గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 92వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

92. ఓం జగద్వ్యాపినే నమః.

కమలవిలసిత వృత్త గర్భ సీసము. 

మనుజుల మదులను మలినము బాపన్గ - భక్తితత్పరతను వరలఁ జేసి,

ఘనతను గొలపను కరుణను బ్రోవన్గ - భక్త రక్షణ పూర్ణ భావనమున

మనముల నిలిచిన మహితుఁడ వీవేర! - మముఁ బ్రోచు యాదాద్రి మాన్యదేవ!

కనుమయ కృప మము ఘన నరసింహాఖ్య! - వర దైవమా! నీవె వరము మాకు.

గీ. కమల విలసిత శ్రీశుఁడా! ప్రముద మొసగి - పాఠకాళిన్ *జగద్వ్యాపి*! వరలఁ గనుమ! 

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

92వ సీస గర్భస్థ కమలవిలసిత వృత్తము. (న న న న గగ .. యతి 9) 

మనుజుల మదులను మలినము బాపన్ 

ఘనతను గొలపను కరుణను బ్రోవన్ 

మనముల నిలిచిన మహితుఁడ వీవే 

కనుమయ కృప మము ఘననరసింహా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా!పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మమ్ములను కాపాడు యాదాద్రివాసా! మానవులలో

మలినము పోగొట్టుట కొఱకు భక్తిని కల్పించి, ఘనత  కొలుపుటకని,కరుణతో కాపాడుటకని, భక్తరక్షణ భావముతో

మనస్సులలో నిలిచిన ఘనుడవీవే.. నీవే మాకు వరము.. కృపతో మమ్ము కనుము. కమలవిలసితవృత్తస్థశ్రీశా! ఓ

జగద్వ్యాపీ! పాఠకాళికి ప్రముద మొసగి వరలఁజేయుము.

జైహింద్.  

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.