శ్రీ రామనవమి సందర్భంగా సుగుణ సంపన్నులైన మీ అందరికీ అభినందనలు. ఆ సీతా రాముల దివ్య తేజస్సు మీలో ప్రసరింపఁ జేసి ఆదర్శప్రాయంగా మీరు లోకంలో జీవించేలా చేసి అందరికీ మీరు ఆదర్శంగా నిలిచేలా చేయాలని, ఆ పురాణ దంపతులను ప్రార్థించుచున్నాను.
ఉ:-
శ్రీ రఘు రామ పాదములు చింతనఁ జేయుచు నుండు వారికిన్
గౌరవ భావమున్ గొలిపి, కష్టములన్నెడబాపి నిత్యమున్
చేరువ నుండి, రక్షణము సేయుచు దీవన లిచ్చు నాతడున్.
మీరలు రామ భక్తులయి మేలును గాంచగ వాంఛఁ జేయుదున్.
శా:-
సీతా రామ వివాహ వేళ. మదిలో చింతించి యా వేళలో
సీతన్ కూతుగ చేసికొంచు జరుపున్ శ్రీరాముతో పెండ్లి. వి
ఖ్యాతంబియ్యది లోకమందు. తమరున్ గావింపగా రాదొకో
సీతా సాధ్వియు, రామ చంద్రుడును మీ చెంతన్ బ్రవర్తింపగాన్?
ఉ:-
ఎంతటి పుణ్య కర్ములకు నిట్టి మహాద్భుత భాగ్య మబ్బు! మీ
కింతటి భాగ్యమబ్బునిల. నీశ్వరు సత్కృప మీకుఁ గల్గు. మీ
చింతలు బాయు. మోదమున చిత్తము తేలి సుఖించు నిత్యమున్.
భ్రాంతిని వీడి మీరలిక భక్తిని పెండ్లిని చేయఁ బూనుడీ.
క:-
సీతా రాముల పెండ్లిని
ఖ్యాతిగ యొనరించు నెవడు ఘనతరముగ. నా
రాతిని నాతిగ చేసిన
సీతా రామయ్య యతనిఁ జేకొని కాచున్.
క:-
యుగమున కలియౌ. త్రేతా
యుగమిది నిజమయ్య. పరమ యోగ్యులు మీరల్
యుగ ధర్మము మార్చిరి. కృత
యుగముగ మార్చెదరు. కర్మ యోగులగుటచే.
శ్రీ సీతా రామ కల్యాణం చేయించుకోండి. కన్యాదాన సత్ఫలం పొందండి. శుభమస్తు.
జైహింద్.
Print this post
నిశుంభశుంభ ధ్వంసిని శుంభాసురమదనీ| శ్రీ కాళిదాసకృత అద్భుతస్తోత్రం గానం,
సంగీతం:మరుమాముల శశిధరశర్మ బృందం.
-
జైశ్రీరామ్.
జైహింద్.
13 గంటల క్రితం
8 comments:
గురువుగారికి,కుటుంబానికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే మేము మా ఊర్లో రేపు చేసుకుంటున్నాము పండుగ
హ్రుద్య పద్య కవులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి శ్రీ రామనవమి సందర్భ శుభాకాంక్షలు.
రామకృష్ణారావుగారూ, మీకూ మీ కుటుంబానికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మన్నించాలి, మీరు పద్యాలన్నిటినీ అన్యులకై కాక కనీసం ఒకటైనా ఆ సీతారాములపై వ్రాసియుంటే ఇంతకంటే మహాద్భుతంగా ఉండేది.
మీకూ మీ కుటుంబానికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు .
ప్రియ రాఘవా! శుభా కాంక్షలు.
ఊ:-
రాముని గూర్చి వ్రాయగను, రాఘవ కల్గెనటంచు నెంచి నే
రాముని భక్తి మత్తును ధరాతలమందున పెంచబూని యా
కారణ మెంచి వ్రాసితిని. గౌరవ మొప్పగ నంతె కాని యా
రాముని నామ మాధురిని రాజిలు నట్లుగ వ్రాయ లేనొకో?
చిలమకూరి విజయ మోహనా! ధన్యవాదములు.
తే:-
చిలమకూరికుటుంబాన వెలుగులీను
విజయ మోహన మార్గంబు విజయ పథము
పదుగురునుమెచ్చు ప్రఖ్యాత పరమ పథము
ననగ రాణింతువికనీవు రాము నాజ్ఞ.
భాస్కర రామి రెడ్డి పుంగవా! ధన్యవాదములు.
సునిశిత సత్ పరిశీలన
గుణ! భాస్కర రామి రెడ్డి! గుర్తుగ మీరల్
వినయ మహాద్భుత సంపద
కనఁ బరచుచు పలికినారు. ఘనతరమవగన్.
ప్రియ పరిమళా! ధన్య వాదములు.
క:-
నవ పరిమళములు పంచుచు
నవమిని మా మదికి మీరు నవకాంతులతో
నవిరళ సుఖములు గొలిపిరి
నవ పరిమళముల నెదుగుము నవనవ కాంతిన్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.