సన్మిత్రులారా! స్వాగతం.
ప్రస్తుతం మనం కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసములనుండి శ్రీ విశ్వనాధ రచన లోని భావుకతను ౨౧ వ భాగం వరకు తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ౨౨ మరియు ౨౩ భాగాలు తెలుసుకొందామా? ఐతే ఆలస్య మెందుకు పరికించండి.
సీతను రాక్షసులు ప్రాణాలతో ఉంచుతారా? అని నిరాశ పడిన శ్రీరాముడు మరు క్షణమే ఆశావహుడై తనను తాను సమాశ్వాసించుకొంటున్నాడు.
క:-
ఇది యొక ఆశా వృక్షము
మొదలు మొదలు చివరిదాక భువి ప్రాణులకున్
బ్రదుకుల జగత్తు కట్టిన
యది. నేనిందొక్క రెమ్మనై యారతముల్. { వి. రా. క. వృ. కి. నూ. ౨౨ }
భూమి యందలి ప్రాణులకు వాటి బ్రతుకు జగత్తు కట్టిన ఆశా వృక్షము ఈ సృష్టి. ఈ మహా వృక్షము లోని అనేక శాఖల పైని గల అనేకానేక రెమ్మలలో నేను ఒక రెమ్మను. కనుక ఈ ఆశా నిరాశల నడుమ నాకీ ఆరాటము తప్పదు.
విష్ణ్వవతారముగ భువియందవతరించిన శ్రీరాముడి ఈహ నిరీహల మధ్య, ఆశ నిరాశల నడుమ ఊగిసలాడు సామాన్య మానవుడు అను శ్రీరామ అవతార రహస్యమును విశ్వనాధ రాముని మాటలలో ధ్వనింప జేయుచున్నాడు.
వాల్మీకి రామాయణమున ‘నాలం వర్తయితుం సీతా సాధ్వీమద్విరహంగతా ’ అని నైరాశ్యమును పొందిన శ్రీరాముడు -ఒక కాకి కూతను ఆలంబనముగా పొంది సీతలభించగలదని పక్షికూయుచున్నదని సంతోషపడును. ‘పక్షీమాంతు విశాలాక్ష్యాః సమీపముపనేష్యతి!!
కానీ విశ్వనాధ ఒక చిన్న పద్యముతో శ్రీరాముడు తనను తాను ఊరడించుకొను మాటలలో సృష్టి రహస్యము మానవ ప్రకృతిని తెలిపినాడు్.
మానవుడు ఆశాజీవి. దురంతమైన కష్టముల నుండి, వేదనల నుండి- ఇడుములనుండి భాధలనొందుచునే ఆశాతంతువుల ఆధారముచే లోకయాత్రను నడుపుకొనును. పతనం నుండి ఉత్ధానంవైపు నడిపించేది ఆశ! ఆశ లేనిచో ఈ సృష్టి ఎక్కడిది?
ఎప్పుడైతే శ్రీరాముడు ఆశావహుడైనాడో ఆయన సీతకై అన్వేషణ ప్రారభించును!
తే:-
‘నష్టసారంగపతి సమాకృష్టయామె
సంగతాకృష్టముగ్ధ సారంగ వీవు
విప్రతీప దశాగత పృథ్వి తనయ
నీకు కన్పించెనా! చెప్పవే! కదంబ! (కిష్కింధ. నూపురఖండం-23)
" అపాయన్ని తెచ్చిపెట్టేలేడిని చూసి ముచ్చట పడినది సీత - లేళ్ల చేత సేవించబడుతున్నావు నీవు! కష్టదశలో ఉండి విలపిస్తున్న సీత నీకు కన్పించిందా?" అని శ్రీరాముడు జాలిగా కడిమి చెట్టును అడుగుతాడు!
సీతాపహరణము వల్ల కలిగిన కష్టము. సీతా విరహము వల్ల కలిగిన సేగివల్ల చేతనా చేతనములందు బేధమును
గుర్తిం చ లేని వాడయ్యాడు రాముడు. లేళ్లు కడిమి చెట్టునీడను ఆశ్రయించి విశ్రాంతి పొందుచుండగా్ మాయలేడిచేత కష్టమును పొందిన సీత గుర్తుకు వచ్చి. ఆచెట్టునే సీతాదేవిని చూచితివా? అని అడుగును.
ఇది విరహావస్థలోని సంచారీ భావమునకు ఉప లక్షణము. " అనయంబు చేతనాచేతన సదృశ మనో భ్రమంబు ధర ఉన్మాదము ". అని కావ్యాలంకార సంగ్రహము నిర్వచనము. చేతనా చేతనములందు సమానమైన చిత్త భ్రాంతి ఉన్మాదము. శ్రీరాముని ప్రస్తుత అవస్థ ఇది.
విరహావస్థయందలి ఈ సంచారి భావమునే ప్రాతిపదికగా చేసుకొని మేఘసందేశము మొదలగు రసవత్కావ్యములు పుట్టినవి.
ఇట్టి (ఉన్మాద) స్థితిలోని రాముని దైన్యము రసహృదయులను కంటతడిపెట్టించును.
శ్రీ బులుసు కవీశ్వరుల భావనా పటిమచే విశ్వనాధ భావుకత మనకు ప్రస్ఫుటము అవడం ముదావహం.
జైహింద్.
Print this post
లాక్షాగృహమందు లవుడు లంకిణి గూల్చెన్. అనే సమస్యకు శ్రీ మరుమామల
దత్తాత్రేయావధాని పూరణ.
-
జైశ్రీరామ్.
శ్రీ మరుమామల దత్తాత్రేయావధాని
సమస్య.
*లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్.*
*మా తమ్ముని పూరణ.*
కం. రక్షణనిడె భీముడెచట?
రక్షాంతక రామ త...
3 రోజుల క్రితం
2 comments:
రామకృష్ణారావు గారూ, నమస్తే. ఈ మధ్య మీరు తఱచుగా కనిపించకపోవటానికి కారణం తెలిసింది. ఇప్పుడు మీరుంటున్నది హైదరాబాదే కనుక అక్కడికి ఎప్పుడైనా పనిమీద వచ్చినపుడు మనం కలుసుకోవటానికి వీలుపడుతుందను కుంటున్నాను. ఈ మధ్య విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం లోని తెలుగు పలుకుబడులను, నానుడులను నా నరసింహ బ్లాగులో ఉంచుతున్నాను.వీలైతే ఓసారి చూసి మీ అభిప్రాయం తెలియజేయండి.
please visit http://dhoommachara.blogspot.com for my new post
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.