గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 51వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

51. ఓం దివ్యాయ నమః.

అలసగతి వృత్త గర్భ సీసము.

నిగమవేద్యా! అలసగతి నుంటిని. సహా - యివయి రావా సద్విభవమగుచును?

దయ చేసి యీ చలితమగు నా మదిని - క్కగను జేయన్ స్థితిన్ గలుఁగఁ జేయ.

ప్రముదంబుగా పలుకుమయ. పుణ్య ఫల భా - విత నృసింహా! నన్నుఁ బ్రేమఁ జూడు.

శ్రమకోర్చుకొని నిలుము మది నీవికను ని - త్యముగ దేవా! నిత్య ధర్మనిలయ.  

గీ. అలసగతి గర్భ సీసస్థ! వెలయుము మది. - భావ సంభాస *దివ్యా*! ప్రభావమిమ్ము.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

51 సీస గర్భస్థ అలసగతి. ( .. యతి 10)

అలసగతి నుంటిని. సహాయివయి రావా.

చలితమగు నా మదిని జక్కగను జేయన్.

పలుకుమయ పుణ్య ఫల భావిత నృసింహా!

నిలుము మది నీవికను నిత్యముగ దేవా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! వేదవేద్యా! నీను అలసగతినున్నాను.

మంచివిభవముగానగుచు నాకు సహాయిగా రమ్ము. చలించు నా మనసును దయతో చక్కగా చేయుటకు స్థితిని

కలుగ జేయుటకుప్రముదముతో మాటాడుము. పుణ్య ఫలమును కలుగ జేయు నృసింహా నన్ను ప్రేమతో చూడుము.

నిత్య ధర్మ నిలయా! శ్రమను భరించి నా మనసులో నీవిక నిత్యముగా ఉండుము.అలసగతి వృత్తగర్భసీసపద్యస్థుఁడా!

నా మదిని వెలయుము.నా భావమున ప్రకాశించు దివుఁడా! నాకు ప్రభావమునిమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.