గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, సెప్టెంబర్ 2016, శనివారం

కపిలగోవు మహానుభావంబు- మహా భారత కథ .. రచన. శ్రీ ఏ.సి.పి .శాస్త్రి.

జై శ్రీరామ్.
కపిలగోవు మహానుభావంబు - మహా భారత కథ
                                                                   
గవాం అనేక వర్ణానాం, క్షీరస్యాపి ఏక వర్ణతా
క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినస్తు  గవాం యథా.

అమృతబిందోపనిషత్తు లోనిది ఈ మంత్రం .. దీని అర్థం ఏమిటంటే .. ఆవులు ఎన్ని రంగులలో ఉన్నా పాలు మాత్రం ఒకే రంగు లో ఉండును. జ్ఞానం అంటే పాలలాంటిది. వేదాలరూపాలు( భగవంతుడి అన్వేషణా మార్గాలు) ఆవుల మాదిరిగా బహువర్ణ మహిమా యుక్తములు.
దీని సారాంశం ఏమిటంటే
ఆవులు ఎన్ని రంగులలో ఉన్నా పాలు మాత్రము ఒకటే .. దానిలో రూపభేదం కాని, గుణ బేధం కాని లేవు. మరి అలాంటప్పుడు ..  కపిల గోవును దానం చేయటం మిగతా గోవులను దానం చేయటం కంటే విశిష్టము అనే వైదికోక్తి, ఆచారము ఎందుకు వచ్చినట్టు? ఇతిహాస నేపధ్యం చూస్తే
మహా భారతం, అనుశాసనిక పర్వంలో ...  భీష్ముడు ధర్మరాజుకి బోధించాడు ...
కం. క్షీరము దధియును ఘృతము సు - ధారూపములగుట దేవతా ప్రీణన య
జ్ఞారంభంబులు విమలా - చారా గోదోహనైక సాధ్యము లయ్యెన్
అని. ఆవు  పాలు ,పెరుగు, నేయి   అమృతం తో సమానమట . . అందుకనే దేవతలకు ఇష్టమట. ఇది ఎలా సాధ్యం! ఎలాగంటే ..
గోవును దానం ఇచ్చేటప్పుడు తీసుకునే విప్రుడు ఆ గోవు పాలతో వచ్చే నేతి తో యజ్ఞం చేస్తాడు. ఆ హవిస్సే  దేవతలకు  అమృతం.
అందుకే దూడతో సహా దానం చేయాలంటారు. దూడ పుడితే గదా ఆవు పాలిచ్చేది. ఇదే .... సోమయాగ మంత్రంలో ఆవుని గూర్చిన మంత్రం చూడండి. 1-4-43 లో 10 వ మంత్రం .."
'దక్షిణా వర్ణనము' లో ....
"అస్మద్దాత్రా దేవత్రా గఛ్చత మధుమతీః ప్రదాతారమావిశతానపహాయాస్మా న్దేవయానేన  పథేత సుకృతాం లోకే సీదత తన్నస్సగ్ంస్కృతం .."
అర్థం: ఋత్విజులకు దక్షిణగా నీయబడినట్టి హిరణ్యాది ద్రవ్యములారా! మీరు మాచే ఈయబడినవారలైదేవస్వరూపులయిన  ఋత్విజులలోనికి వేళ్ళుడు. ఓ గోవులారా! మీరు మధుర క్షీరములు గల
వారగుచు ఈ యజమానుని పరలోకమునందు రూపాంతర మున ఆవ హింపుడు. మమ్ము విడువక దేవ యాన మార్గమున వేళ్లుడు. వెళ్లియు అచట పుణ్యాత్ముల స్థానమున కూర్చుండుడు. ఆ స్థానము మాకు ఉప భోగార్హముగా సంస్కరింప బడినది. కనుక దీని అర్థమేమిటంటే .. గోవు నేయి హవిస్సు రూపంలో స్వర్గానికి వెళ్లి, అది అర్పించిన యజమానికి స్థానం కల్పిస్తుందని సోమయాగం చెబుతున్నది .

ఇంకా భీష్ముడు చెప్పిందేమిటంటే ... శుకుడు వ్యాసుడిని అడిగాడట .. కపిల గోవుకు అంత  ప్రాదాన్యమేమిటి యని . వ్యాసుడు చెప్పింది ఇది. ..
"ఒకప్పుడు అగ్ని దేవతలకు పరాజ్ఞ్ముఖుడై దాక్కొన దలచి గోవులను తనను, తమలో దాచుకోమని కోరాడట. అప్పుడు గోవులు అంగీకరించగా, అగ్ని వారి శరీరాలలో దాక్కున్నాడట. దేవతలు అగ్ని దాక్కున్న చోటు తెలిసికొని వచ్చి గోవులకు 'అలా అగ్నిని దాచటం అఖిల జగత్తుకు కీడు చేయటము అవుతుందని బోధిస్తే .. ఆ గోవులు అగ్నిని చూపినవట .దేవతలు పరమానంద భరితులయి .. గోవులకు వరమివ్వమని అగ్నిని కోరారట. అప్పుడు అగ్ని .. తను దాగి  ఉన్న సమయంలో గోవులు తన కారణం గా కపిల వర్ణం పొందినాయి గనక .. కపిల గోవులు అన్ని గోవులకంటే ఎక్కువ అని, "తదీయారాధనంబు దద్దానంబునుం బుణ్యతమంబులై దురితంబుల దమియింఛి ఉత్తమ లోకములనిచ్చుననియు "చెప్పాడట. ఏతావాతా దీని అర్థం ఏమి కనబడు తున్నదంటే ... "కపిల వర్ణం గోవు పాలలో అగ్ని తత్త్వం ఎక్కువగా ఉంటుంది" అని.
ఇక పొతే అదే అనుశాసనిక పర్వం లో దీనిని గురించి ఇంకొక కథ ఉన్నది. ఆ కథ చెప్పుకోబోయే ముందు .. ఉపోద్ఘాతంగా ఒక విషయం చెప్పుకోవాలి ..

రుద్రాభిషేకంలో ఒక మంత్రం (4-5-1 లో 8 వ మంత్రము)...  అసౌయోజ్ వ సర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్ అదృశన్నుదహార్యః '' దీనర్థం ఏమిటంటే ... తనని మంత్రాల ద్వారా చూడలేని స్త్రీల కోసము, గొల్ల వారి కి కనబడటం కోసం .. రుద్రుడు (శివుడు } సూర్యుడు రూపం లో ఉదయించాడుట . వారందరూ ఆయనను చూస్తున్నారట, దీనర్థం ఏమిటంటే. శివుడంటే సూర్యుడు .. సూర్యుడంటే శివుడు .. అయితే ఈ విషయం మనవారికి తెలుసా?
తెలిస్తే శివుడి కథలు వేరుగాను సూర్యుడి కథలు వేరుగాను ఎందుకు రాస్తారు?. బహుశ మనవాళ్ళు శివుడిని జగత్కారణం గాను సూర్యుడిని అంశగాను భావించి ఉంటారు. అంశ కూడా మూల కారణం రూపమేకదా.
అయితే మన దేవాలయాలన్నీ శివుడిని సూర్యుడి గానే భావించి ఉపచారాలు చెస్తున్నయ్యి. యజుర్వేదం లోని ఈ మంత్రం చూడండి . 2-1-8 లో 3 వ మన్త్రమ్.

"బైల్వో యూపో భవత్య సౌ వా ఆదిత్యో యతో అజాయత తతో బిల్వ ఉదతి ష్టత్స యో న్యేవ బ్రహ్మ వర్చస మవ రున్దే."
"యూప స్తంభము మారేడు చెట్టునకు సంబందించినది కావలయును. ఈ సూర్యుడు ఎచ్చటి నుండి పుట్టెనో అచ్చట నుండియే బిల్వమును పుట్టెను. అందుచే బిల్వమును, సూర్యు డును సమాన యోని (జన్మస్థానము)కలవారగుచున్నారు . అందువలన యజమానుడు సమాన యోని యగు బ్రహ్మ వర్చసమును తప్పక  పొందును ".
మన శివాలయాలలో శివుడుకి చేసే పూజలు 1)మారేడు పత్రాలతో పూజ 2)విభూతి తో అలంకరించి పూజించటం.
ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నయ్యి .
సూర్యుడు ఒక పెద్ద అగ్నిహోత్రం .. అగ్నిహోత్రానికి మనం చేసే ఉపచారం ఏమిటంటే ... ఆ అగ్నిహోత్రం కాంతిని పెంచటం .. సూర్యుడి జన్మస్థానం లో పుట్టి .. ఆయనతో సయోనిత్వం కలిగిన మారేడు ఆకులతో పూజ చేయటం. రెండవది .. విభూతి కి మరొక పేరు భస్మం .. భస్మం అంటే భాసకము అని అర్థం చెప్పారు అంటే  ప్రకాశింప చేసేది   అని అర్థం .. అగ్నికి చేసే ఉపచారాలలో ఆయన కాంతి పెంచే భస్మాన్ని లేక విభూతిని ఉపయోగించటం. యజుర్వేదం నాలుగవకాండ లో ఈ మంత్రం చూడండి 4-2-4 లో రెండవ మంత్రం
"అగ్నేర్భస్మస్యాగ్నేః  పురీషమసి " ఇది ఇసుకను ప్రార్థించే మంత్రం." ఓ సికతా స్వరూపమా! నీవు అగ్నిని భాసింప చేయు దానవు ". ఇక్క డ వేదం భస్మమనే మాటకు చెప్పిన అర్థం గమనార్హము. మనకు అనుభవమే. యజ్ఞం అయిన తరువాత ఆ భస్మం మనం బొట్టుగా ధరిస్తాము. అంటే బ్రహ్మ వర్చస్సును మనము పొందామని అర్థం. కనుక శివుడంటే సూర్యుడే అని మనవాళ్ళు నిర్ధారణకు వచ్చినట్లు మనం సిద్దాన్తీకరిమ్చవచ్చు. ఎందుకంటే మారేడు ఆకులతో
పూజిస్తున్నాము కనుక . ఇంతే కాదు. శివుడికి కాంతి పెంచటానికి చేసే ఉపచారాలలో ప్రభలు కట్టటము కూడా ఒకటి. కోటప్ప కొండలో శివరాత్రి రోజున "ప్రభలు" కట్టుకురావటం అనేది పెద్ద మొక్కు. ప్రభఅంటే కాంతే.
ఇక గోవుకి కపిలత్వం రావటానికి మరొక కథ అదే తృతీయ పర్వంలో ఉందని చెప్పుకున్నాము కదా ..
ఆకథలో...  పేరయితే శివుడని ఉంటుంది కాని.. వ్యాసుడు శివుడిని సూర్యుడుగా భావించి ఆ కథను వ్రాసాడు. అదేమిటో చూడండి
అనుశాసనిక పర్వం .. తృతీయా శ్వాసము ..
ఒక సారి దేవతలకు ఆకలి వేసి ఆహారం కోసం బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లారట. దేవతల ఆహారమంటే అమృ తమే కదా .. బ్రహ్మదేవుడు వారికి అమృతం తాగమని ఇచ్చాడుట. ఆ అమృతము యొక్క సువాసనకి (సురభిత్వసంపద) సురభి పుట్టిందట. అంటే కామ ధేనువు పుట్టిందట. దానికి సౌరభేయులు పుట్టినయ్యిట అంటే దేనువులే. అవి హిమగిరుల పై సంచరించటం మొదలుపెట్టినవట. వాటిలో ఒక లేగ పాలు తాగుతూ ఉంటే దాని నోట్లో నుంచి ఎగిరిన పాల నురుగు,  గాలికి పోయి పక్కనే (హిమాలయాలలో) తపస్సు చేసుకుంటూ ఉన్న శివుడి నెత్తిన పడ్డదిట. వెంటనే ఆయన  చిచ్చర కంటి తో ఆ ఆవులను చూసేసరికి (రుద్రుడు కదా) తెల్లని గోవులన్నీ కపిల వర్ణత్వం పొందినవట.(అగ్నికి ఎప్పుడూ  కపిల వర్ణమే చెబుతారు.) ఆ ఆవులూ, వాటి  వెనుక మిగతా ఆవులు బెదరిపోయి సోముడి దగ్గరకు అంటే చంద్రుడి దగ్గరకి పరుగెత్తినవట. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మ వడిగా వెళ్లి శివుడి పాదాల పై బడి " స్వామీ .. ఆవుపాలకు ఎంగిలి లేదు . ఎట్లా అయితే చంద్రుడు అమృతం ఇస్తాడో అట్లాగే ఆవులు కుడా పాలు ఇస్తాయి. దూడ పాలు తాగినా కూడా వాటికి ఎంగిలి లేదు.పాల శుచిత్వానికి నురుగు శుచిత్వానికి లోపం లెదు. అని నచ్చ చెప్పి ఒక వృషభాన్ని కప్పంగా ఇస్తాడు. శివుడు సంతోషించి ఆ వృషభాన్ని ధ్వజం గాను , వాహనం గానూ చెసుకుంటాడు. అందుకే ఆయన వృషభధ్వజుడూ, వృషభ వాహనుడూ అయినాడు    .
ఇక్కడ శివుడికి పత్యామ్నాయంగా సూర్యుడిని గనుక ఉహించినట్టయితే కథ చాలా తేలిక అవుతుంది. శివుడంటే సూర్యుడు. గొవులంటే కిరణాలు. సోముడంటే ఎటూ చంద్రుడనే అర్థం ఉండనే ఉన్ది. వృషభము అంటే త్రిష్టుప్ ఛందస్సు. శివుడు ఆ త్రిష్టుప్ ఛందస్సు మంత్రం మీద ఎక్కి తిరుగుతుంతాడు. ఊర్ధ్వ, అధో, తిర్యక్ దిక్కులలో వెళ్ళగలుగు తుంది కాబట్టి ఆ ఛందస్సును "త్రిష్టుప్ " అన్నారు. ఈ ఛందస్సు అంతరిక్షంలో ఉంటుంది.
శివుడి కంటిమంటకు ఎర్రపడిన గోవులు సూర్యుడిలోనుంచి వెళ్ళే కిరణాలు. ఆ కిరణాలు చంద్రుడి మీద పడి .. తిరిగి వచ్చేటప్పుడు చల్లటి కిరణాలు అయినయి. అందుకే అవి అమృత కిరణాలు. అదే వెన్నెల.
గోవులు సౌరభేయులు అని చెప్పటానికి ఇదే కారణం. ఇక బ్రహ్మ
ఇచ్చిన వృషభం త్రిష్టుప్ చన్దస్సు.
చంద్ర కాంతి అనేది ప్రత్యేకంగా చంద్రుడి నుంచి వచ్చే కాంతి కాదని సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడి వెన్నెలగా మారుతుందని మన వాళ్లకు ఎప్పుడో తెలుసు. దాని అర్థం లోనే ఇంకొక ప్రసిద్ధమైన మంత్రం ఉన్నది.

యజుర్వేదము 2 వ కాండ లో .. 4ప్రపాఠకం -14 అధ్యాయము
నవో నవో భవతి జాయమానో జ్ హ్నాం కేతురుషసా మేత్యగ్రే .. భాగం  దేవేభ్యో విద ధా త్యాయ న్ప్ర చంద్ర మా స్తిరతి దీర్ఘ మాయుః
చంద్ర కళా వృద్ధి క్షయ హేతువైన ఆదిత్యుడు ప్రతిదినము ఉదయించుచున్నవాడై నిత్య నూతను డగు చున్నాడు. ఆ ఆదిత్యుడు పగటికి చిహ్నము. ప్రభాత కాలముల ఉపక్రమము నందు తూర్పుదిక్కునందు ఉదయించుచున్నాడు .
కనుక ఈ కథ యొక్క పరమార్థం కుడా .. సూ ర్యకిరణాలకి అగ్నితత్వము ఎక్కువ వుంది. అందుకే అవి కపిలవర్ణంలో ఉంటయ్యి. అందుకే సగర వంశీకులను తన చూపుతో భస్మం చేసిన ఋషి "కపిలుడు" అని చెప్పబడ్డది. భూమిలో ఉండే అగ్నియే కపిలుడు.
ఇక ఈ గోదానము చేసిన వాళ్ళు మరణించిన తరువాత గోలోకంలోకి వెళ్లి అక్కడే శాశ్వతంగా నివసిస్తారని చెప్పబడ్డది. ఈ లోకం సత్యలోకంపైన ఉంటుంది.
గోలోక వర్ణన చూడండి.
కం. వినుమయ్యెడ గాలక్రమ - మును డప్పియు రోగములును ముదిమియు లేవ
వ్వినుత స్థానం బవ్యయ - మును కేవల సార సంప్రమోదకరంబున్.
అర్థం: అలొకంలొ కాలము, ఆకలి దప్పులు రోగము, ముసలి తనము ఉండవు. ఎందుకంటే. అది అవ్యయ స్థానం (వ్యయం లేనిది) ఆ లోకానికేవరు వెళతారంటే గురుశుశ్రూష చేసిన వాళ్ళు, ప్రలోభం లేని వాళ్ళు, శమదమాదులు గలవారు, నిర్మలాత్ములు, శాస్త్రం చెప్పిన ఆహారం తీసుకునే వాళ్ళు,... వీళ్ళంతా గోప్ర దానం చేసే వారితో కలిసి     ఉంటారు. అంటే మొదట ఆలోకానికి అర్హత గోదాన పరులకే కలుగు తుంది. మిగతా వారికి ఆ అర్హత వస్తున్ది. అంటే  గోవును దానం చేస్తే మిగతా వేవి చేయక పోయినా పరవాలేదు. (అయితే గోదాన వ్రతం అని ఉంటే మాత్రం స్నాతకం అని అర్థం .. గోవును దానం చేయటం అనేది గోదానం అనే పిలువబడుతుంది) ఇక దానాలలో కపిల గోదానం శ్రేష్ట మని చెప్ప బడినది కదా .. కనుక కపిల గోదాన ఫలితం ఏమిటంటే గోలోకం పొందటం.

సృష్టిలో వ్యాసభగవానుడి దృష్టి నుండి తప్పించుకున్న దేమైనా ఉందా.
                                            సమాప్తం

రచన :శ్రీ ఏ.సి.పి .శాస్త్రి
8-3-1105
కేశవనగర్ కాలనీ    
హైదరాబాద్ -73
చరవాణి :9440308760
జైహింద్.
                         
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కపిలగోవు యొక్క విశిస్టతను గురించి మహాభారత కధను అద్భుతంగా వివరించిన పూజ్యులు శ్రీ ఏ.సి.పి. శాస్త్రిగారికి ధన్య వాసములు. మాకందించిన శ్రీ చింతావారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.