గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 89వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

89. ఓం పరమేశ్వరాయ నమః.

వనమయూర వృత్త గర్భ సీసము.

కలుగు నీ మహిమ నీ గరిమ నే నెఱుఁగ నా - ద్యారమా పూజ్య!  నా ధ్యాస నీవె.

మహితనీ మనమునన్ మనఁగ నీమమున నుం - టిన్నిల్పు నీ మదిన్ సన్నుతాత్మ!

మాన్యనే మనుదు నీ మదిని నెమ్మదిని బ్రో - వన్ జాలుదీవంచు భవ్యమంచు.

గణ్యనీ మదిని నేఁ గనఁగ. నేనచటనుం - టిన్నిల్పితీవేను మన్ననమున.

గీ. నేను *పరమేశ్వరా*త్మనే, నీవె నేను. - నేను నీవైన నీవును నేను కావె?

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

89 సీస గర్భస్థ వనమయూరవృత్తము. ( గగ .. యతి 9)

నీ మహిమ నీ గరిమ నే నెఱుఁగ నాద్యా

నీ మనమునన్ మనఁగ నీమముననుంటిన్.

నే మనుదు నీ మదిని నెమ్మదిని బ్రోవన్ 

నీ మదిని నేఁ గనఁగ. నేనచటనుంటిన్ .

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! రమాపూజ్యుఁడవయిన ఆదిపురుషా! నీకు గల ఘనత

మహిమ నే నెఱుఁగను. నా ధ్యాసంతయు నీపైనే సుమా!.నీ మనసున ఉండుటకొఱకై నియమముతో ఉంటిని నీ మనసులో

నన్ను నిలుపుము.నెమ్మదిని నీవు నీ మదిని నన్ను బ్రోవతగినవాఁడవని నీ మదిలో నేనుందును. నీ మనసును నే

నెఱుఁగుట కొఱకు నీవే నన్ను నీ మనసున నిలిపియున్నావు. నేను పరమేశ్వరుని ఆత్మనే, నేనే నీవు. అయినప్పుడు నీవు

నేనే కదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.