జైశ్రీరామ్.
60. ఓం అధ్భుతాయ నమః.
మౌక్తికమాల వృత్త గర్భసీసము.
జీవము నీవేర! స్థితియు నీవేనురా! - జీవికవీవె నా జీవితేశ!
భావము నీవే, విభవము నీవే ధరన్. - గౌరవమీవేను, ఘనుఁడవీవె.
దేవుఁడ వీవే మదిఁ గన నీవేనురా! - రావేలరా నాకు రక్షనీయ.
నావయు నీవేను నడుపుదీవే సదా. - నావాడ నరసింహ! నీవె దిక్కు.
గీ. వినుత మౌక్తిక మాలస్థ! వినుము భవ్య! - *అద్భుతా*నంద రూప నన్నాదుకొమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
60వ సీస గర్భస్థ మౌక్తికమాల. (భ త న గగ .. యతి 7)
జీవము నీవేర! స్థితియు నీవే. - భావము నీవే విభవము నీవే.
దేవుఁడ వీవే మదిఁ గన నీవే. - నావయు నీవేను నడుపుదీవే.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నా జీవము, స్థితి, జీవిక,అన్నియు నీవే. భావము నీవే ఈ
విభవము నీవే, గౌరవమనునదియును నీవే, నీవే ఘనుడవు..దేవుఁడవు నీవే, నన్ను రక్షింపరావేల? ఓఅద్భుతానందరూపా!
నా మాట వినుము.
నన్నాదుకొనుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.