అట్టి వారిలో ప్రముఖ కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు పంపిన కవితలో వారి హృదయాని చదువుదాం.
శ్రీ విరోధికి స్వాగతం. -
రచన:- శ్రీ బులుసు వేంకటేశ్వర్లు..
ఉ:-
స్వాగతమో ఉగాది! సరసాంతర వార్నిధి! తెల్గు నేల న
వ్యాగత పర్వమిట్లు నిలుపన్ చనుదెంచితివే! విరోధివై
ఈ గతి పేరు పెట్టుకొని యెవ్వరు వచ్చిరి మున్ను? యిట్టి నీ
ఆగమనమ్ములోని పరమార్థము తెల్లము కాదు మాకిటన్.
ఉ:-
స్వార్థతకున్ విరోధివయి సర్వ శుభమ్ములు కల్గ జూతువో
వ్యర్థతకున్ విరోధివయి వాస్తవముల్ గమనింప జేతువో
నిర్ధనతా విరోధివయి నిర్మల భాగ్యము లంద జేతువో
అర్థము కాక యున్నది నవాబ్దమ!నీ వరుదెంచు వైఖరిన్.
ఉ:-
ఎన్ని ఉగాదులేగినవొ యింతకు మున్ను.వసంత దీప్తిలో
క్రొన్ననలైన ఆశలకు క్రొత్త బలంబిడి జీవ యాత్రలో
మన్నన నిల్చినట్టి మధు మాసములైనవి కొన్ని మాత్రమే.
అన్న! త్వదీయ పాలన శుభాస్పద సంపద జూఱలిచ్చుతన్.
ఉ:-
ఆకులపాటు నొందిన వనావళి మ్రోడయి నిల్చునా? ప్రమో
దాకృతి క్రొంజివుళ్ళ నవతన్ భజయించదొ రేపు? చీకటుల్
ప్రాకట మోహనోదయములన్ మటుమాయము గావొ? గుండెలో
వేకువ నింపుకొన్న రస వేత్తకు నిత్యముగాది పండుగే.
మ:-
అళి గీతావళులందు కోకిల కుహూవ్యాజోక్తి మాలాముహు
ర్లలితాశాంతములందు పుష్ప మయ లీలా లక్ష్మి కందోయివె
ల్గులు పాఱాడిన చోటులన్ వలపు వాగుల్ సాగు తీరాన మొ
గ్గలు పూల్ - పూలు ఫలంబులై మధుర కాంక్షల్ తీర్చినన్ పండుగే.
గీ:-
ప్రతి యుగాదికి యెద పంచి పసిడి పళ్ళె
రమ్మునను ప్రేమ నర్ఘ్య పాద్యమ్ములొసగి
చింతలను వంతలను గోడు చెప్పుకొనుట
వార్షికమయ్యెనోయి నవాబ్ద మాకు.
గీ:-
తరువు పచ్చనోర్వని శైశిరము వోలె
పొరుగు పచ్చ నోర్వనియట్టి పరుష మతులు
కుటిల మార్గానుగతుల వ్యాకులత పెంచి
భగ్నముల జేయుచుండె సౌభాగ్య గరిమ.
ఉ:-
పచ్చని చెట్టుపై పిడుగు పైబడి కాల్చినయట్లు శాంతిని
ప్పచ్చరమైన మత్సరపు భావములన్ చెలరేగి క్రూరులై
పచ్చి ప్రశాంత భూమి నెఱపన్ నర మేధము లెన్నియెన్ని సం
పచ్చయ నందనమ్ములటు మాడినవో చిగురాకు మెత్తమై.
ఉ:-
శత్రువు వచ్చి నెత్తిపయి శస్త్రము పెట్టినయప్పుడే కృధా
పాత్రముగా నెదిర్చి రిపు భంజన సేయుట కాదు - ముందుగా
శాత్రవ వ్యూహముల్ గని అశాంతికి తావిడకుండు మార్గమే
మాత్రము చూడకున్న అణుమాత్రము నిల్కడ లేదు శాంతికిన్.
చ:-
చదువుల తల్లులై కదలు చక్కగ మా తెలుగింటి బాలికల్
చదువుకొనంగ స్వేచ్ఛ కొనసాగునొ! వారల ప్రేమ పిచ్చితో
బెదురులు పెట్టి ప్రాణములు వీడగ జేయు పిశాచ కర్మముల్
మది పరికించి యడ్డుకొనుమాయిక ! దుర్ జనతా విరోధివై.
సీ:-
విద్య వ్యాపారమై వేదన కలిగించు - సామాన్యునకునందు జాడ లేదు.
పరిహాస పాత్రమై ప్రాంతీయ భేదాలు - మనవారి విఖ్యాతి మంట గలిపె.
కొన యూపిరుల కొట్టుకొనుచుండె బడులలో - దేశ భాషలయందు తెలుగు లెస్స.
స్వస్థాన వేష భాషలపైన మమకార - మెట్లున్నదనిన చప్పట్ల కొఱకు.
గీ:-
తెలుగు పాదున పూచిన వెలుగు పూల
గుర్తిడెడు వారె లేనట్టి కొత్త జాతి
అవతరించినదోయి మా యాంధ్రమునను
చిర వసంతాతిథీ! చెప్ప చిత్రమగును.
ఉ:-
కన్నులు బైర్లు క్రమ్మెడు వికారములై నవ నాగరీక సం
ఛన్నములెన్ని వచ్చిన విజాతి కుసంస్కృతి యంటబోని మా
అన్నుల మిన్నలే గత మహాంధ్ర మహర్దశ నిల్పు - సంప్రదా
యోన్నతలైన మా తెలుగు యోషలు భూషలు జాతికెప్పుడున్.
మ:-
కటువై ఆమ్ల రుచిన్ వహించి పటు తిక్త స్వాదు మాధుర్య సం
ఘటనన్ పచ్చడి కాని పచ్చడిని లోకంబెల్ల చేసాచి యం
దుటలో జీవన యాత్రలోనిసుఖమున్ దుఃఖమ్మునున్ దాల్చు ను
త్కట ధీరత్వము చెప్ప వచ్చెదవుపాధ్యాయుండవై మిత్రమా!
చ:-
పరహిత బుద్ధి నాటుకొని భావములందున భూతలమ్ములో
నరులు చరించుదాక యొకనాటికి పండుగ రాదు - సృష్టిలో
వరములు శాపమౌటకు నివారణ లేదు. సుఖేచ్ఛ యొక్కటే
సరియగు దారి కాదని ప్రజాతతికీవె వచింపగావలెన్.
చ:-
పిక శుక భృంగ శారికల పిల్పులు పూవున పూవునన్ మరం
దక మధు నిర్ఝరుల్ చిగురునన్ నవరత్న చిరత్న కాంతులున్
ప్రకటములౌ ముహూర్తమిది రమ్ము నవాబ్దమ! ఆకు పచ్చ సం
తకము లొనర్చి క్రొత్త అవతారముతో అధికార ముద్రతో.!!
చూచారు కదా! ఎంతమనోహర దివ్య భావ గంభీరమో వారి రచన.
కొసమెరుపు గమనించారా?
దీని లోని ఆంతర్యం మీకర్థమైందా?
ఈ కవి వతంసునకు జిల్లా పరిషదున్నత పాఠశాల ప్రథానోపాధ్యాయ పదవి వరించడం మూలంగా ఆకుపచ్చ సంతకం అధికారముద్ర లభించాయి.
సు కవుల రచనలలో సమకాలీన స్థితిగతులను, వారి పరిస్థితులను కూడా మనం గ్రహించ వచ్చనడానికిదొక నిదర్శనం.
మరొక పర్యాయం మరొక కవి కవితాగానాన్ని పరికిద్దాం.
జైహింద్.
Print this post
2 comments:
ఎంత కమ్మగా ఉన్నాయండి. ఉగాది రాకమునుపే విందు మాత్రం సిద్ధమయిపోయింది.
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి నా నమస్కారములు తెలుపగలరు. వారిని గూర్చి గరికపాటి వారు తరతరాల తెలుగు పద్యం లో మెచ్చుకోలుగా చెప్పినారు..
... చలకాలం మీద వారి పద్యం కూడా చెప్పినారు..
కడుపులో ఉన్న బిడ్డ తప్ప అందరూ వణుకు తున్నారని.. ..
ఒక్క మంటనుతప్పితే మిగతా అన్నిమంటలనూ మెచ్చుకుంటున్నారని...
అపుడు మొదట తెలిసినది, ఇపుడు మరలా పచ్చ సంతకం చూస్తున్నాను
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.