గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 40వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

40. ఓం సుభద్రకాయ నమః.

తోటక గర్భ సీసము.

దండించుమాదురితంబులు చేసెడి - దుర్జనులన్ గాంచి తోయజాక్ష!

ఘోరమౌ దుష్ పరిహారము చేయుమ - భక్త నుతానీదు శక్తిఁ జూపి,

వర్ధిల్లుచున్ నిరపాయులు కావలె - నీ జనులున్దేవనీవె రక్ష.

యాదుకోరా! పరమాత్మ గణించి కృ - పంగనుమాదేవపరమ పురుష!

గీ. దుర్మదాంధుల దండించి త్రోవఁ జూపు - కర్మసాక్షి *సుభద్రకా*! కరుణఁ గనుమ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

40 సీస గర్భస్థ తోటకము. ( .. యతి 9)

దురితంబులు చేసెడి దుర్జనులన్.

పరిహారము చేయుమ భక్తనుతా

నిరపాయులు కావలె నీ జనులున్.

పరమాత్మ గణించి కృపం గనుమా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! తోయజాక్షా! చెడుగా ప్రవర్తించెడి చెడ్డవారిని

దండించుము. నీ శక్తి కొలది ఘోరమైన  చెడును పరిహరించుము. దేవా నీ జనులు వర్ధిల్లుచూ నిరపాయులు

కావలెనయ్యా. వారికి నీవే రక్షం   పరమ పురుషా! దేవా! కృపతో నీవు చూచి ఆదుకొనుమా. దుర్మదాంధులను దండించి

త్రోవ చూపెడికర్మసాక్షివైన సుభద్రకా! కరుణతో చూడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.