గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 73వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్

73. ఓం మహానందాయ నమః.

భూనుత గర్భ సీసము.

భాసమానుఁడ! దేవుఁడా! సుగుణ మతికిఁ - దేజము నీవేర దివ్య పురుష!

శ్రీశుఁడా! వర జీవితేశుఁడవు మహిత! - జీవము నీవేగ, చిద్విభాస!

నాలోన నుతభావనన్ నిలుచు నిగమ - భద్రుఁడవీవేను, ప్రముఖ దేవ!

రక్షకుండవు ప్రోవ రావయ కరుణను - పూజ్య నృసింహాఖ్య! ముక్తినిడుమ!

గీ. దుఃఖములు బాపి కష్టముల్ తొలఁగఁ జేసి, - నన్ను రక్షించుమో *మహానంద* రూప

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

73 సీస గర్భస్థ భూనుతము. ( గగ .. యతి 10)

దేవుఁడా! సుగుణ మతికిఁ దేజము నీవే.

జీవితేశుఁడవు మహిత! జీవము నీవే.

భావనన్ నిలుచు నిగమ భద్రుఁడవీవే

ప్రోవ రావయ కరుణను పూజ్య నృసింహా!    

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ప్రకాశవంతుఁడా! పరమాత్మా! దివ్య పురుషా!

సుగుణాత్ముల ప్రకాశము నీవే. చిద్విభాసా! లక్ష్మీపతీ! శ్రేష్ఠమైన జీవితేశుఁడవు నీవేకదా! జీవము కూడా నీవేకదా!

ప్రముఖ దేవా! నాలో ప్రశంసనీయమైన భావనతో నిలుచు నిగమములందెఱుఁగఁబడు భద్రుఁడవు నీవే సుమా.నీవే

రక్షకుఁడవు.  కరుణతో కాపాడ రమ్ము. పూజ్య నారసింహా! ముక్తిని ప్రసాదించుము.. మహానంద రూపా! దుఃఖములు

పోగొట్టి, కష్టములను నశింపఁ జేసి నన్ను రక్షించుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.