గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మహామృత్యుంజయ మంత్రము… శుక్ల యజుర్వేద సంహిత, 3.60, ఋగ్వేదం 7.59.12

జైశ్రీరామ్. 

మహామృత్యుంజయ మంత్రము.

శుక్ల యజుర్వేద సంహిత, యజుర్వేదం 1.8.6.....3.60

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || 

ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనం |

ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్ || ఓం ||

ఉ.  జీవ సుగంధమున్ జిలుకి, జీవు లపుష్టిని పెంచునట్టి, సద్

భావ త్రినేత్రునిన్ దలచి, ప్రార్థన చేసెద, దోసపండటుల్

నే విడి మృత్యుబంధమును, నేవిడకుండెద నాత్మసుస్థితిన్,

జీవము బ్రహ్మమున్ గలియఁ జేయుగ సాధన చేయుమా హరా!

‘మృత్యుంజయ’ అంటే మరణాన్ని జయించడం అని అర్థం. మరణాన్ని జయించడానికైన మంత్రంగా దీనిని పేర్కొంటారు.

మరణాన్ని జయించడం అంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం అని అర్థం కాదు. శరీరం నుండి ప్రాణం విడివడడం మరణం, దీన్ని బుద్ధిపూర్వకంగా, అంటే జీవిస్తూవున్నప్పుడే శరీరాన్ని తనకు భిన్నమైనదని అనుభూతి మూలంగా తెలుసుకోవడమే మరణాన్ని జయించడం. విరాగ భావనతో జీవిస్తున్న వ్యక్తిని శరీర పతనం ఏ విధంగాను బాధించదు. నిజానికి తాను శరీరం కాదు, దాన్లో నెలకొని వున్న నాశానంలేని ఆత్మ అని అతడు తెలుసుకొంటాడు. అతడు మరణాన్ని జయిస్తాడు. అటువంటి ఒక ఫలానా స్థితి నిమిత్తం ప్రార్థన చేస్తుంది యీ మంత్రం.

ఇంటినుండి బయటకు వెళుతున్నప్పుడు యీ మంత్రాన్ని జపించడం మనలను ఆపదలనుండి, ప్రమాదాలనుండి రక్షిస్తుందని చెప్పుకోవడం కద్దు.

మరణించిన వారిని ఉద్దేశించి యీ మంత్రం జపిస్తే వారికి సద్గతి లభిస్తుంది; ముఖ్యంగా అకాల మరణం చెందినవారిని ఉద్దేశించి యీ మంత్రాన్ని జపిస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందని చెబుతారు.

ఓం సుగంథం పుష్టివర్ధనం |

ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మా మృతమ్ || ఓం ||

సుగంధిం = సుగంధం వెదజల్లే; పుష్టివర్ధనం = ఆహారం ఒసగి పోషించేవాడూ; త్ర్యంబకం = త్రినేత్రుడూ అయిన పరమశివుని; యజామహే = ఆరాధింతుము. ఉర్వారుకమివ = దోసపండు కాడనుండి విడివడునట్లు; మృత్యోః = మరణంయొక్క; బంధనాత్ = పిడికిలినుండి; ముక్షీయ = విడివడతాముగాక; అమ్రుతాత్ = ఆత్మస్థానం నుండి; మా = విడివడక ఉందాం గాక!

సుగంధం వెదజల్లేవాడూ, ఆహారం ఒసగి పోషించేవాడూ, త్రినేత్రుడూ అయిన పరమేశ్వరుని ఆరాధిస్తాం. దోసపండ కాడనుండి విదివడేటట్లు మరణం పట్టునుండి విడివడుదుము గాక. ఆత్మస్థితి నుండి విడివడక ఉందుము గాక!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.