జైశ్రీరామ్
ఉత్సాహ రాఘవ శతకము
బాలకాండము
శ్రీమదాదిదేవ నీవు సిరులతో నయోధ్యనే
ప్రేమ నింపి, సేమమరసి ప్రియము గూర్చుచున్ననూ
భామ గూడి దశరథుండు బలువిధముల సంతుకై
ప్రేముడించి యున్నవేళ, విధియు దొరికె రాఘవా ! (1)
వ. ఆ దశరథ మహారాజు అశ్వమేథ యాగము మరియు పుత్ర కామేష్టి యాగములను నిర్విఘ్నముగా నిర్వహించెను.
భామలు మరి ముగ్గురు ఘన వారసులను బొందగాన్
ఆ మహిపతి పుత్ర కామ యాగమపుడు జేయగాన్
ధూమకేతు పాయసంబు తోడ వచ్చి ఇవ్వగాన్
భామలకును పంచెనతడు పాయసంబు రాఘవా ! (2)
పామరులగు నరులయందు భక్తి మండు గలుగగాన్
భూమి బారమౌ మసురుల పూని మట్టువెట్టగాన్
రామ నీవు జన్మమొంద, రాజు దశరథుండు నా
సీమమందు వేడ్క జరిపె శిష్టముగను రాఘవా ! (3)
భరత లక్ష్మణుండరిఘ్న భ్రాతలున్ జనించగాన్
తరణి వంశ ఖ్యాతి దలచి దశరథుండు ప్రీతితోన్
ధరణి సురులకెల్ల ధనము ధాన్యములిడి మెండుగాన్
పురజనులకు కాన్కలిచ్చి మోదమందె రాఘవా ! (4)
వ. ముని విశ్వామిత్రుడు యజ్ఞ రక్షణ కొఱకు రామలక్ష్మణులను పంపమని దశరథుని కోరాడు.
అనఘ నీవు మౌని వెంట యాగ రక్షణార్థమై
యనుజు వెంటనిడుకొని జనినంత మార్గమందునన్
గనిన తాటకిన్ వధించి కడకు నీదు శక్తితో
మునుల యాగ రక్ష జేయ బూనినావు రాఘవా ! (5)
యాగ రక్షణంబు నీవు నమలు జేయు వేళలో
ఆగడీడు యా సుబాహుడడ్డు వెట్టునంతలో
నేగి నీవు యగ్ని యస్త్రమెక్కువెట్టి వేయగాన్
మాగుడౌ సుబాహుడపుడు మరణమందె రాఘవా ! (6)
అతి పవిత్ర గౌతమముని యాశ్రమంబు వెలుపలన్
నతి యహల్య రాతివలెను శాపమొంది యుండ నా
యతివకు తన శాపముక్తి నందజేసి కరుణతోన్
శ్రితుల రక్ష జేసినావు శ్రీమదాది రాఘవా ! (7)
వ. మిథిలానగరాధిపతి జనకుని ఆహ్వానం అందుకుని విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిధిలానగరానికి చేరుకున్నాడు.
వినతి జేయ జనకుడు, ఘన వీర శూరులెందరో
జనకపుత్రి నందుకొనుట, చాల పెద్ద కోర్కెగా
మనములెల్ల యుల్లసిల్ల, భళి యటంచు బలిమితో
ధనువు ద్రుంచు జతనమందు తరలినారు రాఘవా ! (8)
ఎంతమంది రాజ పుత్రులెంత సాహసించినా
సుంతయైన కదలదాయె శూలి ధనువు లీలగాన్
యంత, నీవు వచ్చి, గురుని యాజ్ఞననుసరించి, యా
వింత ధనువు నెక్కువెట్టి విరిచినావు రాఘవా ! (9)
హరుని విల్లు ద్రుంచి నీవు యవని సుతను గైకొనన్
మరలి పురము జేరు వేల పరశురాముడడ్డినన్
వెరువకీవు జామదగ్ని విష్టు చాపమెక్కెడన్
కెరలి వాని గర్వమణచి కీర్తి కొంటి రాఘవా ! (10)
అవనిజ కరమీవు బట్టు యా శుభ సమయంబునన్
అవరజులును పరిణయమ్ములాడినారు వేడుకన్
భువిత మాండవిని భరతుడు నుద్వహించు నేరుగా
కవలు ఊర్మిళ శ్రుత కీర్తి కరములొగిని రాఘవా ! (11)
అయోధ్యకాండము
దిశల ఖ్యాతినొందునట్లు దేవ నీవు దైత్యులన్
విశర ఘాతమొనరజేయ ప్రీతి జెంది తండ్రియౌ
దశరథుండు ప్రేమ మీర ధరనయోధ్య రాజుగా
శశిముఖ నిను జేతుననెను సంతసమున రాఘవా ! (13)
“రాజు వ్యసన సప్తకమున భ్రాంతి లేక యోగ్యతన్
తేజమలర జనులు పొగడ దేశమేలకావలెన్”
నీ జనకుడు ఇటుల హితము నీకు బోధ జేయుచున్
ఓజ గాను దీవెనలను యొసగినాడు రాఘవా ! (14)
“మదిర పాన, మృగ వినేద, పడతి లౌల్య ద్యూతముల్
వదరు భాషణంబు నర్థ వ్యర్థ వినిమయంబులున్
బెదరియున్న యల్పులకును పెద్ద శిక్షనిడుట కూ
డదని” వ్యసనములను నీకు తండ్రి దెల్పె రాఘవా ! (15)
కామ కారణంబు వలన కలుగును పది వ్యసనముల్
బామము యను కారణమున బరగు నష్ట వ్యసనముల్
సామమంది, రాజు వాని సాగనంపి, నరుల తాన్
సేమము పరిపాలనంబు చేయవలెను రాఘవా !(16)
దాసి మంథరపుడు కైక దాపు జేరి వేగమే
చేసె కుచ్ఛితంపు బోధ చేడగ నీదు పట్టమున్
బాస చేసినట్టి పతిని వరములడుగ జెప్పుచున్
ఈసు కలుగునట్లు మార్చె హృదిని యకట రాఘవా !(17)
వ. అలుక దీర్చ వచ్చిన దశరథునితో, శ్రీరాముని పదునాలుగేండ్లు వనవాసమునకు పంపవలెననియు, భరతునికి రాజ్య పట్టాభిషేకము చేయవలెననియు కైక కోరినది.
ధరణి తండ్రి మాట నిల్ప దలచి నీవు యంతటన్
తరుణి సీత కోరి నడువ, తరలినావు యడవికిన్
పిరుద జనగ లక్ష్మణుండు విడువకెపుడు తోడుగా
కరమునందు ధనువు బట్టి కాపు గాను రాఘవా ! (18)
అందరిని తరింపజేయు ఆది దేవ రామ పే
రందగాడ దరిని జేర్చ యాజ్ఞనొంది గుహుడు, ము
న్ముందుగాను నీదు పాదముల కడిగి తరించగా
కందువగను నదిని దాట కదలినావు రాఘవా !(19)
వ. అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు విషయం తెలుసుకొని తల్లిపై కోపించి, శ్రీరాముని వద్దకు బయలుదేరాడు.
భరతుడీవు కాననుంట బాధ మిగుల చెందుచున్
మరలి నీవు రాజు కాగ ప్రార్థనంబు జేసినన్
శరణు యనుచు నిలిచినంత సాంత్వనొసగి సత్య త
త్పరత తోడ నొసగినావు పాదుకలను రాఘవా ! (20)
అరణ్య కాండము
దండక వనమందు జేరి దనుజులు వ్యధ బెట్టగా
దండు భయము వల్ల మునులు తపములు విడి బోవ, కో
దండ ధారివైన నీవు ధరణి రక్ష జేయగా
దండనము విధించినావు దానవులకు రాఘవా ! (21)
రణము గోరి యా విరాధ రాక్షసుండు క్రుద్ధుడై
వనిత సీత నపహరించి వదరు తనము జూపగా
కినకనొంది నీవు యతని కేలు ద్రుంచి పైన నా
తననిని సంహరించి యపుడు తరలినావు రాఘవా !(22)
వనము శరభంగ మౌని వార్తలన్ని దెల్పుచూ
ఘనముగా ,సుతీక్ష్ణ మునిని కలువనంప, నీవు యా
మునిని జేరి సేమమరసి మోదమెసగ వాసమ
వ్వనమునుందు నుంటివయ్య పంచవటిని రాఘవా !(23)
(ముని జేరి సేమమరసి మోదమరల జేయుచూ
యనుజు గూడి పంచవటిని యాగినావు రాఘవా !)
పంచవటిని యా జటాయు పక్షియపుడు భక్తితో
వంచి శిరము మ్రొక్కులిడుచు బల్కెనిట్లు ప్రీతిగా
“ఎంచకు నను రక్ష చేతునిచట నుండి తమను సే
వించుకొందు యనుమతించ వేడు కొంటి” రాఘవా !(24)
“ఆహ” యనుచు నీదు సందరాననంబు గాంచి స
మ్మోహపడిన శూర్పణఖను ముక్కు చెవులు గోసి, బల్
సాహసమున రోసమునను శౌరి లక్ష్మణుండు స
మ్మోహనుడు ధరిత్రిలోని మూర్తి నిలిచె రాఘవా ! (25)
ఖరుడు మరియు దూషణుండు ఘటన వలన క్రుద్ధులై
హరుని నిన్ను జంపుటకును యసురుల గొని వచ్చినన్
అరనిముషములోన వారినంతయు దునుమాడి యీ
ధరణి మునుల గాచినావు ధన్యరీతి రాఘవా !(26)
అది తెలిసిన రావణుండు నాగ్రహంబు నందుచున్
వదలి వ్యధను తాటకేయు వనికినంప నతడు తాన్
మదిని మోహ వశము జేయు మాయలేడి రూపుడై
పొదల లోన రజము వోలె పొసగుచుండె రాఘవా ! (27)
“చూడు! చూడు! పసిడి లేడి! చూడు!” మనుచు సీత తా
వేడుకొనిన, స్వర్ణ హరిణి వేగ దెచ్చి ఇవ్వగా
జాడ వెదకి, దాని బట్టు జతను వ్యర్థమైన, నీ
వాడి బాణ ధాటి వాని పడగొడితివి రాఘవా ! (28)
వ. ఆ సమయమందున తాటకేయుడు(మారీచుడు) హా సీతా హా లక్ష్మణా యనియరచుచూ మరణించగా ఆ కేకలకు సీతా దేవి భయపడినది.
“హా హతోస్మి! సీత! లక్ష్మణా!” యటంచు మదిని సం
దేహమదియు కల్గగా తదీయ స్వరమునరువ, వై
దేహి బదరి తమ్ముననిపె నీకు కడిరి యనుచు తా
నూహ జేసి అయ్యొయో యనుచు తిమాడె రాఘవా !(29)
వ. సీతా దేవిని భయపడవలదని లక్ష్మణుడు చెప్పాడు.
అరచుచున్న తాటకేయు నరుపులు విని భయముతో
మరల సీత లక్ష్మణుని రపాపతికి తోడుగా
నరయుమనుచు పలికినంత “యమ్మ నమ్ము” మనుచు సు
స్థిరముగాను లక్ష్మణుండు తిరిగి బల్కె రాఘవా ! (30)
“గాటముగను శక్తియున్న కార్ముక ధరుడచ్యుతున్
వేట యందు గూల్చ గలుగు వీరుడెవడు ధరణిపై?
చేటు కలుగదతని” కనుచు జెప్పిన తరి బాధతో
“మాట వినవదేల?” యనుచు మాత యడిగె రాఘవా ! (31)
వ. లక్ష్మణుని మాటలు సితా దేవికి అనుమానం కలిగించాయి.
“అన్న లేని సమయమందు యనుచితమగు వర్తనం
బెన్నుచుంటివేమొ! కపటి! ఇదియు నీకు ధర్మమే!
ఉన్నతమగు ఇనకుల ఘనమూడగించిపోవదా?
అన్నెకారి వగుట తగదు” యనెను సీత రాఘవా ! (32)
వ. సీతాదేవి మాటలకు లక్ష్మణుడు బాధపడి అన్న గారి వద్దకు బయలుదేరాడు.
జననినచట నొంటినొదలి జనుటకిచ్చలేని కా
రణము వలన దేవతలను రక్ష కొరకు వేడుచూ
యనఘుడైన రామచంద్రు నడవియందు వెదుకగా
మనముతోడ లక్ష్మణుండు మరి వెడలెను రాఘవా ! (33)
వ. అదే అదనుగా రావణుడు భీక్షుక వేష ధరియై అక్కడకు వచ్చాడు.
అదను కొఱకు వేచియున్న యసుర రాజు రావణుం
డదనుకు తగు వేష ధారి యుగుచు నటకు జేరి, యా
బెదరియున్న సీతను గని భిక్ష కోరు నెపముతో
యదవదపడు యామెనపుడు యపహరించె రాఘవా ! (34)
పడతి బట్టి గగనమందు బయలు వెడలు రావణు
న్నడవిని గని యా జటాయువమితముగను క్రుద్ధుడై
యడచి యడ్డు నిలిచినంత, యతని రెక్క ద్రుంచి తా
వెడలిపోయె రావణుండు వేడ్క గాను రాఘవా ! (35)
రక్కసుని వధించి వచ్చు రామ నిన్ను చేరి తా
నక్కజముగ లక్ష్మణుండు నచటి గాధ దెల్పగా
నెక్కుడైన బాధతోడ నేగి సీత జాడకై
విక్కుజముల వేడుకొనుచు వెదకినావు రాఘవా !(36)
చెట్టునడిగి, పుట్టనడిగి, జీవనదులనడుగుచూ,
గట్టు గట్టు వెదకి జూచి, కానరాని సీతకై
పట్టరాని బాధతోడ పద్మనయన యపుడు నీ
బెట్టు సడలి పొగిలినావు భీరువు వలె రాఘవా !(37)
దెబ్బతిని జటాయు పక్షి దీనుడై చరించుచూ
నిబ్బరమున వెదకుచున్న నీదు దరికి జేరి తా
గొబ్బున వివరించి యసురు క్రూరమైన చేష్టయున్
అబ్బ యనుచు గాయములను యసువులు విడె రాఘవా ! (38)
వ. సీతా దేవిని కాపాడే ప్రయత్నంలో రెక్క తెగి, శ్రీరామునికి సందేశమందజేసి, మరణించిన జటాయువుకు శ్రీరాముడు అంత్య క్రియలు యధావిధిగా నిర్వహించాడు.
మబ్బు మసక బారినట్లు మనము క్రుంగిపోవగా
నిబ్బరమును కూడగట్టి నిఱత జతన పరుడవై
దెబ్బుగను జటాయు పక్షి దెలిపిన వన మార్గమం
దబ్బురముగ వెదకినావు నడవిలోన రాఘవా ! (39)
బాహుబలము జూపుచున్ కబంధ రాక్షసుండు స
ద్బాహుజులను మిమ్ము బాహు బంధనమున బట్టగా
సాహసించి మీరు యతని సంహరింప బూని త
ద్బాహువులను త్రుంచినారు బలిమితోడ రాఘవా ! (40)
వికృత రూపమణగిపోయి వేల్పుగాన రూపమున్
సుకృతుడై కబంధుడొంది శుభము నీకు కలుగ నొ
ద్దికగ ఋశ్యమూకమందు ద్రిమ్మరేని చెలిమితో
నొకరికొకరు సాయమనగ యుక్తి దెలిపె రాఘవా ! (41)
వ. ద్రిమ్మరేని అనగా సుగ్రీవుడు. కబంధుని సలహా మేరకు సూగ్రీవుని కొరకు వెదకుచూ
మార్గమధ్యంలో మాతంగ మును ఆశ్రమంలో ఉన్న శబరిని రామలక్ష్మణులు కలిశారు.
అనఘుడా మతంగ మౌని యాస్రమమున చేరి భ
క్తిని గురుని పదమ్ములంటి కెరలి సేవ చేయుచున్
మనమునందు రామనామ స్మరణమే తపస్సుగా
క్షణము క్షణము నిన్ను కనగ శబరి యుండె రాఘవా ! (42)
అతివ శబరి యున్నచోట నాశ్రమంబు దాపులన్
వెతుకుతూ శ్రమించి వచ్చు వీరులైన మీకు, తా
నతిథి సేవలందజేసి యామె ప్రణుతి జేయగా
వెతలు మాన్పి తనను బ్రోచి వెడలినావు రాఘవా !(43)
వ. ఋష్యమూక పర్వతం పైనుండి రామలక్ష్మణులను గమనించిన హనుమంతుడు వారిని కలిసి, వివరం తెలుసుకొని సుగ్రీవుని కడకు వారిని తోడ్కొని వెళ్లాడు.
అంత దవ్వు మిమ్ము జూచి ఆంజనేయుడపుడు మీ
చెంత జేరి రవితనయు సచివుని తాననుచును గా
ధంత జెప్పి యర్కసుతుని దరికి త్రోవ జూపగా
స్వాంతమలర మైత్రి నెరుప సాగితివటు రాఘవా ! (44)
వంత జిక్కి ఋష్యమూక పర్వతాగ్ర శిఖరిపై
హంతు భయముతోడనున్న నార్కి క్షేమ విషయముల్
మంతి జరిపి యగ్ని సాక్షి మైత్రి సేయు కోర్కెయున్
అంత జెప్పి యతని సాయమడిగినావు రాఘవా ! (45)
కిష్కింధా కాండము
చేవ గల్గియుండి ఏమి చేయలేక మసలు సు
గ్రీవుడన్న వాలి తనకు కీడు చేయు వైనమున్
భావనమున దలచి, మించి బాధతోడ దెల్పగా
పావి వాలి జంపెదనని బల్కినావు రాఘవా ! (46)
వ. పావి అనగా పాపి
“అన్న వాలి శక్తియుతుడు ఆలమందు యాతనిన్
పన్ను గాను ఎదురునిలిచి స్పర్థి జయమసాధ్యమే!
అన్నగారి సుతుని గెలువ నవఘళమ్మునీయెడన్”
ఎన్నగాను దలచె మర్కటేశుడంత రాఘవా ! (47)
వ. అన్నగారి సుతుడు అ నగారి సుతుడు నగారి అనగా ఇంద్రుడు.
దుందుభి మృత దేహమవల త్రోసి కాలి వ్రేలితో
చిందరగొని ఏడు మద్ది చెట్ల నొకచ గూల్చియా
నందమొసగ హరివిభునికి నమ్మిక కలిగించుచున్
పొందు పెంపు జేసినావు పొలుపు మీర రాఘవా ! (48)
అప్పుడు బలశాలియైన యార్కి మిగుల స్ఫూర్తితో
నప్పడైన మిమ్ము గొల్చి యప్పనమ్మునందుచున్
చెప్పిన తన మాట వినక చేటు చేయు సోదరున్
అప్పళించి భుజ యగమ్ముననికి పిలిచె రాఘవా ! (49)
అన్న వాలి , తమ్ముడార్కి అపర విక్రమార్కులై
మన్ను మిన్నులేకమనగ మగటి మెసగ పోరగా
“అన్న ఎవరు? తమ్ముడెవరు?” యనుచు పోల్చలేక నీ
వన్నయటుల వాలి జంపవైతవుడు రాఘవా ! (50)
చిన్నబోవు నార్కినపుడు చిహ్నధారిజేయుచూ
వెన్ను దట్టి యుద్ధమునకు వెడలజేసి, దుర్నయుం
డన్నెకాడు వాలినొక్క యగము చాటు డాగియున్
మన్నిగొనగ విడిచినావు మారమగణమును రాఘవా ! (51)
వ. దుర్నయుడు, అన్నెకాడు అనగా దుష్టుడు.
చివరి క్షణములందు శక్తి క్షీణమైన వేళలో
“అవనిపైన నన్ను జంప యత్నమిటుల జేయు వా
రెవరు?” యనుచు నిన్ను జూచి, ఎగవుతోన వాలి, త
ద్భవము దలచి, నిందలిడుచు బల్కెనపుడు రాఘవా ! (52)
“చేవ లేని భీరువు వలె చెట్టు వెనుక నక్కుచున్
జావడమున నీతి విడచి శరమునేసి చంపినా
వీవు” యనుచు వాలి తాను ఈసడించి బల్కగా
దేవ! ధర్మ సూక్ష్మములను దెల్పినావు రాఘవా !(53)
వ. జావడము అనగా పిఱికితనము.
“కూడని పని చేయు వాని, కుటిల బుద్ధి వానినిన్
కీడు చేయు మృగమునైన కీటడంచుటొప్పగున్
కోడలికెన వచ్చు రుమను క్రూరముగ రమించుటన్
పాడి గాదు; యట్లగుటను వానరేంద్ర నిన్ను వే
టాడు విధము యుక్త”మనుచు నాడినావు రాఘవా ! (54)
ఆ వనచర సీమకెల్లనధిపు పట్టమొంది సు
గ్రీవుడంతటన్ ప్రియుప కృతినొనర్చు బుద్ధితో
ఆవటించి కోతి దండు కానతిచ్చి నల్గడల్
పావని వలకడకు సాగె వాలి సుతుడు నేతగా
దేవి సీత జాడ నరయ తివిరినంపె రాఘవా ! (55)
దక్షిణాశ జనిరి వాలి తనయుడనిల పుత్రుడున్
ఋక్ష వల్లభాది కీశ బృందముద్యమించగా
దక్షుడైన హనుమ గనుచు తావకీన ముద్రికన్
లక్షణముగ సీతకొనగ లక్ష్యముగను రాఘవా ! (56)
వెదకి వెదకి సీత కొఱకు వేసరిలి నిరాశతో
పొదిలి దుఃఖ మగ్నులగుచు ముగమునెటుల నేతకున్
అదువు మీరి చూపగలము అదుబిదుకున మరలుచున్
ఎదను తలచి అంగదాదులీల్గుటే శరణ్యమై
కదలి కడలి జేర గనిరి ఖగమొకటిని రాఘవా ! (57)
వ. ఆ ఖగము పేరు సంపాతి. ఇతడు జటాయువు సోదరుడు.సూర్య మండలం దగ్గరకు ఎగిరే ప్రయత్నంలో అతని రెక్కలు కాలిపోయాయి.
ఘాతుకముల రెక్కలన్ని కాలిపోయి వగచు సం
పాతి యచట చేరియున్న మర్కటముల చర్చలో
కౌతుకమున యా జటాయు కథను తెలిసి వగచుచూ
సీత జాడ దెల్పి తాను సేమమందె రాఘవా ! (58)
యోజన శతమై పొడము పయోధి దాటి యచ్చటన్
భూజ జాడ నెఱసి కుశలముగను మనల కార్యమున్
ఓజ పరచునట్టి శక్తియున్న యుత్తముండు నై
తేజమొసగ ఆంజనేయుడే యటంచు నెంచి యు
త్తేజమొందిరి కపులెల్ల దిగులు తొలగి రాఘవా ! (59)
అంజని వరపుత్రునిగను అనిల వీర్య తేజమై
సంజనించి, శక్తి నొంది, శంకరాంశ లబ్ధుడై
రంజనమున నేర్పు జూపి రామ కార్య సఫలతన్
నెంజిలి తొలగింపుమనిరి నీలకములు రాఘవా ! (60)
వ. నెంజెలి యనగా దుఃఖము. నీలకములు అనగా వానరములు.
సుందర కాండము
వ. ఆ విధము ప్రోత్సాహము దిన హనుమంతుడు తన శరీరమును పెంచి, మహేంద్రగిరి పై కాలుంచి ఒక్క ఉదుటున గాలిలోకెగిరాడు.
గగనమంటు రీతిగ తన కాయము మరి బెంచుచున్
తగిలి యా మహేంద్ర పర్వతంబు నుండి ఎగురుచున్
సొగసుగా సురాదులెల్ల చోద్యమనుచు చూడగా
జగము మెచ్చ వాయు సుతుడు సాగెనపుడు రాఘవా ! (61)
అరయు గట్టి పట్టి స్పర్శనాదరించి, స్ఫూర్తితో
సురస నోట జొచ్చి వెడలి శూరుడై గమించుచున్
వరము గొన్న సింహికనట వధము జేసి, సాగుచున్
మరులు గొల్పు స్వర్ణలంక మారుతి గనె రాఘవా ! (62)
వ. ఆ నిధంగా సముద్ర లంఘనం చేసి ఆవలకు చేరిన హనుమంతుడు లంబ పర్వతం పై దిగి, అక్కడ నుండి లంకా నగరాన్ని పరిశీలనగా చూశాడు.
ఆరజముగ గానుపించు యందమైన హర్మ్యముల్
నీరజముల శోభతోడ నిబిడమౌ వనంబులున్
క్రూర యసుర గణములచట గూడి యున్న లంకయున్
శూరుడైన హనుమ గాంచె సుందరముగ రాఘవా ! (63)
వ. సూక్ష్మరూపియై లంకలో ప్రవేశించ ప్రయత్నించిన హనుమంతుని లంకా రాక్షసి లంఖిణి యడ్డగించింది.
లంక రక్షణమున నిలచు లంఖిణినొక గ్రుద్దుతో
అంకకాడు హనుమ చంపి అంక పొంకములను తా
హుంకరించి దావలి పదమూనె మానితమగు యా
లంక వీధుల జననెంచి లౌక్యముగను రాఘవా ! (64)
వ. అలా ఎడమ కాలు లోపల పెట్టి లంక ప్రవేశించిన హనుమంతుడు లంకా నగర వీధులలో పరిశీలనగా చూసుకుంటూ ముందుకు సాగాడు.
యజ్ఞ దీక్షనున్నవారు నఖిల శాస్త్ర సార మ
ర్మజ్ఞులు వర తాపసులను మహిత శక్తిమంతులన్
ప్రాజ్ఞులు ఘన సామగాన పండితులును ధీయుతుల్
విజ్ఞులనట గాంచె హనుమ వేనవేలు రాఘవా ! (65)
మంద పవన వీచికలవి మరులు గొల్పు రీతిగాన్
కందువందు నతినలచట కామకేళులాడి యా
నందమతిశయింప నొడలు యలసియున్న వారినిన్
సుందరాంగనల్ గృహముల సొక్కి సోలి యున్న యా
మందిరముల జూచి జూచి మధన పడుచు నెంతయో
డెందమందు యాశ కల్గి ధ్యేయ సాధనంబుకై
అందమైన లంకలోన హనుమ వెదకె రాఘవా ! (66)
వెదకి వెదకి దశ శిరస్కు వింజరంపు గేహమున్
వెదకెననుజ సచివ బంధు విప్ర ప్రజల గృహములన్
వెదకె ఝరుల, నదుల, వనుల, వీధుల గిరుల గుహలన్
వెదకె రధ విమానములను వెదకె మంటపముల పూ
పొదల కొట్టములను వెదకె భూమి సుతను రాఘవా ! (67)
“కౌసలేయు పత్ని యిచట కానరాదదేలనో!
ఆ సముద్రమునను దూకి యసువులనెడబాసెనో!
ఆసురీ ప్రవృత్తి జనుల ఆరడులకు ప్రాణముల్
ఆ సుమాంగి విడచెనొ! మరి యశనమాయెనో!” యనిన్
ఆశ సన్నగిల్లుచుండినంత కలత నొందుచున్
ఆ సమీరజుండు చిక్కెనరమరలము రాఘవా ! (68)
“సుందరా! రవికుల జలధి సోమ! ధామ లంకనున్
సుందరాంగి సీత నాదు శోధనమ్మునందునన్
ఎందు కానరాదటంచు ఏను పలికినంతటన్
క్రిందు మీదులై జగాలు కీడ పొందు గావుటన్”
డెందమందు ఇటుల మర్కటీడు నెంచె రాఘవా ! (69)
“శ్రీ రఘువర! నరయనైతి సీత జాడ లంకలో
వారితేరి నేను ఇట్టి వార్త చెప్పినంతనే
భూరివంతనందునట్టి భూరమణుడు నంతమౌ
నారటించి సోదరులును ఔర మృతిని బొందరే!
వారి మాతృమూర్తులట్లె ప్రాణములను విడుతురే!
ఆ రవికులమెల్ల ధరణినంతరించునయ్యొ! సీ
తా రమణుని మృతిని గనుచు ధరణి సుతుడు, రుమయు, నా
తార,యంగదాదులెల్ల తనువు విడచు వారలే!”
మారుతాత్మజుండు ఇటుల మదిని కలగె రాఘవా ! (70)
“సంచరించి యటవిలోన సంయమిలృతునగుటయో,
అంచితముగ నిరశనమును యాచరించుటొప్పునో,
మించి కడలిలోన లంకమేరనెల్ల నుంచుటో,
వంచకుండు ముష్కరుండు పాపి కైకసేయు బం
ధించి రామ చరణ సన్నిధి బడజోయుటొప్పొ” చిం
తించె పలు విధముల నతడు ధీమసముల రాఘవా ! (71)
వ. అలా చింతిస్తూ తాను పరిశీలించ మరచిన అశోక వనము వెదుకనెంచి హనుమంతుడు ముందుకు సాగాడు.
శోకముడిపి చింతలాపి సుందర కపి వీరుడ
స్తోకమైన వీకనొంది సుచరిత జనకాత్మజన్
తూకొని పలుమార్లు నగరి దుడుకు వడక వెదుక నిం
దాక వెదుకనట్టి తావు తావులీను సీమయున్
జోక నందనమగు దాని జూచినాడు రాఘవా ! (72)
సుందర కపివరుడు గాడ్పు చూలి మోదమందుచున్
సుందరమునసోఖవనము చొరగ నిశ్చితాత్ముడై
వందనములు సకల దేవ వర్గమునకొనర్చుచున్
సందడించు ఆశలందు సాగినాడు రాఘవా ! (73)
అనిలజుడు యశోకవనమునంత కలియ దిరుగుచూ
జనినచోట శింశుపతరు శాఖళందు దాగి చూ
సిన, శరీరమంత గూడ చిక్కి శల్యమైన భా
మిని గనె తరు ఛాయలందు మీన నేత్రనొక్కతిన్
ఇనకుల పతి రామపత్ని ఈమె గాకపోవునా
యని దలచెను మనమునందు యాశతోడ రాఘవా ! (74)
వ. ప్రాతఃకాలముననె రావణాసురుడు అక్కడకు వచ్చి, సీతతో సంభాషించ ప్రారంభించాడు.
ఉదయమునను పంక్తి కంఠుడుజ్వలమగు శోభలన్
హృదయమందు సీత పొందు హెచ్చు పెచ్చరిల్లగా
బెదరియున్న నాతి జేరి ప్రేమ పొంగు వారగన్
“కుదురుకొనదు మనసు దేవి! కోర్కె నెగులు రగులునే!
మదన తాప మార్తరమ్ము మచ్చెకంటి నీరమై
ముదిత సమ్మతించు” మనుచు మూఢుడాడె రాఘవా ! (75)
“అనద! నీవు గొప్ప కీర్తి నరసినావు గాని, నీ
కనులకు పెను మాయ గప్పె కామ వివశ కాంక్షలున్;
తృణము కన్న హీనుడ! నిను త్రెంచక పతి మానునే!”
యనుచు నింద జేసి రావణాసురునికి సీతయున్
ఇనకులపతి శరణమడుగ హితము బల్కె రాఘవా !(76)
“బిడుగు వోలె మాటలేల! బెడగు విడి గ్రహించుమా!
అడుగువెట్ట దాశరథికినలవిగాదు లంకలో
పడతి! నను తిరస్కరించు పంతమేల! నీకు నై
గడువు రెండు నెలల నిత్తు; కాదనకను లొంగుమా!
అడగిపోవనేల! చెన్ను!” యనెనసురుడు రాఘవా ! (77)
“పట్ట మహిషి జేతు నిన్ను; పద్మనేత్రి వినుము నా
పట్టునున్న భామలెల్ల బానిసలుగ జేతునే!
యట్టుగాదు యందువేని హతమొనర్తు”ననుచు తాన్
తిట్టి కోపమునను వెడలె త్రిదశ వైరి రాఘవా ! (78)
వ.ఆశలు అడుగంటుచుండగా సీతా దేవి ప్రాణ త్యాగానికి నిశ్చయించుకున్నది. అప్పుడు హనుమంతుడు చెట్టుమీదనుండి రామ గాధను వినిపించాడు.
వనమునందు వనటనందు ప్రాణమాశ నిల్పగా
దినమునందు శుభశకునములరసె హనుమ యంతటన్
యనువుగాను రామ గాధనాలపించ, సీతయున్
వినుచు దలచె సోకురేని బేలుగాను రాఘవా ! (79)
హనుమ లాఘవమున తఱువు నవతరించి ఆ మహీ
తనయ కంచలించి తన్ను తాను ఎరుక పరచి భీ
తిని శమియింపజేయు పలుకు తీరు కూర్చుకొనుచు భ
క్తి నెనరులెనయంగ మీదు కీర్తి చాటె రాఘవా ! (80)
రామ బంటుననుచు హనుమ రామకెరుక జేయుచున్
రామ ముద్రికామెకొసగి రంజిలగను జేయగా
స్వామికొసగుమనుచు పలికి సంతసించి తనదు చూ
డామణి కపి చేతికిచ్చె డంబు మీర రాఘవా ! (81)
వ. వచ్చిన పని సఫలమగుతుండగా మారుతిలో సహజమైన చంచల బుద్ధి వలన అతడు అక్కడున్న చెట్లను పెఱికి వేస్తూ అందిన ఫలాలను ఆరగిస్తూ స్వైర విహారం చేశాడు.
తమ బలమును ఎదిరి బలము తారతమ్యమరయగా
సమయమిదియె ననుచు దలచి చతురుడైన హనుమయున్
కొమరు చౌకలించు తోట గొప్పతనము మాపగా
ద్రుమ సమూహములను పెఱుకదొడగెనపుడు రాఘవా ! (82)
ఆ యశోకవనము చెన్ను యంతరింప జేయుచున్
వాయు సుతుడు వృక్షములను బాగ పెఱికి వేయుచున్
చేయు చేష్టలాపగాను చేరి రాక్షస గణముల్
ఆయుధములనంపగాను యాగ్రహమున వారి బల్
గాయపరుప, భీతితోడ కావలి జనులార్చుచున్
నాయకునికి దెల్ప జనిరి నగరివైపు రైఘవా (83)
ఆమికతిశయించ రావణాత్మజుండు ఇంద్రజి
న్నామ బిరుదు గొన్న మేఘనాదుడటకు రాగ సం
గ్రామమంత జరుగ సాగె గాసి లేక ఇరువురు
ద్దామ బల విభవము మించ తక్కులేక నపుడు తా
నామరుత్తనయుని జంప నలవి కానె కాదనిన్
తా మనసుననెంచి కడకు దానవెంద్ల సుతుడు పై
తా మహీయ శరము విడచె దాన బంధితుడగుచున్
ఆ మహీరుహచర ఋషభుడాదరించి రాఘవా ! (84)
వ. పైతామహీయ శరము అనగా బ్రహ్మాస్త్రము. ఆ విధంగా బ్రహ్మాస్త్రముచే బంధితుడైన హనుమంతుడు రావణ సభలో ప్రవేశించాడు.
రావణుండు మాఱుతి గని రౌద్రుడగుచు భటులతో
“నా వనమ్ము తనయ బంధ నాశకుండు; దుష్టుడున్,
త్రోవ దప్పి నడచు వాని దునుము”మనుచు బల్కగా
నా విభీషణుండు దూత హత్య నీతి కాదనెన్
“ఈ వనచరమునకు వాలమెంతొ ప్రీతి యందురే!
కావున కపి వాలమపుడు గాల్చ”మనెను రాఘవా ! (85)
వ. సీతాదేవి అగ్నిదేవునికి చేసిన ప్రార్థన వలన మాఱుతిని మంటలు ఏమీ బాధించలేదు.
తుంటరి వలె మాఱుతి తన తోకతో పురంబునే
మంట గాల్చి తిరిగి వచ్చి మాత సీత జూచియున్
మింటికెగసి వేగముగను మిత్రుల గని మరలి తాన్
మింటి తెరువరి కొలపతికి మిగుల భక్తి మొక్కుచూ
కంటి సీత ననుచు బల్కె కార్య సిద్ధి రాఘవా ! (86)
యుద్ధ కాండము
కమనుడైన రావణునట గ్రక్కున వధియించగా
శమము వీడి కపుల సేన సారధిగను నిలచి, నీ
విమల తేజ శౌర్యమునట వేల్పులంత గాంచగా
సమరమెంచి వెడలినావు సగర తటికి రాఘవా ! (87)
వ. వానర సేన రామలక్ష్మణులను మధ్యలో ఉంచి, వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.
ఎడను మార్గదర్శి గాను నేగు నీలుడుండగా
కుడిని ఋషభనాయకుండు గూర్చి సేన కదలగా
ఎడమ గంధమాదనుండు నిచ్చగించి నిలువగా
నడిమి నిలచి తమ్ముని గొని నడచినావు రాఘవా ! (88)
గజ,గవయ, గవాక్షులాది గాను ఋషభ నాయకుల్
ధ్వజిని తోడ నేగె జాంబవంతుడాది ఋక్షముల్
నిజుడు భాస్కరజుడు బిందు నేతగాను సూర్య వం
శజులు మిమ్ము హనుమ మ్రోయ సాగినారు రాఘవా ! (89)
వ. అక్కడ, రావణ సభలో మంత్రులు, బంధువులు అందరూ రామునితో వైరము వలదని,సీతా దేవిని రామునికి వప్పజెప్పమని సలహా ఇచ్చారు. రావణుడు వినలేదు. అతని సోదరుడు విభీషణుడు కూడా అదే విధంగా చెప్పినపుడు రావణుడు అతనిని వెళ్లిపొమ్మన్నాడు.
సావధానపరచు మాట సాహసించి చెప్పినా
సావిలేని మాటలనుచు సక్తి గనని రావణు
న్నావరించె కామ క్రోధలనుచు హెచ్చరించుచూ
నా విభషణుండు వదలె నసురపురిని రాఘవా ! (90)
వ. లంకా నగరమును వదలిన విభీషణుడు సరాసరి శ్రీరాముని వద్దకు వచ్చి శరణు వేడాడు.
తన పరిచయమందజేసి తా విభీషణుండు, నిన్
ఘనుడవని స్తుతించి నీదు కరుణ గోరి నిలువగా
చనవుతో నధర్ములనిక జంపివేసి, రాజుగా
తనను జేతునంటివపుడు తారక ప్రభు రాఘవా ! (91)
వ. శతయోజన పర్యంతము వ్యాపించియున్న సముద్రమును దాటుటకు ఉపాయం గురించి అందరూ ఆలోచించారు. ఫలితం లభించలేదు.
సాగుటకును దారి లేక చాల కోపమొంది, యా
సాగరుని హరింపజేయ శరము నెత్తు నీకు తాన్
సాగిలపడి ప్రణతులిడుతు జలధి దాటు మార్గమున్
వేగ దెల్పె సాగరుండు వేడుచు నిను రాఘవా ! (92)
వ. సాగరుని సలహా మేరకు విశ్వకర్మ పుత్రుడైన నీలుని నిర్వహణలో సేతు నిర్మాణం ప్రారంభం అయింది.
రామసేన గిరుల దెచ్చి లాఘవమున పేర్చి శ్రీ
రామ నామమును ముదమున వ్రాసి నీట వేయగాన్
రామ నామ మహిమ వలన రాళ్లు నిలచి సేతువై
రామ పాద స్పర్శ కోరి ప్రవణమాయె రాఘవా ! (93)
వ. ఆ విధంగా ప్రారంభమయి, క్రమముగా 14,20,21,22,23 యోజనముల మేరకు నిర్మితమవుతూ అయిదు రోజులలో సేతు నిర్మాణం పూర్తి అయింది.
జక్కర పతి సూచన గొని చక్కనైదు దినములం
దొక్క రోజు పదియు నాల్గు యోజనముల మార్గమున్
ఒక్క రోజు నిరువది మరియొక్క రోజు నిరువది
న్నొక్క యోజనముల దూరమొక్క రోజు నిరువదిన్
పెక్కు రెండు యోజనములు పేర్చి శిలలు క్రమముగాన్
మొక్కవోని బలమిరువది మూడు యోజనంబులన్
మిక్కుటముగ పూర్తి అయిన మేలు సేతు బంధమున్
అక్కజముగ నిర్మితమయెనబ్ధి పైన రాఘవా ! (94)
సాగర జల ఘోష మించి శబ్దములను జేయుచున్
వేగముగను జలధి దాటి విడిసిన కపి సైన్యమున్
బాగ జూచి రావణుండు మంది మార్బలమ్ముతో
సేగి నుండి లంక గావ సిద్ధమాయె రాఘవా ! (95)
వ. సేగి అనగా ఆపద.
అంగదుండు రామదూతననుచు రావణ సభనున్
పొగువారు కోపమూని పూర్వజనులు బంటులన్
అంగవించి వారినెల్ల యమపురమునకంపి తాన్
చెంగలించి త్వరితముగను చేరె నిన్ను రాఘవా ! (96)
వ. సంధి ప్రయత్నాలన్నీ వ్యర్థమైన కారణంగా రాక్షసులకు, వానరులకు మధ్య సంగ్రామం ప్రారంభం అయింది.
మ్రొక్కిన జనులందరికిని ముదము మోదమలరగాన్
దిక్కుల సమధర్మ జ్యోతి దీటుగా జ్వలించగాన్
చుక్కల నడిమింట నిలచి సురలు గూడ గాంచగాన్
రక్కసులకు వానరులకు రణము జరిగె రాఘవా ! (97)
వ. రావణ సేనలో ఉన్న ముఖ్యమైన సేనాధిపతులు చాలా మంది రాముని చేతిలో హతులయ్యారు.
అగ్నికేతు, రశ్మికేతు, యజ్ఞకోపనసురులున్
భగ్నమగుచు నీదు బాణ పటిమ నేల గూలగాన్
అగ్ని కీలవోలె మెరసి యాహతించు నీదు కో
పాగ్ని యందు భసమ్మైరి యసురులంత రాఘవా ! (98)
వ. అప్పుడు రావణుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు.
ఆగడీడు మేఘనాదుడంత వానరంబులన్
జాగు సేయకుండ బలిమి జంపగోరి క్రుద్ధుడై
నాగపాశ బంధితులుగ తమను బాధ పెట్టగాన్
ఆ గరుడుడు వచ్చి మిమ్ము హరియని తెలియంగ తాన్
నాగపాశ బంధములను నష్టమొనర జేయుచున్
వేగ జోతలిడుచు తాను వెడలినాడు రాఘవా ! (99)
వ.ఎక్కువ కాలం నిద్రించి యుండే కుంభకర్ణుని నిద్ర లేపి, రావణాసురుడు యుద్ధానికి పంపాడు.
కుంభకర్ణుడాగ్రహించి కోతి మూకలందరిన్
డంభముగను కడిగొని తన డాబు చూపుచుండ, యా
దంభి పైన యస్త్రములను నాటినంత, దనుజుడౌ
కుంభకర్ణుడద్రివోలె కూలె ధరణి రాఘవా !(100)
వ. కుంభకర్ణ మరణంతో బాధనొందిన రావణాసురుని ఊరడిస్తూ ఇంద్రజిత్తు మరల యుద్ధానికి వచ్చాడు.
లావు మీరి ఇంద్రజిత్తు లాఘవమ్ము జూపి సు
గ్రీవ, లక్ష్మణులను ఇతర కీశముల జయించుచూ
దేవ మిమ్ము గూడ తా వధింప బ్రహ్మ యస్త్రమున్
చేవ గాను వేసినంత చేష్టలుడుగు మిమ్ము సం
జీవని గిరి చేత దెచ్చి జీవమూది ప్రీతి తోన్
ఆ వనచరములను గూడ హనుమ గాచె రాఘవా ! (101)
వ. విజయము కోరి మేఘనాదుడు చేసే యజ్ఞాన్ని భగ్నపరుస్తూ లక్ష్మణుడు అతనితో యుద్ధం చేశాడు.
మేఘనాదుడనికి వచ్చి మిగుల నేర్పు జూపుచున్
మేఘజాలమందు దాగి మెఱయుడగుచు మూకపై
శ్లాఘనీయమైన రీతి రణమొనర్చునంతటన్
లాఘవముగ జంపెనతని లక్ష్మణుండు రాఘవా ! (102)
వ. అప్పుడు యుద్ధరంగానికి వచ్చిన రావణునికి, రామునికి మధ్య పోరు భీకరంగా సాగింది.
కూడి యుద్ధమందు నిన్ను కూలవేయ జూచి, నీ
వాడి బాణ వర్షమునకు వడలియున్న రావణుం
డీడిగిలగ ధర్మ మూర్తి వీవు కరుణ జూపుచున్
“నేడు పోయి రేపు రమ్ము” నీవు యనుచు బల్కగా
వీడి జనియె సమరభూమి వీటికతడు రాఘవా ! (103)
వ. అవమానమును భరించలేని రావణుడు మితిమీరిన క్రోధంతో మరల యుద్ధానికి వచ్చాడు. ఆరు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది.
క్రూరుడౌ దశాననుండు కోరి విజయ కాంక్షతో
పోరునెంచి మరలివచ్చి పూనిక నిను దాకగా
బీరమతిశయించుచుండ మీకు భీకరంబుగా
పోరు సాగె సాహసమున పోల్చనదియె సాటిగా
ఆరు దినములంత వరకు ఆగకుండ పోరుచూ
సారమంత నుడిగిపోయి సత్తులేని సోకుచే
జారి ప్రాణములును భువిని జన్మ రహితుడైన యా
పేరు గన్న రావణునకు ప్రీతి ముక్తి నొసగి, బల్
కీరితి గొనినావు నీవు క్షితిజ నాభ రాఘవా ! (104)
మంకుబోతు రావణుండు మరణమంద యంతటన్
అంకములను వదలి శరణుయన్నవారి గాచుచున్
లంకకున్ విభీషణునట రాజుగ నియమించుచున్
అంకమందు సీతనపుడు నరయనంపె రాఘవా ! (105)
జాతవేదు వేడి జేరి చాటమనగ నీల్పునున్
సీత పూతచరిత యనుచు శిఖియు బల్కె స్వచ్ఛమై
జాతి సంతసిల్లి నీకు జయము వెట్ట, మాఱుతిన్
భ్రాత భరతు కడకు వార్త పంపినావు రాఘవా ! (106)
వ. 14 సంవత్సరుమల పాటు పాదుకలకు పూజ చేస్తూ అయోధ్యానగరం వెలుపల కుటీరంలో నివసించిన భరతుని శ్రీరాముడు వచ్చి కలిశాడు.
భరతుని గనినంత ప్రేమ భావముప్పిలగ దయా
నిరతుడవయి, కౌగలించి నెగడు సంతసమ్ముతో
త్వరితముగ నయోధ్య జేరి తాపసులను గొల్చి యా
పురమునకభిషిక్తుడవయి బ్రోచినావు రాఘవా ! (107)
ఉత్తర కాండము
శ్రీకరమని జనులు మెచ్చు రీతి సుఖము నొసగుచున్
సాకతమున పాలనంబు సంతసిల్ల జేసినన్
చాకివాని నింద వినుచు సంకట పడినావయా
లోకనిందకెంతయో విలువ నొసంగి రాఘవా ! ! (108)
ఇనకుల ఘన యశము నిలిపి, ఇలను నీతి దెల్పగా
కనికరమును మరచి సీత కాననముల కంపి, యా
మనమునందు గ్లాని నొంది మరల రాజ్య దీక్షతో
జనుల కొఱకు పాలనంబు జరిపినావు రాఘవా ! (109)
వ. ఇష్టము లేకున్నా రాజాజ్జ్ఞననుసరించి లక్ష్మణుడు సీతామాతను అడవులలో విడచి వెళ్లాడు.
వనమునందు లక్ష్మణుండు వదలి వెళ్లినంత,యా
వనిత సీత దుఃఖ తప్త వైఖరి గని ప్రేమతో
గనుచు తరులు, ఝరులు, మునులు గాచుచుండ, జేసెనా
జనక మహిత నీదు నామ స్మరణమెపుడు రాఘవా ! (110)
ఆకుల పడు సీత యపుడు యడవినందు వెదకి వా
ల్మీకి యాశ్రమంబు జేరి మేలుగా వసించుచూ
శోకము వలదన్న మౌని సుద్ది వినుచు భక్తితో
లోకమాత యొక్క పూజ లోన యుండె రాఘవా ! (111)
లవకుశులకు జన్మనిచ్చి రామపత్ని సీత సం
స్తవుడు రామచంద్ర నామ జపము జేయుచూ వనిన్
భవుని పత్ని పూజనచట భక్తి మీర జేసి, స
ద్భవిత కొఱకు విన్నవించె ప్రార్థనలను రాఘవా ! (112)
లవణ రాక్షసుండు రామ రాజ్యమందు చండుడై
యవనియందు జనులనంత నారగించుచుండగా
పవన బలుడరిఘ్నుడపుడు భ్రాత యాజ్ఞ బొంది యా
కవుచు మేపరిని దునుముచు ఖ్యాతినొందె రాఘవా ! (113)
వ. దేశ క్షేమం కొఱకు శ్రీరాముడు అశ్వమేధ యాగం నిర్వహించాడు. అనంతరం సీతా దేవి లవకుశులను శ్రీరామునికి వప్పగించి, భూమాతను ప్రార్థించి ప్రాణ త్యాగం చేసింది.
అతి పవిత్ర యశ్వమేధ యాగమీవు జేయగా
సుతులు వీర కుశలవులను సొక్కుచు స్పృశించగా
నతివ సీత పతికి మ్రొక్కి నతిశయమున బిల్చి యా
క్షితిని గూడి రసతలమును జేరెనపుడు రాఘవా ! (114)
వ. భరతుని మేనమామ అయిన యుధాజిత్తు కేకయ దేశానికి రాజు. అతని దేశానికి సమీపంలో గల గంధర్వ దేశాన్ని శైలూషుడు అనే గంధర్వరాజు పాలించుచున్నాడు. ఆ దేశాన్ని జయించి తన సమస్యలను తీర్చమని యుధాజిత్తు శ్రీరాముని కోరాడు. అప్పుడు గంధర్వ దేశమును జయించి రమ్మని శ్రీరాముడు భరతుడిని పంపగా, అతడు ఏడు రోజుల పాటు వారితో యుద్ధం చేసి, చివరకు సంవర్తము అనే మహాస్త్రాన్ని ప్రయోగించగా, ఆ శస్త్రం మూడు కోట్ల గంధర్వులను వధించి శాంతించింది.
కేకయ నగరాధిపతియు కేలు మోడ్చి కోరినన్
కైక సుతుడు వేల్పు గాణ కటకము పరి వెడలగా
యా కుపితులు గాన విదులు అస్త్రములను వేయుచూ
మూకలైన వారినిన్ సమూహ బాణ వర్షమున్
ఆకపరచి ఏడు దినములావిధమున వైరులన్
తాకిన ఫలమేమి కూడ దక్కని తరుణంబునన్
తూకొకి ప్రళయంపు శక్తితో శరంబు వేయగా
ఆ కలుషిత మగ్నులంత యంతరించి పోవ, తాన్
ఆ కటకము గెల్చె భరతుడా విధముగ రాఘవా ! (115)
వ. దుష్ట శిక్షణ పూర్తి అయిన తరుణాన అన్నదమ్ములు అవతారములు చాలించవలసిన సమయం ఆసన్నమైనదని శ్రీరాముడు భావించాడు.
జోసి కాల పురుషుడు భువి జొచ్చిన తరి మౌని దు
ర్వాసునచట రోధ జేసి వధ్య శిక్షనొందుచూ
శ్వాస నిల్పి లక్ష్మణుండు సాగర తటి ధ్యానమం
దా శరీరమును వదలుచు హరిపురి జనె రాఘవా ! (116)
అవతరించు కారణంబునంత యంతరించగా
నవని జనులు భోగ మోదమందుచూ సుఖించగా
లవకుశుల నయోధ్య నగర రాజులుగను జేయుచూ
అవని భరతరిఘ్న సోదరాత్మజులును తోడుగా
దివము జేరినావు నీవు దివ్యముగను రాఘవా ! (117)
దుష్ట శిక్షణంబు జేసి దుర్జనుల వధించియున్
శిష్ట జనుల రక్ష జేసి దుర్జనుల వధించియున్
శిష్ట జనుల రక్ష జేసి శ్రేయమొదవ చేసియున్
కష్ట జీవులకును ఫలము కరుణనిచ్చి గాచి, మా
కిష్టమైన నీప్సితములు నెలమినీవె రాఘవా ! (118)
ఖట్టికుండు కవిగ మారి ఘనత రామ చరితమే
ఎట్టి జనులు ధన్యులగుటకిచ్ఛతో రచించగా
అట్టి కావ్య రాజము మనకంద జేయు పూజ్యులన్
ఇట్టులే స్మరింతునుడు నినకులేశ రాఘవా ! (119)
ఎందరో మహానుభావులిచ్చు కృషి ఫలంబుగా
నందమైన రామ కధయు నందె మాకు గ్రంథమై
కందువగను తెలుగు ప్రజల ఖ్యాతి బెంచు పుణ్యులౌ
వందలాది కవులకివియె వందనములు రాఘవా ! (120)
నిస్తుష ఘన రత్నము వలె నిలచు నీదు చరిత, నే
స్వస్తి వచనములను బల్కి శతకముగను వ్రాయగా
నిస్తరించి రోధములిట, నిన్ను గొల్చు భాగ్యముల్
ఇస్తివనుచు సంతసింతు నెంతొరామ రాఘవా ! (121)
నిన్ను గూర్చి స్తుతిని జేయ నేను తగిన వాడనే
పన్నగేంద్ర శయన నిన్ను పాడగలుగు వాడనే
సన్నుతాంగ నీదు పద్య శతకమేను కూర్చగా
నన్ను నీవు బ్రోవవయ్య నరహిత ఘన రాఘవా ! (122)
జయము రామచంద్ర నీకు జయము మానవోత్తమా
జయము సర్వ సుజన పాల జయము రాక్షసాంతకా
జయము పితృవచన పాల జయము దశరథాత్మజా
జయము రామ భక్త సులభ జయము జయము రాఘవా ! (123)
జైహింద్.