జైశ్రీరామ్.
13. ఓం త్రివిక్రమాయ నమః.
లలితగతి వృత్త గర్భ సీసము.
హిత కలిత! సుర వినుత, శుభ కలిత, సుం - దర పదా! గోవింద! శరణు శరణు.
ముదమొసఁగు పరమపద మొసగు మిక భ - క్త సులభా! కేశవా! కావు మీవె.
మనమునను నిరతమును నినుఁ గనెడి నే - ర్పునిడుమా. కృపతోడ ప్రణవరూప!
ప్రవరుఁడవు. నరహరివి మనవి విని న - న్ను కనుమా! మాధవా! ప్రకటితముగ.
గీ. సత్య వేద్య *త్రివిక్రమా*! సార్వభౌమ! - నీవు లేనట్టిదేది? మా నీరజాక్ష!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
13వ సీస గర్భస్థ లలితగతి వృత్తము. (న న న జ స .. యతి 11)
సుర వినుత శుభ కలిత సుందర పదా! - పరమపద మొసగుమిక భక్త సులభా!
నిరతమును నినుఁ గనెడి నేర్పునిడుమా. - నరహరివి మనవి విని నన్ను కనుమా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! హితముతో కూడుకొన్నవాఁడా!
శుభములతో
కూడుకొన్నవాఁడా! దేవతలచే పొగడఁబడెడి అందమైన పాదములు కలవాఁడా! ఓ గోవిందా! శరణమునిమ్ము.
భక్త
సులభుఁడా! ఓ కేశవా! సంతోషమును ఇచ్చెడి పరమపథమును నాకు దయచేయుము. నీవే కాపాడుము. ఓ ప్రణవ
స్వరూపుఁడా! మనస్సులో ఎల్లప్పుడు నిన్ను చూచెడి నైపుణ్యమును కృపతోనిమ్ము. ఓ మాధవా! నీవు మిక్కిలి శ్రేష్ఠుఁడవు,
నారసింహుఁడవు, నా మనవినాలకించి స్పష్టమగునట్లుగా నన్ను చూడుము. సత్యమున తెలియఁబడెడి ఓ త్రివిక్రముఁడా!
ఓ సార్వభౌమా! మా నీరజాక్షా! నీవు లేనటువంటిది లేనే లేదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.