గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 35వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

35. ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః.

మాలిని వృత్తము గర్భ సీసము.

వినయ మనయమునీవే నవ్య సూర్యప్ర - కాశానృసింహా! వికాసమీవె!

విజయ విభవములీవే సత్య సంపన్మ - హేశామహద్భాగ్య మీవె నాకు

సదయనొసఁగు రమేశాదర్ప మూలప్ర - ణాశామహద్ధర్మ నవ్యగతిని.

యనయ వితరణమిమ్మా! నన్ను రక్షించు - శ్రీశా! మహాత్మా! విశేష భాస!

గీ. దనుజుఁడగు *హిరణ్యకశిపుధ్వంసి*! నృహరి! - వినుత ప్రహ్లాదుఁ గాచిన విశ్వవేద్య!   

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

35 సీస గర్భస్థ మాలిని వృత్తము. ( .. యతి 9)

నయమనయము నీవే నవ్య సూర్యప్రకాశా! - జయ విభవములీవే సత్య సంపన్మహేశా

దయనొసఁగు రమేశాదర్ప మూల ప్రణాశా! - నయ వితరణమిమ్మానన్ను రక్షించు శ్రీశా!  

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! రాక్షసుఁడగు హిరణ్యకశిపుని నశింపఁ జేసినవాడా!

ఓ నరహరీ! ప్రశంసింపఁబడు ప్రహ్లాదును కాపాడిన విశ్వమంతటను తెలియఁబడువాడా!.  ఉదయ సూర్యప్రకాశా!

నృసింహా! ఎల్లప్పుడూ వినయ స్వభావము నీవే అగుదువు. నాకు వికాసమునిమ్ము. సత్య సంపన్నా! విజయవిభవములు

నీవే సుమా. రమేశా! నీవే నాకు గొప్ప భాగ్యమును దయతో నొసగుము. దర్పమును సమూలముగా నశింపఁ

జేయువాడా!.నన్ను రక్షించు శ్రీశా! మహేశా! విశేషముగా ప్రకాశించువాడా! అనయ వితరణబుద్ధినిమ్ము. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.