గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2010, బుధవారం

నక్షత్ర బంధ కందము.

3 comments

సాహితీ ప్రియులారా!
విజ్ఞాన తేజో మూర్తులైన గురువులు తల్లి దండ్రులతో పాటు పూజనీయులు. విజ్ఞాన జ్యోతులను మనలో వెలిగించు అట్టి గురువుల ఋణం మన మేవిధముగనూ తీర్చుకొన జాలము. అట్టి వారికి హృదయ పూర్వకముగా నమస్కరించుటయే మనము చేయ గలిగినది. కావున మా గురు దేవుల నుద్దేసించి నక్షత్రబంధ కందములో వినమ్రతతో నమస్కరించు చున్నాను.
పరిశీలింప మనవి.

పై పటమున వేవురి లో వు(vu)అనునది మరుగునకు పోయినందున గుర్తింప మనవి.
పై పటమున ఎడమవైపున పైనుండి క్రాసుగా చదువ వలసి యున్నది.
నక్షత్ర బంధ కందము.
గురువన దయ యన దగు.   వే 
వురి భాగ్య మునీశులు! గురువుకు సమ భావం
బురు దయ యలరుద్యోగము
న రహి మునుగ వెలయ సకలునకు వందనముల్.
భావముః-
గురువును దయా స్వరూపముగా చెప్ప వచ్చును. వారు  అనేకులకు భాగ్య కారణమైన మునీశ్వరులు. గురువు అనే వారికి అందరి యెడా సమాన భావము; గొప్ప దయ ఒప్పు చుండును. నేను చేసెడి సద్రచనోద్యోగమున వేగము ముందుగా వెలయు నిమిత్తము సకలము తానే ఐన గురువుకు నమస్కరింతును.
కోణాగ్రములందు     > " గురువులకు " అనియు;
కూడలులయందు    > " వందనములు " అనియు వచ్చినవి.
మీరిస్తున్న ప్రోత్సాహమే నాచే ఈ బంధ కవిత్వమును చేయించ గలుగుచున్నందుకు మీ కునా కృతజ్ఞతలు.
జై శ్రీరాం.
జైహింద్.

29, జూన్ 2010, మంగళవారం

నక్షత్ర బంధ కందము సుక్షేమముఁ గూర్చు మీకు.

10 comments

ప్రియ సాహితీ బంధువులారా
మన ఆంధ్ర సాహిత్యము నిత్యము సాహితీ సౌరభాన్ని కప్పురము వలె దశ దిశలకు వ్యాపింపఁ జేయడానికి మూల కారణము అందుగల రచనా వైవిధ్యమే. ఎన్నెన్ని సొగసులు; ఎన్నెన్ని రకములు !
అన్నీ మన ఆంధ్రామృతానికే సొంతం. అది మనకెంతో ఆత్మానందాన్నిస్తుంది కూడాను.
ఇక ప్రస్తుతం బంధ కవిత్వంలో నక్షత్రబంధ కంద పద్యన్ని వ్రాసితిని. అది మీ ముందుంచుతున్నాను.
కll
సుమ హృదయజ ! రమణ! కృపా
నుమతిన్ దగు నద్భుత సుధను కురియ; సు శ్రే 
య మయ మగును. జక్కన్ గను   
మము. తగు విధముల గన; హితమగు. శ్రేష్టము నౌన్ !
భావము.
హృదయ పుష్పమునుండి ఉద్భవించినవాఁడా! ఓ వేంకట రమణా!నీ కృపానుమతితో అద్భుతమైన అమృతమును మాపై కురిసినచో అంతా మంచి శ్రేష్టమైనది యగును సుమా! మమ్ములను చక్కగా చూడుము. తగిన విధముగా నీవు చూచినచో  మాకు చాలామంచి యగును.  అది ఉత్తమమైనదియు నగును సుమా!   

పటముపై క్లి చెయ్యండి
ఈ నక్షత్ర బంధములో ఒక ప్రత్యేకతను మనము దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే
కోణాగ్రములందు వచ్చెడి ఐదు అక్షరములు ఒక చక్కని అర్థము గల పదమై యుండ వలెను. అట్లే
కూడలుల యందు కూడా వచ్చే ఐదక్షరములు ఒక చక్కని అర్థవంతమైన పదమై యుండ వలెను.
నేను రచించిన ఈ పై పద్యమునందు 
కోణాగ్రమున వచ్చిన పదము " సుజనులకు "( సుజనులకు = మంచివారికి)
అట్లే
కూడలులయందు వచ్చిన పదము " శ్రేయమగుత."(శ్రేయమగుత = మంచి సమకూరును గాక)
చూచారు కదండీ! 
ఎంచి చూచిన దోషంబు లెన్నియేని 
యుండకుండునె? మీరలట్లున్నయెడల
ఎంచి చూపుఁడు. సరి చేతు.మంచి నెంచి;
యంచలట్టుల మీరు గ్రహించువారు.
నక్షత్రమునందు చూపుట కొఱకు ఆంగ్లమున వ్రాసితిని. ఆంధ్రమున వ్రాయుట చేతకాని వాఁడ నగుటచే క్షంతవ్యుఁడను.
శ్రమ తీసుకొని చదివిన స రస హృదయులైన మీకు నా ధన్యవాదములు.
జై శ్రీమన్నారాయణా.
జైహింద్. 

28, జూన్ 2010, సోమవారం

చ"తురంగ" గతి (చదరంగ) బంధ సర్వ లఘు కందము

4 comments

సుహృన్మణులారా! ఈ క్రింది సర్వ లఘు కందము చతురంగ బంధము కలిగి యున్నది.
ఇందు " నినుకని - జగతిని - మరతును - వరదుఁడ " అనే పదాలు భావ యుక్తంగా అశ్వ గతిలో వస్తాయి. పరిశీలించండి. మీ నుండి మేల్గొల్పు మంచి సూచనలకై ఎదురు చూస్తున్నాను.  ఇక చూడండి.
మదులను గలడని; విని; ఘన   
పదు డమర నుతుఁడు; ధర ప్రతిభఁ గని; కొలువగన్;
బుధ జన వినుతులు వినగ సు
మధుర మదిని తిరముగ మను. మరువక నిలుచున్.
భావము:-
గొప్ప పాదములు కల వాఁడును; దేవతల చేత కీర్తింపఁ బడు వాఁడును అగు శ్రీమన్నారాయణుఁడుమన భివిపై మనస్సులలో కలఁడని విని; అతనిని ప్రతిభ కలిగి చూచి; కొలిచినట్లైతే బుధ జనులు చేయు పొగడ్తలు వినుట కొఱకు సుమధుర మైన మనస్సులలో  స్థిరముగ ఉండును. ఏమరుపాటు అనునది లేక నిలుచును.
మ   దు      ల     ను     గ     ల      డ       ని;
వి     ని;     ఘ    న      ప     దు          మ
ర     ను     తుఁ   డు     ధ     ర      ప్ర       తి
భఁ          ని ;     కొ     లు    వ     గ        న్
బు   ధ            న     వి     ను   తు     లు  
వి     న      గ     సు     మ     ధు         మ  
ది     ని      తి      ర     ము     గ         ను.  
మ   రు      వ      క      ని     లు    చు      న్.
చూచారుకదా! మీరూ యత్నించి మీ వినూత్న ప్రయోగాలను నేను కూడా చూచే భాగ్యం నాకు కలిగించండి.
జైహింద్.

26, జూన్ 2010, శనివారం

చ "తురంగ " గతి బంధ కందము.

5 comments

మాన్య మహోదయులారా!
ఇందు మనము చతురంగ అశ్వ పదము చూడ వచ్చును. చదరంగములో అశ్వము నడకవెంట నడచి చూచినచో కోరుకొనిన పదములు భావ యుక్తముగా వచ్చుట మనము గమనింప వచ్చును.చదరంగమున నుండు అరువది నాలుగు గడులలో అరువది నాలుగు అక్షరముల కందమిమిడియుండును.
పరికించి చూడుడు.
సుగుణ తతిని వలదనక నొ
సగుచును; ధర గనును సమరస హరి కృప నొగిన్.
తగ కని ఫలము కవితను చొ
రగ; రహి; జయమమర;కవన రమనిడునతడున్.
భావము:-
సమతా భావ సంపన్నుడైన ఆ శ్రీహరి వద్దని చెప్ప కుండా మనకుకృపతో క్రమముగా సుగుణ తతిని సంప్రాప్తింపఁ జేయుచు భూమిపై చూస్తూ ఉంటాఁడు. తగిన విధముగా చూచి; ఆ సత్ఫలితము మనకు కవితలో చొరఁబడు విధముగా చేసి; గొప్పతనము; విజయము మనకు అమరు విధముగా అతఁడు కవిత్వము అనెడి లక్ష్మిని ఇస్తాఁడు..
సు   గు    ణ    త    తి    ని    వ    ల
        క    నొ   స   గు  చు  ను;
        గ    ను  ను     మ    ర
   హ   రి     కృ  ప  నొ    గి      న్.
త    గ     క     ని   ఫ    ము    
వి    త   ను    చొ   ర   గ;         హి; 
   య     మ  ర   క            
ర     మ   ని     డు   న  త     డు     న్.

నరహరి - కనుమయ - వరముల - నొసగుచు. అనే దైవ ప్రార్థన ఇందు అశ్వ గమనంలో మనకు గోచరిస్తోంది కదండీ! మీరూ ప్రయత్నిస్తారనే ఆశతో నేనీ పద్యము  వ్రాసితిని. మీ అభిప్రాయమును తెలుప గలరు.
జైహింద్.

ఆతపమును బాప వయ్య!వర దాతగ నీవయి లోక పాలకా!

2 comments

జగతి నశేష సౌఖ్యములు చక్కగ చూపుచు; మాయఁ గొల్పి; మా
ప్రగతి యభాగ్య భాగ్యములె భవ్యములంచు తలంపఁ జేసి; సత్
సుగతికి దూరమై కడకు శూన్యమునన్ మము నిల్పి ; చింతలన్ 
రగులొకొనంగ చేసెదవు. రక్షక! శ్రీహరి! న్యాయమా? ప్రభూ!
కర్మముఁ జేయుటే తగును. కాదని పోవ యధర్మమౌను. సత్
కర్మలె జేయనౌ ననుచు కమ్మగ గీత వచించు. కాని మా
ధర్మము కర్మగా కనుక తప్పదు. అందున క్రూర మైనదు
ష్కర్మలఁ జేయఁ జేసి నరకంబున కంపుట ధర్మమా హరీ! 
జగతి ననేక జీవములఁ జంపక జీవనమెట్లు సాగు? మా 
ప్రగతికి హింస తప్పదు. అబద్ధపు జీవన  జీవికార్థమై 
సుగతికి దూరమౌ విధిని చూపితివేల? యహింస మార్గమున్
జగతిని గొల్పి యున్న; నిను చక్కని దైవమటంచు మ్రొక్కమే?
అష్ట ప్రసిద్ధ సిద్ధులను హాయిగ నేర్పితి వొక్క నాడు. పల్
కష్టములైన గాని మది గాంచక చక్కగ సాగె నాడు. నీ
సృష్టికి వింత శోభలను చేర్చగ నన్నియు వీడఁ జేసి యీ
కష్టములన్ సృజించితివి. కాంచవదేలర! మమ్ము శ్రీ హరీ!
తపమును జేయుచుంటి. పరితాపము బాపుము జీవకోటికిన్
విపులము కాగ నీ మహిమ విశ్వము నేలుచు మమ్ముఁ బ్రోచుచున్;
నిపుణతఁ గొల్పు! నిన్ గనగ. నిత్యుఁడవై మది నిల్చి యుండు; మా
తపమును బాపుమయ్య! వర దాతగ నీవయి లోక పాలకా!
జైహింద్.

24, జూన్ 2010, గురువారం

శారదా కటాక్ష సిద్ధిరస్తు.

3 comments

అహరహమున్ శ్రమించి మన యాంధ్ర  మహా మృత పాన లోలురన్
సహన వివేక వర్తులుగ చక్కగ మార్చగ శారదాంబ తా
బహుముఖ బోధనల్ సలుప సన్నుత సాహితి నంద జేసె. స 
ద్గ్రహణ వివేక వర్తుల ధరాతల మందు నుతింప జేసెడిన్.
సదయులు సన్నుతాత్ములును; సత్య వివేక ప్రపూర్ణ  శోభితుల్ ; 
మధుర వచో విలాసులు సమస్త శుభప్రద    కార్య ధుర్యులున్.    
చదువరు లైన మీకు మన శారద మాత మనోజ్ఞ భాషణా
విధము నొసంగి బ్రోచు! సవిధంబగు  జీవన భాగ్య మిచ్చుచున్. 
జైహింద్.

21, జూన్ 2010, సోమవారం

చెప్పుకోండి చూద్దాం?

4 comments

రాయల వారి ఆస్థానమునకు ఉద్దండ పండితుడైన ప్రెగడరాజు నరస కవి వచ్చి తానెంత వేగముగ, కఠినతరముగ ఆశువుగా చెప్పెడిపద్యమైనను నిస్సంకోచముగ వ్రాయ గలనని ప్రతాపముగా పలుకుటవిని తెనాలిరామలింగఁడు ఒక అద్భుతమైన చాటుపద్యమును ఆతడు వ్రాయలేని విధముగా చెప్పాడు. 
ఆ పద్యమేమిటో మీరు చెప్పుకోండి చూద్దాం???
అదే నరస కవి  ఇతరుల కవిత్వంలో తప్పులు ఎంచెదననినందులకు కోపంతో,
చll
ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పు బట్ట పని యుండదు. కాదని తప్పు బట్టినన్
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో
సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !
అంటూ ఊరుకోక ఇంకా ఇలాగన్నాడు.
చll
తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !
చూచారు కదండీ మన రామలింగడి కోపాన్ని. సరేకాని పైన చెప్పుకోండి చూద్దాం అని ఒక ప్రశ్నవేసాను కదా! మీ నుండి వచ్చే సమాధానం  కోసం నే నెదుచూడనా?
జైహింద్.

20, జూన్ 2010, ఆదివారం

అల్లసానిని అవ హేళన చేస్తూ చెప్పిన రామలింగని చాటువు.

7 comments

ఒకమారు అల్లసాని పెద్దన కవి ఒక కవితలో "అమావాశ్య నిశి" ని ఛందస్సు కోసం "అమవస నిసి" అని వాడగా దానికి రామలింగకవి పెద్దనను ఎగతాళి చేస్తూ చెప్పిన అద్భుతమైన చాటువు గా చెప్పఁ బడుతున్నదీ క్రింది పద్యము. మీరూ చూడండి.

ఎమి తిని సెపితివి కపితము?
బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
ఉమెతకయను తిని సెపితో
అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!
భావము:-
ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని అమవస నిసి అని చెప్పితివి కదా?  ఏమి తిని చెప్పితివి? భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?
ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వఛత లేని పదం అని  రామకృష్ణ కవి నిష్కర్షగా ఆశుపద్య రూపమున తన అభిప్రాయమును వెల్లడించెను.
జైహింద్.

19, జూన్ 2010, శనివారం

కవిత్వమున వ్రాయ కూడని దశ దోషములు. వివరణ.

6 comments

దశ దోషములు
1.ఛందో భంగము:-
గురువుండ వలసిన చోట లఘువు; లఘువుండ వలసిన చోట గురువు ప్రయోగించిన ఛందో భంగము అను దోషమగును.
గోవింద యనవలసిన చోట ముకుంద యనిన ఛందోభంగము అను దోషమగును.
2.యతి భంగము:-
యతి ఉండవలసిన చోట కాక మరియొక చోట పాటింప బడనిచో యతి భంగము అను దోషము.
ఆంధ్ర ప్రజల సాటి అరయ లేరు. అన వలసిన చోట ఆంధ్ర ప్రజల సాటిని అరయముగ!
3.విసంధికము:-
సమాస గతములగు పదముల మధ్య సంధి చేయనిచో విసంధికము అను దోషము.
అమృతోదధిశయనఅనిఉండవలసిన చోట అమృత ఉదధి శయన అని వ్రాసినచో విసంధికము అను దోషము.
4.పునరుక్తి దోషము:-
ఇది రెండు విధమ్లు.శబ్ద పునరుక్తి; అర్థ పునరుక్తి.
తొలుతపలికిన శబ్దమునే మరల పలికిన శబ్ద పునరుక్తి.
కాంతి చంద్రుడతడు కళలు జిందెడి శశి. అనినచో శబ్ద పునరుక్తి దోషము.
పూర్వోక్తమగు అర్థమే పునరుక్తమైన అర్థ పునరుక్తి దోషమగును.
కాంతినమృత చంద్రుడని యశో మృగాంకుడనినచో అర్థ పునరుక్తి దోషమగును.
5.సంశయము:-
పద్యమున భావము నిస్సంశయముగా నుండునట్లు వ్రాయబడ వలెను. ఆ విధముగ కాక భావము సంశయాస్పదమైనచో అది సంశయమను దోషము.
అతని కలయిక వలన కదా ఇంతపట్టు జరిగినది? జరిగినది లాభమా? నష్టమా? సంసేహముగానున్నందున సంశయము అను దోషమిందుకలుగు చున్నది.
6.అపక్రమము:-
క్రమాలంకారము ఉండవలసిన చోట అపక్రమముగనున్న అపక్రమ దోషమనబడును.
విష్ణువు హృదయము నాభికమలము పాదము గంగ లక్ష్మి బ్రహ్మల నివాస స్థానములు. ఇందు క్రమ విరుద్ధముగ నున్నందున అపక్రమ దోషము కలిగినది.
7.న్యకుమ:-
మొదట పలికిన పదముల కనుగుణము కాని వ్యర్థ పద ప్రయోగము చేసిచో న్యకుమ లేదా వ్యర్థము అను దోషము .
నీవు త్యాగివి. నాలుగు కాసులెవ్వరికీ ఈయవు. ఇందు త్యాగికి  సరిపడు గునమునకు విరుద్ధముగ పిసినారి యనుపద ప్రయోగము వలన పరస్పర విరుద్ధమైనందున వ్యర్థము అను దోష భూయిష్టము.
8.అపార్థము:-
వాక్యమునందలి పదములకన్యోన్యాకాంక్ష యుండ వలెను. అట్లు లేకపోయినచో సముదాయార్థము స్ఫురింపనందున అపార్థముఅను దోషమగును.
కరిచర్మము గైరిక శిల సురగిరి అని వ్రాసినచో పరస్పరాన్వయము లేనందున అపార్థమను దోషమిందు కలుగు చున్నది.
9.అప శబ్దము:-
౧.కుసంధి; ౨.దుస్సంధి; ౩.చుట్టుంబ్రావ; ౪.వైరి వర్గము; ౫.నిడుదలకాకుదోషము; ౬.కుఱుచ కాకు; ౭.తెలుగునకు జొరని సంస్కృత క్రియల దుష్ప్రయోగములు; ౮.సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడిన అప శబ్ద దోషమనఁబడును.
౧.కుసంధి:- దీని+ఒడయడు=దీని యొడయడుసాధువు. దీనొడయడు అసాధువు.  
౨.దుస్సంధి:- అతడు+అతడు=అతడునతడు. సాధువు. అతడున్నతడు.
౩.చుట్టుంబ్రావ:- అసలారు వందలకు వడ్డీ మూడు వందలు బలాత్కారముగ లాగుకొని జీవించువాడు ఇదిగో వచ్చు చున్నాడు. అని ఈ విధముగా చెప్పభడినచో చుట్టుంబ్రావ యను దోషము.
 ౪.వైరి వర్గము:- సంస్కృత పదమును తత్సమము చేసి తెలుగు పదముతో సమసింప జేయుట సరి అయిన పద్ధతి. అట్లు గాక పూర్వ పదమున కాంధ్ర విభక్తి చిహ్నము చేర్చక సంస్కృత ప్రాతిపదికమునకే తెలుగు పదము చేర్చి సమాసము చేసినచో వైరివర్గము అను దోషమగును. పుష్ప విల్లు. వైరి వర్గము.
ముజ్జగములు. ముల్లోకములు మున్నగునవి నిర్దోషములు. వాటిపై మరల ముజ్జగద్వంద్యుఁడు; ముల్లోక పూజ్యుఁడు అని యుండిన వైరివర్గమున చేరును.
౫.నిడుదలకాకుదోషము:- హ్రస్వముండవలసిన చోట దీర్ఘముంచినచో అది నిడుదల కాకు దోషమగును.
ఉllపొగడ దండలు అను చోట పొగాడ దండలు అని ప్రయోగించరాదు.
౬.కుఱుచ కాకు:- దీర్ఘములుంచ వలసిన చోట హ్రస్వముంచిట.
ఉllనాయెడన్ కు బదులు నయెడన్ అనిప్రయోగింపరాదు.
౭.(తెలుగునకు జొరని సంస్కృత క్రియల) దుష్ప్రయోగములు:- సంస్కృత విభక్త్యంత పదములను తెలుగు విభక్త్యంత పదములతోఁ గలిపి ప్రయోగించుట.
సత్వరము నృపస్య పదం గత్వాయాతఁడు నిహత్యకంటకుల సఖీ భూత్వా మెలగెడు. అని ప్రయోగింపరాదు.
౮.సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడుట:- గ్రామీణుల వాడుక భాషను ప్రయోగింపరాదు.
10.విరోధములు:- 
౧.సమయ విరోధము. ౨.ఆగమ విరోధము. ౩.లోక విరోధము. ౪. కాల విరోధము. ౫.కళా విరోధము. ౬.దేశ విరోధము అని ఆరు విధములు.
౧.సమయ విరోధము:- ఆచార విరుద్ధము సమయ విరుద్ధమని గ్రహింప వలెను. బాహువుల యందు కుండలములు ధరించినాఁడు అని వ్రాసిన సమయ విరోధముగా గ్రహింపదగును.
౨.ఆగమ విరోధము:- అనగా శాస్త్ర విరోధము. 
ఉllహింసా పరమో ధర్మః అనిన అది ఆగమ విరోధముగా గ్రహింపనగును.
౩.లోక విరోధము:- లౌకికమునకు విరోధముగ వ్రాసిన దోషము.
ఉllతనయునకు పాద సేవను తల్లి చేసె. అనిన దోషము.
౪. కాల విరోధము:- దేశ కాలాను గుణముగా వ్రాయ వలసినదిగా నియమముండగా తద్విరుద్ధముగా వ్రాసినచో దోషమగును.
ఉll.సుగుణాకర పట్ట పగలు చుక్కలు పొడిచెన్.
౫.కళా విరోధము:- ఏయే కళలకు తగిన పరికరముల నాయా కళలందు చెప్ప బడుటకు బదులు తద్విరుద్ధముగా చెప్పుట.
ఉllతాళము బట్టక చదువును, పుస్తకము పట్టక పాడు ఘనుడీతడు. అనిన దోషమే కదా!
౬.దేశ విరోధము:- ప్రదేశమును బట్టి కాక తద్విరుద్ధముగా చెప్పిన దోషము.
ఉllఎడారిలో నూతులనుండి నీరు పొంగి ప్రవహించు చున్నదని చెప్పినచో దోషము. 
జైహింద్.

18, జూన్ 2010, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 95

4 comments

శ్లోll
నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ వేదాంతవిణ్మాస సహస్ర జీవీ
పరోపకారీచ పతివ్రతాచ షట్ జీవ లోకే మమ వందనీయా:.
ఆ.వెll
అన్నదాతయు; ప్రథిత నిత్యాగ్ని హోత్రి;
వేదసంపన్నుఁడును; వయో వృద్ధ నరుఁడు;
పరుల కుపకారి; నుత పతి వ్రతయు నాకు
వందనీయులు. భువి పైన భాగ్యనిధులు.
భావము:-
పేదవారికి నిత్యము అన్నదానము చేయువాఁడును; నిత్యాగ్నిహోత్రియు; వేదాంత వేత్తయు; సహస్ర చంద్ర దర్శనము చేసినవయో వృద్ధుఁడు; పరోపకార పరాయణుఁడు; మహా పతివ్రత; ఈ ఆరుగురూ నాకు వందనీయులు.
(ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం మన సంస్కృతి 28. పొరపాటున పునరుక్తమైనది)
శ్లోll
సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం
ద్వయమేతద్ధి జంతూనాం అలంఘ్యం దిన రాత్రవత్.
ఆ.వెll
పగలు రాత్రి వోలె ప్రబలును సుఖ దుఃఖ
ములు సతతమును జీవనులకు; నిజము.
ధరణి పైన మనకు దురతిక్రమములివి.
విజ్ఞు లెఱిగి మెలగు భీతి విడిచి.
భావము:-
రాత్రింబవళ్ళ వలె సుఖము తరువాత దుఃఖము; దుంఖము తరువాత సుఖము వచ్చుచునే యుండును. జీవులకీ రెండునూ తప్పని సరైనవి. ఇక వీనికై వివేకి యైన వాఁడు దుఃఖము నొందడు.
జైహింద్.

15, జూన్ 2010, మంగళవారం

బంధ కవిత్వములో ఒక ప్రక్రియ " ఛురికా బంధము "

19 comments


సద్గుణ సంపన్న సన్మిత్రులా! సాహితీ జగత్సంచారులారా!
ఆంధ్ర భాషలో ఛందో బద్ధ కవిత్వము చేయుట ఒక అపురూప ప్రక్రియ కాగా ;అందు బంధ కవిత్వము అపురూప ప్రక్రియ. 
ఈ బంధ కవిత్వమున ఛురికా బంధము అను ప్రక్రియ సుకవి పండిత మనోహరమై యొప్పు పద్ధతి అనుటలో ఏమాత్రమూ సందేహము లేదు. మహాకవులు చేసిన ఈ ప్రయోగమును నాబోటి అల్పుఁడు చేయఁ బూనుట సాహసమే ఔతుంది.  ఐనా ఉత్సాహాన్ని అణచుకో లేక ఈ ఛురికాబంధంలో ఒక కందపద్యాన్ని వ్రాసాను.
సదసద్వివేక సంపన్న పాఠకులు మీరు. గుణ గ్రహణ గుణాన్వితులు మీరు. నా రచనను పరిశీలించి గుణసంపన్నము చేయుట కొఱకు; నిర్దోషత కొఱకు తగిన సూచనలు కలవేని సూచింప మనవి చేయు చున్నాను. ఇక అవలోకించండి. 
రామ. సుమ సమ. మనోరమ
నా మది మహనీయ తేజ! నా దైవతమా!
మా మక సుగుణాకరమా!
నామ దివిజ గణ సుపూజ్య.  నా ప్రియ ధనమా!  

    సు           నా    మా!    ర  క  ణా గు  సు క       మ
రామనోర మ హ నీ  య  తే     జ!   నా    దై వ త   మా!
    స             దివిజ గణ సు పూజ్య !  నా ప్రియ  ధ  న


భావము:-
ఓ రామా! సుమ(పూల వలె) సుకుమారుఁడా!  మహనీయమైన  మనస్సును రమింపఁ జేయు తేజస్సు తో నా మనస్సున ఒప్పు వాఁడా! ( రమయతీతి రామా ) ఓ నా దేవుఁడా! నాయొక్క మంచి గుణములకు స్థాన మైన వాఁడా! దేవతా గణము చేత మంచిగా  పూజింపఁబడు పేరు కలవాఁడా! నా యొక్క ప్రియమైన ధనమైనవాఁడా!
చూచారు కదండీ! 
జైహింద్.

13, జూన్ 2010, ఆదివారం

అంతరంగం - శ్రీ బులుసు వేంకటేశ్వర్లు. తే.04 - 06 - 2010.

2 comments

ఆధునిక కవుల్లో నాకు విశ్వనాథ అభిమాన కవి. వారు రచించిన తెలుగు ఋతువులు నేను చదవడంతో ప్రారంభమైన ఆ అభిరుచి నాలో దినదిన ప్రవర్ధమానమై; పెద్దల ఉపన్యాసాలు వినడం వల్లా; వారు చేసే వ్యాఖ్యానాలవల్లా మరింత ఎదిగి కల్పవృక్షము అయింది. చివరికి అది నా యింటికి పేరై కూర్చొంది.
క్రమేపి ఆ విశ్వనాథ సాహిత్య విశ్వరూపం నన్ను కష్టాల్లో ఓదార్చింది. సుఖాల్లోనూ తోడయింది. ఎన్ని పద్యాలు! ఏమి సృష్టి! ఎంత భావుకత! ఒక పద్యం మనకి నచ్చిందంటే అది తలచుకోగానే మనకు వెఱ్ఱి ఆనందం కలుగుతోందంటే కారణం ఏమిటి? ఆ భావం మనకు నచ్చిందా? పద్యం నడక బాగుందా? కల్పన మిన్ను ముట్టిందా? హృదయాన్ని తట్టిందా?
ఏదో ఒక విలక్షణత ఉండే ఉంటుంది. ప్రతి మహా కవి వాక్కులోనూ వ్యక్తమౌతున్న కాంతి సర్వాంగీణంగా ద్యోతకమౌతూనే ఉంటుంది. ఆ కావ్య నాదంలో కరగిపోయి బాహ్య జగత్తుకు రాగానే విచారణ ప్రారంభమౌతుంది. సుఖ దుఃఖాలను మనిషి ఒక్కడే భరించ లేడు. ఎవరితోనో పంచుకోవాలి. అదిగో అప్పుడు ప్రారంభమౌతుంది చర్చ.
ఆ పద్యంలో ఏ అలంకారముంది? రీతి ఏటువంటిది? రసమేమిటి? ఔచిత్య స్థాయి ఎంత? ఈ మూల్యాంకనలో సగం ఆనందం ఆవిరి అవుతుంది. ఇక మిగిలింది సగం. ఆ సగంలోను అనిర్వాచ్యమైన ఆనందాన్ని తూచడానికి మనం ఉపయోగించే నీరస పదాల వల్ల మరో సగం ఆనందం అదృశ్యం. ఇక మిగిలింది నాలుగో వంతు మాత్రమే. ఆ మాత్రానికే సహృదయుఁడు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాఁడు. ఉద్వేగానికి గురి అవుతున్నాఁడు. కళ్ళు చెమర్చుతున్నాఁడు.
అటువంటి సహృదయుల వల్లనే ఈ కావ్య ప్రపంచం సృష్టింపఁబడింది. కవిత్వ రచన మినహా మిగిలిన అర్హతలన్నీ కవితో పాటు కలిగినవాఁడు సహృదయుఁడు. కవితో సమానమైన హృదయం కలవాఁడు సహృదయుఁడు. అంటే మంచివాఁడని అర్థం కాదు. (కవి సహృదయాఖ్యం విజయతే)
రామాయణ కల్ప వృక్షంలో కిష్కింధ కాండ నూపుర ఖండం లోని ఒకటి నుండి ఏభై పద్యాలు నేను "కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత" పేరున వ్యాఖ్యానిస్తూ ఉపన్యాసాలిచ్చాను. ఇస్తున్నాను కూడా.
మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు, స్వయంగా ప్రతిభ కల కవులయి ఉండి కూడా నా యందు ప్రేమతో ఈ వ్యాసాలు వ్రాయమని కోరారు. మొదట సరే అని దిగినా క్రమంగా విశ్వనాథ భావుకతలోని లోతు నాకు తెలియ వచ్చింది. ఇది నా వల్ల కాదు అనిపించింది. దిగితే కాని లోతు తెలియదని ఊరికే అన్నారా?
మిత్రులు శ్రీ చింతా వారు వారం వారం నన్ను ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సాహిత్య ప్రేమికుల ‘కామెంట్స్’ వినిపిస్తూ వెన్ను తట్టారు. మొత్తం మీద విశ్వనాథ భావుకత శీర్షిక పూర్తి చేయించారు. అట్టి రామ కృష్ణా రావు గారికి; ఈ నా వ్యాసాలు చదివి సూచనలతో శుభాకాంక్షలతో స్పందించిన సాహిత్యాభిమానులకీ; నా హృదయ పూర్వక నమో వాకాలు. ధన్యవాదాలు.
నా వ్రాతలో ఏమైన తప్పులుంటే పొరపాట్లు దొల్లితే మన్నించి - నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను.

"కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత" ఒక పుస్తక రూపంలోకి తీసుకు వచ్చినప్పుడు మరింత సరళతరం చేస్తానని మనవి చేసుకొంటున్నాను. మీరు ఆంధ్రామృతంలో ఈ నా వ్యాసాలపై చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొనగలనని మనవి చేయుచున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు, మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్కారాలు తెలుపుకొంటున్నాను. జై శ్రీరాం.
సెలవ్.
మీ

బులుసు వేంకటేశ్వర్లు.(సెల్. 9949175899.) 
కల్పవృక్షం.
ESIహాస్పటల్ దగ్గర.
చిట్టివలస.
విశాఖపట్టణం జిల్లా.
పిన్. 531162.
హిందూదేశము.
పాఠక మిత్రులారా! చూచారు కదా ఆ సహృదయ కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అంతరంగం. మీ అంతరంగాన్ని కూడా వెలువరించండి.
జైహింద్.

11, జూన్ 2010, శుక్రవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 50.

6 comments



ఇదిగో నిల్చిన పాటు నిల్చినటు లిట్లే చేరుకొంటిన్ వియ
త్పదమాలంబముగాగ దైత్య పద విధ్వస్త ప్రదేశంబునే
మొదలన్ సర్వ చరాచరంబు విలువంపున్ మీటునన్ దేల్తున
న్నది కాదంటివి. పోవనిమ్మ యిపుడైనన్ నా సతిన్ జూడగన్.
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స. 1-50)
సీతా వియోగంతో దుఃఖితుఁడైన శ్రీరామునిలో అత్యుత్కటమైన క్రోధావేశం పొంగిపోయినది. 
లక్ష్మణా! నిలిచిన వాఁడిని నిలిచినట్లుగానే నేను ఆకాశము దాకా ఎగిరిపోయి ఆ రాక్షస దేశాన్ని చూసి సీతను కనుక్కొంటాను. ఇంతకు ముందు నా ధనుస్సు చేత ఈ చరాచర ప్రపంచాన్ని నాశనం చేసి; సీతను తీసుకు వస్తానంటే నీవు వారించావు. ఇప్పుడైనా నన్ను పోనీవయ్యా నా సీతను చూడడానికి.
శ్రీరాముని హృదయం ఆవేశ బంధురమై ఉంది. సీతా వియోగం హృదయాన్ని మండింప జేస్తోంది. బాహ్యావరణ విచ్ఛేదం జరిగినప్పుడు రాముని మనసు అన్య విషయాసక్తమైనను అది క్షణికమే.
సముద్ర గర్భం నుండి గర్జించుచూ పరువులెత్తుకొని వచ్చుచున్న మహోత్తుంగ తరంగముల వంటి సీతా స్మృతి పరంపరలచే సంచలితుఁడైన రాముఁడు తాను ఆకాశ మార్గాన పోయి సీతను కనుగొందునని పలుకును. ఇది వరకు స్వామి ప్రపంచమునే నాశనము చేస్తానన్నాఁడుట. ఎప్పుడు(అరణ్యకాండమున) ? రావణుఁడు సీతను అపహరించుకు పోయిన పిదప పర్ణశాలకు వచ్చిన శ్రీరాముఁడు ఆమెను గానక క్రోధాత్ముఁడై సృష్టినే నశింపఁ జేసెద ననెను.  
ఈ సందర్భమున భాస్కర రామాయణమున ఇట్లు వ్రాయఁ బడినది.
అస్మచ్చాప విముక్త బాణముల నుద్యద్భూతలంబంతయున్ 
భస్మీభూతము జేసి యిందు భగణ ప్రద్యోత నాకాశమున్
విస్మిత్యన్విత బాహు శౌర్యమున నుర్వింగూల్చి కల్పాంతకో
గ్రస్మర్తవ్య మహోగ్రతిన్ సకల లోక ప్రాణులం ద్రుంచెదన్.
(భా.రా. 3 - 332)
ఇట్టి క్రోధ మూర్తియైన శ్రీరాముని గతములో లక్ష్మణుఁడు అనునయించి సాంత్వనపరచినాఁడు. ఆ ఘట్టమును స్మరించి శ్రీరాముఁడు ఇప్పుడు నేను ఆకాశము అంత ఎత్తుకు ఎదిగి సీత ఎక్కడుందో చూస్తాను. నన్ను పోనీ. అనుచున్నాఁడు.
ఇది ఔత్సుక్యము అను సంచారీ భావము. ఔత్సుక్యమనగా సమయాక్షమత్వము. అనగా కాల విడంబము (ఆలస్యము)ను ఓర్వకపోవుట. ఇది విప్రలంభ శృంగార నాయకుని స్థితికి పరాకాష్ఠ.
పద్యము వలన సీతారాముల అద్వైత స్థితి మనకు తెల్లమగుచున్నది. రాముఁడు సీతను చూడ లేకపోయినను ఆయన హృదయమున ఆమె లేని క్షణము లేదు. ఒకే దేహమున పార్వతీ పరమేశ్వరులు. ఒకే హృదయములో సీతారాములు. వీటికి ఎడము లేదు. విరహము లేదు. దూరస్థితి లేదు. ఆస్థితి వచ్చినచో జగత్ప్రళయమే.
ఈ రహస్యమును మొదట తెల్లము జేసినాఁడు హనుమంతుఁడు.
అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం.
తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి.
(సుం.కాం. 15 - 52.)
( ఈ సీతమ్మ హృదయమున శ్రీరాముఁడు ఆ శ్రీరాముని హృదయమున సీతమ్మ ప్రతిష్ఠితులై ఉన్నారు. కావుననే ఆ ధర్మాత్ముఁడు జీవించి యున్నాఁడు. )
ఒకే తటాకమున చక్రవాకముల జంట ఉన్నది. రెండూ ఒకే తామరతూడును మెసవినవి. ఒకే తామరాకు గొడుగు క్రింద నిద్రించినవి. రెండూ ఒక పద్మమునందలి మధువునే త్రాగినవి. భిన్న ప్రయత్నములతో పర్యాయముగా కూయుచున్న ఆ చక్రవాక మిధునము యొక్క కూత ఏక కంఠముగానే విన వచ్చుచున్నది. శారీరకముగా ద్వైతమై కనిపించుచున్నను ఆ పక్షి జంట అద్వైతమును వ్యాఖ్యానించు చున్నదని ‘ఘన కవి’ వర్ణించి యున్నాఁడు. విశ్వనాథ తన వర్ణనల యందు ఈ రహస్యమును మరువ లేదు. 
ఈ విధముగ విశ్వనాథ తన స్వీయ ప్రతిభతో మూల రామాయణమునకు తన కల్ప వృక్షము అనువాదము కాని విధముగా రామాయణమునకు  గల ప్రసిద్ధ వ్యాఖ్యానములకు రామ కథా నాటక కర్తల భావములకు అనువాదముగా తీర్చి దిద్దుచునే స్వంత మార్గములో కల్ప వృక్షమును వెలయించినాఁడు. 
సీతా వియోగ స్థితిలో నున్నశ్రీరాముని లక్ష్మణుఁడు తన మధుర ప్రియాలాపములతో ఊరడించి ఆయన మనస్సును శాంతపరచును. 
ఈ విధముగా వసంతము ఒక వంక అధిక దుఃఖమును; మరొక వంక ఆత్మానందమును కల్పించు చుండగా ఆ శ్రీరామ చంద్రుఁడు పొందిన భావ సంఘర్షణను విశ్వనాథ అనితర సాధ్యమైన భావుకతతో కవితా సృష్టి కావించి యున్నాఁడు. 
ఇతి శమ్.
ఓ శ్రీరామచంద్రా!
నీ దయ లేక యేరికిని నిన్ గ్రహియించుట శక్యమౌనె? నీ
పాద సరోరుహ ద్వయము భావన సేయుట శక్యమౌనె? నీ
మేదుర కార్యముల్ మదికి మేలనిపించుట శక్యమౌనె? నా
పై దయ చూపినావొ? ప్రభువా! హృదయమ్మున కల్పవృక్షమై.
జై శ్రీరాం.
ఇంతటితో  "ఏబది భాగములు గా నే చెప్పఁ బూనిన ‘శ్రీమద్రామాయణ కల్ప వృక్షము నందలి’ విశ్వనాథ భావుకత"  నేటికి సంపూర్ణమైనదని తెలుపుటకు ఆనందిస్తున్నాను.
ఇట్లు
సుహృద్విధేయుఁడు;
బులుసు వేంకటేశ్వర్లు.(సెల్. 9949175899.) 
కల్పవృక్షం.
ESIహాస్పటల్ దగ్గర.
చిట్టివలస.
విశాఖపట్టణం జిల్లా.
పిన్. 531162.
హిందూదేశము.
ఆంధ్రామృతాస్వాదనా లోలులారా!
కల్పవృక్షము క్రింద సేద తీరిన కవి వతంసుల కమనీయమగు కంఠధ్వనిగా వెలువడిన విశ్వనాథ భావుకత ఏబది భాగములు రసజ్ఞులగు పాఠక పుంగవుల కందించేలా ఆ శ్రీరామ చంద్రుఁడు నాచే చేయించి తన భక్తులపై తాను చూపించే  అవ్యాజానురాగాన్ని రుజువు చేసుకొన్నాఁడు. అట్టి శ్రీరాములవారికి సీతమ్మకు పాదాభివందనం చేస్తున్నాను.
సాహితీ ప్రియులారా! 
ఈ ఏబది భాగములూ పరి పూర్ణముగా చదివి మీ అమూల్యమైన వ్యాఖ్యానమును మీరు మీ ఆంధ్రామృతమునకందించినట్లైతే అవి కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు ముద్రించబోవుచున్న పుస్తకమునందు మీరు చూపిన ఆదరణపై గల గౌరవభావంతో మీ వ్యాఖ్యాన రూపంలో ఉండు వ్యాసాల్ని ప్రచురింపనున్నారు. 
కావున అత్యంత శ్రద్ధ చూపి మీరు మీమీ వ్యాఖ్యానాలు వ్రాసి పంప గలందులకు మనసారా కోరుచున్నాను.
ఎంతో శ్రమించి ఎంతో ఉత్సాహంతో నిరంతరాయంగా ఏబదిభాగములుగా ఉపన్యాసాలిచ్చిన ప్రియ సాహితీ మిత్రులగు కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి ఆంధ్రామృతం తరపున అభినందనలతో పాటు హృదయ పూర్వక కృతజ్ఞతలను కూడా తెలియఁజేసుకొంటున్నాను.   
ఆదరించిన పాఠక లోకానికి కూడా కృతజ్ఞతలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.

10, జూన్ 2010, గురువారం

నర్కుటక; కోకిలక; చంపక వృత్తాలు.(బంధ కవిత్వము)

3 comments

Sarasvati with a peackock

1)నర్కుటకము:- న - జ - భ - జ - జ - వ.   
(1వ అక్షరంతో - 11వ అక్షరానికి యతి)
నకజ భర్తనే సతము క్కగ సమ్మతితో; 
నమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్
నుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుఁడై 
ప్రణుతులనందు యీ ప్రభువు రాముఁడె రమ్యుఁడుగా!    
2)కోకిలకము:- న - జ - భ - జ - జ - వ. 
(1వ అక్షరంతో - 8వ అక్షరానికి - 14వ అక్షరానికి యతి)
నకజ భర్తనే తము చక్కగ మ్మతితో; 
నమున నిల్పుచున్ నుజ మాన్యులు న్ననలన్
నుటది సత్యమే! రుణఁ గాంచుచు; కామ్యదుడై 
ప్రణుతులనందు యీ ప్రభువు రాముడె మ్యుఁడుగా!    
3)చంపకము:- న - జ - భ - జ - జ - జ - ర.  
(1వ అక్షరంతో - 11వ అక్షరానికి యతి
నకజ భర్తనే సతము క్కగ సమ్మతితో; ముదాత్ములై
నమున నిల్పుచున్ మనుజ మాన్యులు మన్ననలన్ సతంబు తా
నుటది సత్యమే! కరుణఁ గాంచుచు; కామ్యదుఁడై మనంబులన్
ప్రణుతులనందు యీ ప్రభువు రాముఁడె రమ్యుఁడుగా!   ధరాస్థలిన్. 
ప్రాస నియమన్నింటికీ ఉంటుంది.
జైహింద్.

8, జూన్ 2010, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 49.

2 comments

 రిక్షాపై వున్నది కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. ఇది గుంటూరులో తీసిన పోటో.
చంపుట చంపుటే యనును జానకి హేతు వివక్షచే ఫలం
బింపగుఁ గాని యిప్పటికి నేమగునో యఘమేమొ యన్న వా
క్యంపు యదార్హమున్ జరిగె నక్కట  తాదృశ సీతఁ బాసి సై
రింపులు దక్కి యుండుట భరింపగ జాల నిమేష మేనియున్.
(వి.రా.క.వృ.కి.కా.నూ.స. 1 - 49)
గతములో పంచవటి ప్రాంతమున సీత తనతో పలికిన మాటలనే భావించు చున్నాఁడు శ్రీరాముఁడు. సీత యేమనినది?
ఏ కారణము కానీయండి. చంపడము చంపడమే. కొన్ని జీవులను ఆకలి కోసం చంపుతున్నారు. కొందరు రాక్షసులను ధర్మ రక్షన పేరున చంపుతున్నారు. ఇలా కారణములు చెప్పుకోవడం వల్ల మనస్సు సమాధాన పడుతుందేమో కాని పాపమేమో?  ఈ హింస వల్ల మున్ముందు మనకు ఏమి యగునో? అని బోధించు సీతను ఎడబాసి ఈ విరహాన్ని సహిస్తూ ఒక్క నిమిషం కూడా ఉండ లేనయ్యా లక్ష్మణా ! అన్నాఁడు శ్రీరాముఁడు.
ప్రతి నిమిషం జానకీ స్మరణమున ఆమె చేష్టలూ సంభాషణలు జ్ఞాపకం వచ్చి తత్ భావనల యందు వివశుఁడగుచున్న శ్రీరాముని ఇక్కడ మనం దర్శించ వచ్చును. 
అప్పటి శ్రీరాముఁడు మునుల కోరికపై వారి ధర్మ రక్షణ కొఱకు ఆయుధము పట్టితినని సీతతో పలికిన రాముఁడు ప్రాణి హింస ఫలితముగానే ఈ సీతా వియోగము సంభవించినదేమోనను ఆలోచన చేయుచున్నట్లు భావింప వచ్చును. 
సీత మాటలు ఎట్టివో భవభూతి తన ఉత్తర రామ చరిత్ర నాటకమున రామునితో ఇట్లు పలికించినాఁడు.
మ్లానస్య జీవ కుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియ మోహనాని
ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని.
(వాడిపోతున్న జీవ కుసుమానికి నీ మాటలు వికాసములు. తృప్తిని కలిగించేవి. సకలేంద్రియములను మోహింపఁ జేయునవి. అంతే కాదు. ఓ సీతా! నీ పలుకులు కర్ణామృతములు. మనసునకు మధుర రసాయనము వంటివి.)
యథా రసాయనస్య రసమయత్వాత్ భోగ్యత్వం ఔషధత్వాత్ భోగ నివర్తకత్వం చ ఏవ మేతేషామపి ప్రియత్వం హితత్వంచేతి రసాయనత్వోక్తిః. అని వ్యాఖ్యానింపఁ బడినది.
సీత సుతీక్ష్ణనుని ఆశ్రమములో శ్రీరామునకు హింస చేయవలదని చెప్పిన మాటలలోనిదీ పద్యము.
క్రూర మృగంబులున్ దితిజ కోటియు కానన హింస్రజంతువుల్
క్రూరత సింహముల్ పులులు ఘోణులు గుంపులు కట్టి యుండ నా
క్రూర మృగంబులందున నొకొండు వధించినఁ దక్క నన్నియున్ 
వారక కోప మూని పగఁ బట్టి చరింపవె మూక లెత్తుచున్.
(అరణ్య. కాం. 1 - 200)
(క్రూర మృగాలైన పులులు; సింహాలు; అడవి పందులు; మరియు రాక్షసులు అడవిలో గుంపులు కట్టి తిరుగాడుచుండగా ఆ మృగాలలో ఒక్క దానిని నీవు చంపినచో మిగిలినవన్నీ పగఁ బట్టి దండెత్తి రాకుండా ఉండునా?) 
 " ఏ స్పృహా సందోహమ్ములచే చలించి యిది ఈ జ్యావల్లి సంధించుటల్"
(ఏ కోరికతో అల్లె త్రాటిని సంధించు చున్నావో చెప్పుము) అని ప్రశ్నించిన సీత మాటలకు ప్రభావితుఁడైన శ్రీరాముఁడు గత పద్యములో జ్యావల్లిని మ్రోగింపుము చాలును అనినాఁడు.
పద్యములో జానకి పద ప్రయోగము సాభిప్రాయము. జనకుఁడు రాజర్షి. సత్వ గుణ ప్రథానమైన ఆర్జవ జీవితమును గడుపువాఁడు. ఆయన కూతురైన జానకి ఆ గుణములు పుణికి పుచ్చుకొన్నదని ధ్వని. సీతను వదలి వియోగాగ్నిని భరిస్తూ సహిస్తూ నిమిషమైనన్ నిలువ లేనని శ్రీరాముఁడు పలుకుట పరాకాష్టకు చెందుచున్న విప్రలంభ అవస్తకు సూచనము.
మూలములో 
త్వంహి బాణ ధనుష్పాణిః భ్రాతా సహ వనం గతః
దృష్ట్వా వన చరాన్ సర్వాన్ కశ్చిత్ కుర్యాశ్శరవ్యయం.
(నీవు లక్ష్మణునితో కలిసి ధనుష్పాణివై అడవికి వెళ్ళి రాక్షసులను చూచి బాణములను వేయుచుందువు. )
అని యుండగా కేవలము శ్లోకము లోని వన చరాన్ అను మాటను ఆధారము చేసుకొని విశ్వనాథ సీత మాటలను ఎంత మనోహరముగా తీర్చినాఁడో పాఠకులు గమనించ గలరు.
శ్రీమద్రామాయణ కల్ప వృక్షమును విశ్వనాథ నా సకల ఊహ వైభవ సనాథము అని పేర్కొనినాఁడు. నిజమే కదా!
జైశ్రీరామ్.
గౌరవ పాఠకులారా! కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్ప వృక్షము రచనలో తనకు గల సాహితీ ప్రకర్షనంతనూ చొప్పించి రచించారు. అది మనమెంతగా చదివినా అర్థం చేసుకున్నాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ తరిచి తరిచి చూస్తున్నకొద్దీ మనకు కొత్త క్రొత్త భావాలు స్ఫురిస్తూనే ఉంటాయన్న మాట అనుభవైకవేద్యమేకదా! అటువంటి విశ్వనాథ వారు తన రామాయణ కల్ప వృక్షమున చొప్పించిన భావుకతను కవివతంస శీ బులుసు వేంకటేశ్వర్లు గారు చాలా కృషి చేసి ఉపన్యాస రూపంలో సాహితీ ప్రియులకదించడమన్నది ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను. అట్టి వ్యాసాలలోని సారాంశాన్ని ఒక ఏభై భాగాలుగా నిరంతరాయంగా అందించాలనే నా ప్రయత్నం  రాబోయే మరొక్క భాగంతో నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉంది.
సాహితీ ప్రియులైన మీరు " శ్రీ బులుసు వేంకటేశ్వర్లు" అనేలేబిల్ తో ఉన్న ఈ వ్యాసాలను ఆకళింపు చేసుకొని మీ మీ అభిప్రాయాలను వ్యాస రూపంలో ఆంధ్రామృతానికి అందించ గలరని ఆశిస్తూ మీ వ్యాసాలకై ఎదురు చూస్తుంటాను. మీరు పంపే వ్యాసాలను ఆంధ్రామృతం బ్లాగు ద్వారా పాఠకుల కందరికీ అందుబాటులోకి తేవాలనే నాభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారని భావిస్తున్నాను.
జైహింద్ 

7, జూన్ 2010, సోమవారం

శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా పాఠకాళికి శుభాకాంక్షలు.

5 comments

శ్రీరామ భక్తాళి క్షేమంబు నిత్యంబు చేకూర్చగా నున్న శ్రీ ఆంజనేయా!
నోరార నా రామ నామంబు నే పల్క నృత్యంబునే చేతువచ్చోట నీవున్.
ధీరాత్ముఁడా! భక్త వారాశి నీసేవ దీప్యంబుగా జేయు నీనాడు. ప్రేమన్
నీ రామ భక్తాళినేగావగా రమ్ము. నీజన్మ మీనాడు మాభాగ్యమేగా!
హనుమజ్జయంతి సందర్భంగా శ్రీవీర భక్త రామాంజనేయస్వామి వారికి సహస్రానేక వందనములర్పిస్తూ; తద్భక్తజనాళికి వారి ఆశీశ్శులనంతంగా ప్రాప్తించాలని మనసారా కోరుకొంటున్నాను.
జై వీర హనుమాన్.
జైహింద్.

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 48.

1 comments

పాపమ్మీ పులి పీట వెట్టుకొని యీ బాటం దువాళించెడున్
వేపుచ్ఛాహతి తర్జనోగ్ర రదనావిర్భూతి రక్త చ్ఛవిన్
చాపంబెత్తక హస్త కర్షణముగా జ్యావల్లి మ్రోయింపుమీ 
ప్రోపుంజెందుత దాని దారి నది పోవుం జంపగా నేటికిన్?
(వి.రా.క.వృ.కి.కా.నూ.స. 1- 48)
శ్రీరాముఁడు లక్ష్మణునితో యిట్లనుచున్నాఁడు.
చూడవయ్యా! పాపం ఈ పులి ఈ బాట ప్రక్కనే పీట పెట్టుకు కూర్చున్నది. తోకను భూమిపై కొడుతూ కోరలు కనపడునట్లు రక్త కాంతులతో గర్జిస్తూ మనల్ని భయపెడుతున్నది. ధనుస్సును ఎక్కుపెట్టుము. అల్లెత్రాడు మీటి చప్పుడు చేయుము. చాలు. దాని దారినదే పోవును.
సుతీక్ష్ణుని ఆశ్రమము నందు శ్రీరామునకు సీత చనువుతో అహింసా ధర్మమును ఆచరించమని బోధించెను. రాక్షసులతో; క్రూర మృగములతో విరోధము ముని ధర్మమునకు విరోధమని చెప్పెను. మన భాగ్యమీ విధముననున్న నియ్యది చాలనట్లు నెత్తికిఁ గొని తెచ్చుకోనయిన తీరుననున్నవి యీ విరోధముల్ అని చెప్పినది. అటు మానవుల్లాగ కనిపిస్తారు.ఇటు క్రూర మృగాలకంటె ఘోరంగా ప్రవర్తిస్తారు రాక్షసులు. వారి తలకు నూనె కారు. త్రాగుటకు నేయి కారు. అట్టివారితో మనకు విరోధము ఎందుకు? అని వచించెను.
సీత చెప్పిన మాటలు శ్రీరామునకు గుర్తుకు వచ్చినవి కాబోలు. లక్ష్మణునితో జ్యావల్లి మ్రోగించి పులిని భయపెట్టుము చాలును. దాని దారిన అదే పోవును. అనినాఁడు. సీతాసక్త హృదయుఁడైన స్వామి అన్య కార్యములందు నిరాసక్తుఁడగుట పై పద్యము వలన మనకు విశదమగుచున్నది. 
సీతాన్వేషణములో సూక్ష్మ భావ దశలను మహా కవి ప్రదర్శించుట శ్రీరాముని యందు వానిని రూఢిపరచుట కావ్యమునందలి కవి నైపుణ్యమునకు సూచన.
నిరుపమ దుఃఖేర్ష్యాదుల
నిరతము జనియించు నరతి నిర్వేదమగున్.
దుఃఖము వలనను; అసూయ వలనను తత్వ జ్ఞానాదుల చేతను కలిగిన నిష్ఫలత్వ బుద్ధి నిర్వేదము అనఁబడును.
కంటికి కనబడకుండా దాగియుండి కూయుచున్న కోయిల కూత వలన శ్రీరాముఁడు పునః దుఃఖితుఁడై యున్నందున దాని వెన్నంటి ఈ నిర్వేద భావము పులిని చూచి చెప్పిన మాటలలో వ్యక్తమైనది.
వాల్మీకి రామాయణములో సీత మునివృత్తిలో నున్న వారికి శస్త్ర సంయోగము కూడదని శస్త్ర సంబంధము అగ్ని సంబంధము వలె ప్రమాద కారి యని హెచ్చరించినది. 
అపరాధం వినా హంతుం లోకాన్ వీరన కామయే.( ఏ అపకారము చేయని వానిని చంపుట నాకు సమ్మతము కాదు) అన్నది.
అంతే కాదు. స్త్రీ సహజమైన ప్రకృతితో ఆమె ఒక చక్కని కథ చెప్పి రాముని మెప్పించినది. 
పూర్వం ఒక పచ్చని అడవిలో ఒక ముని తపస్సు చేయుచున్నాఁడు. దేవేంద్రుఁడు ఆ ముని తపస్సును పరీక్షింపఁ గోరి ఒక గొప్ప వాడియైన ఖడ్గమును ఇచ్చెను. ఆ మునికి జప తపములపై శ్రద్ధ సడలి ఈ దేవేంద్ర న్యాసమైన ఖడ్గమునందే ఆసక్తి ఎక్కువైనది. ఖడ్గము పట్టిన మౌనియందు క్రమముగా సాత్విక గుణము మాయమై అతఁడు క్రూరుఁడై అధర్మాచరణము చేత నరకము పొందెను. ఇది సీత రామునికి చెప్పిన కథ. 
అందుచే మనము ముని వృత్తి ధర్మమునే పాటించుదము గాక అనెను. 
ధర్మాదర్థః ప్రభవతి - ధర్మాత్ ప్రభవతే సుఖం.
ధర్మేణ లభతే సర్వం - ధర్మసారమిదం జగత్. 
అన్నది సీత.
ధనుస్సును పట్టుట క్షత్యియ ధర్మ మనియు క్షత్రియులకు ఆర్త త్రాణ పరాయణత ప్రథమ ధర్మ మనియు వాదించి ఆనాడు సీతను ఒప్పించిన శ్రీరాముని మనస్సులో ఏ మూలనో సీత ఉపదేశము తళుకు లీనుచునే ఉన్నది.
ఆ మహాత్ముఁడు సీత మాటలను మన్నింప దలచెను. మన్నించెను.
ఒక్కొక్కప్పుడు కథలోని చమత్కారమే ఒక శిల్పముగా రూపొంది కావ్యమునకు వింత రుచులను ప్రసాదించును.
జ్యావల్లి మ్రోగింపుమీ చంపగా నేటికిన్ అను మాటలు కవి అర్థాంతర వివక్షచే ప్రయోగించెను.
జై శ్రీరాం.
చూచాం కదండీ విశ్వనాథవారి కల్ప వృక్షంలో నిబిడీకృతమైయున్న భావుకతను. తదుపరి భాగములను మరొక పర్యాయం కలిసినప్పుడు చూద్దాం.
జైహింద్.    

6, జూన్ 2010, ఆదివారం

ప్రథమ పద్యమున ప్రయోగ నిషిద్ధాక్షర స్థానములు.

6 comments

పద్య రచనాసక్తితో పరిఢవిల్లు పాఠక పుంగవులారా!
మనం అతి ముఖ్యమైన; చేయ వలసిన పనుల కంటే కూడా అత్యంత ముఖ్యమైన చేయ కూడని పనులేవో మున్ముందుగా తెలుసుకొని ప్రవర్తిస్తుంటాం కదా! న రావణాదివద్వత్రితవ్యం. రామాదివద్వర్తితవ్యం. అనే అంశాలు గ్రహించినప్పుడు రాముడులాగ ప్రవర్తిస్తే మంచి పేరొస్తుందో రాదో కాని రావణాసురుఁడు లాగా ప్రవర్తించ కుండా అను క్షణం జాగరూకతతో జీవితాంతం మెలగాలి.  ఇందేమాత్రం భంగం వాటిల్లినా అపకీర్తికి అంతు ఉండదు కదా!
సరే ఆ విషయానికేమి కాని - - - ప్రస్తుతం పద్య రచన చేయాలనే ఆసక్తి ఉన్న మనం మాత్రం ఏ అలంకారం ప్రయోగించినా; ఎంత అందంగా చెవులకింపుగా పద్యం వ్రాసినా మంచి పద్యాలలో ఒక మంచి పద్యంగా సామాన్యంగా కొత కాలం మాత్రమే గుర్తింప బడుతుంది. ఇక చేయకూడనివి కొన్ని మనకు ఛందో నియమాల్లో చెప్ప బడ్డాయి. 
వాటిలో దశ విధ దోషాలు ప్రక్కన పెట్టితే; అతి ముఖ్యంగా పద్యాది ఎలా గుండాలో ముఖ్యంగా ఎలాగ ఉండ కూడదో చెప్ప బడింది. ఆ నియమాన్నతిక్రమిస్తే వచ్చే ప్రతికూల ఫలితాలు కూడా వివరింప బడ్డాయి. వాటి యందు కావ్యమున కాని మరే రచన యందు కాని వ్రాసెడి మొదటి పద్యంలో ఏ స్థానంలో ఏ అక్షరం నిషిద్ధమో వివరించ బడింది. అది మీ ముందుంచుతున్నాను. దయచేసి ఇది శాస్త్ర బద్ధమైన నియమమని; నమ్మడం; నమ్మకపోవడం  కవి మనసుపై ఆధారపడి ఉంటుందని మరచిపో వలదని మనవి.

ప్రథమ పద్యము నందు ప్రథమ పాదమున ప్రయోగ నిషిద్ధాక్షరములు.
 1 వ అక్షరముగా:-  అలు - అలూ -  ఋ - ౠ - గ - ఘ - ఙ - చ - ఛ -  జ - ఝ --ఞ - ట - డ - ఢ - ణ - ద - ధ - న - బ -  భ - మ - య - ర - ల - వ ళ - స - క్ష .
 3 వ అక్షరముగా :- అ - క - గ - జ - ట - డ - త - ప - ర - శ - స - హ. 
 5 వ అక్షరముగా:- ర - స - జ - గ. 
 6 వ అక్షరముగా :- అ - ఆ - క - గ - జ - ట - త - ప - ర - శ - స - హ - క్ష.
 7 వ అక్షరముగా :- అ - ఆ - క - ట - త - ప - ర - శ - హ - క్ష.
11 వ అక్షరముగా :- అ - ఆ - క - ట - త - ప - ర - శ - హ - క్ష.
----ప్రయోగింప రాదు. 
----ఇది కేవలము కావ్యమున కాని; ఖండిక యందు కాని ప్రథమ పద్యమున ప్రథమ పాదమున మాత్రమే యని  గ్రహించునది.
మిత్రులారా! ఈ నియమాన్ని భూతద్దంలో చూసి భయపడి; మనకెందుకొచ్చిన తల్నొప్పి లెద్దు అనుకొని  మీ రచనా వ్యాసంగానికి స్వస్తిమాత్రం పలకకండి సుమా!
జైహింద్.

4, జూన్ 2010, శుక్రవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 46 & 47.

0 comments

కంll
అట శబరియు నిట పంపయు
నటు లాత్మకు నిటుల కనుల కనవధి భూత
స్ఫుటతర సుఖానుభూతిం
ఘటియించిరి యింత కష్ట కాలము నందున్. (1 - 46)
కంll
ఆ యాపద యచ్చోటిది
రా! యని తెలిసినను కొంత రాపిడి తగ్గున్.
కోయిలయు నుల్ల కొండల
లోయలలో నుండి యెడదలో నిడియించున్.(1 - 47)
శబరి - పంపా సరస్సు శ్రీరాముని ఆత్మకు కనులకు అంతు లేని ఆనంద ప్రదమైన సౌఖ్యమును కలిగించినవి. ఇంత కష్ట కాలము లోను దుఃఖమును మరపించినవి అనినాఁడు శ్రీరాముఁడు.
శబరి రామ భక్తురాలు. బోయ కాంత యైనను ఆ యమ్మ ప్రతీక్షా రూపమైన తపస్సు, ఆతిథ్య రూపమైన అర్చన శ్రీరామునికి హృదయానంద కారకమైనవి. ఆమె మాటలాడినంత సేపు శ్రీరాముఁడు పొందిన ఆత్మానందమునకు అవధి లేదు. ఆమెతో స్వామి పరియాచకము లాడినాఁడు కూడా. సీతా వియోగ వ్యథనే మరిపించినది శబరీ సాన్నిధ్యము.
శబరి ఎట్లున్నది? శిరసుపై పూల తట్ట మోయు చున్న ఆమె తుట్ట తుద దాక ఎండిన చెట్టు కొమ్మ - శేఖరంబున యందు పుష్పించినట్లున్నదట. పరమ యోగిని యైన శబరితో శ్రీరాముఁడు మాటలాడిన మాటలన్నియు చమత్కారములు మరియు నిర్భర దివ్యార్థములై కన బడునట్లు విశ్వనాథ ఉక్తి వైచిత్రిని పండించి పోసినాఁడు. 
అవ్వ! నివ్వరి వెన్నులయట్లు ముగ్గు
బుట్ట వలె నయ్యె నీ శిరంబును ననంగ
ప్రభువ! నీ ఆత్మ వాకిట రంగ వల్లి
నినుచుటకు నింతగాగ పండిన దతంచు.
(అరణ్య కాండ శబరి ఖండము- 357)
శ్రీరాముఁడు శబరిని ఆశ్వీయుజ సంబంధాంబు దాలకా! (ఆశ్వయుజ మాద మేఘము వంటి ముంగురులు కల దానా!) అని ప్రేమతో పిలువగా శబరి సుందరాపాంగ మంధరవిద్యుజ్జలదాభిరామ తను! (అందమైన కంటి చూపుల మెరుపులు గలిగినట్టి నీలి మేఘాభిరామ శరీరా!) అని పిలుస్తుంది.
శబరి కనుల యందు స్వామి తా దన ప్రతిబింబమరసి దార విరహ మూర్తి
విరహ బాధయెల్ల విడిచెను. అని విశ్వనాథ వర్ణించినాఁడు.
యోగ కర్త యోగ భర్త యోగ ఫల స్వరూపుఁడైన శ్రీరామునకు శబరీ యోగినీ సామీప్యము ఆత్మానంద మొనరించుటలో వింత లేదు కదా!
ఇక పంపా సరస్సు నేత్రానంద ప్రదాయిని. ఆయా సందర్భములలో పంప సౌందర్య వీక్షణా లాలసతచే రాముఁడు ప్రకృతి స్వరూపిణి యైన సీతను చూచినట్లే ఆనందించినాఁడు. 
అక్కడ శబరి ఇంద్రియాతీతమైన ఆనందము కలిగించి సీతా విస్మృతిని కలిగించగా ఇక్కడ పంపా సరస్సు ఇంద్రియగతమైన (నేత్ర) ఆనందమును కలిగించి సీతా సందర్శనము చేయించినది శ్రీరాముని చేత. బాహ్యావరణ విచ్ఛేదమునందు జానకి విస్మృతితో ఆత్మానందము ప్రకాశము కాగా సంఘటించినది శబరీ దర్శనము. తాను రాముఁడనే స్పృహ యందు సీతా సౌందర్యమును దర్శింప జేసినది పంపా సరోవర దర్శనము.
ఈ విధముగా తనకు సీతా విస్మృతి యందును సీతా స్మృతి యందును చేతను ఆనందమును ప్రసాదించిన శబరి పంపా సరస్సును స్వామి కృతజ్ఞుఁడై స్మరించుట శ్రీరాముని సద్గుణ విశేషము కాక మరేమిటి? 
ఇంతలో దూరపు కొండలలో నుండి  వచ్చిన కోయిల కూత రాముని హృదయమును గాయ పరచినది. 
ఈ ఆపద యిచ్చటి నుండి వచ్చునని తెలిసినచో హృదయము రాపిడి తగ్గును కదా! ఆ కోకిల చూడుము. ఎచ్చత ఉన్నదో. లోయలలో దాగి యుండి నన్ను బాధించు చున్నది. అని రాముఁడు లక్ష్మణునితో పలుకును. ఈ మాటలు సీతను అపహరించిన రావణుఁడు ఎచ్చటనున్నాడో తెలియని అసక్తతను కోకిల వ్యాజమున రాముఁడు వ్యక్తపరచు చున్నట్లు  గ్రహించ వలెను. 
మహా కవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు కల్ప వృక్షమును శ్లాఘించిన తీరు ఇది.
భద్రాధార కథా ప్రసాద గుణ శుంభాన్మూల మారూఢ భా
షా ద్రాగ్గుంఫ కళా ప్రవిచలత్ శాఖా ప్రశాఖంబు కుం
భ ద్రోణీ కృత పూరితాఖిల రస స్వచ్ఛాల వాలంబు. శ్రీ
మద్రామాయణ కల్ప వృక్షమున కస్మత్ గంధపుష్పాక్షతల్.
జై శ్రీరాం.
చూచారు కదండీ 46 & 47 భాగములు.
తదుపరి భాగాలు త్వరలో తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దం.
జైహింద్.  

2, జూన్ 2010, బుధవారం

కుమార సంభవంలోని గోమూత్రికా బంధ పద్యము.

12 comments


నన్నెచోడుడు ఒక గొప్ప ప్రాచీన కవి. అతడు కుమార సంభవం అనే తెలుగు పద్య కావ్యం వ్రాసాడు. అందులో అనేకమైన చిత్ర, బంధ కవిత్వాలు కలవు.
ఇతడు గోమూత్రికా చక్ర బంధాలతో కూడా పద్యాలను వ్రాసినాడు. గోమూత్రికా బంధ పద్యములో ఒకటి విడిచి మరొక అక్షరము మొదటి రెండు, చివరి రెండు పాదాలకు సమానముగా ఉంటుంది.
ఈ క్రింది కంద పద్యమున ఒకటవ; మూడవ పాదములందు; రెండవ; నాల్గవ పాదములందు సరి సంఖ్యాక్షరాలు సమానంగా ఉంటాయి. అది మీరు గమనించ వచ్చు.
కం.స్థితి శు    సి మూర్తీ!   వ సుర   దనుదురిధి సుకీర్తీ!
    హ  దతి శుయు మూర్తీ! స్మ పుర  నుభి దురిసుకీర్తీ!

....(10.85)
స్థి   మ    శు    సి     మూ     వ    సు   వ    ద      జ      రి    వ    ధి      కీ
   ర    తి      భ      త       ర్తీ!     ర     ర    ర     ను    దు   త    న    సు      ర్తీ!
హ   ద     శు   యు   మూ   స్మ   పు   హ    త      భి     రి    జ    న      కీ
భావము:- స్థిరమతీ, శుభమైన తెల్లని ఆకారముగలవాడా, సురాసురుల పాపసముద్రాన్ని ఇంకింప జేయువాడా, పాపాలను హరించే మంగళకరమయిన ఆకారము గలవాడా, మన్మథుని, త్రిపురాలను భేదించిన వజ్రాయుధమువంటి దేహముగలవాడా అని ఈశ్వరుని సంబోధిస్తున్నాడు కవి ఈ పద్యములో.
ఒక అక్షరంనుండి తరువాత ఉండ వలసిన అక్షరాన్ని కలుపుతూ అన్నీ అలా కలిపి చూడండి. వచ్చే డిజైన్ నుబట్టి గోమూత్రికా బంధంగా మన కర్థమౌతుంది.

నేను వ్రాసిన పద్యమును ; మన(భా)రవి వ్రాసిన పద్యమును; వ్యాఖ్యానములలో చూడవలసినదిగా మనవి.
మీరూ ప్రయత్నిస్తే అద్భుతంగా ఇలాంటి ప్రయోగం చేసి వ్రాసి ఆంధ్రామృతానికి  పంపగలరు. ప్రయత్నించండి మరి.
జైహింద్.