గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 36వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

36. ఓం దైత్యదానవ భంజనాయ నమః.

విద్రుమలతా వృత్త గర్భ సీసము.

నిరుపమ! కొల్చెద నిను నిరతమిలన్ సు - సౌందర్య లహరివి సారసాక్ష!

తరుణము కావఁగ, ధరను ననుఁ గనన్ - కలనయినం గని కావుమయ్య!

చరణములందుదు సమయమిది హరీశ! - స్మరణమె ముక్తిని చక్కనిచ్చు.

వరముగనందుమ వరలఁ గన ననున్ వి - వర్ధిలఁ జేయుమ, భవ్య నృహరి!

గీ. విద్రుమలతగర్భ సీసస్థ! వెలసి మదిని - *దైత్యదానవ భంజనా*! తనియనిమ్ము

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

36 సీస గర్భస్థ విద్రుమలతావృత్తము. ( .. యతి 8)

నిరుపమ! కొల్చెద నిను నిరతమిలన్

తరుణము కావఁగ, ధరను ననుఁ గనన్

చరణములందుదు సమయమిది హరీ!

వరముగనందుమ వరలఁ గన ననున్.

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేని వాడా! నిన్ను కొలిచెదను. సారసాక్షా! నీవు

మంచి సౌందర్యకెరటమే..  భూమిపై నన్ను చూచుటకు కాపాడుటకు ఇదే మంచి సమయము. నా కలలోనైనను నన్ను

చూచి  కాపాడుము. హరిపరమాత్మా! ఇది మంచి సమయము. నీ పాదములందుకొందును. .నీ స్మరణమె చక్కగా

ముక్తినిచ్చును కదా.నన్ను వరలునట్లు చూచుటకు నీవు నాకు వరముగా లభించుము. గొప్పవాడవైన నరహరీ నను

ప్రవర్ధిలఁ జేయుమయ్యా. దైత్య దానవ భంజనా! విదృమ వృత్తగర్భ సీసపద్యమున కలవాడా! నా మనసున వెలసి

నన్ను తృప్తిపడనిమ్ము. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.