గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2012, మంగళవారం

కవిసమ్మేళనము తే.30 - 11 - 2012 న చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభ లో జరగబోతోంది.

0 comments

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా! 
అరసి వేయ వచ్చు అపరాధ సుంకమ్ము  -  పావు గంట దాటు వక్తపైన.
ధనమునపహరించు మనుజుఁడే దొంగయా?  -  కాన రాని దొంగ కాల హర్త.
ఇదెక్కడి పద్యమని ఆశ్చర్యపోతున్నారా? 
అభినవ వేమన, ఆంధ్ర పద్య కవితా పితామహుఁడు, పీఠికా ప్రబంధ పరమేశ్వరుఁడు
 అని కీర్తింపఁ బడిన 
మహా కవి నండూరి రామకృష్ణమాచార్యులవారు వ్రాసిన పద్యమిది.
లెక్కకు మిక్కిలిగా వ్రాసిన చక్కని మౌక్తికాలే కాదు. అపురూప ఖండికలు కూడా వీరి రచనలో చోటు చేసుకొన్నాయి. మహా ప్రజ్ఞాన్విత మహనీయ రచనా ధురీణులైన 
శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యులవారి రచనలు - వ్యక్తిత్వము అనే అంశముపై 
కవిసమ్మేళనము 
తే.30 - 11 - 2012 న సాయంత్రం 5 గంటలకు
చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభ లో 
జరగబోతోంది.
నిర్వాహకులు
తెలుగు సాహిత్య కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు"సహస్ర పద్య కంఠీరవ" శ్రీ చిక్కా రామ దాసు.
ఈ కార్యక్రమమును ఆస్వాదించడానికి సహృదయులందరూ ఆహ్వానితులే.
జైహింద్.

25, నవంబర్ 2012, ఆదివారం

మాతృభాష మనుగడ - కవి పాత్ర

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
ఈ రోజు సాహితీ సమితి - శేరిలింగంపల్లి శాఖవారు నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమం నిస్సందేహంగా బాగా జరిగిందని చెప్పుకొనవచ్చును. 
కవి సమ్మేళనమునకు ముందు సాహితీ సభ జరిపి అందు పాల్గొనినసభాధ్యక్షులు శ్రీ ఆర్.రామచంద్రరావు, ముఖ్య అతిథి శ్రీ బిజ్జం వేంకటేశ్వర రెడ్డి, విశిష్ట అతిథి డా.చంద్రభూషణ రావు, వక్త శ్రీవడ్లూరి ఆంజనేయ రాజు, సంయోజకులు శ్రీ బీ.సత్యనారాయణరెడ్డి,  వారి వారి ప్రసంగాలతో శ్రోతల హృదయాలను ఆకట్టుకొన్నారు.
తదుపరి కవిసమ్మేళనమునకు కవితిలక, భారత్ భాషా భూషణ్, సాహిత్య రత్న డా. తిరునగరి , సభాధ్యక్షులుగా వ్యవహరించారు. 
కవులు ఒక్కరొక్కరుగా తమ కవనపటిమకు అద్దం పట్టుతూ కవితా గానం చేశారు.
అధ్యక్షులు ప్రతీ కవి యొక్క కవనమును తన భావనా నైపుణ్యంతో అత్యద్భుతమైన సాహితీ కోణంలో చూపించి ప్రతీ కవికీ ప్రత్యేక గౌరవాన్ని ఇనుమడింపజేశారు. నండూరి కృష్ణమాచార్యులవారి సుపుత్రులు శ్రీ నండూరి శోభనాద్రి గారు కూడా సభలో మాటాడి సభను రంజింపజేశారు. సాహితీ సమితి వారు కవులందరినీ ఉచిత రీతిని సత్కరించారు. కవులకు చక్కని గౌరవమును ఇనుమడింప జేసే చక్కని ఈ కార్యక్రమమును నిర్వహించిన శేరిలింగంపల్లి సాహితీ సమితివారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. 
అక్కడ సభలో నేను చదివినపద్యాలను మీ ముందుంచుతున్నాను.
మాతృభా మనుగడ - వి పాత్ర
రచన :-  చింతా రామ కృష్ణా రావు 
:- 
శ్రీ సుమ పేశ లాన్విత  విశేష పదజ్ఞులు, జాను తెల్గు  
ద్భాషణ భూషణుల్, మధుర వాఙ్మయ స్రష్టలు, గౌరవార్హులై
యీ సభనొప్పి యుండుదురనేకులు సత్కవి పండితుల్,సద
భ్యాస పరుల్,మహాత్ములును,భక్తిగనందరికంజలించెదన్.1.
శా:- 
కాలం బింతనెఱుంగు నాడు ఘన సంస్కారాన్వితోద్భాగ్య  
మ్మేళంబై వెలుగొందినట్టి తెలుగున్.దీనంబుగా నేడు తా
బేలై రక్షణచేయుఁ డంచునిలిచెన్ భీతిన్ సుధా మాధురుల్ 
గ్రోలం జేసిన యాంధ్ర మాత. సుగతింగోల్పోయె నే డీగతిన్.2.
.వె.:- 
మాతృ గర్భ ముక్త మణి హార మగు కవి 
మాతృ భాష నిలను మనుపు నతఁడు
మార్గ దర్శి యతఁడు మహనీయ వరులకు.  
మనుజ వరుల లోన మహితుఁ డతఁడు. 3.
:- 
సుకవికలంబుచేసుధలు శోభిలఁ జేయఁగ చింద మాతృభా 
షకు జవజీవముల్ కలుగు. సద్గతిభాషకుసత్కవీంద్రులే.
సకల జనంబు నేర్వ దగు చక్కని తేలిక పాటి మాటలన్ 
చక చక వేసి పద్యములు చక్కగ వ్రాసిన . . . తెల్గు వెల్గదే? 4.
గీ:- 
తెలుగు భాషను గల తీపి తెలుప వలయు.  
తెలుగు సామెత లెల్లెడ తెలుప వలయు.
తలుగు ఛందపు రీతులు తెలుప వలయు.  
తెలుగు బంధ కవిత్వము తెలుప వలయు. 5.
.వె.:- 
తెలుగులోన పలికి, తెలుగు మాటాడించి,  
తెలుగు ఘనత నెన్ని తెలుప వలయు.
తెలుగు భాష మనకు తేనె వాగని చెప్పి
తెలియ పరచ వలయు తెలుగు వెలుగ. 6.
చతుర్విధ కందగీత  గర్భ  చంపక మాల :-
మనతెలుగేభువిన్సుగుణమాన్యులుమెచ్చఁగ శోభఁగాంచునూ
తనకళలన్గొనున్.తెలుగుతమ్ములునన్నలుతృప్తిఁజెందుభూ
జనగళమున్సదాధ్వనిగసత్యలసద్వరభాషయౌను.ధా
రణ విలువన్ గనున్  కవులు భ్రాంతిలఁ జేసెడి కావ్య మాలతిన్ 7
1వ క. :-  
తెలుగే భువిన్ సుగుణ మా  
న్యులు మెచ్చఁగ శొభఁ గాంచు నూతన కళలన్
గళమున్ సదా ధ్వనిగ స 
త్య లసద్వర భాష యౌను ధారణ విలువన్ .
2వ క. :-  
గళమున్ సదా ధ్వనిగ స 
త్య లసద్వర భాష యౌను ధారణ విలువన్
తెలుగే భువిన్ సుగుణ మా  
న్యులు మెచ్చఁగ శొభఁ గాంచు నూతన కళలన్ .
3వ క. :-  
కళలన్ గొనున్ తెలుగు త  
మ్ములు నన్నలు తృప్తిఁ జెందు. భూజన గళమున్
విలువన్ గనున్  కవులు భ్రాం 
తిలఁ జేసెడి కావ్య మాలతిన్ మన తెలుగే.
4వ క. :-  
విలువన్ గనున్  కవులు భ్రాం  
తిలఁ జేసెడి కావ్య మాలతిన్ మన తెలుగే
కళలన్ గొనున్ తెలుగు త  
మ్ములు నన్నలు తృప్తిఁ జెందు. భూజన గళమున్ ,
గీ.: - 
సుగుణ మాన్యులు మెచ్చఁగ శొభఁ గాంచు   
తెలుగు తమ్ములు నన్నలు తృప్తిఁ జెందు.
ధ్వనిగ సత్య లసద్వర భాష యౌను  
కవులు భ్రాంతిలఁ జేసెడి కావ్యమాల .
:-
సదమల సంస్కృతంబు సరి చక్కని తెల్గు కనంగ. పద్యముల్ 
ముదము దలిర్ప వ్రాసి కడు ముచ్చటతో పఠియింప జేయుచున్
మధుమయ భావనాగరిమ మాన్యులు మెచ్చగ చూపిసత్కవుల్
విధి కృత తెల్గు భాషనిక వేల్పుల భాషగ మార్చగావలెన్ 8
అశ్వధాటి:-
జీవంబుతో ఘన విభావంబుతో మృదుల రావంబుతో తెలుగిలన్
నీవారలిచ్చిరిది నీవారసత్వమిదినీవర్ధనంబగునిదే.
నీవాఙ్మయోజ్వలిత భావ ప్రపూర్ణమిది, నీవాక్సుతేజస మిదే.
దేవాది దేవులును భావించి నేర్తురిది. నీవేల నేర్చుకొనవో?9
:-
తెలుగును విడువక చదువుఁడు
వెలుగుల గని తెలుగు. తెలుగు వెలుగయి నిలుడీ.
తెలుగునఁ గల  పలుకుబడులు 
తెలుగు జనులు పలుకు నటుల తెలుపుడు సతమున్.10.
గీ:- 
జయము కలుగుత తెలుగును చదువ మనకు
వివిధ గతులను తెలుగిల వెలుగు సతము.
కవిత లొలికెడి కలములఁ గలుగు జయము 
జయము సుకవుల జగతికి జయము జయము.11.                       
స్వస్తి.
చూచారుకదండీ!
మీరూ ఈ అంశమును స్వీకరించి మీ కవితా పటిమను ప్రదర్శించుతూ పద్య సుమాల మాలతో ఆంధ్రామృత భాండాన్ని అలంకరింప జేస్తారని ఆశిస్తున్నాను. 
జైహింద్.

23, నవంబర్ 2012, శుక్రవారం

సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా? పద్య కవిత పోటీలో మన సోమార్క గారికి ప్రథమ బహుమతి

13 comments

జైశ్రీరామ్.
సాహితీ పిపాసులారా! సుమనర్నమస్సులు.
ఇప్పుడు  రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొనిన శ్రీ అర్క సోమయాజిగారిని గూర్చి తియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. వారిని మనము హృదయ పూర్వకంగ అభినందిద్దాము. వారికి ఈ బహుమతి కైవసమైన వార్తను వారి మాటలలోనే చూద్దాము.
అయ్యా! నమస్కారాలు!
ఇటీవల సాహిత్యాభివృద్ధికి పద్యం ఉపయోగపడిందా?లేదా?అని ప్రశ్నిస్తూ,ఒక సంస్ఠ పద్య పోటీ నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని నా సమాధానాన్ని "పద్య శైలూషి "అనే పద్య ఖండికను పద్య కవిత రూపంలో పంపించాను.దానికి రాష్ట్ర స్తాయి పద్య కవితలపోటిలో ప్రధమ బహుమతి లభించినట్లు తెలిపారు.ఆ కార్యక్రమం "ఒంగోలు"లో ఏర్పాటు చేశారు.24/11/2012నబహుమతి అందుకోవడానికి మరియు అదే రోజు కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనడానికి రేపు రాత్రి బయలుదేరుతున్నాను.మీ ఆశీర్వాదములు కోరుతున్నాను.
ఆ పద్యాలను ఇక్కడ మన అంతర్జాల వీక్షలకు కూడా అందజేస్తున్నాను. ఇట్లు మీ సోమార్క
తేనియలూటలూరు,తియ తియ్యని దేశిపదాల సౌరు,స
ద్గాన గుణమ్ము,తెల్గు నుడికారగణమ్ములనొప్పు,వాక్యవి
న్నాణములున్,మనోజ్ఞ కవనమ్ముకు పెట్టని సొమ్ములౌనుగా,
జానుతెనుంగుపద్యముల జాతికి సాటికవిత్వమున్నదే?
పదముల్ పేర్చి,బిగించికూర్చి,రసవద్భావమ్ములన్ పేర్చి,సొం
పొదవన్, శైలియు,వృత్తి,రీతి,రసవత్పాకాది,మేలౌ గుణా
భ్యుదయోల్లాస, కవిత్వ రూప నిగమ ప్రోక్తార్ష విజ్ఞాన సం
పదయై భాసిలు,తెల్గు భాషకు,మహద్భాగ్యంబు!పద్యంబెగా! 
నన్నయనాటి నుండి,యధునాతన రీతులు నేర్చుకొంచు,నె
న్నెన్నొ కవిత్వ ప్రక్రియలనింపగు,రూపుల దిద్దుకొంచు,న
భ్యున్నతిగొంచు,కావ్యవిభవోజ్వలమౌచును,తెల్గుసాహితిన్
యెన్నగ!హృద్య పద్యమది!యింపగు!తెల్గు సమృద్ధినందగన్.
పద్యము ప్రాతవడ్డదని,భావన సేయుటయేమొ గాని?!త
ద్విద్య సహస్ర రూపిణిగ,విస్తృత రూపము దాల్చియొప్పె,న
య్యద్యతనాంధ్రసత్కవులు,యాధునికత్వ,కవిత్వరూపమౌ,
హృద్య కవిత్వ రీతులకు,నింపగు మూలము!గాదనందురే?
సరస పద ప్రహేళికల జల్లిన భావరజమ్ముతో,నలం
కరణలనొప్పు వర్ణనల గప్పిన,యక్షర రధ్యపైని,మా
సరస కవీశు లందముగ,చక్కని పద్య రధమ్ము గూర్చిరా
దరమున,త్రిప్పినారలు!వధాన విధాన పధాన నెల్లెడన్.
నన్నయ సంస్కృతాంధ్ర సుగుణమ్ములనొద్దికదిద్దితీర్చి,వి
ద్వన్నుతుడయ్యె;నూతన విధానము నేర్పెను సోమయాజి,రూ
పోన్నతిజేసె,దేశికవితోద్యమసారధి;సోముడున్ పదా
ర్వన్నెల శొభగూర్పగను!పద్యము జానగు శోభ నొప్పెడిన్.
చింతింపంబనిలేదు!పద్యకవు లక్షీణ ప్రభావోన్నతిన్,
గొంతుల్విప్పుడు!పూర్వ వైభవము సంకోచమ్ముగా బొంద,మీ
వంతున్ సత్కృషిసల్ప,మేటి రసవత్పద్యమ్మనావద్యమై,
భ్రాంతుల్ దీర,రసజ్ఞశ్రోతృ జలధిన్ పర్వించు పద్యాపగల్.
డా.చంద్రశేఖరావధాని చేస్తున్న అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకులుగా శ్రీ సోమార్క..
చూచాము కదండి! ఈ సాహితీ ప్రయాణంలో శ్రీ సోమార్కగారు మరిన్ని విజయ బావుటాలెగరవేయాలని కోరుతూ వారిని ఆంధ్రామృతం ద్వారా మరొక్క పర్యాయము అభినందిస్తున్నాను. ఇక 
ఈ అంశముపై మీరూ మీ భావలకు పద్య రూపాన్ని కల్పించి ఆంధ్రామృత్ం ద్వారాపాఠకులకు అందజేయ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.

21, నవంబర్ 2012, బుధవారం

మియాపూర్ హైస్కూల్లో25-11-2012న కవిసమ్మేళనమునకు ఆహ్వానము

0 comments

జైశ్రీరామ్.
సాహితీ సన్మిత్రులారా! సాహితీ సమితి శేర్లింగంపల్లి శాఖ వారు వివిధ ప్రాంతములనుండి అనేకమంది కవులను ఆహ్వానించి, కవిసమ్మేళనము ఏర్పాటు చేసియున్నారు. సహృదయులందరూ ఈ కార్యక్రమమునకు  అహ్వానితులే.
మియాపూర్ లోగల ఈసేవా కేంద్రము ప్రక్కనే గల జిల్లాపరిషత్ హైస్కూల్ లో ఈ కార్యక్రమము జరుగుచున్నది. మియాపూర్ చౌరాస్తాకు, ఆల్విన్ చౌరాస్తాకు మధ్యగల ష్టాప్.రోడ్డుకు ఉత్తరంగా ఉన్న సందులో ఈ పాఠశాల కలదు.
జైహింద్.

19, నవంబర్ 2012, సోమవారం

రుద్రము (నమక చమకములు) వింటూ అభిషేకం చేసుకోండి

2 comments

17, నవంబర్ 2012, శనివారం

ప్రపంచ తెలుగు మహాసభలు 27th, 28th & 29th Dec 2012

0 comments

జైశ్రీరామ్
సోదరీ సోదరులారా!తెలుగు భాషాభిమానులకు తెలుగు మాతృభాషగా కల యావన్మందికి శుభ వార్త. ప్రపంచ తెలుగు మహా సభలను ఈ సంవత్సరం మన దేశంలో మన రాష్ట్రంలో మన ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరి యున్న తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఏక క్రియా ద్వ్యర్థికరీ అన్నట్టుగా తెలుగువారు తెలుగు భాషా సంస్కృతుల కద్దంపట్టే కార్యక్రమాలను సభలో చూడడంతో పాటు మన స్వామివారి దివ్య దర్శన భాగ్యం కూడా పొందే అరుదైన సదవకాశం మనకు లభిస్తోందని తెలియ జేస్తున్నాను. ఈ క్రింది కరపత్రమును చదివి మిగిలిన వివరములను మీరు గ్రహింపనగును.
జైహింద్.

16, నవంబర్ 2012, శుక్రవారం

అత్యద్భుతంగా తుని గ్రంథాలయంలో జరిగిన సాహితీ సభ.

1 comments

జైశ్రీరామ్.
పండిత నేమాని వారు
సాహితీప్రియులారా!
14వ తేదీన ఆంధ్రామృతము ప్రకటించిన విధముగా
తే.15-11-2012ని తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో గల శాఖా గ్రంథాలయములో పండిత నేమాని రామజోగిసన్యాసిరావుగారి ఉపన్యాస కార్యక్రమము ఆనందముగా సాగినది. వారు 1 గం. 30 ని.లు మాటాడినారు.  శివానందలహరి ప్రాశస్త్యమును వర్ణించుచూ కొన్ని శ్లోకములకు విపులమైన వ్యాఖ్యను చేసినారు.
1.శ్రీమదాది శంకరులు శ్రీశైలములో రచించిన శివానందలహరి అను శతకమునుగూర్చి తెలియఁజేసినారు.  ఇందులోని 100 శ్లోకములు భక్తి మరియు జ్ఞానప్రబోధకములే తనియు,  దీని శైలి చాల సరళముగా నున్నదనియు,  అనేక విధములైన ఛందస్సులను సుగమనముతో సులభ గ్రాహ్యముగా రచించినారనియు,  ఇందు రూపక, ఉపమ, శ్లేష, ఉత్ప్రేక్ష మొదలైన అర్థాలంకారములు మరియు శబ్దాలంకారములు శోభిల్లుచుండుననియు వివరించినారు.
మరియు
2. తొలి శ్లోకములో శ్రీ శంకరులు ఆది దంపతులు, జగతికి తల్లిదండ్రులు, ఆది గురువులు అయిన పార్వతీ పరమేశ్వరుల తత్త్వమును వర్ణించుచూ వారికి ప్రార్థన చేసిన విధము అద్భుతమనియు,  2వ శ్లోకములో ఈ శివానందలహరీ ప్రవాహము యొక్క జననము, అది ప్రవహించుచున్న విధానము, దాని ఫలితమును వర్ణించినారనియు,  3వ శ్లోకములో శివతత్త్వమును సంగ్రహముగా చదువరులకు తెలియజేసినారనియు,భక్తి జ్ఞాన యోగములకు ఇదొక చక్కని కరదీపిక యనియు వివరించినారు.
ఈ సభను తుని సాహితీ సమితి వారు నిర్వహించిరి. సమితి అధ్యక్షులు అధ్యక్షత వహించిరి.
తుని ఛాంబర్ ఆఫ్ కామర్సు మాజీ కార్యదర్శి శ్రీ ఏలూరి శివకుమార్ గారు, మరియు శ్రీ ఈరంకి రామ సూర్యప్రకాష్ గారు గౌరవ అతిథులుగా పాల్గొనిరి.
శ్రీ ఈరంకి రామ సూర్య ప్రకాష్ గారు మరియు డా. ఎల్.ఎస్.యాజ్ఞవల్క్య శర్మ గారు శ్రీ నేమాని వారిని దుశ్శాలువతో సత్కరించిరి.
వందన సమర్పణతో సభ జయప్రదముగా ముగిసినది.
అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహక బృందానికి ఆంధ్రామృతం అభినందనలు తెలియజేస్తోంది.
జైహింద్.  

మా చోడవర గ్రామానికి అతి సమీపంలోనే ఉన్న దేవీపురం చరిత్ర.

1 comments

జైశ్రీరామ్.
శ్రీచక్రాకృతి

భక్త శిఖామణులారా!
ఈ రోజు నేను మీకు మా చోడవరం గ్రామానికి అతి సమీపంలోనే నెలకొని యున్న దేవీపురం గురించి తెలియచేయాలనుకుంటున్నాను.
విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.
“నాకు ఇల్లు కట్టించు” 
న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి, ముంబాయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ లో శాస్త్రవేత్త గా పనిచేస్తున్న నిష్ఠల ప్రహ్లాద శాస్త్రిని “ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. ఒకసారి ప్రహ్లాదశాస్త్రి హైదరాబాద్ లో బిర్లామందిర్ కు వెళ్ళి, బాలాజీని దర్శించి, ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపురసుందరిగా దర్శనమిచ్చి నాకు ఇల్లు కట్టించు అని పలికి అంతర్థానమైనట్లనిపించింది. అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి. జాగ్రత్తగా, దోషరహితంగా, ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు అని ఆదేశించింది. ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు.
ఆలయం ఎక్కడ కట్టాలి ? ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపురసుందరీ దేవి స్వయంగా ఎంచుకుంది. తొమ్మిది కొండల మధ్య, రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాదశాస్త్రి తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఒక అగ్ని గుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ళ అమ్మాయిలా దేవి కనిపించింది. పూజలు అందుకుంది. తనకు అక్కడే ఇల్లు కట్టాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రదేశంలో తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది. ఆ శ్రీచక్రమేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాక్షి  పీఠం ప్రతిష్టించారు. ప్రక్కనే వున్న ఎత్తైన కొండమీద శివాలయం కట్టించారు.
ఆలయ సొబగులు.
ఈ దేవీపురం ప్రాంతంలోని శ్రీచక్ర మేరు నిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది. ప్రహ్లాదశాస్త్రి ఏకాగ్రతతో, సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా, లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు, ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. 1990 లో జూన్ 4 వతేదీన మూలవిరాట్ ‘సహస్రాక్షి’ విగ్రహ ప్రతిష్ట జరిగింది. శ్రీ చక్రాలయంలో బిందు స్థానంలో (మూడో అంతస్తు) పవళించిన సదాశివుని మీద కూర్చున్న, నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే, జీవకళ ఉట్టిపడుతూ, జీవితం ధన్యమవుతుంది. ఆమె చుట్టూ, క్రింది అంతస్తులలో, నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు.
నిష్ఠల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, రెండో అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటు చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి మూడో అంతస్తులో అష్ట దళ పద్మంలో ఉంచారు. ఇవికాక భూమిమీదే భ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళియమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు _ఈ పది విగ్రహాలనూ రాతితో చెక్కించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేకాలు చేస్తారు.
దేవీ పురాన్ని శ్రీదేవీ భాగవతంలో వర్ణించిన ‘మణిద్వీపం’ గా రూపొందించాలని గురూజీ (ప్రహ్లాద శాస్త్రి) ఆకాంక్ష .

15, నవంబర్ 2012, గురువారం

హాయిగా గ్రోల రారె యాంధ్రామృతమ్ము. మకుటంతో పద్య రచన చేయ మనవి

9 comments

జైశ్రీరామ్.
ఆంధ్రామృతం.
సాహితీ సన్మిత్రులారా!
కొంత కాలముగా చక్కగా పద్యరచన సాధన చేయుచున్నసహృదయులయిన మీకొక విన్నపము
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.  
అను పద్య పాదమును మకుటముగా చేసుకొని
కవులు తమ అభిప్రాయములను భావనా పటిమకు జోడించి
పద్యాలను వ్రాయవలసినదిగా
సహృదయ శిరోమణి పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు సూచించారు.
నా పూరణ చిత్తగించండి.
శ్రేయములఁ గూర్చు సాహితీ చిత్ర గతుల
విధివిధానము బోధించు విశ్వ వాణి
మంచి చెడ్డల బోధించు మధుర సురభి
హాయిగా గ్రోలరారె ఆంధ్రామృతమ్ము.
చూచారు కదా నా పూరణము. మీరు కూడా శ్రీ నేమానివారి వాంఛితమునీడేర్చ గలరని ఆశింతును.
జైహింద్.

14, నవంబర్ 2012, బుధవారం

శివానందలహరి ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాస కార్యక్రమము.

0 comments

జైశ్రీరామ్.
శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు.
సోదరీ సోదరులారా! 
తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామంలో శాఖా గ్రంథాలయంలో "శివానందలహరి"  అను అంశముపై  మన సాహితీ సన్మిత్రులు శ్రీ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారి యొక్క ఆధ్యాత్మిక సాహిత్య ఉపన్యాసమును అచ్చటి సాహితీ ప్రియులు ఏర్పాటు చేసి యున్నారు.
ఉపన్యాస కార్యక్రమము తేదీ:- 15 - 11 - 2012.
సమయము:- సాయంత్రం గం.6:00 లకు ప్రారంభమగుము.
స్థలము:- శాఖాగ్రంథాలయము, తుని, తూర్పు గోదావరి జిల్లా.
వక్త:- పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు.
విషయము:- "శివానందలహరి" 
ఈ కార్యక్రమము వివరములను ఇంకా వివరముగా తెలుసుకొన గోరువారు 
శ్రీ యల్.యస్.వై.వి.శర్మ గారిని 9247168255 
దూరవాణి ద్వారా అడిగి తెలుసుకొనవచ్చును.
ఈ కార్యక్రమము విజయవంతంగా పరిపూర్ణమవాలని మనసారా కోరుకొంటూ, నిర్వాహకులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
జైహింద్.

12, నవంబర్ 2012, సోమవారం

పాఠక జనానీకానికి దీపావళి శుభాకాంక్షలు.

15 comments

జై శ్రీరామ్.
సదసద్వివేక సంపన్న పూజ్య భారతీయ సోదరీ సోదరులారా! నమస్సులు.
మీ అందరికీ  ఈ చిదానంద దీపావళి శుభాకాంక్షలు.
ఉ:-
మానవులందు రాక్షసము, మాన్యతఁ గొల్పెడి దైవ తత్వమున్
జ్ఞాన వివేక సంపదలు, కర్కశమైన దురంత దౌష్టముల్
కానఁగ వచ్చు. జ్ఞానమున గౌరవ వృద్ధినిఁ గొల్పు వానినే
మానధనుల్గొనున్. మహిని మాన్యులు వారలె మంచి నెంచుటన్.
క:-
నరకుండత డెటనుండును?
హరి యెవ్వడు? సత్య యెవరు? హరి సత్య లటుల్
నరకుని చంపుటదేమిటి?
తరచి తరచి మదిని చూడ తత్వము తెలియున్.  
శా:-
జీవాత్ముండన లక్ష్మి యౌను. కనగా జీవంబుగా నిల్చు నా
దేవుండే పరమాత్మ యౌను మనలో దీపించు జ్ఞానంబుగా.
భావంబందున గల్గు దౌష్ట్యములు సంభావింప నా యాసురుం
డే. వానిన్ హతమార్చుటే జరుగు గాదే నేడు జ్ఞానంబుచే.
క:-
అజ్ఞాన తిమిర హరమున
విజ్ఞానపు వెలుగులు మది వెలయును. కనుకన్
సుజ్ఞానులార! మనలో
నజ్ఞానము పారద్రోల నమరు సుఖంబుల్.
క:-
ఆ లక్ష్మీ శ్రీ కృష్ణులు
మీ లక్ష్యము జేర్చ నెంచి, మీలో గల యా
భీలాసురుఁ బరిమార్చుత!
శ్రీలన్, సుఖ శుభ ఫలముల చేకూర్తురిలన్.
జైహింద్.

11, నవంబర్ 2012, ఆదివారం

మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః.

1 comments

జైశ్రీరామ్.
విషయ వాంఛ అనే మొసలి మనస్సు  అనే ఏనుగును ఎలా లాగుతున్నాదో చూడండి.
శ్లో:-
మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః.
బంధాయ విషయా సంగీ. ముక్త్యైనిర్విషయం స్మృతమ్.
ఆ:-మనసు కారణంబు మహనీయ ముక్తికిం
బంధ కారణంబు మనసె యగును.
బంధమొసగు విషయ వర్తిత చిత్తము
ముక్తబంధ యైన ముక్తినొసగు.
భావము:-
ఐహిక బంధములకైనా, ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణము. మనస్సు విషయాసక్తి కలిగి యున్నచో బంధనములు దానితోపాటు పెఱుగును. అదే మనస్సు నిర్విషయాసక్తమైనచో ముక్తిని పొందును.
మనము ఐహిక స్పృహ కలిగి ఉండవలెనే కాని అదే శాశ్వితమనే భ్రమకు దూరముగా నుండ వలెనని గుర్తుంచుకొన వలెను. సత్య స్వరూపమును, శాశ్విత స్వరూపమును తెలుసుకొని ఆముష్మికము వైపు మనసును మరలించ గలిగితిమేని దుఃఖాతీతులమై విషయ దూరులమై చిత్త శాంతితో ప్రశాంతముగ జీవింప సాధ్యమగును కదా!
జైహింద్. 

6, నవంబర్ 2012, మంగళవారం

ఓ టింగరి నీలమా! కనవటే? జన జీవన శైలి నీవు?

5 comments

ఆంధ్ర మహాజనులారా! నీల నామక పెను తుపాను మన ఆంధ్రుల జీవితాల్ని ఎలా అతా కుతలం చేసిందో తల్చుకుంటేనే గుండె చెరువైపోతుంది. నా గుండెల్లోంచి ఉప్పొంగిన బాధను పద్యరూపంలో ఈ పెనుకి విన్నవించాను.
హృదయ విదారకంగా ఉండే ఈ పద్యాలను సహృదయుఁడైన మా చిరంజీవి ముక్కు రాఘవ కిరణ్ ఆలపించగా మీకు వినిపించడం కోసం ప్రతీ పద్యమునకు పైన ఆ ఆడియోను ఉంచాను. గమనించి వినగలరు.

నింగిని మేఘమై నిలిచి నింగియు నేలయు నొక్కటైనటుల్
పొంగగ భూమిపై జలము పొంగుచు వర్షము కుర్సినట్టి యో
టింగరి నీలమా! కనవటే? జన జీవన శైలి నీవు? యా
ముంగిళులందు జొచ్చి గృహముల్మునిగించిన వాన లెందుకే? 1.

రాతిరియున్ బవల్ భువిని ప్రాణముగా కని పాడి పంటలన్
చేతికి వచ్చునంచు కృషి చేసెడి శ్రామిక కర్షకాళికిన్
ప్రీతి యొనర్చ చాల మురిపించుచు వర్షము నిచ్చువాడ వే
రీతిగ ముంచినావు? కలరే నినుపోలెడి దుష్ప్రవర్తకుల్? 2.

వ్యవసాయమును నమ్మి అప్పులు  గొని తమ -  భవిత భాగ్యమ్మవన్ పగలు రాత్రి
శ్రమియించి, భూదేవి శ్రమకు తగ్గ ఫలము నిచ్చె  పండియటంచు మెచ్చుకొనుచు
పంటను కోసిరి. పనలపై నుండగా -  మంటిని కలిపె నీ మాయ వాన.
కన్నీరు మున్నీరుగా విలపించెడి  -  కర్షకులను జూడ కరుగు మనసు.
ఎంత నిర్దయ నీకు, నీ వింత వృత్తి  -  కొంత పరికించి చూడుము. కొంపలెన్ని
కూల చేసెనొ నీ వాన? గో గణముల  - ప్రాణములు తీసె. నీకిది భావ్యమౌనె? 3.

అప్పుల యూబిలో మునుగు నర్భక మానవ జాతిపైన నీ
విప్పుడు నీ ప్రతాపములనెల్లెడ జూపగ కోరి వర్షముల్
ముప్పును గొల్పగా కురిసి ముంచితివే! బ్రతుకంగ నెట్లు వా
రిప్పుడు? తప్పు , తప్పు లొనరించుట నీకది మేలు కాదుగా? 4.

కొంపలు కూలగా గోలు గోలుమటంచు -  నార్త నాదము చేసి అలయువారు,
ఉన్న పాటున నీరమన్ని దిక్కుల క్రమ్మి  -  ముంచె సర్వంబని మూల్గువారు,
పశువుల పాకల ప్రవహించి గొనిపోయె  -  పాడి పసులనని వందు వారు.
కోళ్ళను మేకల గొనిపోయె వరదొచ్చి  -  కోలుకొనుటెట్లని కుములువారు,
అన్న పూర్ణగ వెలుగెడి యాంధ్ర మాత  -  చిన్నబోయెను సర్వంబు చేయి జార.
కన్న బిడ్డల నొడి చేర్చి కావ లేక  -  కంట నీరిడి కుమిలెను. గాంచవేమి? 5.

జీవన యానమందు మము చేతిని వీడి, గతించినారు దే
వా! వన యానమందు నిలువంగను చాలక నీటి పోటికిన్.
బ్రోవగ నున్న వార లిక బ్రోవగ నెవ్వరటంచు నేడ్తు,  రా
జీవన వేదనల్ మదికి చేరవొ? నీ మది చింత కల్గదో? 6.
ఎక్కడివారలక్కడ ననేకులు చిక్కిరి వర్షధారచే
నుక్కిరిబిక్కిరై యొదిగి యుండిరి చేయగ జాలకేమియున్.
నిక్కుచు నీల్గుచున్ నిలిచి, నివ్వెరపోవగ నెల్ల లోకమున్
దిక్కులు మ్రోగ ఘూర్ణిలుచు తేజము జిమ్ముచు వృష్టి గొల్పితే? 7.

దారులన్ని కూడ గోదారియయ్యెను  -  దారి లేక జనులు తల్లడిలిరి.
చేర వలయు చోటు చేరక కొందరు  -  చేరినారుధది నచేతనులయి. 8.

జీవన సాగరాన వ్యధ చెందుచు నిత్యము మున్గి తేలుచున్
బ్రోవగనుండు దైవమని పూజలు చేయుచు, భుక్తికై సదా
చేవను చూపి కష్టములు చేయుచు కూలి గడించు వారికిన్
నీవలనన్ పనుల్ కనమి  నివ్వెర పోవుచు నుండ్రి. చూచితే? 9.

కూలి కొఱకని పొలమేగు కూలివార్ని
జాలి విడుచుచు నీటితో చంపితేల?
ఆలు బిడ్డలు కనలేని యవధి చేర్చి
తేల? దుర్ నీలుడా! నిజ మేల కనవు? 10.

మందులు కొట్టెడు భూ కా
మందుల కడ పనికి చేరి మందులు కొట్టున్
మందులు పర భూముల. నీ
వెందులకిటు చంపినా వదేమి సుగుణమా? 11.

నిన్నెన్నడు మెచ్చను నే.
నెన్నను నిను సుకృతి వనుచు నెన్నరు జూడన్.
కన్నీరే మున్నీరై
మిన్నంటగ నేడ్చు జనులు మేదినిఁ గనవే? 12.

దుర్మార్గుల శిక్షింపగ
మార్మోగెడి గర్జనలను మా మదులదరన్
ధర్మంబని చేతువొ, యే
మర్మము లేనట్టి వారు మట్టిని కలియన్? 13.

ఇకనైనను శాంతింపుము.
సకలంబును తెలియు కర్మ సాక్షికి. ప్రజలన్
వికలంబు చేయ దగదిక
సకలము శుభ ఫలములొసగి సద్దుకుపొమ్మా! 14.

ఈ పెను తుపాను కారణంగా ఆస్తులను, అసువులను, మనశ్శాంతిని బాసిన ప్రతి ఒక్కరికీ నా విచారం తెలియజేస్తున్నాను. ఆ పరమాత్మ తప్పక కాపాడాలని మనసారా కోరుకొంటున్నాను.
లోకాః సమస్తాః సుఖినో భవంతు.
జైహింద్.