గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2009, బుధవారం

వృత్త పద్య రచన సాధన చేద్దామా? 2

sembahసాహితీ బంధువులారా! ఇంతకు ముందు మనం ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర గణములు తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు మనం తెలిసిన వైనప్పటికీ వృత్త పద్యములను గూర్చి, యతి, ప్రాస లను గూర్చి కొంచెం చెప్పుకొందాం.

వృత్తము = సున్నా.circle
పద్యములో ఒక పాదము ఆద్యంతము ఒక చక్రము వలె నడిస్తే మరల 2 వ పాదము కూడా అదే చక్రము నడక సాగిస్తుంది. అలాగే మూడు, నాలుగు పాదాలు కూడాను. ఒక క్రమంలో ఉండే గణాలు వరుసగా నాలుగు పాదాలలోనూ ఆవృత్త మౌతున్నందున దీనికి వృత్త పద్యము అనే పేరు సార్థక మౌతుంది.

ఇక వృత్త పద్యాలకు ప్రాస నియమము చెప్పఁ బడిన చోట అది నాలుగు పాదాలలోను రెండవ అక్షరం ఒకే హల్లు లేదా సంయుక్త హల్లు తప్పక రావాలి. ద్వితీయో వర్ణః ప్రాసః పాద పాదేషు.. --- ప్రాసః సర్వేషుచ ఏకయేవ స్యాత్. అని నియమము.
ఇక యతి విషయానికొస్తే యతిర్విచ్ఛేద సంజ్ఞకః అన్నారు. యతి నియమము ఏయే వృత్తాలకు ఎలాయెలా నెర్దేశింపఁ బడిందో గమనించి పాటించాలి.

ఉదాహరణకు మనం ఉత్పల మాల వృత్తాన్ని తీసుకున్నట్లయితే,
ఉత్పలములు = తామర పూవులు.
ఉత్పల మాల = తామర పూల దండ.
ఉత్పల మాల వృత్త లక్షణములు:-
ఇందు ప్రతీ పాదమున " - - - - - - ." అనే గణాలే రావాలి.
ప్రాస నియమం ఉంది.
ప్రాస యతి మాత్రము చెల్లదు.
యతి స్థానం పదవ అక్షరం.
ఉ:- పాఠక / మిత్రుడా / భరన / భారల / గంబులు / ఉత్పలం / బగున్.
పైన భ - ర - న - భ - భ - ర - వ. అనే గణాలు వచ్చాయి కదా!
అలాగే మొదటి అక్షరమే పదవ అక్షరంగా కూడా వచ్చి యతి నియమం పాటింపఁబడిందికదా!
ప్రాస నియమన్ని పాటిస్తూ అదే నియమాలతో మిగిలిన 2, 3, 4, పాదాలు కూడా పూర్తిగా వ్రాసినట్లయితే అది పూర్తి ఉత్పలమాల పద్యం ఔతుంది.

నాలుగు పాదాలు కాక అంతకన్నా ఎక్కువ పాదాలు గల దానిని మాలిక అంటారు. అది ఉత్పలమాలైతే ఉత్పల మాలిక అని అంటారు.

నా మనవి:-
ఉ:-
వృత్తము లక్షణంబులను విస్తృత రీతిని తెల్పినాడ. గ
మ్మత్తుగ మీరలింక తమ మత్తును వీడి రచింప సాధనన్
క్రొత్తగ చేయ బూనుడయ! కోరిక తీర్చెడి దైవ భక్తితో.
నుత్తమ మైన పద్యమని, ఉత్తములంత గణించునట్లుగాన్.

మరి వ్రాస్తారు కదూ! ఉత్పలమాల వ్రాయండి.
జైహింద్ Print this post

4 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మాస్టారు గారు,
మీకు వీలైతె మిశ్రమ సమాసానికి, దుష్ట సమాసానికి మధ్య భేదము తెలుపుతూ ఉదాహరణలతో ఒక టపా వ్రాయవలసిందిగా నా మనవి.

అసంఖ్య చెప్పారు...

ఆచార్యా, నాకో వీలైతే somasd at gmail dot come కిఒక email చెయ్యగలరా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధవళ వినిర్మలాకృతి, సుధాపరి పూర్ణ మనోజ్ఞ భావనల్,
సువిదితమౌను నీ పలుకు సొంపును గాంచిన వారికెల్లెడన్.
నవతను జూపి సత్కవిత నామది సంతసమందఁ జేసి, నా
కవి వివరించి పంపుడు. సుఖించెదఁ జూచుచు. సోమ శేఖరా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శుభమస్తు సత్యనార్యా!
తప్పక వ్రాయ గలను. త్వరలో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.