జైశ్రీరామ్.
63. ఓం పురుషోత్తమాయ నమః.
కుసుమవిచిత్ర వృత్త గర్భ సీసము.
వినుత మహాత్మ! విధిని విధించన్ దేవ! - ప్రణుతులు కొనుమయ్య పద్మనయన!
ఘనుఁడవు కానన్ కను నయవర్తీ! నన్ను, - గమ్యంబు చేర్చరా! కామితదుఁడ!
క్షణమున నిన్నున్ గను నయరీతిన్ ముద - మున మనసారగా కనుచునిమ్ము.
కనుఁగొను నేర్పున్ గనునటులిమ్మా. కోరి - కను తీర్చి కాపాడు కరుణతోడ.
గీ. కుసుమ సువిచిత్ర గర్భ సీస సుమవాస! - పూజ్య *పురుషోత్తమా*! నన్నుఁ బ్రోవుమయ్య!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
63వ సీస గర్భస్థ కుసుమవిచిత్రవృత్తము. (న య న య .. యతి 7)
వినుత మహాత్మ! విధిని విధించన్ - ఘనుఁడవు కానన్, గను నయవర్తీ!
క్షణమున నిన్నున్ గను నయ రీతిన్ - గనుఁగొను నేర్పున్ గనునటులిమ్మా.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రస్తుతింపఁబడు ఓ పద్మనేత్రా! విధిని శాసించుట కొఱకు
నా వందనములు స్వీకరింపుము. ఓ నయవర్తీ! నీవు ఘనుఁడవు కావున నన్ను చూడుము. కోరికలనీడేర్చువాఁడా! నన్ను
గమ్యమునకు చేర్చుము. నన్ను మనసారా చూచి క్షణములో నిన్ను చూచు నయమార్గమును ప్రసాదించుము. నిన్ను
చూడఁగలిగిన నైపుణ్యమును నిన్ను చూచెడి శక్తిని ప్రసాదింపుము. నా కోరిక తీర్చి నన్ను కాపాడుము. కుసుమ వృత్త గర్భ
సీస సుమ నివాసా! పూజ్యుఁడవైన పురుషోత్తమా నన్ను బ్రోవుము.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.