గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 23వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

23. ఓం జ్వలన్ముఖాయ నమః

ప్రముదితవదన వృత్త గర్భ సీసము.

భువి ప్రసన్నత, నయము ప్రియము కానగన్ - మాధవున్, ప్రార్థించి మసలుచుండి

మతిని నిలిపి, భయము తొలఁగ, ప్రాభవం - బొప్పఁగా గొల్చిననొనరు సుగతి.

సుచరితమున, నియతిఁ, జరణ సన్నిధిన్ - సేవలన్ జేసిన జిత్తమలరు.

సుకృతి పెఱుఁగ జయము కలుఁగ నాశ తోఁ - జేయనౌన్ స్మరణ మా చేవ చూపి.     

గీ. “ప్రముదితవదన గర్భ సీసమున వెల్గు - దుష్టపాళి *జ్వలన్ముఖా*! శిష్టరక్ష

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

23 సీస గర్భస్థ ప్రముదిత వదన. ( .. యతి 8)

నయము ప్రియము కానగన్ మాధవున్, - భయము తొలఁగ, ప్రాభవం బొప్పఁగా,

నియతిఁ జరణ సన్నిధిన్ సేవలన్ - జయము కలుఁగ నాశ తోఁ జేయనౌన్.   

భావము.

ప్రముదిత వృత్త గర్భ సీసమున వెలుగొందుచున్నవాడా! దుష్టుల సమూహము విషయమున జ్వలన్ముఖుఁడా! శిష్ట రక్షకా!

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! భువిపై ప్రసన్నత, నీతి, ప్రియము కాంచుట కొఱకు

మాధవుని ప్రార్థించుచు మసలుచుండి, మనసు నిలిపి. భయము తొలఁగి పోవగా ప్రాభవము కనఁబడునట్లుగా కొలిచిన

సుగతి ప్రాప్తించును. మంచి ప్రవర్తనతో నియమముతో,  నీ పాదముల సమీపమునసేవలు చేసినచో మనసు పొంగును.

చేసిన  మంచి పెఱుఁగుట కొఱకు, జయము కలుగుట కొఱకు ఆశ కలిగి మా చేవ చూపిసేవ చేయనగును.     

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.