గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 37వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

37. ఓం గుణభద్రాయ నమః.

చంద్రికాద్వయ గర్భ సీసము.

సరస సుగుణ సాధ్య సత్ప్రభూ! మరువకు - నను మాన్య రక్షకా! కనుము కృపను.

సిరులనడుగఁ, జిత్ప్రసిద్ధుఁడా! వరము నొ - సఁగు భక్తి భావమున్. నిగమ వేద్య!

సురుచిర కృతి శోభఁ జూడరా! స్థిరుఁడవు - కన దీని దీప్తిలోఁ. గమల నయన.

పరమ పురుష బ్రహ్మబాంధవా! శరణు శ - రణు చంద్రికాసుధార్ణవ, మనోజ్ఞ!

గీ. చంద్రికాద్వయ గర్భిత సాంద్ర సీస - రమ్య *గుణభద్ర*! దాసుఁడన్. రక్షనిమ్ము.

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

37వ సీస గర్భస్థ చంద్రికాద్వయము. (న న ర వ .. యతి 7)

1.సరస సుగుణ సాధ్య సత్ప్రభూ! - మరువకు నను మాన్య రక్షకా!

సిరులనడుగఁ, జిత్ప్రసిద్ధుఁడా! - వరము నొసఁగు భక్తి భావమున్. 

2.సురుచిర కృతి శోభఁ జూడరా! - స్థిరుఁడవు కన దీని దీప్తిలో. 

పరమ పురుష బ్రహ్మబాంధవా! - శరణు శరణు చంద్రికాసుధా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సరస సుగుణములచేత మాత్రమే సాధ్యమగువాడా!

మన్ననలందు నా రక్షకుడవైన ఓ హరీ! నన్ను కృపతో చూడుము, మరువకుసుమా. చిద్రూపిగా వేదములచే

యెఱుగబడెడివాడా! నేను ధనములు కోరుటలేదు. .భక్తి భావములే నాకు వరముగా నిమ్ము. ప్రసిద్ధమయినవాడా! ఓ

కమలనయనా! ఈ శతకము యొక్క ప్రకాశములో నీవు స్థిరుఁడవై యున్నావు. .చూడుము..ఓ వెన్నెలసుధా సాగరమా!

మనోజ్ఞుఁడా! ఓ పరమ పురుషా! బ్రహ్మ పితా! నిన్ను శరణు కోరుచున్నాను..చంద్రికావృత్తద్వయగర్భసీసస్థుఁడవైన ఓ

గుణభద్రా! నేను నీ దాసుఁడను. నీవు నాకు రక్షణనిమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.