గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2025, సోమవారం

రమాలలామ శతకము..... రచన... చింతా రామకృష్ణారావు.

0 comments

 ఓం శివాయ నమః

రమాలలామ శతకము

07 . 04 . 2021 వ తేదీన ఉదయం 11 గంటలకు పరమపదించిన

నా రెండవ మరదలు శ్రీమతి సింహంభట్ల రమాదేవికి

నా నివాళి.

చింతా రామకృష్ణారావు.

రమాలలామ శతకము.

తే.గీ.  శ్రీ రమాదేవి పుట్టిల్లు శ్రీకరమగు

పైడిపిల్లి, పిఠాపుర వాసి, తల్లి

మహిత వేంకటలక్ష్మి, రామజనకు సుత,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  1.


తే.గీ.  వినుతులందుచు భువిపైన వెలుగు నాదు 

జీవితేశ్వరి విజయకు చిత్తమందు 

మెలగు రెండవ చెల్లె లమలిన హృదయ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  2


తే.గీ.  తనకు చిన్నక్క రత్నము, ధర్మనిరత,

చెల్లెలౌ లలితనిల పెంచె లలితముగ

రామలక్ష్మి, దేవిగనయి రాణగాంచె

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  3.


తే.గీ. ఉదయలక్ష్మి యన్ బినతల్లి ముదముతోడ

నీమె ననుపమ రీతిగా ప్రేమతోడ

పెంచె చిననాటి నుండియు విజ్ఞత కని,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  4.


తే.గీ.  రామకృష్ణాఖ్యునయిన నా ప్రాణ సఖికి

చెల్లెలయి నాకు కూతురై చెలగెఁ బ్రీతి

నాదు వడిలోన మెలిగెడి నయ గుణాఢ్య

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  5.


తే.గీ. పిన్నగా నున్న వేళనే పేరు గాంచె

కన్నతల్లి యీ జగతికే, కనులపంట

లోకమునకంచు, సద్గుణ లోల యగుచు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  6.


తే.గీ.  చదువె బీ.యేను, జగతినే చదివె నీమె,

సదయ సన్నుత హృదయ యీ సత్ స్వరూపి,

మిత్రులందున నీమెయే మేలుబంతి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  7.


తే.గీ.  చచ్చి బ్రతికెను చిననాడు, జగతి కొఱకె

బ్రతుక చేసెను దైవమీ వనితనపుడు,

నాడు యముని జయించిన నయ నిధాన,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  8.


తే.గీ.  శత్రు షట్కము లేనట్టి సన్నుత మతి,

మిత్రవర్గమునకు నిల మేలు చేసి

వారి హృదయముల్ గొన్నట్టి వారిజాక్షి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  9


తే.గీ.  బంధువులయెడ ప్రీతిని వరలు వనిత,

కందు నామెకు మది ప్రజ కలతలఁ గని,

మందమందస్మితోద్భాస మహిత ముఖియు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  10.


తే.గీ.  తలచి చూడగ తానుదార చరిత,

లోకమే తన బంధువు, శ్రీకరమగు 

భావనలతోడ నొప్పెడి భవ్య చరిత,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  11


తే.గీ.  వర్ణ భేదము లెఱుగదు ప్రగతి శీల,

మతము నెన్నదు, తన యభిమతమునరయ

లోక కల్యాణకర కృషిలో రహింపు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  12.


తే.గీ.  లోచనంబులఁ బ్రగతి యాలోచనములె

మనకుఁ గనిపించు నామెను మనము చూడ,

నిరుపమానంద సామ్రాజ్ఞి, పరిణత మతి, 

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  13.


తే.గీ.  ధరణి సింహముభట్ల సుదర్శనునికి

సతిగ చేరిన దాదిగా నతులిత గతి

పూర్ణ సహకారమందించె పుణ్య రాశి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  14.


తే.గీ.  కలహమెన్నడున్ లేనట్టి కాపురమది,

సహన సౌశీల్యములతోడ సన్నుతముగ

పతికి మదిలోన మెలగుఛు పరవశించు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  15.


తే.గీ.  శ్రావణీ ప్రియాంకలు తమ చక్షువులన

కలిగిరిద్దరు కొమరితల్ వెలయఁ జేయ 

వీరి సత్కీర్తి జగతిలో విస్తృతముగ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  16.


తే.గీ. భర్త యాదర్శజీవనస్ఫూర్తిని గొని

భార్యగా తాను తన్మార్గవర్తిగనయి

జయ పథంబున పతినుంచె భయవిదూర,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  17.


తే.గీ.  సత్ పథంబున కూతులన్ సరిగ నడిపి

వారి కాదర్శ జీవన కారిగనయి

కీర్తి చంద్రికల్ విరియించె కృషి యొనర్చి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  18.


తే.గీ.  ధర ప్రజాపత్రికను తాను వరల నడుప

కంకణము కట్టుకొని, గొప్ప గణుతిఁ గాంచ

విఘ్నమే లేని విధముగ ప్రీతి నడిపె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  19.


తే.గీ.  భర్త యాదర్శ జీవన ప్రమిదలోన

చమురుగా మారి వెలుగులు సంతసముగ

పంచె జగతికి, లోకాన మంచి నిలిపె, 

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  20.


తే.గీ.  స్వార్థమన్నది లేనట్టి సదయ హృదయ,

నిత్య దారిద్ర్యమున క్రుంగు భత్య రహితు

లకిల సహకారమందించు  లక్ష్మి కనగ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  21.


తే.గీ.  పెట్టుటే కాని యనబోదు పెట్టితినని,

కట్టు బట్టలన్ సహితము కరుణ తోడ

పేదవారలకందించు పెద్ద మనసు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  22.


తే.గీ.  పరుల కష్టముల్ గాంచిన కరిగిపోవు

జాలి గుండెతో చింతించు సదయ హృదయ,

తనకు కలిగినదిచ్చుచు దయను కాచు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  23.


తే.గీ.  మతముతో పని లేదదే మతము తనది,

మానవత్వమే మతముగా మదిని తలచి

సేవ చేసెడి జనయిత్రి, జీవితమున

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  24.


తే.గీ.  పిల్లలకు వండి వడ్డించు వేళనయిన

పరులు కోరిన వారికిఁ బంచిపెట్టు

పిదప పిల్లలకును వండు ప్రీతితోడ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  25.


తే.గీ.  అతిథి సత్కారమును చేయు యతివలందు

నగ్రగణ్యగా చెప్పుదు రతిథులెల్ల

పూర్వపుణ్యంపు ఫలమీమె పుడమికరయ

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  26.


తే.గీ. ఎఱుగ సహధర్మచారిణి, హృదయమందు

భర్త భావన గ్రహియించి వరలఁ జేయు,

పతికి తగినట్ట్లు నడచెడి సతి, కనంగ 

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  27.


తే.గీ.  ప్రకృతి మాత రమను గాంచి పరవశింప

మ్రొక్కలను పెంచు ప్రేమగా, చక్కఁదనము

నొప్పు ప్రకృతియే రమ యన నుత్సుకముగ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  28.


తే.గీ.  పేద విద్యార్థులకు సొమ్ము మోదమునను

తానె చెల్లించి చదివించు దయను చూపి,

పేదలకునీమె దైవమే వినిన తెలియు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  29.


తే.గీ.  స్నేహితులపట్ల ప్రేమయే నిరుపమముగ

నందఁ  జేయుచు ప్రీతితో ననితర గతి

పొంగి సంతసంబును పొందు పొణ్యమూర్తి.

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  30.


తే.గీ.  ఉన్నవారలనొప్పించి యుత్సహముగ

లేనివారలకిప్పించు జ్ఞాని యీమె

చదువు కొనసాగ నిప్పించు సన్నుత మతి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  31.


తే.గీ.  వంట చేయును గొప్పగానింటిలోన,,

పలువురికి పెట్టు తనయింటివంట సతము,

వరలె నన్నపూర్ణే యన వసుధపైన

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  32.


తే.గీ.  పచ్చడులు పెట్టుటందునన్ ఖచ్చితముగ

సాటి లేరనన్ జేసెడి మేటి యీమె,

యూరగాయలన్ బరులకు నొసగు సుగుణ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  33.


తే.గీ.  తన కుటుంబముతోడ యాత్రలను చేయ

నుత్సహించుచు చేసె ననుపమముగను

పెక్కు యాత్రలు భువిపైన ప్రీతి తోడ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  34.


తే.గీ.  కాశికాపురి చూచి లోకమునె చదివె,

వరలు రామేశ్వరము గాంచె, ప్రకృతిలోని

మర్మమెఱిఁగనీ యిల్లాలు, మాన్య చరిత,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  35.


తే.గీ.  కనిరి కాశ్మీరు, డార్జ్లింగు జ్ఞానమంద

కనిరి యూటీని పతితోడ ఘనతరమగు

చూడఁ దగినట్టి వెల్లను జూచినారు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  36.


తే.గీ.  ఆర్థిక క్రమ శిక్షణ నర్థితోడ

నేర్వవలెనీమెనుండియే నేర్పు కనగ,

వ్యర్థమైనట్టి ఖర్చులా యసలు లేవు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  37.


తే.గీ.  అక్షరంబగు సత్యమీయమ్మ, నిజము,

సతము వ్యయమునాదాయమున్ మతిని నిలిపి

వ్రాయు పుస్తకమందున వాసిగాను,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  38.


తే.గీ.  ఆత్మయు ననాత్మ నెఱుగదీ యనుపమ రమ,

గనుచునాత్మీయులుగ నందరిని జగాన,

యింతకన్నను పరమార్థమేమియుండు?

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  39.


తే.గీ.  బంధుజనులను సతతంబు పరవశింపఁ

జేయుచుండును మాటలన్ జేతల నిల,

మాయయును మర్మ మెఱుగని మహిళ యీమె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  40.


తే.గీ.  తనను ద్వేషించినను గాని తాను ప్రేమ 

చూపు చుండును వారిపై కోపగించ

నేర్వదెప్పుడున్, మెచ్చగ సర్వజగతి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  41.


తే.గీ.  కోపమెఱుగదు తనలోని లోపములను

తెలుసుకొనుచుండి మారును తీరుగాను,

లోపమే లేని తనలోన కోపమున్నె?

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  42.


తే.గీ.  బ్రహ్మ జిజ్ఞాసనెఱుగదు, భక్తి కలదు

ప్రజలపైననుపేదలపైన కనగ

లోక సుజ్ఞాన కాంక్ష లోలోన కలుగు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  43.


తే.గీ.  క్రొత్తవారైన గాని తా కూర్మితోడ

పలుకరించుచు సేవించు కలుష రహిత,

సులలితాత్మగా భువిపైన శోభగాంచె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  44.


తే.గీ.  సహనమున ధాత్రియే కన సన్నుతాంగి,

యిహమె పరమని తలచుచు నహరహంబు

శ్రమకు నోర్చుచు సేవించు జగతి జనుల,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  45.


తే.గీ.  పరిసరంబుల శుభ్రత నిరుపమముగ

చేయుచుండును నిరతంబు చేవఁ జూపి,

శుభ్ర సంపూర్ణ చిత్త సంశోభితయగు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  46.


తే.గీ.  గృహమునే చూడ గృహలక్ష్మి కీర్తి తెలియు

నిత్య సంశోభితమ్ముగా ముత్యమటుల

గృహమునే సర్దుకొనెడిదీ గృహిణి సతము,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  47.


తే.గీ.  పిల్లలను పెంచు వేళలో ప్రేమతోడ

మిత్రురాలుగ మెలగెడు మేల్మి పసిడి,

వారి మనసులు గెలిచిన వారిజాక్షి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  48.


తే.గీ.  పతికి కష్టంబు కలిగిన పరితపించు

చీమ కుట్టినన్ దాళదు, ప్రేమతోడ

బాధ తగ్గింప యత్నించు భవ్య చరిత,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  49.


తే.గీ.  భర్తకే కాదు కష్టంబు పరులకైన

తానె తల్లడమందును తనకె కష్ట

కాలమ్మన్నట్లు కన్నీరు కార్చుచుండు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  50.


తే.గీ.  గ్రంథపఠనమందాసక్తి కలిగి యీమె

పెక్కు గ్రంథముల్ చదివెను మిక్కుటమగు

జ్ఞాన ధనము సంపాదించె కన్నతల్లి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  51.


తే.గీ.  కని ప్రహేళికల్ (ఫజిల్స్) ముడివిప్పు ఘనతరముగ,

జ్ఞాని, మేధస్సు పాదరసంబు కనగ

నబ్బురంబగు చూచిననందరికిని,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  52.


తే.గీ.  (వీడియో గేమ్సులో) జాల కేళిలో మేటి యీ జ్ఝాన తేజ,

పాడ లేక తా పాడించు పరుల చేత

పరులకుత్సాహమును గొల్పు పాడునపుడు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  53.


తే.గీ.  మేటి, పేకాటలో తాను వాటి లోని

మంచినే చూపు, నైపుణ్యమెంచి చూపు,

నీమెకన్నిటనరయంగ నీమె సాటి

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  54.


తే.గీ.  కాంచ చదరంగమున మేటి కానరారు

ఘనముగా నీమె నోడించు ఘనులనైన,

నింత నిపుణత నొప్పు నీ యిందువదన,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  55.


తే.గీ.  తాను సంతోషముగనుండు, ధాత్రి జనుల

నిత్య సంతోషముగనుండ నిరుపమగతి

కోరి సంతోషమున్ గొల్పు కూర్మితోడ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  56.


తే.గీ.  వృద్ధులకునాశ్రయంబును ప్రీతిఁ గొలుప

యత్నముండియు తీరలేదమలినకిల

మృత్యుదేవత గొనిపోవ మిన్నుఁ జేరె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  57.


తే.గీ.  ఆభరణముల పైన నేయాస లేదు,

శోభ మనిషికి గుణమని చూపెనీమె,

జ్ఞాన గుణ శోభశోభిత కమలనయన,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  58.


తే.గీ.  తృప్తి పడులక్షణంబును తెలిపెనీమె

నిత్యసంతోషి తృప్తుఁడే నిరుపముడని

తాను తృప్తినొందుచు పరుల్ తనియ మప్పె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  59.


తే.గీ.  వ్యయము మితముగ నున్నచో భయవిదూర

జీవనంబును గడపుట శ్రీకరమని

వ్యర్థమగు వ్యయమణచెను భవ్యముగను,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  60.


తే.గీ.  భేషజములేని సన్మూర్తి విస్తృతమగు

సేవలందించుచుండియు, చిత్స్వరూప,

పొగడ చిఱునవ్వు చిందించు, ద్విగుణితముగ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  61.


తే.గీ.  నమ్మునందరిన్ మదిలోన, నయము తప్పి

మెలగు కుజనుల కడ చేరి మేలుగూర్చు

వర్తనంబును తెలుపెడి భవ్య భావ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  62.


తే.గీ.  తండ్రి నుండి తా బడసిన తత్వమిదియె

చేయుటుపకారమెప్పుడున్ జేవఁ జూపి

దుష్టులకునైన భువిపైన కష్టమనక,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  63.


తే.గీ.  మానవత్వ నిర్వచనమీ మానవతియె,

జ్ఞానమే రూపముగనైన్న కంబుకంఠి,

ధీనిధానమె రమణిగా దీపితమగు

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  64.


తే.గీ.  తప్పు చేయదు, చేసినన్ దప్పు పరులు

నచ్చచెప్పుచు వారించు, మెచ్చుచుండ

పరులలో మంచి, భువిపైన పరమ సాధ్వి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  65.


తే.గీ.  ధరణి కొరగాని వేళలో దారి తప్పి

భుక్తి కోరుచు వచ్చినన్ భక్తితోడ

వండి వడ్డించు వారికి పరమ సాధ్వి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  66.


తే.గీ.  భర్త చీకాకుగా నుండి వదరడెపుడు,

వదరినన్ గోపమొందదు బాధ నెఱిగి

బాపి, యోదార్చునతనిని కోపమణచి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  67.


తే.గీ.  కూలి చేయగ వచ్చిన, జాలి చూపి

కన్న తల్లినాఁ గృప జూపి కడుపు నిండ

భోజనము పెట్టునీ యన్న పూర్ణ తనియ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  68.


తే.గీ.  చుట్టపక్కములొచ్చినన్ చూపి వారి

మంచి వర్ణించి చెప్పు సన్మాన్యులకును,

దొడ్డ గుణముల సుగుణాల బిడ్డ యీమె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  69.


తే.గీ.  మూర్ఖ విశ్వాసములు లేని పూజ్యురాలు

మూఢతత్వంబులను బాప గాఢ మైన

యత్నమును చేయు, వెలయించి నూత్న సుగతి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  70.


తే.గీ.  పలువురికి సేవ చేయుట వరమటంచు

చేరవచ్చిన వారికి చెప్పి, చేయు,

చేయఁ జేయుచు, మహనీయ సేవ నిలను,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  71.


తే.గీ.  శాస్త్రవిజ్ఞానమదియేల? చక్కనైన

భక్తితోఁ బ్రజన్ సేవించు భావమున్న,

దేవి కున్నట్టి గుణ మదే, దివ్య చరిత

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  72.


తే.గీ.  పలుకరించుటలో హాయి పంచునీమె,

కనికరించుటలో గొప్ప కల్పవల్లి,

యినుమడించుత మనలకునిట్టి గుణము

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  73.


తే.గీ.  మనిషి జీవించియుండినన్, చనిన గాని

దేహ మితరులసేవకు దేవి నిలిపె,

మృతికి పూర్వమే కనులిచ్చె మేలటంచు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  74.


తే.గీ.  వైద్యవిద్యార్థులకు తాను భక్తి నొసగె

తనదు దేహంబు పూర్వమే ఘనతరముగ,

మోక్షమదియున్న రాకున్నె పూజ్య రమకు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  75.


తే.గీ.  రోగికిచ్చి ప్రియాంక శిరోజములను

బాహ్యసౌందర్యహీనకాన్ బాధపడక

పొంగె నీ తల్లి గని సుతన్ పూజ్యవనుచు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  76.


తే.గీ.  జీవనాధారమైనట్టి జీతమెల్ల

భర్త తనకీయ వెచ్చించు పరుల కొఱకు

కష్టములు బాప వారికి కరుణ తోడ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  77.


తే.గీ.  ఆడపడచు తా భర్తతో నమర యింట 

తిష్ట వేసినన్ బోషీంచె కష్టమనక,

యింగితజ్ఞాన హీనులకిదియె సుఖము,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  78.


తే.గీ.  తిట్టుచున్ననునేమియు పట్టనట్లు

తాను సర్దుకొనుచు పోవు దయను రమయు 

నాడపడచు నేమనలేక, యడరెనయ్యొ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  79.


తే.గీ.  ఎన్ని బాధలు పడినదో యింటిలోన

బంధువులపోటు మాటలన్ పాపమీమె,

భర్తకెన్నడు చెప్పదు పరువునెంచి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  80.


తే.గీ.  భవ్యమైనట్టి యా ప్రజా పత్రిక నిల

నడుప చేపట్టి మిగుల సుజ్ఞాన మొప్ప

నిర్వహించెను రేబవల్ నిత్యమీమె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  81.


తే.గీ.  వీధిలోనున్న పేదలన్ బ్రీతితోడ 

చేరదీయుచి మప్పుచు చిత్తమలర

బ్రతుకు మార్గము, వారలు వరలిరట్లు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  82.


తే.గీ.  ప్రస్తుతము రాజమండ్రిలో ప్రబలు ఘనుల

నెన్ని సత్కృల్ చేసి రహింపఁ జేయు

సంస్కృతీప్రభనొప్పిన సద్వరేణ్య,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  83.


తే.గీ.  ఘనులనేకులు మార్మూలలను వెలుంగ

వారి ప్రఖ్యాతి నెన్నుచు భవ్యముగను

పత్రికన్ వ్రాసి లోకాన వరలఁ జేసె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  84.


తే.గీ.  సేద తీర్చుటయే కాని సేదతీర

కోరనట్టి మహా సాధ్వి, కూలె భువిని

శాశ్వితమ్ముగ నిదురించె సడియె లేక, 

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  85.


తే.గీ.  బావగారండి రండని పరవశమున

పలుకరించెడి మరదలు వాలె భువిని,

ప్రేమతో నన్ను పిలిచెడి పిచ్చి తల్లి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  86.


తే.గీ.  చెల్లెలను చూచి పొంగెడి చిట్టితల్లి,

దివికినేగగ లల్లీ మదిన్ కలంగి

యేడ్చుచేడ్చుచుక్రుంగె, హా! యేమనందు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  87.


తే.గీ.  మొదటి ముద్దను భర్త తా ముందు తనకె

యిచ్చుటలవాటు యిప్పుడట్లీయ జూచి

దుఃఖమున కూరు నాభర్త తోడు వీడ,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  88.


తే.గీ.  శ్రావణీప్రియ లీతల్లి చనగ దివికి

కానరమ్మంచు పిలుతు రీ కాంతనెంచి

యెంత యేడ్చిన ఫలము రవ్వంత లేదు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  89.


తే.గీ.  తిండి మానిరి యేడ్చుచునుండిరమ్మ

నీదు భర్తయు పిల్లలున్ నీవురమ్మ

టంచు పిలిచితి పిచ్చిగా నంగలార్చి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  90.


తే.గీ.  రెండువేలిరువదొకటి, మండుటేండ,

ఏప్రెలేడవ తేదీనె యీమె దివికి

నేగె పదకొండుకే పగల్, వేగలేక,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  91.


తే.గీ.  నాదు జననికపరకర్మ నయముతోడ

చేయుచున్నట్టి వేళలో చేదు వార్త

నేను విజయయు వింటిమి దీనముగను, 

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  92.


తే.గీ.  వైద్య లోపంబు జరిగెనా వైద్యులపుడు

శ్రద్ధ చేయక చంపి రశ్రద్ధ మ్రింగె

మా రమాలలామను, విధి మాయ చేసె,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  93.


తే.గీ.  చిఱుత ప్రాయముదాటని చిన్నదీమె,

మృత్యువెట్టులు మ్రింగెనో, మిధ్యలోన

బ్రతుకు వారికి తప్పదీ బ్రహ్మ వ్రాత,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  94.


తే.గీ.  కంటిపాప లా యంధుల కంటికమరె, 

దేహవిజ్ఞాన బోధకై దేహమమరె,

ప్రాణమొక్క టే ప్రాంతాన వరలునొ కద?

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  95.


తే.గీ.  ఈ రమాదేవి సత్స్ఫూర్తి యెందరికిల

వంటబట్టునో చూతము, ప్రజలలోన

సేవ చేసెడి బాధ్యత చేరుగాక,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  96.


తే.గీ.  ఇల సుదర్శన హృదయాన మెలగును రమ,

నిత్యమున్ స్ఫూర్తిగొలుపుచు నిలుపునతని,

ప్రజల సేవకై పురికొల్పునిజము నిలుపు,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  97.


తే.గీ.  స్ఫూర్తిదాయి రమాదేవి కీర్తి దిశల

వెలుగుచుండును ప్రజలలో మెలగునీమె,

దైవ మెవ్వరు? వీరలే దైవమిలను  

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  98.


తే.గీ.  ఈమె వాగ్ధాటి, నిపుణత, ప్రేమ జ్ఞాన

మమరుగావుత సుతలకు ననుపమమగు

శ్రీ రమాదేవికే కీర్తి చేర్చ దిశల

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  99.


తే.గీ.  శ్రీ ప్రజాపత్రికను జనుల్ చేతఁ బట్టి

చదువునప్పుడీ దేవియే, మెదలు మదుల,

శాంతితోదివి మెలగునీ శాంతమూర్తి,

మాన్య గుణ గణ్య భువిని రమాలలామ..  100. 

ఓమ్ శాంతిః, శాంతిః, శాంతిః.

అంకితము.

శ్రీ రమాసాధ్వికిన్, శాస్త్రి చిత్తమందు

వెలుగు దేవికి, శ్రావణీప్రియల జనని

కి విజయ సహోదరికి నాదు కృతినొసంగి 

ధన్యుతనుపొంది వరలెద ధరణిపైన.


చింతా రామకృష్ణారవు. 07 . 4 . 2021.


"యువత-భవిత" .... రచన... చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్.

 శ్రీరస్తు               శుభమస్తు               అవిఘ్నమస్తు

"యువత-భవిత"

౧.శా.  శ్రీమన్మంగళ భారతావని సదా శ్రేయోభిరామమ్ముగా

భూమిన్ వెల్గఁగ హేతు వీ యువత, తా పూజ్యప్రవృత్తిన్ లసత్

ప్రేమోదారసుధాస్రవంతియన సద్విఖ్యాతితో సృష్టిలో

క్షేమంబున్ సహవాసులన్ గనెడి సచ్ఛ్రీమార్గమందొప్పుతన్.  


౨.చ.  యువత శుభాస్పదంబయిన నుజ్వల దివ్యమనోజ్ఞమైన సద్

భవితను గాంచనెంచవలె, వర్ధిలు మార్గము లెంచి, యుక్తమౌ

ప్రవర పథంబులో నడచి, భద్రతనొప్పెడి భావి నిప్పుడే

కువలయమందు నెంచుకొని కోరిన రీతి గ్రహింగాఁదగున్.


౩.ఉ.  బాల్యమునుండి పిల్లలకు భక్తియు, యుక్తియు, శక్తిఁ గొల్పుచున్,

లౌల్యము చేరనీక మదులన్ స్థిరనిర్ణయమొప్ప నేర్పు చా

కుల్యత లేని గొప్ప కుదురైన మనంబును కల్గఁ జేసి, ప్రా

బల్యము పెంపు చేసుకొను పాఠములన్ వచియింప యుక్తమౌన్.


౪.శా.  స్వాధీనుండయి, నిశ్చితాత్ముఁడగుచున్ సంపాదనా శక్తి తా

మేధా శక్తిని పొంది, సంఘమునకున్ మేల్జేయు సుజ్ఞానిగా

బోధన్ గొల్పు విధంబుగా నడచుచున్ పూజ్యుండటంచంతటన్

సాధింపన్ వలె, కీర్తి నట్టి ఘనుఁడే సాధించునౌన్నత్యమున్.


౫.మ.  పిననాడే పర సంపదన్ బ్రతుకుటన్, వేధించి సాధించుటన్,

గొనుటన్ పేదల సొమ్మునూరకనె, సాకుల్ జెప్పుచున్ కాలయా

పనమున్ జేయుట, నేరనట్టి గతిలో పాఠంబులన్ జెప్పుచో

మన నేర్చున్ తన కాళ్ళపై యువత క్షేమంబొప్పగా భావిలోన్.   


౬.చ.  ఉచితము లొందుచుండుటను నోపరు కష్టము చేయనెవ్వరున్,

సుచరితులై స్వతంత్రముగ శోభిలఁ జాలరు బద్ధకస్తులై,

పచనము చేసిపెట్టునెడ వండుటకేల మనంబు వచ్చు? సా

గుచునిటులుండ, భావిని యగోచరమంచు గ్రహింపనెట్టులౌన్?


౭.చ.  చదువులు నేర్పునప్పు డటు సంపద గూర్చు స్వశక్తి గొల్పగా

మదికినినెక్కు పాఠములు మన్ననతో వివరింపగావలెన్,

పదునగు మేధఁ గొల్పవలె భాగ్యము సృష్టిని చేయునట్లుగన్,

పదువురి కో యుపాధినిడు భావన పెంచిన వర్ధమానుఁడౌన్.


౮.మత్త.  వృత్తివిద్యల శిక్షణంబిడ పృథ్విపైనెటనుండినన్

జిత్తశుద్ధిని సంపదల్ గని క్షేమమొప్పఁగ జీవనం

బెత్తరిన్ సుఖమొప్పగా నడిపింపగానగు శక్తితోన్,

మత్తువీడిన శక్తియే వరమౌ ధరన్ యువతాకృతిన్.  


౯.చ.  యువతకుఁ గొల్ప సద్భవిత నొప్పుగ ధర్మ విశుద్ధ చిత్తులై,

కువలయమందుఁ జూచి యనుకూల పరిశ్రమలన్ రచించుచున్,

ప్రవిమల శిక్షణంబులిడి, భావిని మేలుగ వాడు వస్తువుల్ 

ప్రవరముగా సృజించునటు భవ్యముగా నొనరింపగా వలెన్.


౧౦.ఉ.  భిక్షకు చేయి చాపుటను, భీరువుగా తలయొంచి యుండుటన్,

రాక్షసబుద్ధి నుంటను, భరంబుగనన్యులపైన మన్కి, స

ల్లక్షణ దూర వర్తనము లక్ష్యముతో నెడబాపి, చక్కనౌ

శిక్షణ నీయగా వలెను చిన్నతనంబునే శుభార్థులై.


౧౧.శా.  నిర్లిప్తంబగు జీవనంబు విడుచున్, నిస్తంద్రతన్ మెల్గుచున్,

స్వర్లోకాద్భుత హర్మ్య భర్మముల త్రోవన్ వీడి స్వప్నంబులన్

దోర్లీలన్ సృజియించు వాని గనుచున్, దుర్నీతులన్ వీడుచున్,

స్వర్లోకంబుగ భారతావనిని ధ్యాసన్ జేయుతన్ ధీనిధుల్.


౧౨.గుప్త పంచమ పాద గోమూత్రికాబంధ ఉత్పలమాల.

భావంబందలి వెల్గు నేర్పు నుత సేవాసక్తి, నుత్పాద్యతన్,

భావిన్ భారతి వెల్గు నీ యువత సేవన్ భాతి నత్యున్నతి(న్),

న్భావ స్వేచ్ఛ, గణింపుచున్ యువత లోనన్ యోగ్య  సంపత్ప్రభన్

భావిన్ స్వచ్ఛత తోడ వెల్గు వసుధన్ భాసింప సంస్కారముల్.


౧౩.అనేక ద్వివిధ కంద గీత గర్భ చంపక మాల.

వర నుతమేదినిన్ నిధుల భారత దేశము నిండుకుండరా,

పర హితమౌశుభాకరము భక్తితరంగపు కల్పవల్లి, ధీ

వర ధృతిచేతనే యువత భాగ్య తలంబిది యుచ్ఛఁ గొల్పుగా,

పర గతియౌమహా సుగతి భారతి భావికి శోభఁ గూర్చురా!


౧౪. శివలింగ బంధ భావ గోపనచిత్ర ఉత్పలమాల. 

శ్రీయుత భావ! భారత ప్రసిద్ధి  నృపాలకులంతరాత్మలన్

జేయఁగ నౌను చింతనను, చేసి యపార మహార్తి బాధితుల్

మాయ,కొలాలు చూపుచును మాడు జనంబుల ప్రేమ వీడరా

దేయని దేహియంచననిదీనులె యుండని తీరు నేలుతన్.


౧౫.శుద్ధ నిరోష్ట్య తేటగీతి(ఉ ఊ ఒ ఓ ప ఫ బ భ మ వ/వర్ణ నిషేధము)

తైజ సాకృతి నెనలేని ధారణ, నిజ

శక్తి నెన్నగ తనరిట చాలినంత

కీర్తి గని, జననేతలీ క్షితిని సహజ

శ్రీశ! కాంతిని దనరిన శ్రీనిధిదియె.


౧౬.మణిప్రవాళ మాలిని.

యువత భవిత దేఖో, యుద్ధతే నాఽస్తి కించిత్, 

ప్రవణ గరిమ గ్రేటే, వర్ధనంబెన్న డౌటే,

నవత గనఁగ ఫారన్ నప్పునంచున్ చలంతి,

ప్రవరవరులు, హేరామ్! వారలన్ గావు మాల్వేజ్!


౧౭.శ్రీచక్రబంధ తేటగీతి.

కనఁగ మీశక్తి శ్రీమాత కాంతి చేత,

లక్ష్యమీడేరు సుశ్రీ యువాళి బ్రతుక,

సిరుల భారతీ శ్రీమాత మిమ్ము బ్రోచు,

కమల వాసిని తప్పక కాంచునింక.


౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము. 

(గుఱ్ఱపుటెత్తులలో వచ్చు పదములు యువతకు - భవితను - ప్రజలిల - కొలుపుత,)


జననుత ప్రభువులు యువతకు 

ఘనమగు ధృతియు నిలుపుత, సుకర వర! కొలువుల్

ఘన తకు సులలితముగ మన 

ను నిజ బృతికి భవితకు ప్రభను గొనవలెనిలన్.


౧౯.చ.  త్రికరణ శుద్ధితో యువత ప్రేమను కోరెడి పాలకోత్తముల్

ప్రకటనలిచ్చుచుండవలె భన్యపు జీవన వృత్తులిచ్చుటన్,

ముకుళిత హస్తులై విధులు పొంది మహత్తర సేవఁ జేయుచున్

సకలజగంబునన్ యువత చక్కగ కీర్తిని పొందగా వలెన్.


౨౦.ఉ.  మంగళమౌత భారతికి, మంగళమౌ యువసజ్జనాళికిన్,

మంగళమౌత శాంభవికి, మంగళమౌగురుదేవపాళికిన్,

మంగళమౌత సత్కవుల మంగళ సత్కవితాసుధారకున్,

మంగళమౌత మీకు, పరమాత్మునకెల్లెడమంగళంబగున్.

స్వస్తి.

చిత్ర బంధ పద్యముల వివరణ.


14 శివలింగబంధ ఉత్పలమాల.
౧౭.శ్రీచక్రబంధ తేటగీతి.

౧౮.చ`తురంగ స్వస్తిక్ బంధ లఘు కందము.
(గుఱ్ఱపుటెత్తులలో వచ్చు పదములు యువతకు - భవితను - ప్రజలిల - కొలుపుత)
ఓం శ్రీమాత్రే నమః.
స్వస్తి.
జైహింద్.

శ్రీ షిరిడీశ దేవ శతకము రచన:- చింతా రామ కృష్ణా రావు

0 comments

 శ్రీ షిరిడీశ దేవ శతకము

రచన:- చింతా రామ కృష్ణా రావు


పండితాభిప్రాయములు.

అభివందనం

 శ్రీ షిరిడీశదేవశతకముపై సమీక్ష.

డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ, M.A.; M.Phil., Ph.D.;

ప్రశాంతి నిలయం,

పాయకరావుపేట.

       ఆధునికాంధ్ర వాఙ్మయం అనేక ప్రక్రియలతో శాఖోపశాఖలుగా విస్త్రుతమైనప్పటికీ శతక ప్రక్రియ మాత్రం అప్పుడూ యిప్పుడూ నవనవోన్మేషమై తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. తాను నమ్మిన దైవాన్ని గాని, వ్యక్తిని గాని, లేదా తన ఆత్మను గాని స్తుతిస్తూ స్వాభిప్రాయాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే స్వేచ్ఛ శతక రచయితకుంటుంది.

       ఇటీవలి కాలంలో శ్రీ చింతా రామ కృష్ణా రావు కవి వర్యుల కలం నుండి జాలువారిన" శ్రీ షిరిడీశ దేవ శతకం " ఒక ఉత్తమ రచనగా శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వంటి కవి పండితులచే ప్రశంసలందుకుని ఆంధ్ర లోకాన్నిఆకట్టుకుంటోంది. భక్తి రస ప్రథానమైన యిటువంటి ఆర్షసాహితీ మరందాన్ని ఆస్వాదించే భాగ్యం ఆంధ్ర లోకానికి కలిగించినందుకు శ్రీ రామకృష్ణాగ్రజులకు కృతజ్ఞతాభివందనలు సవినయంగా తెలుపుకుంటున్నాను.

       నేటి కాలంలో భారతీయుల్ని ఆకట్టుకున్న దైవం షిరిడీశుడంటే అత్యుక్తి కాదేమో. సర్వ దేవతాతీత స్వరూపునిగా ఆ స్వామి అశేష భారత ప్రజలచే నీరాజనాలందుకుంటున్న విషయం లోక విదితమే. అటువంటి సాయి తత్వాన్నిఈ కవి అష్టోత్తరశత చంపకోత్పలాలతో అర్చించి, సాయి కరుణకు పాత్రుడైనట్లు మనకు తెలుస్తుంది.

షిరిడీశ దేవునే మనం ఎందుకు కొలుస్తాం? అంటే

చ:-  అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపు చుండి, మ

     మ్మనువునఁ బ్రోతు వీవు. పరమాత్ముఁడ వంచు భజింతు మేము. ని

     న్ననయముఁ గొల్చు చుండి, సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే

     య, నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 7.

అని తన ఆర్తిని మహాద్భుత శక్తి కలిగిన స్వామికి నివేదించారు కవి.

అలాగే ఈ క్రింది పద్యంలో భగవంతుడు సర్వాంతర్యామి అని చక్కగా వివరిస్తూ ఇలా అంటారు.

ఉ:-  కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండ నిం

     కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచు గాంతు రిం

     కొందరు దీను లందు కడు కూర్మిని నిన్ గని పొంగు చుండు. ని

     న్నందరి లోన గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా! 22.

     స్త్రీవాద కవిత్వంలో స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డ కవులలో వీరు కూడా అగ్రగణ్యులు. ఈ శతకంలో అనేక పద్యాలు కాలానుగుణంగా స్త్రీల పట్ల జరిగే అన్యాయాలు అకృత్యాలు స్పష్టపరుస్తున్నాయి. సమస్యా పరిష్కారం కోసం కవి తన ఆవేదనను సాయికి నివేదించడం ఈ పద్యాల్లో మనం చూస్తాం. ఇందుకో ఉదాహరణ పద్యం చూడండి.

చ:-  మగువలఁ గాంచి, మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్

     భగ భగ మండు యగ్నిశిఖ పాలొనరింపు ముపేక్ష యేల? యీ

     మగువలఁ గావకున్న వర మాతృ జనంబిక మృగ్య మౌను. నీ 

     తెగువనుఁ జూపి, బ్రోవుమయ తీరుగ! శ్రీ షిరిడీశ దేవరా! 60.

     అనాదిగా స్త్రీకి ఓ ప్రత్యేక ప్రతిపత్తి గల్గిన యీ దేశంలో మహిళలకు జరుగుచున్న అన్యాయాలను ప్రతిబింబింపఁ జేసిన పద్యాలు చదివితే సహృదయ పాఠకుల మనసుల్ని కలిచివేస్తాయనడంలో సందేహం లేదు.

సామాజిక స్ఫృహ గలిగిన కవిత్వం వీరిది అనడానికి ఈ పద్యం ఒక్కటి చాలు.

ఉ:-  హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ

     హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణ మొందఁ జేసి, జై

     హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై

     పొందిక నుండఁ జేసితివి పూజ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 73.

     ఇంకా

     ఏది సతం బనిత్యమన నేది?......

     నమ్మిన వారి చిత్తమున........

     లోకమనంతమయ్య........

     వృక్షములాదిదేవతలు........

     గుమ్మడిపండు చందమున........

     వంటి అనేక నానుడులు, పోలికలు, సందర్భోచితంగా వివరించి కవి తన లోకజ్ఞతను చాటుకున్నారు.

     తన తల్లిదండ్రులను, గురువులను స్మరిస్తూ వ్రాసిన పద్యాలు కవికి వారిపట్ల గల అనన్య సామాన్య భక్తికి నిదర్శనాలు.

ఉ:-  కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం

     తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీ ధర. రామ కృష్ణుడన్.

     నిన్ వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ " పే

     రన్ విరచించి తీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా! 101.

అని కాణ్వ శాఖపై తనకు గల అభిమానాన్ని వ్యక్తీకరించడం అభినందనీయం.

    ఉభయ భాషా ప్రవీణులు, నిరంతర రామాయణ పఠనా శీలురు, మహర్నటులు అయిన శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల పట్ల తనకు గల గురు భక్తిని ఈ పద్యంలో ఇలా చాటారు.

ఉ:-  ఆర్యులు. కల్వపూడి వినయన్విత వేంకట వీర రాఘవా

     చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా

     వీర్యుడ! నీ కృపామృతము బ్రీతిగ నీ శతకంబు లోన నే

     నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 103.

ఆచార్య దేవోభవ అన్న దానిని సత్యం చేశారు శ్రీ రామ కృష్ణగారు.

    కీ.శే. ముత్యం రామమూర్తి కవి పండితుల కోర్కెకు ప్రతీకగా ఈ శతక రచన గావించినట్లు మనకనిపిస్తుంది. వీరిద్దరి సంబంధం అటువంటిది. ఇలాంటి ఇద్దరు ఉద్దండ కవి పండితులు లభించడం " చోదవరం " ప్రజలు చేసుకున్నపూర్వ పుణ్యఫలం.

షిరిడీశునిపై తనకు గల అపార భక్తికి ఈ ఒక్క పద్యం " కలికి తురాయి ".

ఉ:-  నీ దరహాస చంద్రికలు నిత్యముఁ గ్రోల చకోరమౌదునా?

     నీ దరి కాంతులీను మహనీయ సముజ్వల జ్యోతినౌదునా?

     నీ దరిఁ జేరు భక్తుల పునీతపు పాద రజంబునౌదునా?

     నీ దరి కెట్లు జేర్చెదవొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 90.

అని తన వినమ్రతను తెలుపుకున్నారు.

    ఈ శతకం చదివిన పాఠక లోకానికి అన్నీ శుభాలే జరుగుతాయని నా ప్రగాఢ విశ్వాసం.

జగమెఱిగిన యీ కవి పుంగవులు ఇంతటితో ఆగకుండ, మరిన్ని తెలుగు రచనలు వెలువరించి, పాఠక లోకాన్నిఆనందింపఁ జేస్తారని తలుద్దాం. ఆ షిరిడీశుడు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి ఆయురారోగ్యాలు సదా యిస్తూ,  ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. 

ఇక సెలవు.

భవదీయ,

డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ.

తే. 02 - 03 - 2009.









శ్రీ షిరిడీశ దేవ శతకము. కవితాబినందనం. 

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు,

    తెలుగు సాహిత్యంలో శతక రచన అగ్ర స్థానం పొంది యున్నది. కవులు తమ అనుభవాల్ని -ఆశల్ని - ఆర్తితో -   ఆనందంతో చెప్పుకొనడానికి చక్కని వీలుంది శతక రచన లోనే! లౌకిక అలౌకిక భావాలు ప్రక్క ప్రక్కనే చెప్పుకోడానికి ఒక్క శతక ప్రక్రియలోనే అవకాశం కలుగుతుంది.

    పూర్వం అంటే ఇప్పటికి ముప్ఫై నలభై ఏళ్ళ క్రితం పల్లెల్లో సాధారణ రైతులు కూడా సమయోచితంగా శతక పద్యాల్ని తమ సంభాషణల్లో ఉదహరిస్తూ మాటలాడేవారు. అలాగే అప్పటి గృహ లక్ష్ములు కూడా చక్కని తెలుగులో జాతీయాల సౌరభాలు గుబాళించే లాగ మాటలాడే వారు. ఇప్పటి తరం పిల్లలకి అనివార్యంగా సంకర తెలుగు మాటలాడే దౌర్భాగ్యం వచ్చింది. సాధారణంగా ఏ ఉద్యమమైనా ప్రజలనుంచి వస్తేనే అది కార్య రూపం ధరిస్తుంది. కొందరు విద్యావంతుల ఆశల్ని ముందుగా పసిగట్టి రాజకీయ నాయకులు వారిని సంతృప్తి పరచడం కోసం ఆయా విషయాల్ని ఉద్యమాలుగా ప్రచారం చేస్తారు. దానితో అది రాజకీయ అజెండాలో చేరి ఒక పార్టీ ప్రణాళికలో అంశంగా చేరిపోతుంది. అంతే ఇంక అది ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్లు తయారు అవుతుంది. పది మందిలో పాము చావదు అన్నట్లు 

కాలంలో బడి నలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు భాష ఔజ్వల్యం అలాగే తయారయింది. అందుకనే మాతృ భాషలో విద్యా బోధన అనే విప్లవం ప్రజల్లోంచి రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టినప్పుడు ప్రజల్లోంచి తగినంత స్పందన రాలేదు.ఈ నేపథ్యం అంతా ఎందుకంటే ప్రస్తుతం అధునిక కవులు కూడా శతకాలు వ్రాస్తున్నారు. శతక ప్రక్రియ వెనక బడ   లేదు. కొంచెం తన ప్రణాళీకను మార్పు చేసుకొని, అనేకానేక అంశాలు స్పృశిస్తూ ముందుకు సాగుతోంది. భక్తి శతకమే అయినా అనివార్యంగా సమాజం లోని అనేక కోణాల్ని చూపుతోంది ఈనాటి శతకం. శ్రీ షిరిడీశ దేవరా! అన్న మకుటంతో 108పద్యాల్లో సాగిన ఈ శతకం మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు రచించారు.వీరు తెలుగు అధ్యాపకునిగా పని చేసారు. సాహిత్య మిత్రులు. ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను ఆపోశన పట్టిన పండితులు. సమాజాన్ని నిశితంగా పరిశీలించే హృదయం కలవారు. దీనులయెడ సహానుభూతి కలిగిన ఉత్తమ సంస్కారవంతులు. అందుకే ఈ శతకం నిండా సమాజం లోని చీకటి కోణాల నుండి అనేకానేక అసమంజస  

విషయాలపై కవి తీర్పు లుంటాయి. వేదన లుంటాయి. ఆశావహ దృక్పథంతో కూడిన సందేశాలుంటాయి. ఏతావాతా శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి ఈ శతకం భక్తితో పాటు లోకజ్ఞతను కూడ పంచి పెడుతుంది పాఠకులకు. పద్య నిర్మాణంలో కూడా ఈ కవి చాలా సిద్ధ హస్తులు. పద్యం గోదావరిలా సాగి పోతుంది. భావ కూలంకషయై మనల్ని నివ్వెఱ పరుస్తుంది. అభ్యుదయ భావాలు, దేశ భక్తి ప్రపూర్ణమైన భావనలూ ఈ శతకంలో దర్శనమిస్తాయి. 

యువ తరాన్ని ఎంతగా శ్లాఘించారో ఈ కవి.

ఉ:-  భారత మాత రక్షణము, భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,

     ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే

     కారణ భూతులయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ

     వారికి శక్తి నీయుమయ భవ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 47.

యువతకు దేశ భక్తి - రక్షణా శక్తి - యీయుమని సాయిని ప్రార్థించడం హర్షణీయం.

అలాగే స్త్రీలను వేధించే వారిని వీరు చాలా గర్హించారు.

"అద్వైతం సుఖ దుఃఖయోః" అంటూ దాంపత్య బంధాన్ని ఎంత గొప్పగా భవభూతి చెప్పాడో. అట్టి దాంపత్య బంధాల్ని తృణీకరించే "పురుష పుంగవుల్ని" వీరు చాలా సూటిగా, కరుకుగా విమర్శించారు. " 

కన్నులఁ బెట్టి కావుమయ!  కాంతల" నంటూ సాయి దైవాన్ని ప్రార్థిస్తారు. చాలా పద్యాల్లో వీరి  

సంస్కార హృదయం  దర్శనమిస్తోంది. చక్కని పోలికలు కూడా కనిపిస్తాయి.

    " శరీరము గుమ్మడి పండులా గుట్టుగా కుళ్ళి నశిస్తుంది" అని అంతారు. ఎంత మంచి పోలిక!  

 గుమ్మడి పండు కంటికి బాగానే కనిపిస్తున్నట్లుంటుంది. కాని లోపల కుళ్ళిన సంగతి మనకు తెలియదు దానిని తాకేదాకా!

ఉ:-  నీ దరి చేరువాఁడనయ! నీ శతకంబుఁ బఠించు వాఁడ. స

     మ్మోదము తోడఁ గాంచుమయ! మూలము నీవయి కావుమయ్య! యా

     వేదనఁ బాపుమయ్య! సమ దృష్టి నొసంగి రహింపఁ జేయుమా!

     మేదిని పైన నన్ గనుమ మేలుగ. శ్రీ షిరిడీశ దేవరా! 98.

పద్యం వీరి భక్తి, మోక్షము యెడల వీరికి గల కాంక్ష, సాయిపై గల ప్రేమనూ ప్రత్యక్షరం ప్రత్యక్షం చేస్తున్నది. ఇలా శతక మంతా ఉదహరించ వలసి వస్తుంది మంచి మంచి పద్యాల కోసం. పాఠకులుగా మీరు శతకంలోఎలాగూ ప్రవేశిస్తారు. కాబట్టి ఈ ముందు మాటను ముగిస్తున్నాను.

    శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు తమ చిక్కని, చక్కని భావాల్ని పద్య రూపంగా మలచి,  శిరీష కుసుమ పేశలంగా సాయి శతకంగా రచించి, ఆ దేవ దేవునకు సమర్పించి, మనకు 

చక్కని మాధుర్య కవిత్వ ప్రసాదం పెట్టారు. ఈ శతకాన్ని కన్నుల కద్దుకొని ఆస్వాదించ వచ్చును. మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు ఇతోధికంగా సాహిత్య సేవ చేస్తూ - పరిణతి చెందిన తమ కవితాధోరణిని మంచి కావ్యాలు రచించాలని, మనసారా ఆకాంక్షిస్తూ -  

అభినందిస్తున్నాను.

బులుసు వేంకటేశ్వర్లు,

కల్ప వృక్షం,

చిట్టివలస.


శ్రీ షిరిడీశదేవ శతకము

రచన:- చింతా రామ కృష్ణా రావు


అంకితము

ముత్యము రామ మూర్తికి, ప్రపూజ్య చరిత్రునకున్, పవిత్రులన్

నిత్యము గౌరవించి, మహనీయతఁ గొల్పిన స్థుత్య మూర్తికిన్,

సత్య జగంబునం వెలుఁగఁ జక్కగ నంకితమిత్తునయ్య! యీ

స్తుత్యతనొప్పు గ్రంథమును శోభిల శ్రీ షిరిడీశ దేవరా!  


శ్రీ షిరిడీశదేవ శతకము

రచన:- చింతా రామ కృష్ణా రావు


ఉ:-  శ్రీద! విరూప! భాగ్యదుఁడ! చెన్నుగ నా మనమందు నిల్చి, స

     మ్మోదము నాపయిన్ నిలిపి, ముక్తిని గొల్పి, తమో గుణాదులన్

     నాదరిఁ బాయఁ జేయుమయ. నాధుఁడ! నిన్ గని ప్రస్తుతించెదన్.

     నీ దరిఁ జేర్చి కావుమయ! నిత్యుఁడ! శ్రీ షీరిడీశ దేవరా! 1.


ఉ:-  సుందర సత్ ప్రబంధముగ సూనృత! నీ మహిమాదికంబు సద్

     బంధుర సత్ పదంబులను పన్నుగ గైకొని, వ్రాయఁ గోరి, మున్

     ముందుగ నీపయిన్ శతకమున్ భువి వ్రాయగఁ బూనితయ్య! ఇ

     బ్బందులు పారఁ ద్రోలి, నిలు ప్రాపుగ. శ్రీ షిరిడీశ దేవరా! 2. 


చ:-  ప్రమద గణాభిసేవితము పావన శ్రీ షిరిడీ పురంబు. స

     ద్విమల యశో విరాజితము, విస్తృత సత్కృతికాకరంబు, మా

     భ్రమలను రూపు మాపి, గురు పాద యుగంబునుఁ గొల్వఁ జూపి, నే

     రములను సేయనీయదయ !, నిత్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 3. 


ఉ:-  శ్రీ సమ! సాయి నాధ! గుణ శేఖర! శ్రీ షిరిడీ నివాస! నీ

     ధ్యాస యొకింత కల్గి, పర తత్వము గాంచి, భజించు వారికిన్

     మోసములంటనీయవుగ! ముక్తిని గొల్పి రహింపఁ జేతువే!

     నీ సరి దైవమేడి? మహనీయుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 4.


ఉ:-  కన్నుల నిచ్చినావు నినుఁ గన్గొను భాగ్యమునీయనెంచి, మా

     కన్నులవేమి జూచు? కళ కాంతులఁ గోల్పడు భౌతికమ్ములన్.

     పన్నుగ నీదు రూపమును ప్రస్ఫుటమొప్పగఁ జూడగా వలెన్

     కన్నులు గల్గు భాగ్యమది కాదొకొ? శ్రీ షిరిడీశ దేవరా !  5. 


చ:-  అతులిత పాప పంకిలము లంటగ, నెన్నగ రాని బాధలన్,

     మతి చెడి దుష్ట చింతన లమానుష దుష్కృతిఁ జేయఁ జేయ, దు

     ర్మతులగు లోక నిందితులు రక్షణఁ గోరుచు నిన్నఁ జేఱ సం

       తతమును  బ్రోచు చుందువయ, దక్షుఁడ ! శ్రీ షిరిడీశ దేవరా! 6.


చ:-  అనితర సాధ్యమైన మహిమాన్విత శక్తులు చూపు చుండి, మ

     మ్మనువునఁ బ్రోతు వీవు. పరమాత్ముఁడ వంచు భజింతు మేము. ని

     న్ననయముఁ గొల్చు చుండి, సుగుణాకర చిత్తులమై మెలంగఁ జే

     య, నిను మదిం దలంతుము. మహాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 7.


ఉ:-  మోసము చేయుటే పనిగ మూర్ఖులు కొందఱు చేయు చుండ, నా

     మోస మెఱుంగ లేమి, మది ముమ్మొన వాలు విధంబు నాటఁగా,

     గాసిలి, వారు నిన్ను మదిఁ గాంచిన తోడనె బ్రోతువయ్య! నీ

     ధ్యాసయె రక్షగా నిలుచు ధాత్రిని. శ్రీ షిరిడీశ దేవరా! 8.


చ:-  మలినపు కావి వస్త్రమును మచ్చునకై తమ మేనఁ దాల్చి, నీ

     సులలిత సుందరాకృతిని జూపుచు నిల్తురు కొందఱత్తరిన్

     పలుమఱు నీవె యౌదువని, భక్తిని సేవలు చేయు భక్తులన్

     తెలివిని గొల్పి కావుమయ! తీరుగ. శ్రీ షిరిడీశ దేవరా! 9.


ఉ:-  ఎంతటి రోగమున్న, మనమేగతిఁ జింతలఁ సోలుచున్న, ర

     వ్వంత విభూతి నీ ధునిది హాయిగ దాల్చినఁ జాలు మేన, మా

     వంతలు బాపి, ప్రోచునయ వర్ధిలఁ జేయుచు, నట్టి భూతి ధ

     న్వంతరి కీవొసంగితివొ? పావన! శ్రీ షిరిడీశ దేవరా! 10.


చ:-  పదిలము తోడ నా షిరిడి వాసముఁ జేయుచు నుండకుండ, మా

     మదులను దేవళమ్ములుగ మన్ననఁ జేయుచు నుంటివీవు. నీ

     హృదయము మా పయిన్ నిలిపి, ప్రీతిగ నిత్యము రక్ష సేయ గో

     రెదవుగ! మమ్ము. నీ కృప గరీయము. శ్రీ షిరిడీశ దేవరా! 11.


ఉ:-  మానవ మూర్తిగా వెలసి మమ్ముల బ్రోచెడు కన్న తండ్రి! నీ

     జ్ఞానము వేద సారమయ! జాగృతమై నినుఁ గాంచఁ జేయ, న

     జ్ఞానము రూపు మాపి, విలసన్నుత చేష్టలు మాకుఁ జూపి, నీ

     జాణ తనంబుఁ జూపెదవు చక్కగ. శ్రీ షిరిడీశ దేవరా ! 12.


చ:-  అఖిల జగంబులోన పరమాప్తుఁడ వీవని గాంచ లేక, నే

     సఖులుగ నెంచి నాడ విలసన్నుత మూర్తుల, సన్నుతాత్ములన్.

     నిఖిలము నీవె కాగ మరి నీవని, వారని భేద మేమి? నీ

     వఖిలమునై రహింపఁ గల వాత్మల. శ్రీ షిరిడీశ దేవరా! 13.


ఉ:-  ప్రాణము లుండు దాక మము వర్ధిలఁ జేయుచు బ్రోతువయ్య! మా

     ప్రాణము పోవు నాఁడు మము పాప ఫలంబులు వెంట నంటు నీ

     ప్రాణ ప్రయాణ వేళ నినుఁ బాయక చిత్తము లోనఁ జేర్చు సు

     జ్ఞాన పథంబుఁ జేర్చుమయ! సన్నుత! శ్రీ షిరిడీశ దేవరా! 14.


ఉ:-  భోగము, భాగ్యమున్ గొలిపి, పొందగ చేసిన నాఁడు నేను నా

     యోగము నీవె యంచు, కడు యోగ్యుఁడ వంచు, నుతింతునయ్య ! దు

     ర్యోగము వెంబడింపఁగ నయోగ్యుఁడ వీవని నింద సేతు. స

     ద్యోగ మొసంగి గొల్పుమయ యోగ్యత! శ్రీ షిరిడీశ దేవరా! 15.


చ:-  వరములనిచ్చుటందు నల బ్రహ్మకు, భక్తుల కల్ప వల్లి యా

     హరునకు సాటి లేరనుచు నందురు కొందరు. నిన్నుఁ గూర్చి వా

     రెరఁగుడు చేసి, కాంచి, కలరీయిల సాయి, నిజంబు, కోరినన్ 

     వరముల నిచ్చు నండ్రు. తమ భక్తులు. శ్రీ షిరిడీశ దేవరా! 16.


చ:-  కరుణ రసాల మంచు, వర కామిత సత్ ఫలదుండటంచు, నిన్

     మరిమరి పల్కుచుండ మహి మాన్యుడ! నీ కృపఁ గన్న భక్తులా

     హరియును, బ్రహ్మ, రుద్రుడు నయాచిత సత్ ఫల దాయి సాయిగా

     స్థిరముగఁ బుట్టె నండ్రు కద. దివ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 17.


ఉ:-  ఆదియు మధ్యయున్ మఱియు నంతము లెన్నగ లేవు నీకు, మే

     మేదియు దారి లేక పరమేశ్వర! నిన్ మదిఁ గొల్చినంతనే

     నీదగు చిత్ స్వరూపమును నీటుగ మా మది లోన నిల్పి, స

     మ్మోదముఁ గూర్చు నట్టి గురు మూర్తివి. శ్రీ షిరిడీశ దేవరా! 18.


ఉ:-  అందరి దైవ మొక్కడని, యద్భుత బోధనఁ జేతు వీవు.నీ

     కందువుగా గణించి, నను కన్నులలో నిడి, కాచు చుండి, నీ

     సుందర చిత్ స్వరూపమును జూపుచు, దోష మడంచుచుండి, యా

     నందపు వెల్లువై నిలుమ నాయెడ. శ్రీ షిరిడీశ దేవరా! 19.


చ:-  హృదయము నీపయిన్ నిలిపి, యీప్సిత మొప్పగ నుండ వాంఛ నా

     మదిని వసింపఁ జేసి నిను. మాయలఁ గూర్చుచు దుష్ట చింతనల్ 

     పదిలములౌచు నామదిని, పావను నిన్ మదిఁ వీడఁ జేయు. నా

     మదిని వసించి, దౌష్ట్యములు మాపుము. శ్రీ షిరిడీశ దేవరా! 20.


కా:- పరమ దయానిధీ! పతిత పావన! భక్త మనోజ్ఞ రూప! మ

     మ్మరమర లేక కాచెదవు హాయిగ. నీకృప నెన్న నౌనె? నిన్

     పరిపరి మా మదిన్ దలచి, భవ్య మనస్కుల మౌదుమన్న, సు

     స్థిరముగ నుండదీ మనసు తృప్తిగ. శ్రీ షిరిడీశ దేవరా! 21.


ఉ:-  కొందరు భక్త కోటి నిను కోవెల లోపలఁ గాంచు చుండ నిం

     కొందరు సన్నుతాత్ములకు గుండెలలో కలవంచు గాంతు రిం

     కొందరు దీను లందు కడు కూర్మిని నిన్ గని పొంగు చుండు. ని

     న్నందరి లోన గాంచుటయె న్యాయము. శ్రీ షిరిడీశ దేవరా! 22.


ఉ:-  ధర్మము బోధ చేయుట, స్వ ధర్మమునే పచరించుచుంట, యే

     మర్మము లేక వర్తిలుట, మంచిగ నుండుట, నేర్చినాము. దు

     ష్కర్ములు మాయ వర్తనల సైచుట బాధగ నుండె. నేది సత్

     త్కర్మయొ? దుష్టమో? తెలిపి, కావుము. శ్రీ షిరిడీశ దేవరా! 23.


ఉ:-  మాటల ముత్యముల్ సుజన మార్గములన్ విరచించెనయ్య. నీ

     మాటలె వేద వాక్యముగ, మానవ జాతి గ్రహించె నయ్య. నీ

     సాటి కృపాబ్ధి లేడనుచు సన్నుతి చేయుచు నుందురయ్య! నీ

     వేటికిఁ జూడ రావయ! మునీశ్వర? శ్రీ షిరిడీశ దేవరా! 24.


ఉ:-  ఎంతటి వస్తువైననగు, నెచ్చటనైనను పోయెనేని, మా

     వంతను నీకుఁ దెల్ప, గ్రహ పాటును మార్చి, యొసంగెదీవు. నీ

     చెంతనె చిత్తముంచి, సహ జీవనమున్ ప్రభ గాంచు భక్తులన్

     వింతగ బ్రోచుచుండెదవు వేగమె. శ్రీ షిరిడీశ దేవరా! 25.


ఉ:-  శ్రీ శుభ దాయి సాయి. మన క్షేమముఁ గాంచుచునుండు సాయి. యా

     వేశముఁ బాపు సాయి. సుమ పేశల మానసమిచ్చు సాయి. మా

     యాశలు తీర్చు సాయి. సుమహార్ణవ జీవన మీదఁ జేయు లో

     కేశుఁడె సాయి యండ్రు నిను నీశ్వర. శ్రీ షిరిడీశ దేవరా! 26.


చ:-  గురువన సాయి యొక్కఁడగు. కూర్మిని బోధలు సేయు సాయి సద్

     గురువు, నిజంబు. కూటికిని గుడ్డకు జీవన మార్గ మెన్ని, సద్

     గురువుల మంచు, బోధనలు కోరుచుఁ జేయు గురున్ గురుండనన్

     కరరుహమున్ ఘనంబనుట కాదొకొ? శ్రీ షిరిడీశ దేవరా! 27.


ఉ:-  బాల్యము నందు నిన్ గొలుచు భాగ్యము శూన్యము జ్ఞాన హీనతన్.

     బాల్యము దాటి పోవు తఱిఁ బాశవికత్వము క్రమ్ము మమ్ము. సౌ

     శీల్యము నీ వొసంగిన సు శీలురమై నినుఁ జేరఁ గల్గు. దౌ

     ర్బల్యముఁ బాపి, ప్రోవుమయ! రక్షక! శ్రీ షిరిడీశ దేవరా! 28.


ఉ:-  భౌతిక మైన వాంఛ లెడఁ బాయక, నామది నిండె నయ్య! సం

     ప్రీతిని పొంద దీ మనసు పేలవ చిత్త ప్రవృత్తిఁ గల్గి, య

     జ్ఞాత భవాంధకారమును కానఁగ నేర దదెంత చిత్రమో!

     ఏ తఱి నన్నుఁ గాచెదవొ? యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 29.


ఉ:-  నిశ్చల భక్తి భావమున నిన్ను భజింపగ వేడుకొంటి. నీ

     నిశ్చయ మేమిటో యెఱుగ. నిర్దయతో పలు దుష్ట చింతనల్

     దుశ్చరితంబుఁ గొల్పి, నను దుష్టుగఁ జేసితి వీవ. యింక నా

     నిశ్చిత భావ మిచ్చి, నిలు నీడగ. శ్రీ షిరిడీశ దేవరా! 30.


చ:-  వెలయగఁ జేసినావు భువి వేలకు వేలుగ జీవ కోటి . కో

     వెలగ మనంబులన్ గొలిపి ప్రీతిగ మానవులందె నీవు, నీ

     తలపులె రూపు కాగ కడు తాల్మి వసింతు వదెంత భాగ్యమో!

     తలపుల వీఁడఁ జేయకుమ! దక్షుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 31.


చ:-  వర గుణ ధామ! యో పరమ పావన! భక్త శరణ్య! నీ కృపన్

     వరముగ నొందినట్టి గుణ వర్యులు ధన్యులు. పాప కర్మముల్

     దరి కిక చేర రావు. వర దాయివి. శ్రీ షిరిడీ నివాస! మ

     మ్మరయుచు నుండుమయ్య! పరమాద్భుత! శ్రీ షిరిడీశ దేవరా! 32.


ఉ:-  బాల్యమునందు సద్ గురుని ప్రాపు లభింప నమోఘమైన సౌ

     శీల్య సుధా ఫలంబు ప్రవచింతురు. నిక్కము. నేటి బాలకుల్

     బాల్యము నుండి బాధలను, పాపపు కర్మములన్ గ్రహింతు రీ

     బాల్యము నందు నీవె కన బాగగు! శ్రీ షిరిడీశ దేవరా! 33.


ఉ:-  శీల మహత్వమున్ దెలిపి క్షేమముఁ గూర్చెడి సద్గుణాన్వితుల్

     మూలము లార్య సంస్కృతి సమూలముగా వివరించి నేర్పు. దు

     శ్శీలు రదెట్లు నేర్పు? శుభ శీలము, జీవము, నీవె కాదె? సత్

     శీల సమృద్ధి నిచ్చి , దరి చేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 34.


చ:-  ధనముఁ గడింప వచ్చు. పర తత్వ ధనంబు గడింప లేము. సా

     ధనమున సాధ్యమౌను. వర దాయివి నిన్ను స్మరించు నాడు ని

     ర్ధనుఁడు ధనుండు. నీ స్మరణ తప్పిన నాడగు నిర్ధనుండు. మా

     ధనమది నీదు సత్ కృప. యథార్థము. శ్రీ షిరిడీశ దేవరా! 35.


ఉ:-  మానవ జన్మ మెత్తి, యసమాన సుదుర్లభ శక్తి యుక్తులన్

     జ్ఞాన సమృద్ధి, భక్తి, పరికల్పిత దైవ బలంబుఁ గల్గి, య

     జ్ఞానపు చీకటుల్ తనను క్రమ్మగ నేమియుఁ జేయ లేక, నిన్

     దీనత రక్ష వేడు. కను దీనుల. శ్రీ షిరిడీశ దేవరా! 36.


చ:-  శుభ కర సత్ స్వరూపమును చూడగ నెంచి, రచించినావు నీ

     విభవముతో శుభాకృతిగ విశ్వము. సర్వము నీవ. కాని, దుష్

     ప్రభవ మెలర్చె. దౌష్ట్యములు రాజిలె. దౌష్ట్యము నుండి కావుమా.

     ఉభయులకున్ శుభంబది. సముజ్వల! శ్రీ షిరిడీశ దేవరా! 37.


ఉ:- భార వహుండు సాయి యని భావనఁ జేయుచు నెల్ల వేళ మా

    భారము సాయి నాధునిది, పన్నుగఁ గాచు నటంచు, నమ్మినన్

    కోరక మున్నె తీర్తువట కోర్కెలు. నీ పద పంకజంబులన్

    తీరుగ మా మదిన్ నిలిపి, తేల్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 38.


చ:- సుఖము సుఖమ్ము లంచు మనుజుల్ దరిఁ గానక స్రుక్కు. నీదు స

    మ్ముఖమున నిల్చి, నిన్ను వరముల్ కరుణించి యొసంగుమండ్రు. యే

    మఖములఁ జేయ నేల? నిను మా మది నిల్పినఁ జాలదొక్కొ? యీ

    నిఖిలము నందు సౌఖ్యమది నీ కృప! శ్రీ షిరిడీశ దేవరా! 39.


ఉ:- జ్ఞాన మొసంగి మాకు కరుణాది గుణంబుల నిచ్చినాడవే!

    మానము మంటలోఁ గలుపు మాయని దుర్గుణ మేల యిచ్చితో!

    ప్రాణము లుండు దాక నినుఁ బాయని భక్తి ప్రపత్తులిమ్ము. య

    జ్ఞాన విరుద్ధ మార్గ మిడి కావుమ! శ్రీ షిరిడీశ దేవరా! 40.


ఉ:-  స్త్రీల స్వభావ సిద్ధమగు శీల మహా ధన రక్షణంబు నే

     డేల నశించి పోయె? కనవేల మదోన్మద దుష్ప్రవర్తనల్?

     శీలము చేలమున్ మహిళ సిగ్గును వీడి త్యజించుటేలనో?

     శీలముఁగొల్పి కావుమయ స్త్రీలను. శ్రీ షిరిడీశ దేవరా! 41.


చ:-  యువకులు కొందరీ భువిని యుక్తి కుయుక్తుల బుద్ధి నేర్పునన్

     భవితను భారతావనికి పన్నుగ నాశన మొందఁ జేయఁ గా,

     నవిరళ దుష్ట చేష్టలను హాయిగఁ జేయుచు నుండ్రి. , చూచితే?

     భువి కిక రక్ష నీవె కద! పూజ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 42.


ఉ:-  మంచిది చూచి మానవులు మంగళ కార్యము లాచరింతురే!

     సంచిత పాప కర్మ ఫల సంపదలే వెను వెంట నుండ నీ

     మంచిది మంచిఁ జేయునె? సమంచిత చిత్తులు నిన్నె మంచిగా

     నెంచుచు మంగళంబుఁ గన నెంచరె? శ్రీ షిరిడీశ దేవరా! 43.


ఉ:-  ఏది సతం బనిత్య మన నేది? నిజంబన నేది? కానగా

     నేది యబద్ధమౌను? కన నేది గుణం బగునయ్య? నిర్గుణం

     బేది? ప్రకాశ మేది? వల పేది? కనుంగొన నిక్కమేది? యీ

     పేదకు నీవె చూపుమయ వేద్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 44.


ఉ:-  ఎందుకు మంచి మార్గముల నెంపికతో రచియింపకుండ, మా

     ముందున చెడ్డ మార్గములు ముచ్చటతో రచియించినాడ, వి

     బ్బందులు గొల్పి, నిన్ గొలువ, వర్ధిలఁ జేయఁ దలంచినావొ? యా

     నందమె యెందు కీయవయ? నన్ గను శ్రీ షిరిడీశ దేవరా! 45.


ఉ:-  మంచిని మాత్రమే పెనిచి, మారుగ చెడ్డను పెంచకున్న నీ

     వంచనలేమియున్ భువిని వర్ధిల వంచు భ్రమించినాడవో? 

     మంచిని పెంచుమా కృపను. మా యెద నీ చెడు త్రుంచుమయ్య! మ

     మ్ముంచుము మంచి వారి మది నొప్పుగ. శ్రీ షిరిడీశ దేవరా! 46.


ఉ:-  భారత మాత రక్షణము, భవ్య మహోజ్వల భావిఁ గొల్పగా,

     ధీరులు, సజ్జనావళి విధేయులు, మా యువ భారతీయులే

     కారణ భూతులయ్య. కలి కల్మష దూరులఁ జేయుమయ్య. నీ

     వారికి శక్తి నీయుమయ భవ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 47.


ఉ:-  లక్ష్యముఁ గల్గి చేయ, మన లక్ష్యము సత్ ఫల మందఁ జేయు. నిర్

     లక్ష్యము దుష్ఫలంబొసగు. లక్ష్యమె నీవయి యున్న నాడు , దుర్

     లక్ష్యము లేక సత్ ఫలములన్ గన నౌను. నిజంబు. మాకు స

     ల్లక్ష్యముఁ గొల్పి బ్రోవుమయ దక్షుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 48.


ఉ:-  పుట్టుకతోనె జీవులకు పూర్వ సమార్జిత పుణ్య పాపముల్

     పుట్టుకు వచ్చునేమొ! పరి పూర్ణ వివేకము తోడఁ గొందరున్,

     నెట్టన దుష్ట చింతనము నిండి వసించుచు నుంద్రు కొందరున్.

     పట్టుగ పాప పంకిలముఁ బాపుమ! శ్రీ షిరిడీశ దేవరా! 49.


చ:-  సుగుణ సుమాల సౌరభము సూనృత వాక్కులఁ గొల్పఁ గోర్కె. ని

     న్నగణిత భక్తి తత్పరత నందరుఁ గొల్వఁగ జేయఁ గోర్కె. యీ

     జగము ననంత దౌష్ట్యములు చాలగ నన్ను వహించి వ్రేచు. నా

     దిగులును బాపి కోర్కెలను తీర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 50.


ఉ:-  సద్గుణ! సాయినాధ! వర శబ్దమె నీవట! తీర్థ పాలకా!

     సద్గురు! వేద వేద్య! విలసన్నుత! ద్వారక మాయి సంస్థితా!

     మద్గురు! నాధ నాధ! స్మృతి మాత్ర ప్రసన్న! విభూత! నిర్గుణా!

     సద్గతిఁ జూపి కావుమయ! సన్నుత! శ్రీ షిరిడీశ దేవరా! 51.


చ:-  సురుచిర సుందరాత్ములను, సూనృత సువ్రతులన్ సృజించి, మా

     దరి నిడినాడ వీ వనుచు, దక్షుఁడవంచుఁ దలంచు నంత, మా

     పరువును మంటలో కలుపు పాపపు కృత్య నికృష్ట చిత్తులన్

     దరిఁ గొనఁ జేసితేల? సుకృతంబొకొ? శ్రీ షిరిడీశ దేవరా! 52.


ఉ:-  దేవుఁడ వీవె కాగ పలు దేవుల సృష్టికి హేతువేమి? మా

     భావ మెఱుంగ సాధ్యమని పావన! నీవు గ్రహించినాఁడవో?

     దీవన లిచ్చి బ్రోచుటకొ? దేవులుగా మదులందు నిల్చి, సద్

     భావన లిచ్చి ప్రోచుటకొ? దక్షుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 53.


ఉ:-  సజ్జనులందు నిన్గనుచు, సద్గుణముల్ గొని సంచరింపఁగా

     వెజ్జల తోడు కావలయు. వెజ్జలు కొందరు ఘోర దుష్కృతుల్

     లజ్జిలఁ జేయు చుండిరిల. లక్ష్యము లాత్మ జయంబు కావలెన్.

     సజ్జను డప్పుడౌను కద! సద్గురు! శ్రీ షిరిడీశ దేవరా! 54.


ఉ:-  ఎన్నఁగ రాని పాపముల నెన్నిటినో యిటఁ జేసినాఁడ. నే

     నెన్నడు నీ కృపామృతము నిచ్ఛగ భక్తిని గ్రోల లేదు. నా

     కన్నుల నీదు రూప మను కాంతిని నింపి సుఖింప లేదు. సం

     పన్నుల మ్రొక్కి కీడ్పడితి. పాపిని. శ్రీ షిరిడీశ దేవరా! 55.


ఉ:-  భారతి, నాది దేవత భవానిని, శ్రీ సతి నమ్మ లండ్రు యీ

     భారత భూమిపై. తమ ప్రభావముఁ జూపెడి స్ర్తీల నమ్మగా

     చేరి భజింప రేల? తమ చేష్టల బాధలఁ గొల్ప నేలనో?

     వారి మనంబు మార్చుమయ! భవ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 56.


చ:-  అహ రహమున్ శ్రమించి, కడు హాయి నొసంగెడి స్త్రీలు జాతికిన్

     నిహిత విశేష లబ్ధ మహనీయ సుధా రస మయ్య! మాతగా,

     సహచర మూర్తిగా, సుతగ, సన్నుత సోదరిగా మెలంగు. నీ

     మహిమను స్త్రీలఁ గావుమయ! మాన్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 57.


చ:-  ధర నవమాన భారము లతా కుతలంబొనరింపఁ గృంగి, యే

     తెరువు నెఱుంగ లేక, సుదతీ మణు లెందరొ భారతావనిన్

     పరితప మొందుచున్ తమదు ప్రాణములన్ విడుచుండ్రి. స్త్రీల నీ

     ధర నిక కావుమయ్య పరితప్తుల! శ్రీ షిరిడీశ దేవరా! 58.


చ:-  మగ సిరిఁ గల్గి యుండుటయె మానిత మంచు దలంచి, మూర్ఖులై

     పగఁ గొని నట్లు భార్యలను, పాప మెఱుంగని పంకజాక్షులన్

     వగవఁగ హింస వెట్టు కుల పాంసను లేలఁ జనింతు రిద్ధరన్?

     మగువల పాలి దుష్టులను మాపుమ! శ్రీ షిరిడీశ దేవరా! 59.


చ:-  మగువలఁ గాంచి, మూర్ఖత నమానుష హింసల నేచు మూర్ఖులన్

     భగ భగ మండు యగ్నిశిఖ పాలొనరింపు ముపేక్ష యేల? యీ

     మగువలఁ గావకున్న వర మాతృ జనంబిక మృగ్య మౌను. నీ 

     తెగువనుఁ జూపి, బ్రోవుమయ తీరుగ! శ్రీ షిరిడీశ దేవరా! 60.


ఉ:-  శ్రీకర! సాయినాధ! తమ సేవల నిన్ బరితృప్తుఁ జేసి, నీ

     రాకకు వేచియుండి, తమ రక్షణఁ జేతు వటంచు నమ్మి, పల్

     భీకరమైన బాధలను ప్రేమగ సైతురు స్త్రీలు. వారిపై

     నీకిక జాలి కల్గదొకొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 61.


చ:-  వనితల నేలఁ గొల్పితివి? వారికి రక్షణ నీయవేల? నీ

     పనితన మంతఁ జూపగనొ? వారిజ నేత్రలు సద్గుణాలయల్.

     వనిత వసంత శోభ. బలవన్మరణంబులు పొందుచుండ్రి. నీ

     సు నిశిత దృష్టిఁ గావుమయ! సుందర! శ్రీ షిరిడీశ దేవరా! 62.


ఉ:-  అన్నయ! తమ్ముడా! యనుచు హాయిగఁ బిల్తు రనంత భావ సం

     పన్నలు భారతీమణులు భ్రాంతిగ సోదర భారతీయులన్.

     మన్నికఁ గొల్పఁ జేసితివొ! మాన్యుల, సద్గుణ శీల భామలన్.

     గన్నులఁ బెట్టి కావుమయ! కాంతల. శ్రీ షిరిడీశ దేవరా! 63.


ఉ:-  సున్నిత మైన దేహమున సూదులు గ్రుచ్చు నొకండు. దుష్ట సం

     పన్నుడొకండు దౌష్ట్యములు పల్కుచు గాయము సేయు గుండెలో.

     నెన్నని యోర్చుకో గలరు? ఎవ్వరి కేమని చెప్పు కొంద్రు? నీ

     కన్నులఁ గావుమయ్య! కుల కాంతల. శ్రీ షిరిడీశ దేవరా! 64.


ఉ:-  అంబ భవాని సత్ కృపల నందగ దీక్ష వహింతు రెందరో.

     అంబకు మారు రూపమగు నంగనలన్ గని దుష్ట కాముకుల్

     సంబర మొప్ప, పొంగగను, చాల కలంగ భరింప లేక యా

     యంబ శపించు. లేదు పరిహారము. శ్రీ షిరిడీశ దేవరా! 65..


చ:-  పురుషులు, స్త్రీలు, తాము తమ పూర్వ ఫలంబునఁ బుట్టుచుంద్రు. సు

     స్థిరముగ నన్ని జన్మలను తీరుగ నట్టులె పుట్ట లేరు. సత్

     పురుషుడ వీ వొకండవెగ! పుట్టిన వారిక స్త్రీలె యౌదు, రా

     సురుచిర కృష్ణ భక్తి యిదె చూపును. శ్రీ షిరిడీశ దేవరా! 66. 


చ:-  అతులిత శక్తి యుక్తులను హాయిగ నీ భువి నందఁ జేసి, సం

     స్తుత మతులన్ సృజించితివి శోభిల. శాంతము తక్కు వౌట నా

     గతులను విస్మరించి, చెడుఁ గాంచరు. దౌష్ట్యము లాచరింత్రు. దుర్

     మతులను బాపి, బ్రోవుమయ మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 67.


ఉ:-  చేసెద సాయి పాద యుగ సేవలు సమ్మతి నంచు భక్తు, లా

     యాస మనంబునన్ గలిగి, యన్యము వీడి, చరించుచుంద్రనా

     యాసత నీతి బాధ సుమహార్ణవ మంతయు నీది యీది, తా

     గాసిల కుండ దాటుదురు. కాంచితె? శ్రీ షిరిడీశ దేవరా! 68.


ఉ:-  ఆశ్రిత పక్షపాతి వని, యాప్తుఁడ వీవని నిన్ను నమ్ము నా

     డాశ్రయ మిచ్చువాఁడి వని, యార్తుల యార్తిని బాపుదీవనీ.

     ఆ"శ్రమ" జీవ కోటికి సహాయుఁడ వీవని చెప్పు కొందురే!

     ఆశ్రిత కోటిఁ బ్రోవగదె? హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 69.


ఉ:-  ఎందుకుఁ బుట్టఁ జేసితివొ? ఇంతటి బాధల నెందు కిచ్చితో?

     కందె మనమ్ము నాకిట కకావికలై , నినుఁ గొల్వ నేర దే

     మందును? పాప తప్తుఁడ. మహాత్ముఁడ! పాపుము పాప తాపమున్,

     డెందమునన్ వసించు షిరిడీ పుర శ్రీ షిరిడీశ దేవరా! 70.


ఉ:-  పావనమైన జన్మ మిది. భక్తి ప్రపత్తులు గల్గి దైవమున్

     భావన నైనఁ గానము. స్వభావమొ? పాప ఫలంబొ? దుష్టమౌ

     భావనలే స్పృశించు మది. భాగ్య విహీనుడ. భక్తి హీనుడన్.

     దేవుడ! కావుమయ్య! ప్రణుతింతును. శ్రీ షిరిడీశ దేవరా! 71.


చ:-  అరుదగు రూపుఁ దాల్చి, పురుషాకృతితో మముఁ బ్రోవ నెంచి, నీ

     కరుణను జూపఁ గల్గితివి. కాంక్షను హిందువు ముస్లి మొక్కటై,

     స్థిరముగఁ బుట్టినట్టి పగిదిన్ బ్రభవించితివయ్య! దుష్ట సం

     హరణముఁ జేసి కావుమయ! హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 72.


ఉ:-  హైందవ భావ ప్రేరణము నాత్మల ముస్లిము లొందఁ జేసి, యీ

     హైందవ జాతి ముస్లిముల యద్భుత ప్రేరణ మొందఁ జేసి, జై

     హిందను భారతీయులుగ హిందువు ముస్లిము లిద్దరొక్కటై

     పొందిక నుండఁ జేసితివి పూజ్యుఁడ! శ్రీ షిరిడీశ దేవరా! 73.


చ:-  కలి కృత కర్మ బద్ధులయి కానరు కొందరు నిన్ను. కల్మిచే

     మలిన మనస్కులై సతము మాయలలో విహరించుచుండి. నిన్

     బలుకఁగ నైన నేర్వరుగ! పావన మూర్తులె పుణ్య కర్ములై

     తెలియుదురయ్య నీ విమల తేజము. శ్రీ షిరిడీశ దేవరా! 74.


ఉ:-  నమ్మిన వారి చిత్తమున నర్తన చేయుచు నుందువీవు. లో

     కమ్మున భక్త కోటి వర కామితముల్ నెరవేర్తువీవు. వే

     దమ్ముల సార మీవిచట దక్షతతో మముఁ గాంతువీవు. జీ

     వమ్ముగ నుంటివీవు. గుణ వర్ధన! శ్రీ షిరిడీశ దేవరా! 75.


ఉ:-  లోక మనంతమయ్య! భివి లోకమునందొక భాగమయ్య! మా

     లోకము నీవెనయ్య! మము లోకువచే విడఁబోకుమయ్య! మా

     లో కనువిప్పుఁ గొల్పుమయ! లుబ్ధ గుణం బెడఁ బాపుమయ్య! నీ

     లోకముఁ జేర్చుమయ్య! వర లోచన! శ్రీ షిరిడీశ దేవరా! 76.


ఉ:-  బంగరు భాగ్య సీమ లిడి, పాడియుఁ బంటయుఁ గొల్పి నాడ, వే

     బెంగలు లేక తేజరిలె తృప్తిగ జాతి యొకప్పు డిప్పుడో?

     హంగుల కాశ చెంది, భువి హాలికు లమ్మిరి భాగ్య సీమలన్.

     మ్రింగఁగ ముద్దదెట్లొదవు మేదిని? శ్రీ షిరిడీశ దేవరా! 77.


ఉ:-  హారము లుండ వచ్చు. గుణ హారమునన్ వెలుగొంద వచ్చు. నా

     హారము లేక జీవనము హాయిగ సాగదు. పంట భూములన్

     బేరము వెట్టి యమ్ముటను పెల్లగు నాకలి కేక. కావుమా

     హారము నిచ్చు భూములను హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 78.


చ:-  ధరణి నమోఘ మూలికలు తన్మయతన్ బ్రభవింపఁ జేసి, యా

     వరణము శోభఁ గొల్పి, మము వర్ధిలఁ జేయఁ దలంచినావుగా!

     పరశువు పట్టి త్రుంచుటను పాడయిపోయె వనంబు లన్ని. నీ

     వరయుచుఁ గావ వేమి? పరమాత్ముడ! శ్రీ షిరిడీశ దేవరా! 79.


ఉ:-  వృక్షము లాది దేవతలు. వృద్ధి యొనర్చును జీవ కోటి. పల్

     పక్షుల కాకరంబు. తమ స్వార్థముతో పెకలించు వారికిన్

     జక్షు వినాశనం బగును. సద్ గుణ వర్ధన! కొల్పుమయ్య మా

     కక్షయమైన జ్ఞానము, గుణాంభుధి! శ్రీ షిరిడీశ దేవరా! 80.


ఉ:-  మంచిని చేయగా దలచి, మానవ జాతిని సృష్టిఁ జేసి, మా

     వంచన భావముల్ కనవు వర్ధిలఁ జేయఁగ కోరు చుండి. మా

     సంచిత పుణ్య మట్లు మముఁ జక్కగ జూచుచుఁ బ్రోచునట్టి ని

     న్నుంచెదమయ్య మా మదుల నొప్పుగ. శ్రీ షిరిడీశ దేవరా! 81.


చ:-  పశులకు, మానవాళికిని భౌతిక భేద మెఱుంగు మానవుల్

     పశువులు, పక్షులున్, మరియు పాముల వోలె చరించు టొప్పునో?

     నిశిత విచక్షణంబు, మహనీయతఁ గల్గి చరించు టొప్పునో?

     దిశను గ్రహింపఁ జేయుమయ దివ్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 82.


ఉ:-  ఆపదఁ బాపు వాఁడ! పరమాప్తుఁడ! సద్ గురు సాయి నాధ! ని

     న్నే పగిదిన్ భజింపఁ గల నిచ్ఛగ నా మది కోరకుండ? యే

     పాపముఁ బుణ్యమున్ గనను. భక్తుల కీవ వరం బటంచు సం

     స్థాపనఁ జేతు నిన్ మదిని చక్కగ. శ్రీ షిరిడీశ దేవరా! 83.


ఉ:-  బంగరు మేడ లుండ నగు. భాగ్య నిధానము లుండగా నగున్.

     రంగుల జీవనమ్ము నలరారగ నౌను. రహింప వచ్చు. తా

     నింగిత మించుకేని విడ నెవ్వని కైన క్షయంబు నిక్కమౌ

     నింగిత మిచ్చి బ్రోవుమయ! యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 84.


ఉ:-  ఎందరు బంధువుల్ కలుగ రిందరిలో నిట నొక్కడైన నీ

     బంధము, నాత్మ తత్వమున, ప్రార్థన చేయు క్రమంబు తెల్పిరే!

     ఎందుల కయ్య! బంధు జను లెవ్వరు వత్తురు పోవు నాడు. నీ

     సుందర రూపు ముక్తి నిడు చూచిన. శ్రీ షిరిడీశ దేవరా! 85.


చ:-  త్రికరణ శుద్ధిగా గొలువఁ దేజము శక్తి నొసంగె దీవు. నీ

     వొక పరి మావలెన్ నిలిచి, యోర్పుగ నుండి, జయింపఁ గోరె దీ

     తికమక పెట్టు శత్రువులఁ దేలును నీ పస. సాయి నాధ! నీ

     విక నయినన్ గృపం గనుమ యీశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 86.


ఉ:-  గుమ్మడి పండు చందమున గుట్టుగ క్రుళ్ళి కృశించు దేహమున్

     నమ్ముచు నుండి, కీడ్పడుట, నాశము నొందుట వింత గాదె? వే

     దమ్ముల సార మీవ యని, దారిని చూపెద వీవ యంచు, నిన్

     నమ్మియు, మాయలో పడు జనమ్ములు. శ్రీ షిరిడీశ దేవరా! 87.


ఉ:-  నాది యనంగ నేది? మననంబున మన్మన మందె సందియం

     బాదిని నే నదెట్లొదవె? యాశ నిరాశల మూలమేది? యా

     వేదన మూల మేది యగు? వేద్య మదేది? యవేద్యమేది? నా

     బాధ నెఱింగి తెల్పుమయ పావన! శ్రీ షిరిడీశ దేవరా! 88.


చ:-  పరమ దయా పరుండవయి భక్తుల పాలిట నుందువీవు! ఏ

     వరములు కోరకుండగనె భక్తుల కిచ్చెదవీవు! నిన్ను నే

     వరదుడవంచుఁ గొల్చెదను. భక్తి ప్రపత్తులు నిల్పి నా మదిన్.

     ధర ననుఁ గావుమయ్య! వరదాయివి. శ్రీ షిరిడీశ దేవరా! 89.


ఉ:-  నీ దరహాస చంద్రికలు నిత్యముఁ గ్రోల చకోరమౌదునా?

     నీ దరి కాంతులీను మహనీయ సముజ్వల జ్యోతినౌదునా?

     నీ దరిఁ జేరు భక్తుల పునీతపు పాద రజంబునౌదునా?

     నీ దరి కెట్లు జేర్చెదవొ? నిత్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 90.


చ:-  నట, విట, గాయ కాళి కడ నాకు లభించిన కాల మంత, నే

     కుటిలుడనై చరించితిని. గుట్టుగ నా మది నున్న నిన్ను నే

     నిటుల మదాంధతన్ గనఁగ నేమఱి యుంటి. మరెట్లు కాచెదో

     పటు తరమైన మృత్యువును బాపుచు. శ్రీ షిరిడీశ దేవరా! 91.


ఉ:-  జన్మ పరంపరన్ గడుపఁ జాలక నా మది సోలెడిన్ బునర్

     జన్మము లేని మార్గమును చక్కగఁ జూపుచుఁ బ్రోచు దైవమా!

     నిన్మది బాయ కుండ మహనీయ విభూతిని దాల్పఁ జేసి, మ

     మ్మున్మదిఁ గాంచి బ్రోవుమయ ముద్దుగ. శ్రీ షిరిడీశ దేవరా! 92.


చ:-  క్షణము యుగమ్ముగా గడుపగా మది తల్లడ మందు చుండె. నీ

     క్షణమునఁ బ్రోవ నెంచితివొ? గమ్యముఁ జూపుచుఁ బ్రోవు మయ్య. ర

     క్షణ వలయమ్ము నీ స్మరణ. కాలుని బారికిఁ బంపెదో? సు శి

     క్షణము నొసంగి బ్రోచెదవొ? కాంచెద. శ్రీ షిరిడీశ దేవరా! 93.


చ:-  పటుతరమైన నీదు శుభ పావన రూపముఁ గాంచనిమ్ము. సం

     కటములఁ దేలు వేళ నినుఁ గాంచి సుఖంబు కనంగ గోరినన్

     గుటిల ప్రయత్నమే యగును. గొప్పగ నిన్ గని కొల్చు భాగ్య మీ

     తృటి నిడి, కావుమయ్య నను తీరుగ. శ్రీ షిరిడీశ దేవరా! 94.


ఉ:-  నేను గ్రహించినాడ మహనీయుల కెగ్గులు కల్గు చుండుటన్.

     నేను గ్రహించి నాడ ధరణిన్ కుల పాంసను గౌరవించుటన్.

     నేను గ్రహింప లేను మహనీయుల పాపము, దుష్టు పుణ్యమున్.

     గాన, గ్రహింపఁ జేసి ననుఁ గావుము. శ్రీ షిరిడీశ దేవరా! 95.


చ:-  కనుల కనంత శక్తి నిడి, కాంచఁగ నీ నిజ రూప మిచ్చియున్,

     కనఁగ ననంత దౌష్ట్యముల కల్పనఁ జేసితి వేలనయ్య? మా

     కనులు గ్రహించు నయ్యవియె. కాంక్షలు గొల్పి, భ్రమింపఁ జేయు. నన్

     గనుఁగొని బ్రోవుమయ్య! వర కామ్యద! శ్రీ షిరిడీశ దేవరా! 96.


ఉ:-  పుట్టిన దాదిగా ధనము, భుక్తి, సుఖాప్తికి నాశ చేసి, నే

     నిట్టుల మోస పోతి కద! యెట్టుల నిన్ గరుణింప వేడెదన్?

     నెట్టన పాప కర్మములు నిన్నుఁ గనుంగొననీయవయ్య. నీ

     వెట్టుల కాతు వయ్య? పరమేశ్వర! శ్రీ షిరిడీశ దేవరా! 97.


ఉ:-  నీ దరి చేరువాఁడనయ! నీ శతకంబుఁ బఠించు వాఁడ. స

     మ్మోదము తోడఁ గాంచుమయ! మూలము నీవయి కావుమయ్య! యా

     వేదనఁ బాపుమయ్య! సమ దృష్టి నొసంగి రహింపఁ జేయుమా!

     మేదిని పైన నన్ గనుమ మేలుగ. శ్రీ షిరిడీశ దేవరా! 98.


ఉ:-  పిన్నలఁ బెద్దలం గనుము ప్రీతముగా వర సద్గుణాళితో 

     మన్నన లందు నట్లు గుణ మాన్యులుగా నెలకొల్పి ప్రోవుమా!

     ఎన్నని విన్నవింతునయ! ఏమని కోర్కెలు తీర్చమందు? నీ

     వున్నది మాకు, నిక్కము. మహోద్భవ! శ్రీ షిరిడీశ దేవరా! 99.


ఉ:-  పండిత పామరాళి కడు భక్తిగ నిన్ మదిఁ గొల్చు వేళలన్,

     మెండుగ కష్టముల్ తమకు మించి స్పృశింప కృశించు వేళలన్,

     పండుగ వేళ లందు, వర భావన నీ షిరిడీశ పద్యముల్

     మెండుగ వల్లె వేయ, కను మేలును. శ్రీ షిరిడీశ దేవరా! 100.


ఉ:-  కాణ్వ విరాజ నామమునఁ గ్రాలెడు సత్ శుభ శాఖజుండ. చిం

     తాన్వయ సంభవుండ. చరితార్థుడ నీ ధర. రామ కృష్ణుడన్.

     నిన్ వినుతించి, మ్రొక్కి, మది నిన్ గని, " శ్రీ షిరిడీశ దేవ " పే

     రన్ విరచించి తీ శతక రాజము. శ్రీ షిరిడీశ దేవరా! 101.


ఉ:-  ముత్యము రామ మూర్తి కడు ముచ్చటతో ననుఁ గోరినారు "నే

     మృత్యువు నొందు లోపలనె మీ రొక గ్రంథము వ్రాయు" డంచు. నౌ

     న్నత్యము గొల్పు కోరికను నా మది నుంచి రచించి నాడ, నీ

     స్తుత్యత నొప్పు పద్యములు శోభిల. శ్రీ షిరిడీశ దేవరా! 102.


ఉ:-  ఆర్యులు. కల్వపూడి వినయన్విత వేంకట వీర రాఘవా

     చార్యుల పాద ధూళి విలసన్నుత జ్ఞాన ప్రబుద్ధిఁ గొల్పగా

     వీర్యుడ! నీ కృపామృతము బ్రీతిగ నీ శతకంబు లోన నే

     నార్యులు మెచ్చ వ్రాసితిని హాయిగ. శ్రీ షిరిడీశ దేవరా! 103.


ఉ:-  శ్రీ షిరిడీశ దేవు కృపఁ జెన్నుగ నీ శతకంబు వ్రాయగా 

     నా షిరిడీశ భక్తులు మహాద్భుత భక్తిఁ బఠించుచుండు గా

     దే! సిరి సంపదల్ గొలిపి, తేజముఁ గొల్పుము దేవ దేవ! నిన్

     శ్రీ షిరిడీశ! యన్నఁ దరి జేర్చుమ! శ్రీ షిరిడీశ దేవరా! 104.


ఉ:-  ఎంతగ నేర్చినన్, గుణము లెన్నిక నెన్నిటినైనఁ గూర్చినన్ 

     సంతస మందఁ జేయవుగ సద్గుణు లెంచి, పఠించు వేళ ర

     వ్వంతయు దోషమున్న. బుధు లందరి మన్నన లందు నట్లుగా

     చెంతను చేరి చేయుమయ . శ్రీకర! శ్రీ షిరిడీశ దేవరా! 105.


ఉ:-  వ్రాసితి భక్తి భావమున. వ్రాసితి నే కనుగొన్న వన్నియున్.

     వ్రాసితి సాయినాధు కృప. వ్రాతలలో గుణ మెంచుచున్ గృపన్

     దోషము లున్న వీడి, పరి తోషము, సత్ ఫల మందఁ జేయగా

     నీ సరి దైవ మింక కన నేరను. శ్రీ షిరిడీశ దేవరా! 106.


చ:-  కరుణ రసామృతాబ్ధి ననుఁ గాంచిన వేంకట రత్న మమ్మకున్,

     వెరవరి తండ్రిగారయిన వేంకట సన్యసి రామ రావుకున్

     చరణములంటి మ్రొక్కెదను. చక్కగ నీ శతకంబు వ్రాసి, యా

     గురువుల వాంఛ తీర్చితిని. కోమల! శ్రీ షిరిడీశ దేవరా! 107.


ఉ:-  మంగళ హారతిన్ గొని, యమంగళముల్ తొలగించి, నీదు సన్

     మంగళ రూప దర్శనము మానవ కోటికిఁ గల్గఁ జేసి, యే

     బెంగలు లేక, నిన్ మదిని ప్రేమగ నిత్యముఁ గొల్వఁ జేయు మో

     మంగళ రూప! మంగళము మాన్యుడ! శ్రీ షిరిడీశ దేవరా! 108.

పూజ్య కాణ్వ శాఖోద్భవ, శ్రీ చింతా వంశ సంభవ, జానకీ రామ మూర్తి దంపతుల పౌత్ర , వేంకట రత్నం సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్ర , శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘావాచార్య ప్రియ శిష్య,  రామ కృష్ణా రావు నామధేయుండనైన నాచేత విరచింపఁబడిన శ్రీ షిరిడీశ దేవ శతకము సమాప్తము. 


మంగళం              మహత్              శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ






చింతా రామ కృష్ణా రావు .  భాషాప్రవీణ., M.A,.  Telugu.

,


పుట్టిన తేదీ:- 06 - 10 - 1051 ( తూర్పు గోదావరి జిల్లా - వేట్లపాలెంలో )

తల్లి దండ్రులు:- చింతా వేంకట రత్నం, చింతా సన్యాసి రామా రావు.

స్వగ్రామం:- విశాఖపట్టణం జిల్లా - సర్వసిద్ధి.


తేదీ 01 - 03 - 1974 నుండి తేదీ 30 - 6 - 2008 వరకు ఉద్యోగం చేసిన గ్రామాలు.

ప్రథమాంధ్రోపాధ్యాయునిగా:- 

దిమిలి, యస్.రాయవరం, పాయకరావు పేట.


జూనియర్ లెక్చరర్ గా:- 

మక్కువ, రాజాం, కొత్తకోట, వడ్డాది, చోడవరం,

సీనియర్ లెక్చరర్ గా:- 

చోడవరం.


రచనలు:-

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము.

శ్రీ శివ అష్టోత్తర శత పంచ చామరావళి (శివ శతకము)

పురుష సూక్తానువాదము,

కాళిదాస కృత అశ్వధాటికి తెలుగు పద్యానువాదము.

"ఆంధ్రామృతము", మరియు "యువతరంగము", మరియు  "పద్య విపంచి" అను అంతర్జాల పత్రికలు ( బ్లాగులు ) నిర్వహణ ద్వారా అనేక వైవిధ్య భరిత పద్య రచనలు.

Image

కృతికర్త.  



భాషాప్రవీణ., చిత్రకవితాసమ్రాట్., కవికల్పభూజ., చిత్రకవితా సహస్రఫణి., చింతా రామ కృష్ణా రావు. M.A.,.

విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.

ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.

తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165


రచనలు.

  1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.

 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, 

     ప్రతీపాదమునా మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో  

     వ్రాసినది.)

 3) ఆంధ్రసౌందర్యలహరి.

 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో   

     అనేక స్వీయ రచనలు.

 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.

 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.

 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)

 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.

10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.

11) బాలభావన శతకము.

12) మూకపంచశతి పద్యానువాదము.

13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత  

     సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.

14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

15) రాఘవా! శతకము.

16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

17) రుద్రమునకు తెలుగు భావము.

18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో 

     వ్రాసినది.)

19) వసంతతిలక సూర్య శతకము.

20) విజయభావన శతకము.

21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 

23) శ్రీ అవధానశతపత్రశతకము.

24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.

25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.

26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.

27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.

28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.

29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 

      నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య 

      శతకము.)

30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)

31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.

32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)

33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.

34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.

35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. 

      (బంధచిత్రకృతి ఒకే శతకమున మూడు మకుటములతో 

       మూడు శతకములు.) 

36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)

37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క 

      రోజులో వ్రాసినది.)

38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త 

      శివశతకము.

39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 

      సీతాన్వయముగా తేటగీతి పద్యముల 

      హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల 

      నక్షత్రమాల.)

40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)

41) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార 

      ప్రాసతో అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక.

//స్వస్తి//




29, జూన్ 2025, ఆదివారం

సామ్యవాదము,సౌమ్య ప్రజ్ఞ.భౌమ్య దోషం,గొడ్డలి పెట్టు,జాతకాలు,జాతి మాత,సౌరు లెల్ల,తారు మారు,మంటలంటు,పాత కాళి,ఖ్యాతి నింపు,మేలెంచు,గమ్య మెంచు,గర్భ"-జగన్మిధ్య"-వృత్తము రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,,

0 comments

జైశ్రీరామ్. 

సామ్య వాదం జగన్మిథ్యే!జాతి గొడ్డలి పెట్టు నీతౌ!జారు మాత సుకీర్తులెల్లన్

సౌమ్య ప్రజ్ఞే!దిగు న్నిల్చున్!జాతకాలవి తారుమారౌ!సౌరు లెల్ల జనుం బిరానన్!
భౌమ్య దోషం పగన్గోరున్!పాత కాళికి మంటలంటున్!పౌర లోకము భీతి నొందున్!
గమ్య మెంచన్ప్ర మోదంబౌ!ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!గౌరవంబదె!నిల్చు నిత్యమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత,ఉత్కృతి"-
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,ప్రాస నియమము కలదు,
పాదమునకు;26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"-సామ్య వాదము"వృత్తము,

సామ్య వాదం జగన్మిథ్యే!
సౌమ్య ప్రజ్ఞీ!దిగు న్నిల్చున్!
భౌమ్య దోషం పగన్గోరున్!
గమ్య మెంచన్ప్ర మోదంబౌ!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరములుండును,

2.గర్భగత"-సౌమ్య ప్రజ్ఞ"-వృత్తము,

జాతి గొడ్డలి పెట్టు నీతౌ!
జాతకాలవి తారుమారౌ!
పాత కాళికి మంటలంటున్!
ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి,ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3.గర్భగత"-భౌమ్య దోషం"-వృత్తము,

జారు మాత సు కీర్తులెల్లన్!
సౌరు లెల్ల జనుం బిరానన్!
పౌర లోకము భీతి నొందున్!
గౌరవంబదె!నిల్చు నిత్యమ్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,అక్షరము లుండును,

4.గర్భగత"-గొడ్డలి పెట్టు,వృత్తము,

సామ్య వాదం జగన్మిథ్యే!జాతి గొడ్డలి పెట్టు నీతౌ!
సౌమ్య ప్రజ్ఞే!దిగున్నిల్చున్!జాతకాలవి తారుమారౌ!
భౌమ్య దోషం పగన్గోరున్!పాతకాళికి మంట లంటున్!
గమ్య మెంచం ప్ర మోదంబౌ!ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"-9"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-జాతకాలు"-వృత్తము,

జాతి గొడ్డలి పెట్టు నీతౌ!సామ్య వాదం జగన్మిథ్యే!
జాతకాలవి తారుమారౌ!సౌమ్య ప్రజ్ఞే!దిగున్నిల్చున్!
పాత కాళికి మంట లంటున్!భౌమ్య దోషం పగన్గోరున్!
ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!గమ్య మెంచం ప్రమోదంబౌ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-జాతి మాత"-వృత్తము,

సామ్య వాదం జగన్మిథ్యే!జారు మాత సు కీర్తు లెల్లన్!
సౌమ్య ప్రజ్ఞే!దిగున్నిల్చున్!సౌరు లెల్ల జనుం బిరానన్!
భౌమ్య దోషం పగం గోరున్!పౌర లోకము భీతినొందున్!
గమ్య మెంచం ప్రమోదంబౌ!గౌరవంబదె!నిల్చు నిత్యమ్!

అణిమా ఛందము నందలి,అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"-9,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-సౌరు లెల్ల"-వృత్తము,

జారు మాత సు కీర్తులెల్లన్!సామ్య వాదం జగన్మిథ్యే!
సౌరు లెల్ల జనుం బిరానన్!సౌమ్య ప్రజ్ఞే!దిగున్నిల్చున్!
పౌర లోకము భీతి నొందున్!భౌమ్య దోషం పగం గోరున్!
గౌరవంబదె!నిల్చు నిత్యమ్!గమ్య మెంచం ప్రమోదంబౌ!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18.అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-తారు మారు"-వృత్తము,

జాతి గొడ్డలి పెట్టు నీతౌ!జారు మాత సు కీర్తు లెల్లన్!
జాతకాలవి తారు మారౌ!సౌరు లెల్ల జనుం బిరానన్!
పాత కాళికి మంట లంటున్!పౌర లోకము భీతి నొందున్!
ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!గౌరవం బదె?నిల్చు నిత్యమ్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"-మంటలంటు"-వృత్తము,

జారు మాత సు కీర్తు లెల్లన్!జాతి గొడ్డలి పెట్టు నీతౌ!
సౌరు లెల్ల జనుం బిరానన్!జాతకాలవి తారు మారౌ!
పౌర లోకము భీతి నొందున్!పాత కాళికి మంట లంటున్!
గౌరవంబది నిల్చు నిత్యమ్!ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు18.అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-నీతి దూర"-వృత్తము,

జాతి గొడ్డలి పెట్టు నీతౌ!సామ్య వాదం జగన్మిథ్యే!జారు మాత సు కీర్తు లెల్లన్!
జాతకాలవి తారు మారౌ!సౌమ్య ప్రజ్ఞే!దిగు న్నిల్చున్!సౌరు లెల్ల జనుం బిరానన్!
పాత కాళికి మంట లంటున్!భౌమ్య దోషం పగన్గోరున్!పౌర లోకము భీతి నొందున్!
ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!గమ్య మెంచం ప్రమోదంబౌ!గౌరవంబది నిల్చు నిత్యమ్!

అనిరుద్ఛందము నందలి,ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,18.అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-పాత కాళి"-వృత్తము,

సామ్య వాదం జగన్మిథ్యే!జారు మాత సు కీర్తు లెల్లన్!జాతి గొడ్డలి పెట్టు నీతౌ!
సౌమ్య ప్రజ్ఞే దిగున్నిల్చున్!సౌరు లెల్ల జనుం బిరానన్!జాతకా లవి తారు మారౌ!
భౌమ్య దోషం పగన్గోరున్!పౌర లోకము భీతి నొందున్!పాత కాళికిమంట లంటున్!
గమ్య మెంచం ప్రమోదంబౌ!గౌర వంబది నిల్చు నిత్యమ్!ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-ఖ్యాతి నింపు"-వృత్తము,

జారు మాత సు కీర్తు లెల్లన్!సామ్య వాదం జగన్మిథ్యే!జాతి గొడ్డలి పెట్టు నీతౌ!
సౌరు లెల్ల జనుం బిరానన్!సౌమ్య ప్రజ్ఞే!దిగు న్నిల్చున్!జాతకాలవి తారు మారౌ!
పౌర లోకము భీతి నొందున్!భౌమ్య దోషం పగన్గోరున్!పాత కాళికి మంట లంటున్!
గౌరవంబది నిల్చు నిత్యమ్!గమ్య మెంచం ప్రమోదంబౌ!ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"-మేలెంచు"-వృత్తము,

జాతి గొడ్డలి పెట్టు నీతౌ!జారు మాత సు కీర్తు లెల్లన్!సామ్య వాదం జగన్మిథ్యే!
జాత కాలవి తారు మారౌ!సౌరు లెల్ల జనుం బిరానన్!సౌమ్య ప్రజ్ఞే!దిగు న్నిల్చున్!
పాత కాళికి మంట లంటున్!పౌర లోకము భీతి నొందున్!భౌమ్య దోషం పగన్గోరున్!
ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!గౌరవంబది నిల్చు నిత్యమ్!గమ్య మెంచం ప్రమోదంబౌ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-గమ్య మెంచు"వృత్తము,

జారు మాత సు కీర్తు లెల్లన్!జాతి గొడ్డలి పెట్టు నీతౌ!సామ్య వాదం జగ న్మిథ్యే!
సౌరు లెల్ల జనుం బిరానన్!జాతకాలవి తారు మారౌ!సౌమ్య ప్రజ్ఞే!దిగు న్నిల్చున్!
పౌర లోకము భీతి నొందున్!పాత కాళికి మంట లంటున్!భౌమ్య దోషం పగ న్గోరున్!
గౌరవం బది నిల్చు నిత్యమ్!ఖ్యాతి నింపు పరార్ధ చింతన్!గమ్య మెంచం ప్రమోదంబౌ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
జైహింద్.

కృతజ్ఞేన సదా భావ్యం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  కృతజ్ఞేన సదా భావ్యం - మిత్రకామేన చైవహl

మిత్రాచ్చ లభతే సర్వం - మిత్రాత్పూజాం లభేత చll

(మహాభారతమ్ - శాన్తిపర్వము)

తే.గీ.  భువి కృతజ్ఞతతోనున్న పూజ్యులైన

వారి మైత్రి సంప్రాప్తమౌ, వారివలన

లభ్యమగుచుండు సర్వమున్, లభ్యమగును

గౌరవంబు, సత్ కీర్తియున్, ఘన సుచరిత!

భావము. "మంచి మిత్రులను కోరుకునే వారు సదా కృతజ్ఞునిగా ఉండాలి. 

మంచి మిత్రుని వలన సమస్తమూ పొందుతారు. మిత్రుని సహాయం వల్లనే 

లోకంలో గౌరవం పొందుతారు".

జైహింద్

28, జూన్ 2025, శనివారం

చిత్రకవితాసమ్రాట్ బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారికి *పుంభావభారతీ* బిరుదు ప్రదానము తే.19.10.2024...... విద్వాన్ చక్రాల లక్ష్మీకాంతరాజారావు. ఎం.ఏ.,

0 comments

 శ్రీరస్తు                                  శుభమస్తు                       అవిఘ్నమస్తు

చిత్రకవితాసమ్రాట్ బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారికి

*పుంభావభారతీ* 

బిరుదు ప్రదానము తే.19.10.2024ని చేయుచు


పంచరత్నములు.

కం.  చింతా యను పద భావమె

చింతించుట యగును, మీరు చిత్తమునందున్

సంతతము చింత చేయుచు,

సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.


కం.  ఎన్నని వ్రాయుదురయ్యా!

ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం

బున్నట్టి శక్తి సంపద

లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!


కం.  పద్దెములెన్నివిధంబులొ

యద్దెస మీ గమనముండు, నాలోచనముల్

తద్దిశ మెరయున్ గావ్యం

బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.


కం.  *పుంభావభారతీ* యని

సంబోధనతోడ మిమ్ము చక్కగఁబిలుతున్

బింబోష్ఠివాణి ఘనధీ

సంబంధయుతుండవౌట సత్కవివర్యా!


కం.  సొంపగునీ బిరుదమ్మున్

సొంపుగ నే నిచ్చుచుంటి సుందరమతితో

న్నింపుగ నను మన్నించుచు

కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!


స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. 

విద్వాన్ చక్రాల లక్ష్మీకాంతరాజారావు. ఎం.ఏ.,

విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు. హైదరాబాద్.

విద్వాన్ బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు మహోదయులకు

కృతజ్ఞతాభివందనములు.

శా.  శ్రీమన్మంగళ భావనామృతభరశ్రీజ్ఞానతేజోనిధీ!

శ్రీమద్భారతి ముద్దుబిడ్డలగు లక్ష్మీకాంత రాజాఖ్య! మీ 

శ్రీమంతంబగు భవ్యభావ విలసచ్చిద్రూప వాగ్వైఖరిన్

ధీమంతుల్ గణియింతురయ్య! మిము నేతీరున్ బ్రశంసించెదన్? 

మీకు 

కృతజ్ఞతాపూర్వక వందనములు 

సమర్పించుకొనుచున్నాను.

జైహింద్.

రామ కృష్ణ నీతి శతకము. రచన - చింతా రామ కృష్ణ రావు

0 comments

 రామ కృష్ణ నీతి శతకము.

రచన - చింతా రామ కృష్ణ రావు



రామ కృష్ణ మాట రాచ బాట

శ్రీవైష్ణవీ పబ్లికేషన్స్. మియాపూర్.

అంకితము

శ్రీ సాధు శ్యాం ప్రసాద్ గారికి,

శా.  శ్రీమన్మంగళ సాధువంశజుఁడు శ్రీ సీతాకుమారీ పతిన్

ప్రేమోదారుని, శ్యాంప్రసాదు మహితున్ విఖ్యాతుఁడంచెంచి నే

శ్రీమంతంబగు రామకృష్ణశతకశ్రీకన్యనే యంకితం

బోమాతా! యొనరించుచుంటి, కృపతోనొప్పార రక్షింపుమా.


రామ కృష్ణ నీతి శతకము.

ఆ:- శ్రీల నిచ్చు దైవ చింతన యనుచు, నిన్ - దలతు నయ్య! రామ! కొలుతునయ్య,

      ముక్తిఁ గొల్పి, నీదు భక్తులఁ గాపాడు! - రామ కృష్ణ మాట రాచ బాట.1.

ఆ:- సజ్జనాళి జూచి, సద్వర్తనము నేర్చు - సరస మతులు, కాన, సర్వ జనులు

      మంచి నడత కలిగి, మాన్యులై మెలఁగుత! - రామ కృష్ణ మాట రాచ బాట.2.

ఆ:- బాల్యమందు దుష్ట భావంబు లెఱుఁగక - యనుభవంబు నేర్పనరయు చుంద్రు,

      దౌష్ట్య హీన లోక ధర్మంబు వెలయుత! - రామ కృష్ణ మాట రాచ బాట. 3.

ఆ:- శిష్ట వర్తనంబు శివుని జేర్చునటంచు - మంచి మాటలాడి మహిమ చూపు,

      శిష్టులట్లు మెలఁగ శిష్టులా? తెలియుఁడు, - రామ కృష్ణ మాట రాచ బాట. 4.

ఆ:- తెలియనపుడు చెడ్డ తీరున నడచినన్ - దెలిసి చెడ్డ చేయ వలదు మనము,

      మంచి చేయు జనులు మహనీయు లిలలోన, - రామ కృష్ణ మాట రాచ బాట. 5. 

ఆ:- ధర్మ వర్తనంబు, దానంబు, శీలమున్ - గలిగి యున్న వారు ఘనులు భువిని,

      మనసు పరిమళించి మహనీయు లగుదురు, - రామ కృష్ణ మాట రాచ బాట. 6.

ఆ:- నీటిపైని వ్రాత నియమ హీనుని మాట, - చిత్త శుద్ధి లేక చెరిగి పోవు,

      మనసు వశము నున్న మాట నిలుపుటబ్బు, - రామ కృష్ణ మాట రాచ బాట. 7.

ఆ:- ప్రజల మధ్య నుండు పరమాత్మ నెఱుఁగక - పరుగు తీయుటేల భక్తి తోడ 

      కొండ లెక్కి చూడ కోనేటి రాయునిన్? - రామ కృష్ణ మాట రాచ బాట. 8.

ఆ:- గో మయంబు, సులభ గో మూత్ర, గో క్షీర, - గోవు దధియు, మరియు గో ఘృతంబు

      వైద్య గుణము కలిగి వరలించు సేవింప, - రామ కృష్ణ మాట రాచ బాట. 9.

ఆ:- సాధు గుణము కలిగి సత్పూజ్యమైనట్టి - గోవులిహము పరము కొలుపు నిజము,

      గోప బాలకుండె గోసేవ చేసెను! - రామ కృష్ణ మాట రాచ బాట. 10.

ఆ:- జీవమున్న మనిషి చేసిన పాపంబు  - జీవి యనుభవించు చెడిన పిదప,

      చేయనట్టి తనకు చెందుట ధర్మమా? - రామ కృష్ణ మాట రాచ బాట. 11.

ఆ:- శాశ్వతమ్ము కాదు విశ్వమే తలపోయ, - బ్రతుకు శాశ్వతమను భావ మేల?

      శాశ్వతుండు హరియె, సాక్షి యీ జగతికి, - రామ కృష్ణ మాట రాచ బాట. 12.

ఆ:- పాఠశాలలోని పంతుళ్ళ మాటకు - పరవశింత్రు, పిల్ల లరయు విద్య,

      పాఠశాలలోని పంతుళ్ళు దేవుళ్ళు, - రామ కృష్ణ మాట రాచ బాట. 13.

ఆ:- బుద్ధి చెప్ప దగిన పూజ్యులే దౌష్ట్యంబు - చేయుచున్న నేమి చేయ నగును?

      బుద్ధి నేర్చునట్టి బుడుతలే దండింత్రు, - రామ కృష్ణ మాట రాచ బాట. 14.

ఆ:- ఆకలికి తిననగు నధికంబు తిన రాదు, - పారవేయరాదు, బ్రహ్మ మదియె,

      ఆక లన్నవాని కది కాస్త పెట్టుడు, - రామ కృష్ణ మాట రాచ బాట. 15.

ఆ:- విత్త మమరి యున్న మత్తిల్ల బోకుండ - మంచి పనులు చేసి మసలఁ దగును,

      మత్తు డబ్బు, మనను చిత్తు చేయును కదా! - రామ కృష్ణ మాట రాచ బాట. 16.

ఆ:- అన్న వస్త్రములకు నారాట పడఁదగు,  - నధిక ధనము కొఱకు నాశ పడకు,

      పేదవాని కొఱకు ప్రాధేయ పడఁదగు, - రామ కృష్ణ మాట రాచ బాట. 17.

ఆ:- రామ రామ యనుచు రమ్యంబుగా పల్కఁ - బ్రేమతోడఁ గాచు రామ విభుఁడు,

      వట్టి మాటలాడి వదరుట మేల్కాదు, - రామ కృష్ణ మాట రాచ బాట. 18.

ఆ:- పత్నికన్న హితులు పరికింపఁగా లేరు, - పత్ని దైవ దత్త రత్నమయ్య,

      నీతి తప్పనట్టి నెలతయే దేవత, - రామ కృష్ణ మాట రాచ బాట. 19.

ఆ:- భర్త సాటి వాడు భార్యకెన్నగ లేడు, - భర్త ధర్మ బద్ధ వర్తనమున

      భార్య జీవితంబు ప్రాశస్త్యమును పొందు, - రామ కృష్ణ మాట రాచ బాట. 20.

ఆ:- పెద్దలైన వారు ప్రీతితో బుద్ధులు  - చెప్ప వలయు నెపుడు గొప్పగానుమ,

పిన్న లెన్న వలెను పెద్దల మాటలు, - రామ కృష్ణ మాట రాచ బాట. 21.

ఆ:- శాశ్వతమ్ము కాని సౌందర్య కాంక్షతో - పరుగు తీయ తగదు, ప్రజ్ఞ కలిగి

      శాశ్వతు హరి సేవ చక్కగా చేయుఁడు , - రామ కృష్ణ మాట రాచ బాట. 22.

ఆ:- జ్ఞాన ధనము కలుగ సర్వంబు సమకూరు, - జ్ఞాన ధనము సర్వ శక్తి కరము,

      జ్ఞాన హీనులకిల సౌఖ్యంబు కలుగదు, - రామ కృష్ణ మాట రాచ బాట. 23.

ఆ:- మత్తుమందు ధనము, మత్తురా మదిరాక్షి, - మత్తు స్వార్థ బుద్ధి మనుజులకును,

      మత్తు వీడ వలయు మహనీయ భక్తిచే, - రామ కృష్ణ మాట రాచ బాట. 24. 

ఆ:- తండ్రి చెప్పు నట్టి తత్వంబు కనఁ దగు - తండ్రి కన్న గురువు తలప లేడు,

      తండ్రి సేవ చేసి తరియింప తగునుగా! - రామ కృష్ణ మాట రాచ బాట. 25.

ఆ:- తల్లి ప్రేమ ముందు తండ్రి ప్రేమయు కూడ - నిలువ జాలదెపుడు,    

       నిరుపమమది,

      తల్లి దండ్రి మించు దైవంబు లేదుగా,- రామ కృష్ణ మాట రాచ బాట. 26.

ఆ:- తల్లి మనసు కన్న చల్లనైనది లేదు, - తండ్రి కన్న గొప్ప దాత లేడు,

      పిల్లలెపుడు గనుత ప్రేమతో వారిని, -  రామ కృష్ణ మాట రాచ బాట. 27.

ఆ:- బుద్ధి నిచ్చినట్టి పూజ్యుండు దైవంబు, - దైవ భక్తి తోడఁ దనియ వలయు,

      బుద్ధి హీనమైన పోకడ తగదిల, - రామ కృష్ణ మాట రాచ బాట. 28.

ఆ:- దైవ భక్తి కల్గి దైవ శక్తియు కల్గి - లోక సేవ చేయు శ్రీకరులను

      గౌరవించ వలయు, కల్యాణకరమది, - రామ కృష్ణ మాట రాచ బాట. 29.

ఆ:- దివ్యులందు మెలగు భవ్యుఁ డా దైవంబు, - మానవాళి నుండు మాధవుండు,

      మనుజ సేవ చేయ మాధవ సేవయౌ, -  రామ కృష్ణ మాట రాచ బాట. 30.

ఆ:- సత్వ భావముండి సన్మార్గ వర్తియౌ - ధైర్య వర్తనుండు ధక్షుఁడిలకు,

      దక్షులైనవారిఁ దనుపుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 31.

ఆ:- కామ క్రోధ లోభ ఘన మద మాత్సర్య - మోహ వర్తులు ధర మూర్ఖులెన్న,

      ధర్మ బద్ధులైన దైవాంశు లటు కారు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 32.

ఆ:- రామ పాద ధూళి రాతినే నాతిగా  - చేసె, ధర్మ మదియె వాసి గొల్పె,

      ధర్మ బద్ధుల కిల దక్కును సత్కీర్తి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 33.

ఆ:- శిష్ట జనుల మనసు దుష్టులు బాధింప - సృష్టి కర్త కలఁడు, చూచు నతఁడు.

      దుష్ట శిక్షణంబు తొడరక యొనరించు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 34.

ఆ:- పాప వర్తనమున పరవశించుచునుండి, - పాప కూపమందు పడగ నేల?

      కోప తాప జనిత పాపంబు మనకేల?  -  రామ కృష్ణ మాట రాచ బాట. 35.

ఆ:- జీవ హింస చేసి జీవింపగా నేల? - జీవి యన్నఁ గాదె దేవుఁ డిలను?

      జీవులందు దైవ భావంబు కలుగుత, -  రామ కృష్ణ మాట రాచ బాట. 36.

ఆ:- వృక్ష జాతి మనకు భృతి కొల్పి కాపాడు, - వృక్ష మెన్న జీవ రక్ష భువిని,

      వృక్ష నాశనంబు శిక్షార్హ నేరంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 37.

ఆ:- నిత్య పూజ్యులైరి నిరుపమ సత్కవుల్, - సత్య బోధ సేయు సరస మతిని,

      సత్య శోధకులకు సత్కవిత్వ మమరు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 38.

ఆ:- పంట పొలము లెల్ల ప్రాణ రక్షణ చేయు - పంట లిచ్చుచుండు, బ్రతుకు నిచ్చు,

      అట్టి పొలము లిండ్ల కట్టడంబులవేల? -  రామ కృష్ణ మాట రాచ బాట. 39.

ఆ:- కూర్మి తోడ గురువు పేర్మిని విద్యను - నేర్పు మనకు తనదు నేర్పు చూపి,

      అట్టి గురువు ఋణము నరసి తీర్చగనౌనె? -  రామ కృష్ణ మాట రాచ బాట. 40.

ఆ:- భక్తి తోడ గురువు పాద సేవలు చేసి - శిష్య కోటి మురియు శ్రీకరమని,

      పాద సేవకు తగు ప్రతిభులే గురువులు,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 41.

ఆ:- కూడు పెట్టు వారు, గూడు కొల్పెడి వారు - విద్య నేర్పువారు వేల్పులిలను,

      వీరి ఋణము తీర్చనేరికి సాధ్యమౌ? -  రామ కృష్ణ మాట రాచ బాట.  42.

ఆ:- కూడు గూడు లేక కుములు పేదల గాంచి - సాయ పడగ తగును సజ్జనులకు,

      తోటివారి యార్తి తొలగింప శుభమౌను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 43.

ఆ:- తల్లి దండ్రి వీడి, తన సోదరుల వీడి, - భర్త సర్వ మనుచు భార్య వచ్చు.

      అట్టి భార్య మనసు నరసి కావగ తగు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 44.

ఆ:- క్రొత్త కాపురమున యత్త మామల మధ్య - భర్త తోడ, యాడ పడుచు మధ్య

      బావ, మరిది మధ్య, బ్రతుక నేర్చును సాధ్వి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 45.

ఆ:- మాటలాడునపుడు మన్నించు మితరులన్, - జేటు రాదు మంచి మాటలాడ.

      మాటకారి యెపుడు మన్నన లందును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 46.

ఆ:- మంచి చెడ్డలకును మాటయే మూలము, - మంచి మాటకారి మహితుఁడిలను,

      మంచి చెడ్డలరసి మంచినే పలుకుఁడు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 47.

ఆ:- పుట్టినపుడు మనకు పుణ్య పాపము లేమి - తెలియ కుండు, కొంత తెలివి కలుగ

      మంచి చెడ్డ తెలియు, మర్యాద తెలియును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 48.

ఆ:- వంట యింటి లోన నొంటిగా పని చేసి, - భుక్తి నిడెడి స్త్రీలు శక్తి మనకు,

      అట్టి స్త్రీల మనసు కానందమందించు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 49.

ఆ:- అన్నదమ్ముల యెడ ననురాగ మొలికించు, - యాడపడచులున్న నఖిల మమరు,

      ఆడపడచు మనసు నరసి వర్తించుడు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 50.

ఆ:- బాల్యమందు బుద్ధి బలమును పెంచిన - పెద్దయైన పిదప పేరు పొందు,

      బుద్ధి బలము తోడ పూజ్యులై నిలుతురు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 51.

ఆ:- నీతి పాఠములను నేర్పిన పిననాడు - జాతి కీర్తి పెంచు నీతి నిలిపి,

      నీతిమంతు లిలను జాతికి మూలము, -  రామ కృష్ణ మాట రాచ బాట. 52.

ఆ:- స్వార్థ రహితమైన సత్సేవ శుభమగు, - స్వార్థ రహితుఁడెన్ను సర్వ జగతి,

      స్వార్థ రహిత జీవి సర్వాత్ముఁడగు హరి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 53.

ఆ:- భూమిపైన పుట్టి బుద్ధి జీవులమయి - పుణ్య పాపములకు మూల మెఱిగి,

      మంచి చేయకుంట మర్యాద కాదుగా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 54.

ఆ:- రావణాదులెల్ల రాక్షస వృత్తిచే - నేమి లాభ పడిరి భూమిపైన?

      రాక్షసత్వ మెపుడు రాణింపు నీయదు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 55.

ఆ:- పాఠశాలలోన ప్రఖ్యాతమైనట్టి - పలుకుబళ్ళు నేర్ప ప్రతిభులగుచు,

      భావి జీవితమున పరువుగా మనుదురు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 56.

ఆ:- జ్ఞాన సాధనమున ప్రాణంబులను కూడ - లెక్క చేయరాదు, స్రుక్క రాదు,

      జ్ఞానమబ్బినంత కన్పించు సత్యంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 57.

ఆ:- తప్పు చేయఁ బూన నొప్పును చెప్పెడు – నంతరాత్మ, దాని నరయ రేల?

      ఆత్మ చెప్పుదాని నాచరించుట మేలు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 58.

ఆ:- ప్రాప్తమైన దాని పరవశించుచుఁ బొందు – బద్ధకిష్టి, ఘనులు పట్టు పట్టి

      కోరుకొన్న ఫలము గొనకుండ వీడరు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 59.

ఆ:- సరస గుణము కలిగి, సభ్యత పాటించి, - సుజన పాళి మెచ్చ సుగుణులుంద్రు,

      స్వజన పాళి మెచ్చ సుజనులై మెలఁగుడు,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 60.

ఆ:- ఆర్తి తోడ తీర్థ యాత్రలు చేయుచు - క్షేత్ర దర్శనంబు చేయుచుంద్రు.

      క్షేత్ర వర్తి దేహి గాత్రస్థుఁ డరయుఁడీ! -  రామ కృష్ణ మాట రాచ బాట. 61.

ఆ:- భక్తి తోడ కొలిచి, పరమాత్మునకు మ్రొక్కి, - చెత్త కోర్కెలడిగి చెడుటదేల?

      వరలఁ జేయునట్టి వర్తనం బడుగుఁడు. -  రామ కృష్ణ మాట రాచ బాట. 62.

ఆ:- జీవ కోటి లోని జీవంబు దైవంబు, - జీవులెల్ల కనగ దైవమయ్యె,

      జీవ కోటిని తిని జీవింప న్యాయమా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 63.

ఆ:- కన్నులిచ్చె తనను కనుగొన దైవంబు, - కన్నులున్న మనము కనునదేమి?

      మాయ గొల్పునట్టి మట్టి బొమ్మలె కదా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 64.

ఆ:- కంటి ముందు మనకు కనబడునది యెల్ల - కలుగ దెల్ల వేళ, కలుగు నొకటి

      జ్ఞాన నేత్రమునకుఁ గనఁబడు దైవంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట.  65.

ఆ:- బాల్యమందు మనము పాట లాటల తోడ, - యౌవనమున భ్రాంతు లలమి బ్రతుక,

      వృద్ధత నల జ్ఞాన వృద్ధిఁ బొంద తగదె? -  రామ కృష్ణ మాట రాచ బాట. 66.

ఆ:- త్రికరణ పరిశుద్ధ దివ్య వర్తనులకు - నాత్మ తృప్తి కలిగి యలరుదు రిల,

      ఆత్మ తృప్తి పొంది, హాయిగా బ్రతుకుడీ! -  రామ కృష్ణ మాట రాచ బాట. 67.

ఆ:- తనివి కల్గి యున్న తృణమైన ఘనమౌను, - తనివి లేని వానిఁ దనుపు నెద్ది?

      తనివి పొంద సుఖము దక్కును నిజముగా, -  రామ కృష్ణ మాట రాచ బాట. 68.

ఆ:- నగర జీవనంబు నరక కూపంబని - పలుక నేల నీకు పాలు లేదె?

      శుచిగ శుభ్ర మొనరఁ జూడుము నీవును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 69.

ఆ:- ఆత్మ శక్తి యున్న నపురూప తత్వంబు - మదికిఁ గాన వచ్చు మానవులకు,

      ఘన త్రికాలవేది కాగల మరయగా, -  రామ కృష్ణ మాట రాచ బాట. 70.

ఆ:- దేశ భక్తి యనెడి దివ్య భావులు భువి - త్యాగరాజులయిరి దానములిడి.

      దేశ భుక్తు లిపుడు తినుచుండ్రి సర్వమ్ము, -  రామ కృష్ణ మాట రాచ బాట. 71.

ఆ:- మాన ధనము కల్గ మానవు లనఁబడు, - మానహీన జనులు మానవులొకొ?

      మాన ధనము నకును ప్రాణంబు సరి కాదు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 72.

ఆ:- మాటలాడునపుడు మంచిగా చింతించి, - మంచి మాటలాడు మంచివారు,

      మంచి మాటలాడ మర్యాద పెరుగును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 73.

ఆ:- దుష్ట భావనంబు, దుష్ట భాషణయును, - దుష్ట చేష్ట యెన్న దురిత మొసగు,

      శిష్ట వర్తనంబు చిత్స్వరూపంబెంచ, -  రామ కృష్ణ మాట రాచ బాట. 74.

ఆ:- దురిత గతులు వీడి పరువిడు మార్గాన - సత్య వర్తి నడచు సరస మతిని,

      పుణ్య మార్గమెంచి పోవుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 75.

ఆ:- పూల యందు మధువు పొలుపొందు చందాన - పుణ్యులందు సుగతి పొర్లుచుండు,

      పుణ్యు ననుసరించి పోవుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 76.

ఆ:- పాపి ననుసరించ పాప కూపమునందు - పాతుకొనుచు పోవు భవ్యుఁడయిన,

      పుణ్యు ననుసరించ పూజింపఁబడు కదా! -  రామ కృష్ణ మాట రాచ బాట. 77.

ఆ:- మార్గదర్శి యైన మాతృమూర్తి గుణము - ధనము పగిది వచ్చు తనయులకును,

      మాతృ మూర్తి సతము మంచిగా వరలుత! -  రామ కృష్ణ మాట రాచ బాట. 78.

ఆ:- భావమందు మంచి ప్రబలిన సతతము - భాష యందు కూడ ప్రబలు. సుకర

      భావ భాషణములు ప్రఖ్యాతి నొడఁగూర్చు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 79.

ఆ:- యుగము పేరు చెప్పి తెగిపోదు ధర్మంబు - యుగములెల్ల మనలఁ దగిలి యుండు,

      ధర్మ వర్తికి కృత ధర్మమే కలియును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 80.

ఆ:- సూర్య కాంతి చూచి శోభిల్లు పద్మము, - చలువ రేని కాంతి కలువ వలచు,

      సత్య తేజసంబు సన్మార్గి వలచును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 81.

ఆ:- వేద సారమెల్ల విశ్వంబునకు చాటి,- సృష్టి మూల మెల్ల చెప్పినట్టి

      భారతమ్మబిడ్డ లారయ ఘనులుగా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 82.

ఆ:- సృష్టి కర్త నెఱిగి, సృష్టి మూల మెఱిగి - కష్ట కారణములు కనుచు, సతము

      నిష్ట తోడ బ్రతుక నేర్చుట ధర్మంబు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 83.

ఆ:- భారతాంబ తనయ భారతీ దేవియు, - పార్వతమ్మ మరియు. భాగ్య లక్ష్మి,

      ముగ్గురమ్మల సరి మురిపాల స్త్రీ మూర్తి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 84.

ఆ:- అక్క యన్న మాట చక్కని కావ్యంబు, - తమ్ము కుఱ్ఱలకును ధర్మ దర్శి 

      నక్క యమ్మ కంటె చక్కని తల్లిరా, -  రామ కృష్ణ మాట రాచ బాట. 85.

ఆ:- శక్తి చూపి పంట చక్కగా పండించి, - ప్రజలఁ గాచు రైతు వామనుండు,

      రైతుబిడ్డ జన్మ రాణింపగా వలె,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 86.

ఆ:- మాయ మాటలాడి మర్యాద మీరెడి - మాన హీనులున్న మహిని, మహిళ

      ప్రాణ సంకటంబు పడకుండ కాచుడు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 87.

ఆ:- కవుల కలము ఘనత కవితలఁ గననగు, - కవుల మనసు వెన్న, కరుణకు నిధి,

      సుకృత కవుల నరసి సుజనులు మన్నింత్రు,  -  రామ కృష్ణ మాట రాచ బాట. 88.

ఆ:- ప్రజల జీవ నాడి పట్టును సత్కవి, - ప్రజల కవిగ భువిని పరిఢవిల్లు,

      ప్రజల మేలు కోరి  పండించు కృతులను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 89.

ఆ:- పాఠములను చెప్పు బాపడు గుణ హీన - పాంశుడైన చెరచు బాల లనట,

      బాల లందు గుణము వరలింప గురువౌను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 90.

ఆ:- మానవులకు నెంత మహిమ లున్నను గాని - జీవ శక్తి పరిధి చేర్చు తుదికి,

      తుదికి చేరనట్టి ధుర్యుండు దేవుండు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 91.

ఆ:- శాశ్వతమ్ము కాని స్వశరీర వాంఛలు - తీర్చ కోరుటెల్ల తెలివి లేక,

      శాశ్వతాత్మ ముక్తి చక్కని కోరిక, -  రామ కృష్ణ మాట రాచ బాట. 92.

ఆ:- ఆకలున్న వారి కన్నంబు కడుపార - ప్రేమతోడ పెట్ట ప్రీతి నొందు,

      ప్రీతి నొంద వారు ఖ్యాతి మీ కమరును, -  రామ కృష్ణ మాట రాచ బాట. 93.

ఆ:- గుడుల కేగి మనము కొలిచి దేవుని కోరు - పెక్కు కోరికలకు భీతి నొంది

      కఠిన శిలగ మారె కాంచుడీ దేవుని, -  రామ కృష్ణ మాట రాచ బాట. 94.

ఆ:- పుస్తకమ్ము పట్టి, బుద్ధి నావలఁ బెట్టి - చదువ నేమి ఫలము? మదికి పోదు.

      శ్రద్ధ తోడ చదువ చక్కగా మదికెక్కు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 95.

ఆ:- కాల గతిని నిలిచి కాలుని చేరక  - యున్న వారు లేరు పన్నిదముగ,

      దైవ శక్తి కల్గు ధన్యాత్ము లుందురు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 96.

ఆ:- విద్య నేర్పు నపుడు విజ్ఞానమును గొల్పు - శాస్త్ర పద్ధతిఁ గని జరుప వలయు,

      నేర్చునట్లు చేయు నేర్పుతో సాధ్యము, -  రామ కృష్ణ మాట రాచ బాట. 97.

ఆ:- చదువుడనుచు చెప్ప, చదివింప చదువరు, - చదువుచున్న గాని మదికి పోదు,

      చదువ దగిన దాని చర్చింప చదువబ్బు -  రామ కృష్ణ మాట రాచ బాట. 98.

ఆ:- గ్రామ సభల లోన ప్రేమగా పలికెడి - గ్రామ పెద్ద మనము కలువ బోవ

      కానఁడు మనవైపు, కరుణఁ జూడడదేలొ? -  రామ కృష్ణ మాట రాచ బాట. 99.

ఆ:- చిత్ర దర్శకాళి పాత్రలే మారెను, - చూడ రానివన్ని చూపుచుండు,

      చూడ తగిన నీతి చూపిన మేలౌను, -  రామ కృష్ణ మాట రాచ బాట. 100.

ఆ:- పుట్టినట్టివారు పుణ్యాత్ములైనచో - పూజనీయు లవరె బుద్ధి కలిగి?

      పాప కర్ముఁడెపుడు కోపాగ్నితో నొప్పు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 101.

ఆ:- భాగ్యమున్న వారు భాగ్య హీనులఁ గని - సాయపడు టనునది సరస గుణము,

      పాడినెక్కునాడు భాగ్యంబు రాదుగా? -  రామ కృష్ణ మాట రాచ బాట. 102.

ఆ:- దీన బంధు వగుచు దీపించు నెవ్వారు - వారు బ్రతికి యున్న వారు భువిని,

      దీన జనులఁ గనని జ్ఞానియు నజ్ఞాని, -  రామ కృష్ణ మాట రాచ బాట. 103.

ఆ:- శత్రు షట్కమునకు మిత్రులై చెడుటయో? - శత్రువగుచు నాత్మ శక్తి గనుటొ?

      ఎంచి చూడ రెంట నేది మేలందురు? -  రామ కృష్ణ మాట రాచ బాట. 104.

ఆ:- మిత్రులార! సుగుణ పాత్రులారా! నను - శత్రు వనుచుఁ దలపఁ జక్క కాదు,

      ధర్మ వర్తనమును దర్శింపఁ జేసితి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 105.

ఆ:- పద్యమందు కాని, భావమందున కాని - దోష లేశమున్న దూర వలదు,

      మంచి గాంచి మీరు మంచినే గొనఁ దగు, -  రామ కృష్ణ మాట రాచ బాట. 106.

ఆ:- నీతి శతక రచన ఖ్యాతి చింతా రామ - కృష్ణ రావు చేసె తృష్ణ తోడ,

      వాణి కృపను జేసి పన్నుగ నొక నాడె, -  రామ కృష్ణ మాట రాచ బాట. 107.

ఆ:- మంగళంబు కలుగు మహనీయులగు మీకు, - మంగళంబు సుకవి మాన్యులకును,

      మంగళంబు హరికి, మహనీయ లక్ష్మికి, -  రామ కృష్ణ మాట రాచ బాట. 108.

శ్రీమత్కాణ్వశాఖీయులై కౌశికగోత్రులయిన చింతా వేంకట రత్నం, సన్యాసి రామా రావు  

పుణ్య దంపతుల పుత్రుండును, 

శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్యుల వారి ప్రియ శిష్యుండును, 

శ్రీ షిరిడీశ దేవ శతక, శ్రీ వేణు గోప ( కంద - గీత - గర్భ చంపకోత్పల ) శతకశ్రీ శివాష్టోత్తర శత పంచ చామరావళి నామంబునంబరగు శివ శతక, వృద్ధ బాల శిక్ష శతక, సుందర ( రామాన్వయ కంద - సీతాన్వయ గీత గర్భ హనుమదన్వయ ఉత్పల) నక్షత్రమాలాద్యనేక గ్రంథ కర్తయు, ఆంధ్రామృతం http://andhraamrutham.blogspot.com బ్లాగు నిర్వాహకుండునగు చింతా రామ కృష్ణా రావు తేదీ. 01- 01- 2012. ని విరచించిన 

రామ కృష్ణ శతకము సంపూర్ణము. 

స్వస్తి.