాణ కాంతులతో విరాజిల్లుతూ, నిత్య సంతోష నిలయం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.

15, అక్టోబర్ 2009, గురువారం

నన్నయను గూర్చిన మధునాపంతుల వారి మధుర నిర్వచనం.

0 comments

అసమాన ప్రతిభాశాలి యైన ఆది కవి నన్నయను " అభినవ నన్నయగా పేరొందిన మాన్యులు మధునాపంతుల సత్యనారాయణ గా" ఈ క్రింది విధంగా ప్రశంసించారు. మీరూ చూడండి.

శా:-
కాలంబెంత గతించిపోయినను ఆకల్పాంత సంస్థాయిగా
నేలన్ నిల్వఁగఁ జాలు వ్యాస కవితా నిర్మాణమున్ బాసలో
నాలాపింపఁగ పంచమ శ్రుతి గరీయ స్వాదు సన్మాధురీ
శ్రీలన్ నన్నయ కోకిలంబు సవరించెన్ గంటపున్కంఠమున్.

ఎంత కాలము గడచిపోయినప్పటికీ ఆకల్పాంతమూ స్థిరముగా నుండగలిగిన వ్యాసకవి కృత జయమను పేరఁ బరగు మహాభారతాన్నితెలుగుభాషలో ఆలాపించుకొను విధంగా పంచమ శృతిలో { శృతి=వేదము, పంచమ శృతి=పంచమ వేదము} సన్మాధురీ శ్రీలను నన్నయ అనే కోకిల గంటమనే కంఠంతో సవారించెను.

ఎంత స్వభావోక్తి! ఎంతటి సునిశిత పరిశీలన!
ఎప్పుడైనా నన్నయను గూర్చిన ప్రస్తావన వచ్చినప్పుడు మనం తప్పక మన భావాన్ని పద్య రూపంలో వ్రాసి చెప్ప గలిగితే మంచిదే. కానినాడు కనీసం మధునాపంతుల వంటి వారు అత్యద్భుతంగా నిర్వచించిన ఈ నన్నయను గూర్చిన పద్యాలను ప్రస్తావించ వచ్చు.సమయోచితంగా నప్పిదమై, మన్నన కలిగిస్తుంది.
మరి పై పద్యం కంఠస్థం చేద్దామా?

జైహింద్.

8, అక్టోబర్ 2009, గురువారం

అదొక పెద్ద వెల్లువ. దాని సంగతి మీకు తెలుసా?

2 comments

ప్రియ పాఠకులారా!
మనం అక్షౌహిణిని గూర్చి ముచ్చటించుకున్నాం కదా! అది బారతం వరకే మనం పరిమితమై చెప్పుకున్నాం. ఐతే రామాయణం లోనికి తొంగి చూస్తే భారతంలో చెప్పిన 18 అక్షౌహిణీల సైన్యం అత్యల్పమనిపించక మానదు. మీరూ పరికించండి.

కంబ రామాయణంలో " సుగ్రీవుని వద్ద గల సైన్యం " 70 వెల్లువలట.
ఈ వెల్లువ సంగతి మనకు వివరంగా తెలియక పోయినా "అది పార్టీ మీటింగ్‍కు వచ్చినజనమేంటిరా బాబు, అదో పెద్ద వెల్లువ" అని వాడేస్తూ ఉంటాం.
ఇప్పుడీ వెల్లువ విషయం తెలుసుకుందాం.

అక్షౌహిణికి ఎందరుంటారో మనం ఇంతకు ముందు టపాలో తెలుసుకున్నాం కదా! అటువంటీ
8 అక్షౌహిణులు = ఒక ఏకము.
8 ఏకములు = ఒక కోటి. {ఈ కోటి మనం వాడుకునే నూరు లక్షలొక కోటి అన్నది మాత్రం కాదని గుర్తించండి.}
8 కోట్లు = ఒక శంఖము.
8 శంఖములు = ఒక కుముదము.
8 కుముదములు = ఒక పద్మము.
8 పద్మములు = ఒక నాడి.
8 నాడులు = ఒక సముద్రము.
అటువంటి
8 సముద్రములు = ఒక వెల్లువ.
అంటే 366917139200 మంది సైన్యం ఉంటే దానిని వెల్లువ అంటారన్నమాట.

ఇటువంటివి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుడి అధీనంలో ఉండేది.
అంటే 256842399744000 సైన్యమన్నమాట.
ఆ సుగ్రీవుని వద్ద గల సైన్యాధిపతులే 67 కోట్ల మంది.
వీటన్నిటికీ నీలుడు అధిపతి.
ఆశ్చర్యంగాలేదు?

తెలుకోవాలనుకున్నా, తెలియఁజెప్పాలనుకున్నా చాలా చాల విషయాలు మన చరిత్ర పుటల్లోంచి లభిస్తూనే ఉంటాయి గ్రహించేవారికి. మీకు తెలిసిన విషయాలు నాకూ తెలియఁజేయండి.

జైహింద్.

7, అక్టోబర్ 2009, బుధవారం

భారత యుద్ధంలో పాల్గున్న 18 అక్షౌహిణీ లంటే ఎంత సైన్యం?

3 comments

పాఠకావతంసులారా!
మహాభారతంలో పర్వాలు 18.
మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీలు.
అసలు అక్షౌహిణి అంటే ఎంత సైన్యం?
దీనిని గూర్చి సప్రమాణికంగా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది కదా! అందు నిమిత్తం
మహాభారతం ఆది పర్వంలో ప్రథమాశ్వాసంలో 80 వ నన్నయ వివరించిన అక్షౌహిణీ స్వరూపాన్ని యథా తథంగా చూద్దాం.

సీ:-
వర రథమొక్కండు, వారణ మొక్కండు, - తురగముల్ మూఁడు, కాల్వురును నేవు
రను సంఖ్య గలయది యగుఁబత్తి, - యది త్రిగుణంబైన సేవా ముఖంబు,
దీని త్రిగుణంబు గుల్మంబు,దీని మమ్మడుగగు - గణము,తద్గణము త్రిగుణితమైన
వాహిని యగు,దాని వడి మూఁట గుణియింపఁ - బృతననాఁబరగుఁ,దత్‍పృతన మూఁట
ఆ:-
గుణితమైనఁజమునగున్, మరి దానిము - మ్మడుఁగనీకినీ సమాఖ్యనొనరు,
నదియుఁబది యడుంగులైన నక్షౌహిణి - యౌ నిరంతర ప్రమాను సంఖ్య.

వివరణ:-
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱాలు, ఐదుగురు కాల్బలములు కలిసిన సైన్యము "పత్తి".
దానికి మూడు రెట్లు సైన్యమును "సేనాముఖము"
దానికి మూడు రెట్లున్న"గుల్మము"
గుల్మానికి మూడు రెట్లున్న "గణము"
గణానికి మూడు రెట్లున్న "వాహిని"
వాహినికి మూడు రెట్లున్న " పృతన"
పృతనకు మూడు రెట్లున్న "చమురు"
చమురుకు మూడు రెట్లున్న "అనీకిని"
అనీకినికి పది రెట్లున్న "అక్షౌహిణి"

అంటే
{రథము+ఏనుగు+3గుఱ్ఱాలు+5 కాల్బలమును}పత్తి
ఇంటూ 3=సేనాముఖము
ఇంటూ3=గుల్మము
ఇంటూ3=గణము,
ఇంటూ3=వాహిని
ఇంటూ3=వృతము
ఇంటూ3=చమురు
ఇంటూ3=అనీకిని
ఇంటూ10=అక్షౌహిణి.

అనగా అక్షౌహిణిలో
రథాలు 21,870
ఏనుగులు 21870
గుఱ్ఱాలు 65,610
కాల్బలము 1,09,350
ఉండును.

18 అక్షౌహిణీలలో
రథాలు 3,93,660
ఏనుగులు 3,93,660
గుఱ్ఱాలు 11,80,980
కాల్బలము 19,68,300

అంతే కాదండోయ్.
దీనికి అదనంగా రథానికొక సారథి చూపున, ఏనుగుకొక మావటివని చొప్పున అదనంగా కలుపుకోవాలి.
అలా కలుపుకుంటే
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గున్నవారు 47,23,920 మంది.

ఈ 18 అక్షౌహిణీలలో పాండవుల బలం 7 అక్షౌహిణీలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

జైహింద్.

5, అక్టోబర్ 2009, సోమవారం

ఏడు వారాల నగలు ఎందుకు ధరించేవారో తెలుసా?

3 comments

ప్రియ పాఠక బంధువులారా!
పూర్వంనుండీ కూడా మనవారు అలంకారాలకి ఒక ప్రత్యేక స్థానమిచ్చి, తమ అంతస్సౌందర్యంతో బాటు బాహ్య సౌందర్యాన్ని కూడా పెంచుకొనేవారనీ, అందు కొఱకే ఏడు వారాల నగలు ధరించే వారనీ అనుకొంటుంటాం. ఐతే మన పూర్వీకులు ఏపనీ నిర్హేతుకంగా చేసేవారు కారన్న మాట యదార్థమని మనం గ్రహించ వలసి ఉంది.

ఏడు వారాల నగలు ధరించడం అంటే మన కున్న నగలేవో వారంలో అన్ని రోజులూ ధరించడం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత గల నగ ధరించడం.

ఆది వారం ధరించేవి:- కెంపులు పొదగఁబడిన నగలు,

సోమవారం ధరించేవి:-ముత్యాలు పొదగఁబడీన ఆభరణములు.

మంగళ వారం ధరించేవి:-పగడములు పొదగఁబడిన హారములు.

బుధవారం ధరించేవి:-పచ్చలు పొదగఁ బడిన గాజులు మొదలగు నగలు.

గురువారము ధరించునవి:-పుష్యరాగ ఆభరణములు.

శుక్రవారము ధరించునవి:-వజ్రాల హారములు.

శనివారం ధరించునవి:-నీల మణి హారములు.

ఐతే ఈ యేడు రోజులూ ఏ రోజు కారోజు ప్రత్యేకముగా హారములు ధరించుటకు కారణము లేకపోలేదు. ఆ కారణమేమిటో చూడండి.

ఆదివారము:-
ఆదిత్యుడె యధిపతియను
వాదముకలదయ్య ఆదివారమ్మునకున్.
మోదము కెంపు యతనికని,
మోదముతోఁ దాల్తు రతని ముచ్చట దీర్చన్.

సోమవారము:-
సోముడన చంద్రు డతనికి సోమవార
మాధిపత్యము కలదయ్య. ఆతనికిని
ముత్యమిష్టము కావున ముత్య మున్న
హారధారణ చేసిన హాయి కలుగు.

మంగళ వారము:-
అంగారక గ్రహ మధిపతి
మంగళవారమున కండ్రు. మహనీయుడు తా
పొంగును పగడముఁ దాల్చిన,
మంగళ ప్రదుడగును మనకు మహిమను గొలుపున్.

బుధవారము:-
బుధవారము బుధుడధిపతి.
బుధుని కొఱకు పచ్చ దాల్చ ముదమును కూర్చున్.
బుధులగు మన పెద్దలు తా
మదినెంచి ధరింప నేర్పి మాన్యత గొలిపెన్.

గురువారము:-
గురుడధిపతి యీ గురువార మురుతరమగు
పుష్య రాగము ద్లాల్చిన ముదమతనికి.
పెద్దలానాటి నుండియు ప్రీతిఁ గూర్చు,
పెంపుఁ గొలిపెడు అందాలు పెంచి నారు.

శుక్రవారము:-
శుక్రవారము శుక్రుడు శోభిలునయ.
శుక్రునకు వజ్రమిష్టము. శుభము కొఱకు
వజ్ర ధారణ తగునయ్య. వాటి మహిమ
పెద్ద లానాడ కనుగొనె. ప్రీతిఁ దెలిపె.

శనివారము:-
శనివారము శని యధిపతి.
శనికి హితము నీల మణులు. చక్కగ వీటిన్
శనివారము ధరియించిన
శని తృప్తిని పొంది సుఖము చక్కగఁ గొలుపున్.

-----------------------------------------------------------------------
మన జ్యోతక్క పంపిన నవరత్న ఆభరణాల్ని కూడా చూడండి.

పూర్వం రాజకుటుంబానికి చెందిన , మిక్కిలి ధనవంతులైన స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. అవి వారి ఆడంబర ప్రదర్శనకు, గ్రహాల అనుగ్రహమునకు సరిపోయే విధంగా చేయించుకునేవారు. అంటే రోజు కొక గ్రహాన్ననుసరించి ఒకో రకమైన రత్నాభరణాలు ధరించేవారు . వివిధ ఆభరణాలలో జాతి రత్నాలు పరీక్షించి మరీ పొదిగి అద్భుతమైన నగలు తయారు చేసేవారు .అనంతరం నియమ నిష్టలతో పూజలు జరిపి వాటిని శక్తిమంతం చేసి రోజుకో నగ ధరించేవారు. వారంలో ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా చెప్పబడుతుంది. ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నాలతో చేసిన ఆభరణములు ధరిస్తే శుభప్రదం అని అనాదిగా నమ్ముతున్నారు .




రవివారం
ఆదివారం నాడు అధిపతి సూర్యుడు. ఈ రోజు సూర్యుని రంగులో ఉండే కెంపులు పొదిగిన ఆభరణాలు ధరించి , లేత ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించి, తమ కుటుంబమును రక్షించమని సూర్యదేవుని ప్రార్ధిస్తారు



సోమవారం
సోమవారం నాడు అధిపతి చంద్రుడు. ఈ రోజు చంద్రుడి రంగులో ఉండే ముత్యాలు పొదిగిన ఆభరణములు ధరించి చంద్రవర్ణంలో (తెలుపు) ఉండే దుస్తులు ధరించి మానసిక ఆరోగ్యాన్ని, ప్రశాంత జీవనాన్ని కలిగించమని చంద్రుణ్ణి ప్రార్ధిస్తారు.



మంగళవారం
మంగళవారం నాడు అధిపతి అంగారకుడు . ఈ రోజు స్త్రీలు అంగారకుని రంగులో ఉండే పగడపు రంగు వస్త్రాలు ధరించి పగడాలతో చేసిన ఆభరణములతో అలంకరించుకుని శక్తిని ,సౌఖ్యాన్ని ప్రసాదించి , రుణబాధలు లేకుండా చేయమని కుజుడిని ప్రార్దిస్తారు.



బుధవారం
బుధవారం నాడు అధిపతి బుధుడు . ఈ రోజు స్త్రీలు ఆకుపచ్చగా, బుధుడి రంగులో ఉండే ఆకుపచ్చని దుస్తులు ధరించి మరకతం ( పచ్చలు)తో చేసిన ఆభరణములు ధరించి మేధోశక్తిని పెంపొందించి, బుద్ధిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇవ్వమని బుధుడిని వేడుకుంటారు .



గురువారం
గురువారం నాడు అధిపతి గురువు. అతని రంగులో ఉండే లేత పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి కనక పుష్యరాగాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్త్రీలు సంపద, సచ్చీలం పెంపొందాలని గురుడిని ప్రార్దిస్తారు.



శుక్రవారం
శుక్రవారం నాడు అధిపతి శుక్రుడు . ఇతని అనుగ్రహం కోసం తెల్లని రంగులో ఉండే దుస్తులు ధరించి తెల్లని వజ్రాలు పొదిగిన ఆభరణములు ధరించిన స్త్రీలు తమ కుటుంబ జీవనం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని , దాంపత్యం కలకాలం సుఖశాంతులతో వర్దిల్లాలని శుక్రుడిని ప్రార్దిస్తారు .



శనివారం
శనివారం నాడు అధిపతి శని . అతడి శరీరవర్ణమైన నీలం రంగు దుస్తులు ధరించి , నీలంతో చేసిన ఆభరణములు ధరించి తమకు పీడలు , బాధలు లేకుండా చేయమని శనీశ్వరుడిని ప్రార్దిస్తారు.

స్త్రీలు ఇలా గ్రహాలకు సంబంధించిన పూజలు చేసి, తదనుసార జాతి రత్నాభరణములు ధరించడంలో ఆంతర్యం కుటుంబ శ్రేయస్సు మాత్రమే. మనం ధరించే నవరత్నాలు సహజసిద్ధమైనవి ఐతేనే మనకు సరియైన ఫలితం చెకూరుతుంది . ఏడు వారాల నగల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతిష నిపుణులు , రత్న శాస్త్ర నిపుణులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నమ్మకమైన దుకాణములో కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం.

కనీసం ఆరు గ్రహాల స్థితైనా తమ జాతకంలో బావున్నవారు మాత్రమే ఇలా ఏడు రకాల రత్నాలతో ఆభరణాలు తయారుచేయించుకుని ధరించవచ్చు.అలా కాని పక్షంలో మనం కోరుకునే శాంతిసౌభాగ్యాల్ని అవి ప్రసాదించలేకపోవచ్చు. ఉదాహరణకు తమ జాతకంలో కుజస్థితి బాగాలేని స్త్రీలు పగడాలు పొదిగిన నగలు ధరించడం వల్ల వారి భర్తలకు అరిష్టం. లేదా భూమి తగాదాలూ, ఋతుబాధలూ తీవ్రతరమౌతాయి. అలాగే శుక్రుడు యోగించని స్త్రీలు వజ్రాభరణాలు ధరించడం వల్ల దాంపత్యసౌఖ్యలోపం, వ్యభిచార భావాలు, భర్తతో గొడవలు, విడాకులు, సాటి స్త్రీల మూలంగా అశాంతి, వాహనప్రమాదాలు, పొట్టలో ఇబ్బందులు సంప్రాప్తమౌతాయి. జాతకంలో సరిపడని గ్రహాల రత్నాలని ఉంగరంలో పొదిగించి ధరించే పురుషులకు సైతం ఇదే ఫలితం.

-------------------------------------------------------------------------------------------------
చూచారు కదా మన జ్యోతక్క పంపిన నవరత్నాల ఆభరణాల్ని.
ఇక విషయానికొద్దాం.

మన పూర్వీకులు తమ అనుభవాల సారంగా మన కందించిన విజ్ఞానాన్ని హేతువాదం పేరుతో నిర్హేతుకంగా కోల్పోతున్నామేమో ఒక్క సారి మనం ఆలోచించుకోవలసి ఉందని నా అభిప్రాయం.


జైహింద్.

2, అక్టోబర్ 2009, శుక్రవారం

అభివందనం. శ్రీ షిరిడీశదేవశతకముపై డా.ఎల్.ఎస్.వై.వి.శర్మగారి సమీక్ష.

1 comments

అభివందనం

డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ, M.A.M.Phil,Ph.D.
ప్రశాంతి నిలయం,
పాయకరావు పేట.
ఆధునికాంధ్ర వాఙ్మయం అనేక ప్రక్రియలతో శాఖోపశాఖలుగా విస్త్రుతమైనప్పటికీ శతక ప్రక్రియ మాత్రం అప్పుడూ యిప్పుడూ నవనవోన్మేషమై తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాను నమ్మిన దైవాన్ని గాని, వ్యక్తిని గాని, లేదా తన ఆత్మను గాని స్తుతిస్తూ స్వాభిప్రాయాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే స్వేచ్ఛ శతక రచయితకుంటుంది.

ఇటీవలి కాలంలో శ్రీ చింతా రామ కృష్ణా రావు కవి వర్యుల కలం నుండి జాలువారిన" శ్రీ షిరిడీశ దేవ శతకం " ఒక ఉత్తమ రచనగా శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వంటి కవి పండితులచే ప్రశంసలందుకుని ఆంధ్ర లోకాన్ని ఆకట్టుకుంటోంది. భక్తి రస ప్రథానమైన యిటువంటి ఆర్షసాహితీ మరందాన్ని ఆస్వాదించే భాగ్యం ఆంధ్ర లోకానికి కలిగించినందుకు శ్రీ రామకృష్ణాగ్రజులకు కృతజ్ఞతాభివందనలు సవినయంగా తెలుపుకుంటున్నాను.

నేటి కాలంలో భారతీయుల్ని ఆకట్టుకున్న దైవం షిరిడీశుడంటే అత్యుక్తి కాదేమో. సర్వ దేవతాతీత స్వరూపునిగా ఆ స్వామి అశేష భారత ప్రజలచే నీరాజనాలందుకుంటున్న విషయం లోక విదితమే. అటువంటి సాయి తత్వాన్ని ఈ కవి అష్టోత్తరశత చంపకోత్పలాలతో అర్చించి, సాయి కరుణకు పాత్రుడైనట్లు మనకు తెలుస్తుంది.

షిరిడీశ దేవునే మనం ఎందుకు కొలుస్తాం? అంటే
చ:- అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపుచుండి, మ
మ్మనయము బ్రోతువీవు. పరమాత్ముడవంచు భజింతు మేము. ని
న్ననయముఁ గొల్చు చుండి,సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే
య నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా !

అని తన ఆర్తిని మహాద్భుత శక్తి కలిగిన స్వామికి నివేదించారు కవి.

అలాగే ఈ క్రింది పద్యంలో భగవంతుడు సర్వాంతర్యామి అని చక్కగా వివరిస్తూ ఇలా అంటారు.
ఉ:- కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండ నిం
కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచుఁ గాంతు రిం
కొందరు దీనులందుఁ గడు కూర్మిని నిన్ గని పొంగుచుండు. ని
న్నందరి లోనఁ గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా !

స్త్రీవాద కవిత్వంలో స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డ కవులలో వీరు కూడా అగ్రగణ్యులు. ఈ శతకంలో అనేక పద్యాలు కాలానుగుణంగా స్త్రీల పట్ల జరిగే అన్యాయాలు అకృత్యాలు స్పష్టపరుస్తున్నాయి. సమస్యా పరిష్కారం కోసం కవి తన ఆవేదనను సాయికి నివేదించడం ఈ పద్యాల్లో మనం చూస్తాం. ఇందుకో ఉదాహరణ పద్యం చూడండి.
చ:- మగువలపైన మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్
భగ భగ మండు యగ్నిశిఖపాలొనరింపు ముపేక్ష యేల? యీ
మగువలఁ గావకున్న వర మాతృజనంబిక మృగ్యమౌను. నీ
తెగువను జూపిబ్రోవుమయ తీరుగ ! శ్రీ షిరిడీశ దేవరా!

అనాదిగా స్త్రీకి ఓ ప్రత్యేక ప్రతిపత్తి గల్గిన యీ దేశంలో మహిళలకు జరుగుచున్న అన్యాయాలను ప్రతిబింబింపఁ జేసిన పద్యాలు చదివితే సహృదయ పాఠకుల మనసుల్ని కలిచివేస్తాయనడంలో సందేహం లేదు.

సామాజిక స్ఫృహ గలిగిన కవిత్వం వీరిది అనడానికి ఈ పద్యం ఒక్కటి చాలు.
ఉ:- హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ
హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణమొందఁ జేసి, జై
హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై,
పొందిక నుండఁ జేసితివి, పూజ్యుడ ! శ్రీ షిరిడీశ దేవరా!

ఇంకా
ఏది సతం బనిత్యమన నేది?
నమ్మిన వారి చిత్తమున
లోకమనంతమయ్య.
వృక్షములాదిదేవతలు.
గుమ్మడిపండు చందమున.
వంటి అనేక నానుడులు పోలికలు సందర్భోచితంగా వివరించి కవి తన లోకజ్ఞతను చాటుకున్నారు.

తన తల్లిదండ్రులను, గురువులను స్మరిస్తూ వ్రాసిన పద్యాలు కవికి వారిపట్ల గల అనన్య సామాన్య భక్తికి నిదర్శనాలు.
ఉ:- కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం
తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీధర. రామకృష్ణుడన్.
నిన్వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ" పే
రన్విరచించితీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా !

అని కాణ్వ శాఖపై తనకు గల అభిమానాన్ని వ్యక్తీకరించడం అభినందనీయం.

ఉభయ భాషా ప్రవీణులు, నిరంతర రామాయణ పఠనా శీలురు, మహర్నటులు అయిన శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల పట్ల తనకు గల గురు భక్తిని ఈ పద్యంలో ఇలా చాటారు.
ఉ:-ఆర్యులు కల్వపూడి వినయాన్విత వేంకట వీర రాఘవా
చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా
వీర్యుడ! నీ కృపామృతముఁ బ్రీతిగ నీ శతకంబు లోన నే
నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీషిరిడీశ దేవరా!

ఆచార్య దేవోభవ అన్న దానిని సత్యం చేశారు శ్రీ రామ కృష్ణగారు.

కీ.శే. ముత్యం రామమూర్తి కవి పండితుల కోర్కెకు ప్రతీకగా ఈ శతక రచన గావించినట్లు మనకనిపిస్తుంది. వీరిద్దరి సంబంధం అటువంటిది. ఇలాంటి ఇద్దరు ఉద్దండ కవి పండితులు లభించడం " చోదవరం " ప్రజలు చేసుకున్న పూర్వ పుణ్యఫలం.

షిరిడీశునిపై తనకు గల అపార భక్తికి ఈ ఒక్క పద్యం " కలికి తురాయి ".
ఉ:- నీ దరహాస చంద్రికలు నిత్యముఁ గ్రోల చకోరమౌదునా ?
నీ దరి కాంతులీను మహనీయ సముజ్వల జ్యీతి నౌదునా?
నీ దరిఁ జేరు భక్తుల పునీతపు పాద రజంబు నౌదునా?
నీ దరి కెట్లు జేర్చెదవొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా!

అని తన వినమ్రతను తెలుపుకున్నారు.
ఈ శతకం చదివిన పాఠక లోకానికి అన్నీ శుభాలే జరుగుతాయని నా ప్రగాఢ విశ్వాసం.
జగమెఱిగిన యీ కవి పుంగవులు ఇంతటితో ఆగకుండ, మరిన్ని తెలుగు రచనలు వెలువరించి, పాఠక లోకాన్ని ఆనందింపఁ జేస్తారని తలుద్దాం. ఆ షిరిడీశుడు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి ఆయురారోగ్యాలు సదా యిస్తూ, ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను.-- ఇక సెలవు.

భవదీయ,
డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ.
తే. 02 -03-2009.


నా నివేదన

శ్రీ గురుభ్యోనమః.
పాఠక మహాశయులారా!
మంగళప్రదమైన ఆ పరమేశ్వరుని సృష్టిలో బుద్ధి జీవులమై మానవులుగా మనము జన్మించుట మన పురాకృత సుకృత ఫలమే కాని వేరొండు కాదు. అందునా భగవద్భక్తితత్పరత ఆ పరమాత్మ కృప కలిగినంత మాత్రముననే లభించును కాని సామాన్యముగా లభించునది కాదు. అట్టి భక్తి తత్పరులను కాపాడుట కొఱకే తానున్నట్టుగా ఆపరమాత్మ తన భక్తులను వెన్నంటి ఉంటాడు. అతఁడు తనను కొలిచే వారికి కొంగు బంగారం. ఆ పరమాత్మ తన భక్తులను కటాక్షించుట కొఱకు అనేక అవతారములెత్తుతుంటాడు. అనేక రూపములు పొందుతుంటాడు. తన భక్తులైన మానవులు కోరుకొనే కోరికలు తీరుస్తూ, నిరంతరం భక్తుల హృదయాలనే ఆలయంగా చేసుకొని కొలువుండే దైవాలలో నేడు శ్రీ ‘షిరిడీ సాయి’ ప్రముఖుఁడనుటలో ఏమాత్రం సందేహము లేదు. మన  నిర్మలమైన మసస్సే షిరిడీశ్వరునికి మంత్ర తంత్రములు, పూజా పుష్పములు, నైవేద్యములు. మనసారా  ఆ షిరిడీ సాయిని తలచుకొని, మన మనసులో గల కోరికను తీర్చమంటే చాలు. ఆ సాయి అది ఎంతటి క్లిష్టతరమైన కోరిక ఐనప్పటికీ ఇట్టే తీరుస్తూ కలి యుగంలో అత్యంత ప్రతిభతో వెలుగొందుతున్నాఁడు. 
నేను అనేకమైన సంఘటనలను చూచి మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యేవాడిని. అట్టి షిరిడీశ్వరుని ప్రతిభలు నా అనుభవంలో ఉన్నవి లోకులకు చెప్పాలనే తపన నాలో ఏ నాటి నుంచో ఉంది. ఇంత వరకు చెప్పలేకపోయాను. దేనికైనను సమయం ఆ భగవంతుఁడు కల్పించాలి కదా! అంత వరకు ఏ పనీ జరగదు.
విశాఖపట్టణం జిల్లా, చోడవరం పట్టణ నివాసి స్వర్గీయ ముత్యం రామ మూర్తి గారు ప్రముఖ సాహితీ వేత్తయే కాక ప్రముఖ విలేఖరి కూడాను. వారికి నేనన్నా, నా కవిత్వమన్నా అవ్యాజమైన ప్రేమ. 
వారికి అవసాన దశ సమీపించినది. అనారోగ్యంతో  బాధపడుతూ ఉన్న వారికి  వైద్యం చేయించారు అతని అల్లుఁడైన ప్రాత రాజశేఖర్ మరియు కుమార్తె మ.ల.స. మీనాక్షి. ఇక ప్రయోజనం లేదని వైద్యులు చెప్పడంతో తన స్వగృహానికి వారిని తీసుకు వచ్చేసారు. జీవితంలో చివరి దశలో ఉన్న రామ మూర్తి గారు నన్ను చూడాలని ఉందని రమ్మని నాకు కబురంపారు. నేను వారి వద్దకు వెళ్ళాను. అనారోగ్యంతో ఉన్నప్పటికీ తనకెటువంటి అనారోగ్యం లేదని, తగ్గిపోగానే లేచి సాహితీ కార్యక్రమాలలో పాల్గొంటానని నాకు తెలియ జేసారు. తనకు ఒక కోరిక ఉన్నదనీ, అది నేనే తీర్చవలెనని వారు కోరారు. ఆ కోరిక ఏమిటో చెప్పవలసినదిగా నేను కోరాను. “ మీరు ఏదైనా ఒక పద్య కృతి చేస్తే అది చదవాలనుందండి. వ్రాస్తారు కదూ?" అంటూ తన కోరికను తెలియ జేసారు. ఓసి అదెంత పని? తప్పక వ్రాస్తానని చెప్పి సోమవారం సాయంత్రం వారితో మాటాడి వారి నుండి సెలవు తీసుకొని, ఇంటికి వెళ్ళిపోయాను.
రామ మూర్తిగారు అవసాన దశలో ఉన్నారు. కోరినది ఒక కృతి. అదీ పద్య కృతి. ఆ పరమాత్మదే భారము అనుకొన్నాను. ఎన్నాళ్ళగానో శ్రీ షిరిడీశ్వర దేవునిపై ఏదైనా వ్రాయాలని ఆశిస్తున్న నాకు రామ మూర్తిగారి కోరిక మంచి ప్రేరణ నిచ్చింది. అంతే, శ్రీషిరిడీశ దేవరా! అని సంబోధిస్తూ నమస్కరించి వారిపై శతకము వ్రాయుట ప్రారంభించితిని.
శనివారము నాటికి శతక రచన పూర్తైపోయింది. ఆదివారం  రామమూర్తిగారి దగ్గరకు వెళ్ళి అయ్యా! మీ కోరిక నాచేత శతకం వ్రాయించిందని చెప్పాను. ఒక్కొక్క పద్యం జాగ్రత్తగా చదవమన్నారు. నేను ఒక్క పద్యము  తప్ప ఆ మిగిలిన నూట యేడు పద్యాలు చదివి వారికి వినిపించాను. వారు కూడా శ్రద్ధతో అన్నీ విన్నారు. అన్నీ వినిన  తరువాత వారు  " ఏమిటి మీరు నూట ఏడు పద్యాలే చదివారు. నూట ఎనిమిదవ పద్యం కూడా వ్రాసే ఉంటారు. చదవలేదేమండి? అందులో ఏముంటుందో నాకు తెలుసు. మీరు చదవండి పరవాలేదు" అన్నారు.  "ముత్యము రామ మూర్తి......" అనే ప్రారంభంతో ఉండే 102 వ పద్యమును కూడా నేను చదివి వారికి వినిపిం చాను. వారు ఎంత సంతోషించిరో  వారి కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలడం చూచిన నాకే తెలుసును. ఈ శతక ఆవిష్కరణ సభకు మీరు తప్పక రావాలి అన్నాను. అయ్యో ఎంత మాట. తప్పక వస్తానన్నారు. ఆ మహనీయుఁడు ఆదివారం ఆనందంతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొన్నారు. ఆ మరు నాడు నేను ఉద్యోగరీత్యా కళాశాలకు వెళ్ళియుంటిని. మరి కాస్త సమయమునకు ముత్యం రామ్మూర్తి గారు పరమపదించారన్న వార్త తెలిసింది. వెంటనే నేను వారింటికి వెళ్ళి వారి భౌతిక శరీరాన్ని కడసారి దర్శించి, నివాళులర్పించాను.
నా యోగం బాగుంది కాబట్టి ఆ షిరిడీశ్వరుడు కటాక్షించి శతక రచన నాచేత చేయించి, రామ మూర్తి గారికి అతను బ్రతికి ఉండగా వినిపింప జేసాడు. ఆవిధముగ జరగకపోయినచో రామ మూర్తిగారి కడసారి కోరికను తీర్చలేకపోతిని అని నేను అను నిత్యం జీవితాంతం కుమిలిపోయి ఉండే వాడిని. అట్టి పరిస్థితి లోనికి నన్ను నెట్టకుండా కాపాడిన ఆ షిరిడీ సాయి ఎంతటి దయామయుఁడో కదా!
నా జీవితానుభవాలను దృష్తిలో పెట్టుకొని, సద్వృద్ధికై ఆ షిరిడీశ్వరునికి నేను చేసుకొనిన వేడికోలే ఈ  శ్రీషిరిడీశ దేవ శతకము. నా మనసును కలచివేసేటువంటి సమాజంలో జరుగుచున్న దౌష్ట్యాలను మాన్పాలని, తన ప్రతిభ చూపాలని, మంచివారిని, మంచిని, మన భూ మాతను, ప్రకృతిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని నేను సాయినాథునికి చేసుకొనిన విన్నపమే యీ శతకము.
ఇది భావావేశముతో వ్రాసిన శతకమే కాని వేరు కాదు. ఇందు గుణములుండవచ్చును,  లేకపో వచ్చును. దోషములు లెక్కకు మిక్కిలిగా ఉండిననుండవచ్చును. పాఠకులు సహృదయతతో భక్తి భావముతో చదువుతూ, గుణములున్న గ్రహింప వలసినదిగా, దోషములున్న మన్నించ వలసినదిగా కోరుకొంటున్నాను.

నా ప్రియ మిత్రులు శ్రీ కొట్టే కోటారావు గారు ఈ శతకమును చదివి చిన్నచిన్న సవరణలు సూచించడం ద్వారా మెఱుగులు దిద్దినందుకు వారికి నా ధన్యవాదములు.
ఆ పరమేశ్వరుఁడు నాచేత వ్రాయించిన యీ శతకమును చదివి "కవివతంస" బిరుదాంకితులైన 
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు "కవితాభినందనం" పేరుతో తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ జేసారు. వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
మా పినతల్లి గారి కుమారుఁడైన డా.లింగాల సత్య యాజ్ఞవల్క్యశర్మ కూడా యీ శతకమును చదివి తన అమూల్యమైన అభిప్రాయాలను తెలియ జేసినందుకు తమ్మునకు నా సంతోషాన్ని తెలియజేసుకొంటున్నాను.
శ్రీ ముత్యం రామ మూర్తిగారి కోరికపై వ్రాసిన యీ శతకమును అచ్చు వేయిస్తామని రామ మూర్తిగారి కుమ్మార్తె మ.ల.స. మీనాక్షి, అల్లుఁడు శ్రీ రాజ శేఖర్ నన్ను కోరి, ముద్రణ బాధ్యత స్వీకరించినందులకు వారికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
ఈ శతక రచన సమయమున తన మనసులో గూడుకట్టుకొనిన బాబా అనుభవాలను తెలియ జేస్తూ రచనకు సహకరించిన నా అర్థాంగి ‘ చి.ల.సౌ విజయ లక్ష్మి’ కి నా సంతోషమును 
తెలియ జేసుకొంటున్నాను.
ఈ శతకమును సాధ్యమైనంత వరకు దోష రహితముగా ముద్రించుటకు కృషి చేసి, అందముగా ముద్రించిన శ్రీమతి సింహంభట్ల రమాదేవి గారికి, ఆమెకు సహకరించిన శ్రీ సుదర్శన్ శాస్త్రి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.
ఇట్లు
రచయిత.
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్. 

అక్షరం మారకుండా సమాధానం చెప్పఁ గలరా? ట్రై చేసి చూడండి.

1 comments

సంస్కృతంలో గల ప్రశ్నలకు సమాధానం సంస్కృతంలోనే వ్రాయాలి. అక్షరాలు కూడా మార కూడదు..
మరిచూడండి.

ప్రశ్న:- కే దారవంతాః? {భార్యా పోషణకు సమర్థులెవరు?}
సమాధనం:- ?

ప్రశ్న:-కం సంజఘాన కృష్ణః? {కృష్ణు డెవరిని చంపెను?}
సమాధానం:- ?

ప్రశ్న:-కా శీతలవాహినీ గంగా? {శీతల ప్రవాహమున్న గంగ ఏది?}
సమాధానం ?

ప్రశ్న:- కం బలవంతం న బాధతే శీతలం? {ఏ బలవంతుని చలి బాధింప లేదు?}
సమాధానమ్:- ?

చూచారుకదా౧ ఇక ప్రయత్నించి సమాధానాలు పంపండి.

జైహింద్.