గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 44వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

44. ఓం సర్వకర్తృకాయ నమః.

అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము.

కూర్మితోడ సిరులు కురిపించునట్టి శ్రీన్ - జేరి కూర్మి వరలఁ జిత్ప్రభాస! 

చిత్రమైన వర నృసింహంబుగా నీవ - ప్రభవమొందఁగ ఘన ప్రభలతోడ.

శ్రీధరుండ! ధరను యాదాద్రి వర నుత - ధామమయ్యెను కద! తండ్రివీవె.

ధుర్య వర్య! కరుణతో భక్త వరులను - కను నృసింహ! సదయ వినుము మనవి.

గీ. విశ్వ భర *సర్వకర్తృకా*! శాశ్వతమగు - శుభసుచరితంబు కొల్పి నన్ జూడుమయ్య!

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

44వ సీస గర్భస్థ అంతరాక్కర. (1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము ..

                                                యతి 3వ గణము చివరి అక్షరము)

సిరులు కురిపించునట్టి శ్రీన్ జేరి కూర్మి - వర నృసింహంబుగా నీవ ప్రభవమొంద,

ధరను యాదాద్రి వర నుత ధామమయ్యె. - కరుణతో భక్త వరులను కను నృసింహ! 

44వ సీస గర్భస్థ తేటగీతి.

సిరులు కురిపించునట్టి శ్రీన్ జేరి కూర్మి - వర నృసింహంబుగా నీవ ప్రభవమొంద,

ధరను యాదాద్రి వర నుత ధామమయ్యె. - కరుణతో భక్త వరులను కను నృసింహ! 

44వ సీస గర్భస్థ ఆటవెలదిద్వయము. 

1.కూర్మితోడ సిరులు కురిపించునట్టి శ్రీన్ - జేరి కూర్మి వరలఁ జిత్ప్రభాస! 

చిత్రమైన వర నృసింహంబుగా నీవ - ప్రభవమొందఁగ ఘన ప్రభలతోడ.

2.శ్రీధరుండ! ధరను యాదాద్రి వర నుత - ధామమయ్యెను కద! తండ్రివీవె.

ధుర్య వర్య! కరుణతో భక్త వరులను - కను నృసింహ! సదయ! వినుము మనవి.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! ఓ శ్రీధరా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత

జనమున ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ చిత్ప్రభాసా! ప్రేమతో సిరులను

కురిపించునటువంటి లక్ష్మీ దేవిని చేరి వరలుట కొఱకు చిత్రమైన నరసింహ రూపముతో గొప్ప కాంతులతో నీవు

ప్రభవింపగా ఈ యాదాద్రి శ్రేష్ఠమైన పొగడఁబడెడి ప్రదేశమయ్యెను. మమ్ములను భరించెడివాడవైన తండ్రివి నీవే.

కరుణతో భక్తులను చూడుము దయతో మా మనవి వినుము.. విశ్వభరుడవైన ఓ సర్వకర్త్రుకా!  శాశ్వితమైన శుభప్రదమైన

మంచి ప్రవర్తన నాకు ప్రసాదించుచు నన్ను చూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.