గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 48వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

48. ఓం సర్వేశ్వరాయ నమః.

ప్రియంవద వృత్త గర్భ సీసము.

కుసుమాస్త్ర జనక సరసిజాననుఁడ! సన్ను - తాత్ముఁడా! శుభులకు హాయినిమ్ము.

క్షమనొప్పునట్టి పరమ భక్త పరిపాల - కా! హరీ! బాపుమా మోహపటిమ.

ప్రియమునన్ గనుచు దరిని నిల్చి రహదారి - చూపుమా పాపముల్ పాపుమయ్య.

రయమున నీవు కరము బట్టి మము గావు - మా ప్రభూ! కనుమయ్య మమ్ము నీవు.

గీ. పేర్మి నిట్టి ప్రియంవద వృత్త గర్భ - సీస *సర్వేశ్వరా*! నుతుల్. శేషశాయి

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

48 సీస గర్భస్థ ప్రియంవద వృత్తము. ( .. యతి 8)

సరసిజాననుఁడ! సన్నుతాత్ముఁడా! - పరమ భక్త పరిపాలకా! హరీ!

దరిని నిల్చి రహదారి చూపుమా! - కరము పట్టి మము గావుమా ప్రభూ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహామన్మధ జనకుడవైన పద్మ ముఖా! సన్నుతాత్ముఁడా!

శుభప్రదులకు సుఖమునిమ్ము.క్షమాగుణము గల భక్తపాలా! హరీ! మాలోని మోహపటిమను తొలగించుము.

.ప్రియముతో మమ్ము చూచుచు మా దగ్గరుండి జీవనమార్గమును చూపుము..మాపాపములను పోగొట్టుము. మా చేయి పట్టి

వేగముగా మమ్ము కాపాడుము, మమ్ములనెల్లప్పుడూ చూచుచుండుము. .ప్రియంవదవృత్త గర్భ సీసస్థ సర్వేశ్వరా!

శేషశాయీ! నీకు మా నుతులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.