గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2015, శనివారం

లీలాశుకుడు.....శ్రీ జాజిశర్మ.

జైశ్రీరామ్
శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.
లీలాశుకుడు.
లీలాశుకుడు ఒక గొప్ప వాగ్గేయకారుడు మరియు శ్రీ కృష్ణ కర్ణామృతం రచనచేసిన మహాకవి. ఇతడు జయదేవుడు తర్వాత 13వ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాడు.
ఇతడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా శ్రీకాకుళం ప్రాంతంలో నివసించేవాడని ప్రతీతి. ఇతడు రచించిన కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి ఉపయోగపడే రచనలుగా చెప్పవచ్చును.
శ్రీ కృష్ణ కర్ణామృతం
శ్రీ కృష్ణ కర్ణామృతం మూడు ఆశ్వాసాల భక్తి కావ్యం. మూడింటిలోను 110 చొప్పున శ్లోకాలున్నాయి. మొదటి ఆశ్వాసంలో శ్రీకృష్ణుని సాక్షాత్కారం, రెండవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని వివిధ లీలా విశేషాలు, మూడవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని జీవితంలోని అనేక ఘట్టాలు వర్ణించబడ్డాయి. దీనిలోని శ్లోకాలను సంగీత సభలలో రాగమాలికలుగా గానం చేయడం పరిపాటి.
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!
ఈ శ్లోకం ఎక్కడో విన్నట్లున్నది కదా! గాన గంధర్వుడైన మహానుభావుడు ఘంటసాల గారి మధుర గాత్రంలో ఆంధ్రదేశమంతటా మారుమోగిన “పాండురంగమహత్యం” సినిమాలోని “జయ కృష్ణా ముకుందా మురారే” అనే పాట గుర్తుంది కదా? ఆ పాటలో సమయోచితంగా, సందర్భోచితంగా వాడిన శ్లోకమిది.
మరి ఈ శ్లోకానికి మూలమెక్కడుంది?
సంస్కృత సాహిత్యంలో ప్రముఖ స్థానమలంకరించిన శ్రీ కృష్ణుని స్తుతి కావ్యం “శ్రీకృష్ణకర్ణామృతం”లోది ఈ శ్లోకం. కృష్ణభక్తిని మధురంగా గానం చేసే గ్రంధాలలో విశిష్టమైన జయదేవుని “గీత గోవిందమూ”, నారాయణ తీర్ధుల “కృష్ణలీలా తరంగిణీ,” “క్షేత్రయ్య పదాలూ” వీటి కోవలోకి వచ్చేదే “శ్రీ కృష్ణకర్ణామృతం”. ఈ నాలుగు గ్రంధాలూ ఆంధ్రదేశం నాలుగు మూలలా నిన్న మొన్నటి వరకూ పండిత పామరులు చాలామంది నోళ్ళల్లో నానుతూ ఉండేవి. మన దురదృష్టం కొద్దీ ఇప్పుడా పరిస్థితి లేదు.
శ్రీ కృష్ణ కర్ణామృతం ” గ్రంధకర్త లీలాశుకుడు. ఈయనకే “బిల్వమంగళుడు” అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ఏ ప్రాంతం వాడో ఏ కాలం వాడో స్పష్టంగా తెలియటం లేదు. అయితే ఈ “శ్రీ కృష్ణకర్ణామృతం” లోనిశ్లోకాలు 14 వ శతాబ్దం నుంచీ ఇతర గ్రంధాలలోనూ, శాసనాలలోనూ కనబడుతున్నాయి. అందుకని లీలాశుకుడు 11 వ శతాబ్ది నుంచీ 14 వ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడని ఊహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే లీలాశుకుడు జయదేవుడికంటే గూడా ప్రాచీనుడనే చెప్పాలి.
ఈ లీలాశుకుడు ఆంద్ర దేశంవాడనీ, వంగదేశం వాడనీ, మళయాళదేశం వాడనీ రకరకాల వాదాలున్నాయి. అయితే కృష్ణభక్తుడైన చైతన్య మహాప్రభువులు ఆంధ్రదేశయాత్రలో కృష్ణానదీతీరంలో ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ కృష్ణకర్ణామృత గానం విని ఆనందభరితుడై దానికి నకలుప్రతి రాయించుకుని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో ఈ గ్రంధం ప్రాచుర్యంలోకి తెచ్చారని చైతన్యచరితామృతంలో చెప్పబడిఉంది.
లీలాశుకుడు ఏ ప్రాంతం వాడైనాగానీ ఆయన ఒక గొప్ప కృష్ణ భక్తుడూ, పండితుడూ, అద్వైత సంప్రదాయంలో అభినివేశమున్నవాడూ అనటంలో సందేహం లేదు. అటువంటి మహావ్యక్తిని “చింతామణి” నాటకం ద్వారా తెలుగువారు తమవాడిని చేసుకున్నారు.. తన తండ్రిగారు చెప్పిన లీలాశుకుడి కధ తనకు ప్రేరణ అని చింతామణి నాటకకర్త కాళ్ళకూరినారాయణరావు గారు చెప్పుకున్నారు.
శ్రీమద్భాగవత ప్రవక్తగా ప్రసిద్ధుడైన శుకుని లాగానే బిల్వమంగళుడు కూడా శ్రీకృష్ణలీలామాధుర్యాన్ని ఆస్వాదించి, అనుభవించి, ఆ పారవశ్యంలో మునిగి శ్రీకృష్ణకర్ణామృతాన్ని మనకందించి లీలాశుకుడనే సార్ధకనామధేయుడయ్యాడు.
ఈ గ్రంధంలోని శ్లోకాలన్నీ “ముక్తక”రూపంలో ఉన్నాయి. అంటే అన్ని శ్లోకాలూ స్వతంత్రంగా సమగ్రమైన అర్ధాన్ని అందిస్తాయన్నమాట. కధకోసం, భావంకోసం ముందు వెనకల శ్లోకాలు చూడక్కర్లేదు. ఈ గ్రంధం అద్భుతమైన వేదాంత, సాహిత్య, సంగీత, భక్తి, వ్యాకరణ, ఛందోవిషయాల సమాహారమని చెప్పవచ్చు. ఇది కేవలం కర్ణామృతమే కాదు. కరణామృతం. అంతః కరణామృతం కూడా. ఈ కావ్యంలోని సచేతనాలైన గోవులు, గోపాలురు, గోపికలు మాత్రమే కాకుండా గృహాలు, స్తంభాలు, గజ్జెలు, పూసలు, మణులు, వెన్నముద్దలు, పాలు, పెరుగు, కుండల వంటి జడపదార్ధాలు కూడా ఎంతో చైతన్యవంతంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించటం మరో విశేషం. కృష్ణుడు, గోకులంలో ఆడుకునే బాలగోపాలునిగానో, గోపకాంతలకు ఆరాధ్యుడైన లోకోత్తర శృంగార పురుషుడిగానో మాత్రమే ఈ కావ్యంలో మనకు దర్శనమిస్తాడు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
లీలా శుకుని కృష్ణ కర్ణామృతం వినితీర వలసిందే .చాలా బాగుంటుంది ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.