గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2026, బుధవారం

శ్రీయుతులు చింతా రామకృష్ణ వరేణ్య విరచిత లక్ష్మీ అష్టోత్తర సహస్ర నామావళిపై శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, గారి అభిప్రాయము పంచచామరములలో.

0 comments

జైశ్రీరామ్. 

శ్రీయుతులు చింతా రామకృష్ణ వరేణ్య విరచిత లక్ష్మీ అష్టోత్తర సహస్ర నామావళిపైవారి పద్యవిశ్లేషణపై, సాదరాభిప్రాయము, పంచ చామరవృత్తాలలో.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,   జుత్తాడ,  

                    

                                                                           

పంచ చామరము, అష్టిఛందము నందలిది,ప్రాస నియమము కలదు, పాదమునకు16.అక్షరము లుండును

ప్రతి పాదమున,,జ,ర,జ,ర,,జ,గ,గణములుండును,యతి,9.వ,యక్షర మునకు చెల్లును

,వృ,సం:-21846

1.పంచచామరము,

         అనంత కీర్తి కామిదమ్!యశేష ముక్తి శక్తిదమ్!

         కనంగ రాని కౌముదిమ్!కఠోర  కష్ట హారిణమ్!

        అనంగ జారి సోదరిన్!యమేయ కీర్తి భామినిన్!

       మనంబు నిండు నీయుతన్!మదీయ రామ కృష్ణుకున్!

2.పంచ చామరము,

             సహస్ర నామ శ్రీ స్తుతిన్!సరాగ రంజితం బిడన్!

            ప్ర హర్ష!మెర్చు ఛందముల్!ప్రసాదంబుచేకురెన్!

            ఇహంపు ముక్తి శ్రేష్టతన్!యెలుంగు నెత్తెవాగ్ఝరుల్!

           సు హారమాయె!శ్రీ గళమ్!సుమేథ సొంపు టాశ్రియై!

3.పంచ చామరము,

           వరామ రామ కృష్ణమా!వసంత గాన కోకిలల్!

           స్థిరంపు కీర్తి గానముల్!జిగిం వెలుంగు పెంచుచున్!

          పరోప కార శక్తినిన్! ప్రభా విభావ!భాసురిన్!

          నిరంత మేథ!భా తిడన్!నిగూఢ భాష్య బోధ్యమౌ.

4.పంచ చ్మరము,

        భవాంబు దీదు నావయే!వరామ శ్రీ నుతంబ గున్!

        శివాను కూల!భక్తినిన్!శివంబు నౌ!విశేషతన్!

        కవిత్వ శోభ!పంచుమా! గరీయ తిడున్!జనాళికిన్!

        దివాధి నాధు డెల్లెడన్!స్థిరంపు శక్తి నీయుతన్!

5.పంచ చామరము,

          తెనుంగు శక్తినిన్!సదా!దిగంత వ్యాప్తి దం బవన్!

          జనాలు కూడగావలెన్ !స్వతంత్ర భారతావనిన్!

          అనాధ జేసి తెన్గునిన్  !యరాచకంబు!జేసిరే!

          ఘనంబు నాటవలెన్గణింప మాతృ భాషిలన్!

                                        ఇట్లు

                        తమ విశ్వస నీయుడు,

            వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                            జుత్తాడ,

ఆర్యా

      నమోవాకములు,

                తమరి లక్ష్మీ అష్టోత్తర సహస్ర నామ భావామృతమునుగ్రోలి నా సాదరాభి ప్రాయము నిచ్చు చున్నాను,నమస్తే.మూర్తి,జుత్తాడ,                                                                             

జైహింద్.

కనకధారా స్తోత్రము ... పద్యానువాదము ... భావములు. ... పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్. 

కనకధారా స్తోత్రము ... పద్యానువాదము ... భావములు. ... పద్యానువాదము 

చింతా రామకృష్ణారావు.


శ్లో.  వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।

అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

ఆ.  భక్త కల్పవల్లి, వరలక్ష్మికానంద 

కరుఁడు, నంతు లేని హరుస మునను

మెఱయు గజముఖుండు, మేల్గూర్చు గణపతి

కంజలింతు భక్తి నతుల గతిని.

భావము:  ఆశ్రయించిన భక్తులు కోరిన వరాలను ఇచ్చే కల్పవృక్షము వంటివాడు, లక్ష్మీదేవికి అత్యంత ఆనందాన్ని కలిగించేవాడు, అపరిమితమైన ఆనంద సమూహంతో ప్రకాశిస్తున్నవాడు, గజముఖుడు అయిన శ్రీ విఘ్నేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను.

శ్లో.  అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।

అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా

మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

గీ.  హరికి పులక భూషలు గొల్పు నిరుపమ రమ,

వర తమాలముకుళభూష బంభరమన

నొప్పి, సంపదల్ గొనునది,గొప్ప సిరులు

కంటిచూపుతో నొసఁగు శ్రీ కాంత నాకు

మంగళంబులు కూర్చుత మహిత గతిని.

భావము: శ్రీహరి యొక్క శరీరానికి పులకలు అనే ఆభరణాలను అలంకరిస్తున్నది, తమాల వృక్షం యొక్క మొగ్గలను ఆశ్రయిస్తున్న తుమ్మెదల గుంపు వలె ఉన్నది, సమస్త సంపదలను స్వీకరించినది, మరియు కడకంటి చూపుల చేతనే సకల శుభాలను ప్రసాదించేది అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు నాకు మంగళమును చేకూర్చుగాక.

శ్లో.  ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।

మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

గీ.  పతి ముఖంబును జూచుచున్ బరవసించు

నట్టి రమ ముఖపద్మము నధివసించు

సిగ్గునొప్పు నేత్రషడంఘ్రు లగ్గలముగ

నాకు నన్నిసంపదలిచ్చుఁ గాక భువిని.

భావము: శ్రీహరి యొక్క ముఖారవిందం వైపు లక్ష్మీదేవి తన చూపులను పదే పదే సంతోషంతో, సిగ్గుతో అటుఇటు తిప్పుతోంది. ఆ సమయంలో ఆమె కదలాడుతున్న కళ్ళు... పెద్దదైన కలువ పూవుపై వాలుతున్న తుమ్మెదల వరుసలాగా మనోహరంగా ఉన్నాయి. అలా పాలసముద్రం నుండి ఉద్భవించిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్ష వీక్షణాలు నాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించుగాక!

శ్లో.  ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-

ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।

ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

చ.  ప్రియమెసలార శ్రీహరి వరిష్ట నిమీలిత నేత్రుఁడయ్యె, స

జ్జయములు గొల్ప నొప్పెడి భుజంగశయాంగన దివ్య మైన యా

ప్రియుని ముఖంబు గాంచెడి పవిత్ర కనీనిక పక్ష్మ నేత్రముల్

జయములు సంపదల్ మరియు చక్కని బుద్ధిని నాకొసంగుతన్.

భావము: శ్రీ మహావిష్ణువు ఆనందంతో తన కన్నులను కొద్దిగా మూసుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఆనందానికి నిధిగా, రెప్పవాల్చకుండా, మన్మథుని వశంలో ఉన్నాడు.అటువంటి సమయంలో, శ్రీ మహాలక్ష్మి మాత యొక్క కటాక్ష వీక్షణాలు కొద్దిగా వంకరగా, నల్లని కనుపాపలతో, కనురెప్పల అంచులతో కూడిన ఆమె కళ్ళ యొక్క చూపులు నా సంపదలకు, శ్రేయస్సుకు మరియు సకల ఐశ్వర్యాలకు కారణమగుగాక!

శ్లో.  బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి ।

కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా

కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

ఉ.  సిరి చూపుల్ ప్రసరింప నీలమణులే చిందన్రుచుల్ దివ్యమౌ

హరి వక్షంబున కౌస్తుభంపు కెలకుల్ వ్యాప్తంబయెన్ కాంతులే,

హరికిన్ గోర్కెలు తీర్చు లక్ష్మి కనులన్ వ్యాపించునాదీప్తులే,

పరమార్థంబగు మంగళంబులిడుతన్ బ్రాఖ్యాతిగా నాకిలన్.

భావము:శ్రీహరి వక్షఃస్థలమునందు, కౌస్తుభమణికి ఇరువైపులా ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు... శ్రీమహావిష్ణువు మెడలో ఉన్న ఇంద్రనీలమణుల హారము వలె మెరిసిపోతున్నాయి. తామరపుష్పంలో నివసించే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్ష మాలలు, సమస్త కోరికలను తీరుస్తూ నాకు సకల శుభాలను ప్రసాదించుగాక!

శ్లో.  కాలాంబుదాళిలలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।

మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

చ.  అసిత మనోజ్ఞ దేహుఁడగునా హరి వక్షముపైన నొప్పె రా

జసమున భార్గవాత్మజ, ప్రశస్తిగ వారిదప్రంక్తిలోపలన్

మిసిమి పసిండి తీగయ కనంగ? ననన్, జగదేకమాతగా

నసదృశరీతినొప్పెడు, ననంతశుభంబులు నాకుఁ గొల్పుతన్.

భావము: నల్లని మేఘాల సమూహం వలె మనోహరమైన, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, కైటభాసురుడనే రాక్షసుడిని సంహరించినవాడు అయిన విష్ణుమూర్తి వక్షస్థలంపై ప్రకాశిస్తున్న లక్ష్మీదేవి... నల్లని మేఘాలలో మెరిసే మెరుపుతీగ వలె కనిపిస్తోంది. సమస్త జగత్తులకు తల్లి అయినది, పూజనీయమైన దివ్య స్వరూపం కలిగినది, భృగు మహర్షి కుమార్తె అయిన ఆ లక్ష్మీదేవి  నాకు సర్వశుభాలను ప్రసాదించుగాక.

శ్లో.  ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।

మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం

మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

గీ.  ఏ రమా కటాక్షఫలంబహీనగతిని

విష్ణు వక్షంబునన్ మరున్ బ్రీతి నిలిపె

నా రమానుగ్రహంబు నే కోరుచుంటి,

నాకు లభియించుఁ గాక యనారతంబు.

ఉ.  ఏ వనితా కటాక్షమున నీశుని మారుఁడు తా జయించియున్,

జావును గాంచి నప్పటికిఁ, జక్కని శ్రీ మధుమాధినీ హృదిన్

ధీవరుఁడై గ్రహించి గణుతిన్ గనె మంగళ మూర్తిగా, సదా

యావనితాలలామయగు నబ్ధిజపుత్రి కటాక్షమొందెదన్. 

భావము: మన్మథుడు ఏ లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణం వల్లనే మురారిని (మధుమాథిని) మోహింపజేసి, సర్వమంగళప్రదమైన స్థానాన్ని (లక్ష్మీదేవి వక్షఃస్థలాన్ని) పొందగలిగాడో, అటువంటి సముద్రపు కుమార్తె (లక్ష్మీదేవి) యొక్క మందమైన, దయతో కూడిన కటాక్ష వీక్షణాలు నాపై కూడా కాస్త ప్రసరించుగాక!

శ్లో.  విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

ఉ.  దానము చేయఁ గల్గును పదంపడి యింద్రును పీఠమైన, నా

 దానవ వైరి విష్ణుని ముదంబునఁ దేలఁగఁ జేయఁగల్గు, నిం

పైన వినీలకైరవ మహత్తర తేజమునొప్పు శ్రీ రమా

మానవతీకటాక్షములు మాకు లభించుత నిత్యమిద్ధరన్.

భావము: సకల సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షాలు లోకాలను పాలించే ఇంద్ర పదవిని సైతం దానం చేయగలవు మరియు సాక్షాత్తు శ్రీహరికే పరమానందాన్ని కలిగించగలవు. అటువంటి నీలికలువ రేకుల వంటి మనోహరమైన లక్ష్మీదేవి చూపులు.. దయచేసి నాపై కొద్ది క్షణాల పాటు ప్రసరించు గాక!

శ్లో.  ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।

దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

గీ.  కోరికలు పొంద నేరని వారు కూడ

స్వర్గపదమును గాంతురు వారిజాక్షి

లక్ష్మి కడగంటి చూపులన్,  లభ్యమగుత

నాకునున్ బుష్టిఁ గొల్పగ శ్రీకరముగ.

భావము: లక్ష్మీదేవి కటాక్షం ఎటువంటిదంటే, కోరిన కోరికలను తీర్చుకునే విశిష్టమైన బుద్ధి లేని సామాన్యులు కూడా, అమ్మవారి దయతో నిండిన ఆ ఒక్క చూపు వలన సులభంగా స్వర్గపదాన్ని  పొందుతారు. వికసించిన తామర పువ్వు లోపలి భాగం వలె కాంతివంతమైన ఆ లక్ష్మీదేవి చూపులు, నాకు ఇష్టమైన సంపదలను, పురోగతిని (పుష్టిని) అనుగ్రహించుగాక

శ్లో.  దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-

మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

గీ.  అంతు లేని దయావృష్టి నందఁ జేయు

జనని! సంసార తాపపీడనను వగచు

పక్షినమ్మ! నా దుఃఖంబు పారద్రోలి

పాపములువాప ననుఁ గాంచు భక్తిఁ గొలుతు.

భావము: "ఓ లక్ష్మీదేవీ! అపారమైన దయగల కటాక్షాలు కలిగిన దానవు. సంసార తాపముతో బాధ పడుతున్న, దీనుడైన ఈ పక్షి శిశువు పై నీ కరుణారసమనే ధన వర్షాన్ని కురిపించు. ఆ వర్షం వీని పాపాలను, కష్టాలను శాశ్వతంగా దూరం చేయుగాక." 

శ్లో.  గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।

సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

గీ.  ఏ జనని విష్ణు పత్నిగా, నీశు సతిగ,

బ్రహ్మరాణిగా సృష్టిని వరలఁ గొల్పి,

కాచి రక్షించి,  మడఁచు, శాకంబరి, కన

నా జనని లక్ష్మియే, యామె కంజలింతు.

భావము: ఆ లక్ష్మీదేవి సరస్వతి, విష్ణుమూర్తి సతి. భూమిని పోషించే శాకంభరి. శివుని ప్రియమైన భార్య పార్వతిగా ఉంది. సృష్టి, స్థితి, లయలు అనే క్రీడలలో నెలకొని ఉన్నది, సమస్త భువనాలకు గురువైన ఆ పరమేశ్వరుని అర్ధాంగి అయిన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. 

శ్లో.  శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై

రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।

శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై

పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

ఉ.  వందనమాచరించెదను భవ్యశుభప్రదవేద లక్ష్మికిన్,

వందనముల్ రతీసతికి భద్రగుణార్ణవయైన లక్ష్మికిన్,

వందనముల్ సభక్తిగను పద్మనివాసినిశ్రీ రమాంబకున్,

వందనముల్హరిప్రియకు, భాస్కర తేజకు పుష్టిదాత్రికిన్.

భావము:  శుభకరమైన పనులకు ఫలితాన్ని ప్రసాదించే వేదరూపిణి అయిన శ్రుతికి నమస్కారం.రమణీయమైన గుణాలకు సముద్రం లాంటిదైన రతీదేవి (లక్ష్మీ) స్వరూపిణికి నమస్కారం.పద్మము (శతపత్రం) నివాసంగా కలిగిన శక్తి స్వరూపిణికి నమస్కారం.సకల సంపదలను, పోషణను ఇచ్చే దేవదేవుడైన పురుషోత్తమునికి (విష్ణుమూర్తికి) ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కారం.

శుభకరమైన పనులకు ఫలితాన్ని అనుగ్రహించే వేదస్వరూపిణి అయిన లక్ష్మీదేవికి నమస్కారము. రమణీయమైన గుణాలకు సముద్రమైన లక్ష్మీదేవికి నమస్కారము. సర్వశక్తి స్వరూపిణి మరియు పద్మము నందు నివసించే లక్ష్మీదేవికి నమస్కారము. సకల సంపదలను, పుష్టిని ప్రసాదించేది, మరియు పురుషోత్తముని ప్రియమైన భార్య అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

శ్లో.  నమోఽస్తు నాళీకనిభాననాయై

నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।

నమోఽస్తు సోమామృతసోదరాయై

నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

గీ.  పద్మ తుల్య ముఖ రమకు వందనములు,

పాలకడలిపట్టి రమకు వందనములు,

వర సోమసుధల సహోదరికి నతులు,

భాగ్యద హరివల్లభకును వందనములు.

భావము: పద్మము వంటి సుందరమైన ముఖము గల లక్ష్మీదేవికి నమస్కారము. పాలసముద్రము నుండి ఉద్భవించిన తల్లికి నమస్కారము. చంద్రునికి మరియు అమృతమునకు సోదరి అయిన దేవికి నమస్కారము. శ్రీమన్నారాయణుని  ప్రియమైన భార్యకు నమస్కారము.

శ్లో.  నమోఽస్తు హేమాంబుజపీఠికాయై

నమోఽస్తు భూమండలనాయికాయై ।

నమోఽస్తు దేవాదిదయాపరాయై

నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

గీ.  స్వర్ణపద్మపీఠికకును వందనములు,

వసుధనేలెడి తల్లికి వందనములు,

దయను దేవతలనుగాచు తల్లికి నతి,

శార్ఙ్గపాణిరాణికి నతుల్ శతమొనర్తు.

భావము: బంగారు పద్మపీఠంపై ఆసీనురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. భూమండలానికి అధిపతి అయిన తల్లికి నమస్కారము. దేవతలకు సైతం దయను, కరుణను ప్రసాదించే దేవికి నమస్కారము. శార్ఙ్గమనే ధనస్సును ధరించిన శ్రీహరి కి ప్రియురాలైన మహాలక్ష్మికి నమస్కారము.

శ్లో.  నమోఽస్తు దేవ్యై భృగునందనాయై

నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।

నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

గీ.  వందనంబులు శ్రీ భృగు నందనకును!

విష్ణు వక్షస్థయైన దే వికి ప్రణతులు

పద్మవాసిని లక్ష్మికి వందనములు,

భవ్య దామోదరసతికి వందనములు.

భావము: భృగు మహర్షి కుమార్తె  అయిన లక్ష్మీదేవికి నమస్కారములు. శ్రీమహావిష్ణువు యొక్క వక్షఃస్థలము పై నివసించే లక్ష్మీదేవికి నమస్కారములు. పద్మమునందు నివసించే లక్ష్మీదేవికి నమస్కారములు. దామోదరుడైన  శ్రీహరికి ప్రియమైన భార్య అయిన లక్ష్మీదేవికి నమస్కారములు.

శ్లో.  నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।

నమోఽస్తు దేవాదిభిరర్చితాయై

నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

ఉ.  వందనమమ్మ కాంతియుత! వందనముల్ శతపత్రనేత్ర! నా

వందనమమ్మ భూతి యుత! వందనముల్భువనప్రసూతికా!

వందనమమ్మ దేవగణవందిత! సుందర పాదపంకజా!

వందనమమ్మ! నంద సుత వల్లభ! వందనమమ్మ శ్రీరమా!

భావము: తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన లక్ష్మీదేవికి, కాంతి స్వరూపిణికి నమస్కారము. సమస్త భువనములను సృష్టించిన తల్లికి మరియు ఐశ్వర్య స్వరూపిణికి నమస్కారము. దేవతల చేత సైతం పూజింపబడుతున్న దేవికి నమస్కారము. నందుని కుమారుడైన శ్రీకృష్ణునికి ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కారము.

శ్లో.  సంపత్కరాణి సకలేంద్రియనందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।

త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥ 16 ॥

గీ.  సంపదలు కొల్పు నింద్రియ సౌఖ్యమిచ్చు

సకల సామ్రాజ్య విభవంబు చక్కనిచ్చు,

పాపహరములు జనని! నీ పాదయుగళి,

యట్టి నీ పాదయుగళికి నంజలింతు.

భావము: కమలాల వంటి నేత్రాలు కలిగిన అమ్మా! నీకు చేసే నమస్కారాలు సంపదలను కలిగిస్తాయి. సమస్త ఇంద్రియాలకు ఆనందాన్ని చేకూరుస్తాయి. సమస్త సామ్రాజ్యాలను ఇచ్చే వైభవాన్ని కలిగి ఉంటాయి. సమస్త పాపాలను హరించడంలో సమర్థమైనవి. అటువంటి ఓ పూజ్యనీయమైన తల్లీ! నీ పాదాలకు చేసే నమస్కారాలు ఎల్లప్పుడూ నన్నే ఆవరించియుండుగాక

శ్లో.  యత్కటాక్షసముపాసనావిధిః

సేవకస్య సకలార్థసంపదః ।

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

గీ.  ఎవరు త్రికరణశుద్ధిగా నిందిర! తమ

సేవ చేయుదురో వారి చిత్తమెఱిఁగి,

తీర్తు వమ్మరో కోరికల్ దీపితముగ

నట్టి నీ పాదయుగళికి నంజలింతు.  

భావము: ఎవరు శ్రీహరి (మురారి) హృదయేశ్వరి అయిన లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారో, ఆ భక్తులకు లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణం సమస్త సంపదలను, సకల కోరికలను అనుగ్రహిస్తుంది. అటువంటి లక్ష్మీదేవిని నేను సేవిస్తూ నమస్కరిస్తున్నాను.

శ్లో.  సరసిజనిలయే సరోజహస్తే 

ధవళతమాంశుకగంధమాల్యశోభే ।

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

గీ.  పద్మమున్ జేతఁ గల్గిన పద్మ నిలయ!

ధవళ వస్త్ర మాలలు సుగంధముల వెలుగు

భగవతి! వినుత హరివల్లభా! మనోజ్ఞ!

భూతి త్రిభువనములకిడు పూజ్యురాల

నాకిల ప్రసన్నవగుమమ్మ! శ్రీకరముగ.

భావము: పద్మములో నివసించుదానా! చేతిలో పద్మమును ధరించినదానా! మిక్కిలి తెల్లనైన వస్త్రములు, గంధము, పూలదండలతో శోభిల్లుదానా! సకల ఐశ్వర్యములు, మహిమలు కలిగిన దేవీ! శ్రీహరి  కి అత్యంత ప్రియమైనదానా! మనస్సును ఆకర్షించే మనోహరమైన రూపము కలదానా! ముల్లోకములకు సంపదలను, శ్రేయస్సును ప్రసాదించుదానా! నా యందు ప్రసన్నురాలవగుము .

శ్లో.  దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ ।

ప్రాతర్నమామి జగతాం జననీమశేష

లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

గీ.  దిక్కరులుస్వర్ణపాత్రలన్ దెచ్చినట్టి

భవ్య స్వర్గంగనభిషిక్త దివ్యదేహ

లోకజననియు, లోకేశు శ్రీకర సతి

కడలిపుత్రికిఁ దొలిప్రొద్దు నిడుదు ప్రణతి.

భావము: దిగ్గజములు బంగారు కలశములతో తీసుకువచ్చిన ఆకాశగంగ యొక్క పవిత్రమైన, నిర్మలమైన జలములతో అభిషేకింపబడిన దివ్యమైన శరీరము కలది, సమస్త జగత్తులకు తల్లి, లోకపాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క ధర్మపత్ని, క్షీరసముద్రుని పుత్రిక అయిన ఆ తల్లికి ప్రతిరోజూ ఉదయమే నమస్కరిస్తున్నాను.

శ్లో.  కమలే కమలాక్షవల్లభే త్వం

కరుణాపూరతరంగితైరపాంగైః ।

అవలోకయ మామకించనానాం

ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

గీ.  కమలనేత్రుని వల్లభా! కమలవాస!

కరుణ నొలికెడి నీ కడగంటి చూపు

నేమియును లేని నాపైననే పడంగ,

చేయుమమ్మ మున్ముందుగా, చిత్తమలర.

భావము: ఓ పద్మాసనంలో ఉండే దేవి! ఓ విష్ణుమూర్తి సతీమణీ! దయతో నిండి, తరంగాల వలె కదలాడే నీ కటాక్ష వీక్షణములతో అత్యంత దీనుడను, ఏమీ లేనివాఁడనయిన నన్ను దయతో వీక్షించు. నేను నీ కరుణకు ప్రథమమైన, ఎలాంటి కపటము లేని సహజమైన పాత్రగా అనుగ్రహించు. 

శ్లో.  స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।

గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినః]

భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

చ.  ప్రతిదిన మెవ్వరీ కనక రమ్యసుధారపఠించి భక్తితో

నతులిత వేదరూపిణి ననంతజగజ్జననిన్ రమాసతిన్

స్తుతి యొనరింతురో, సుగుణశోభితులై, వర భాగ్యశాలురై,

బ్రతుకుచు వారు ధాత్రి బుధ భావితులై వెలుగొందుగావుతన్.

భావము: వేదస్వరూపిణియు, ముల్లోకాలకు తల్లియు, లక్ష్మీదేవియు అయిన శ్రీహరి ప్రియురాలిని, ఎవరైతే ప్రతిరోజూ ఈ స్తుతులతో పూజిస్తారో, వారు ఈ భూమిపై ఉత్తమ సద్గుణములు కలవారై, గొప్ప అదృష్టవంతులై, పండితుల చేత  ప్రశంసింపబడే మనస్సు కలవారుగా ప్రకాశిస్తారు.

శ్లో.  సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

గీ.  శంకరాచార్యకృత ప్రశస్తమయిన

కనకధారాస్తుతిన్ మూడుకాలములను

ప్రతిదినంబును పఠియించు భక్తులిలను

ధనమునార్జింతురిలపైన ధనదునివలె.

భావము: శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన సువర్ణధారా స్తోత్రాన్ని ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా పఠించేవారు కుబేరునితో సమానమైన అపారమైన సంపదను, ఐశ్వర్యాన్ని పొందుతారు.

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।

భావము:"పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ గోవింద భగవత్పాదుల వారి శిష్యుడైన శ్రీ శంకర భగవత్పాదుల చే రచింపబడిన ఈ 'కనకధారా స్తోత్రం' ఇంతటితో సంపూర్ణమైనది."

\తెలుగు పద్యానువాదము ... చింతా రామకృష్ణారావు.

జైహింద్.

14, జులై 2026, మంగళవారం

70. శ్లోII మంచే సదాశివమయే ... నినరణ అందించినవారు. శ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

 

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

70. శ్లోII  మంచే సదాశివమయే పరశివమయ లలితపౌష్ప పర్యంకే  

అధిచక్రమధ్య మాస్తే కామాక్షీనామ కిమపి మమ భాగ్యమ్! 

తే.గీ.II  అమరె పరమ శివుఁడను  పర్యంకము గల

మహిత  సదాశివమయమైన మంచముపయి

సౌమ్య సద్రూపమయిన శ్రీచక్రమందు

నాదు భాగ్యమై కామాక్షి మేదురముగ.

తాII శ్రీచక్ర మధ్యమున పరమశివుఁడు అనుపుష్ప పర్యంకముగల సదాశివమయమైన మంచమునందు కామాక్షీదేవి యనెడి నా భాగ్యము కూర్చొని యున్నది.   

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు ఈవిధంగా వివరణనంద్ఫించారు.

     శ్రీచక్రం అనే అమ్మవారి ఇంట్లో, దాని మధ్యభాగంలో సదాశివుడే ఒక మంచంగా ఉన్నాడు. ఆ మంచం పైన పరమశివుడే ఒక అందమైన పూలపానుపు (మెత్తటి పరుపు) లాగా అమరి ఉన్నాడు. అటువంటి పరశివుడనే పూలపానుపుపై నా అదృష్ట దేవత అయిన కామాక్షీదేవి వైభవంగా కూర్చొని ఉంది.

​శ్లోకం వెనుక ఉన్న అంతరార్థాలు

​ఈ శ్లోకంలో మూకకవి అమ్మవారి వైభవాన్ని, ఆమె సర్వోత్కృష్టతను వర్ణించడానికి కొన్ని రహస్య సంప్రదాయాలను ఉపయోగించారు. 

​1. పంచప్రేత మంచం (అమ్మవారి ఆసనం)

​శాక్త సంప్రదాయం ప్రకారం అమ్మవారు కూర్చునే మంచానికి ఒక ప్రత్యేకత ఉంది.

​ఈ మంచానికి ఉన్న నాలుగు కోళ్ళు (కాళ్ళు) ఎవరు అంటే—బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు.

​ఈ నలుగురిపై ఆధారపడి ఉండే పై పలక (లేదా నవారు) సదాశివుడు.

​సృష్టి, స్థితి, లయ, తిరోధానాలను చేసే ఈ ఐదుగురు అమ్మవారి శక్తి లేకపోతే శవాలతో (ప్రేతములతో) సమానం. అందుకే దీనిని 'పంచప్రేత మంచం' అంటారు.

​ఈ మంచం పైన, వీరందరికీ అతీతుడైన పరమశివుడు పూలపానుపులా ఉంటే, ఆయనపై అమ్మవారు అధిష్ఠించి ఉంది. అంటే అమ్మవారు విశ్వంలోని అత్యున్నత శక్తులన్నిటికంటే పైన ఉన్నదని అర్థం. ఆదిశంకరుల 'సౌందర్యలహరి' లోని భావననే(శివాకారే మంచే) మూకకవి ఇక్కడ మరింత అందంగా వర్ణించారు.

​2. సదాశివమయ మంచం అని ఎందుకు అన్నారు?

​మంచానికి నాలుగు కాళ్ళు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు) ఉన్నప్పటికీ, మనం కూర్చోవడానికి ముఖ్యమైనది పై పలక లేదా నవారు. ఆ పై భాగమే సదాశివుడు. సదాశివుడు అంటే జీవులపై 'అనుగ్రహం' కురిపించే శక్తి. మంచంలో కాళ్ళకంటే పలకకే ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి, దీనిని "సదాశివమయ మంచం" అని పిలిచారు. పూలపానుపు లాంటి పరశివునిపై అమ్మవారు కూర్చోవడం అనేది, శివ-శక్తుల అభేద స్థితిని (ఇద్దరూ ఒక్కటే అనే భావనను) తెలియజేస్తుంది.

​3. శ్రీచక్ర రహస్యం (మంచమా? పూలపల్లకీనా?)

​తంత్ర శాస్త్రం ప్రకారం శ్రీచక్రం మధ్యలో ఉండే 'బిందువు' అమ్మవారి స్థానం.

​ఇక్కడ 'పౌష్పపర్యంకం' అనే పదానికి పూలపానుపుతో పాటు 'పూలపల్లకి' అనే అర్థం కూడా వస్తుంది.

​సాధారణ మంచం అయితే భూమికి ఆని ఉంటుంది. కానీ పూలపల్లకి అయితే భూమికి తగలకుండా పైకి ఉంటుంది. దీనిని మోసే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు మాత్రమే భూమిని తాకుతుంటారు.

​శ్రీచక్ర సంప్రదాయంలో మధ్యలో ఉండే బిందువును విడిగా గీయకపోయినా, అది పైనున్న ఆకాశ తత్వంలో (బిందు స్థానంలో) వెలుగుతూ ఉంటుందని ఈ పల్లకి భావన మనకు సూచిస్తుంది.

మొత్తంగా ఈ శ్లోకం ద్వారా మూకకవి—సృష్టిని నడిపించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలందరూ అమ్మవారి పాదాల చెంత సేవకులుగా ఉంటే, ఆ జగన్మాత కామాక్షి సర్వోన్నతమైన పీఠంపై నా భాగ్యదేవతగా విరాజిల్లుతోందని ఎంతో అద్భుతంగా స్తుతించారు.

🕉️🙏🕉️

శ్లోకమునకు చక్కని వ్యాఖ్యానమునందించిన పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

13, జులై 2026, సోమవారం

69. శ్లోII కిం వా ఫలతి మమాన్యై ... ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల వివరణ.

0 comments

 జై శ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


69. శ్లోII  కిం వా ఫలతి మమాన్యై ర్బింబాధర చుంబి మందహాసముఖీ  

సంబాధకరీ తమసా మంబా జాగర్తి మనసి కామాక్షీ || 69 


తే.గీ.II  అధర బింబమున్ ముద్దిడు మధుర హసన

ముననునొప్పు మోమున, తమంబును హరించు

లోక జనని కామాక్షి నా లోననుండ

నితర దేవతలొసగునదేమి యుండు?


తాII దొండపండువంటి పెదవిని ముద్దుపెట్టుకొను మురిపెంపు జిఱునవ్యు 

నెమ్మోమునం దులకింప, తమంబు హరించు జగజ్జనని కామాక్షి నా మనసునందే వర్తించుచుండ నా కితర దేవతల వలన నొరుగ బోవు ఫల మేమి?  


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు శ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల వివరణ.

జీవితంలోని చీకట్లను (అజ్ఞానాన్ని) తాత్కాలికంగా కాకుండా, మరెప్పటికీ తిరిగి రాకుండా పూర్తిగా నాశనం చేసేది కామాక్షి అమ్మవారే. దొండపండులా ఎర్రగా ఉండే పెదవిపై, ఎల్లప్పుడూ మురిపించే చిరునవ్వుతో ప్రకాశించే ఆ తల్లి ముఖం నా మనస్సులో నిరంతరం మేల్కొని (ప్రకాశిస్తూ) ఉంది. మోక్షాన్ని ఇచ్చే ఆ కామాక్షి దేవి నా మనసులో ఉండగా, సంసార బంధాలలో మునిగి తేలే ఇతర దేవతలు నాకు ఎలాంటి ఫలాన్ని ఇవ్వగలరు? (అంటే, అమ్మవారి అనుగ్రహం ముందు ఇతర దేవతలు ఇచ్చే చిన్న చిన్న కోరికల ఫలాలు నాకు అక్కర్లేదు.

​1.

​ఎర్రని పెదవి - తెల్లని నవ్వు: అమ్మవారి పెదవి దొండపండులా ఎర్రగా ఉంది. దానిపై తెల్లని చిరునవ్వు మెరుస్తోంది. ఇక్కడ కవి ఒక అద్భుతమైన భావనను చూపిస్తున్నారు. ఎరుపు రంగు అమ్మవారికి ప్రతీక అయితే, తెలుపు రంగు శివునికి ప్రతీక.

​ అమ్మవారి పెదవిని ఆ చిరునవ్వు ముద్దాడుతున్నట్లు ఉంది. కానీ అంతర్లీనంగా చూస్తే, సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారిని ముద్దాడుతున్నాడా అన్నట్లుగా ఆ దృశ్యం కవి ఊహకు తట్టింది. శ్లోకంలోని ‘చుంబి’ (ముద్దు పెట్టుకోవడం) అనే పదం ఈ శివశక్తుల అద్భుత కలయికను మనకు తెలియజేస్తోంది.

​2.  సాధారణంగా సాయంత్రం వచ్చే సంధ్య చీకటిని తాత్కాలికంగానే పోగొడుతుంది. మళ్లీ మరుసటి రోజు చీకటి వస్తుంది. కానీ, కామాక్షి అమ్మవారు అలా కాదు. మన మనస్సులోని అజ్ఞానమనే ‘తమోగుణాన్ని’ (చీకటిని) శాశ్వతంగా తరిమికొడుతుంది. అందుకే ఇక్కడ సంధ్యతో పోలుస్తూనే, సంధ్య కంటే అమ్మవారే గొప్పదని చెప్పడం వల్ల ఇది ‘వ్యతిరేకాలంకారం’ అవుతుంది.

​3. 

​ ‘సంధ్యే సృష్టిరాహ హి’ అనే బ్రహ్మ సూత్రం ప్రకారం, నిద్రకు, మెలకువకు మధ్య ఉండే ‘స్వప్న అవస్థను’ (కలల స్థితిని) సంధ్య అంటారు. మనసు లోపల మేల్కోవడం అనేది ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక స్థితి.

​మోక్షాన్ని ప్రసాదించే కామాక్షి దేవి నా మనస్సులో నిరంతరంగా మేల్కొని ఉంది. అందువల్ల ప్రాపంచిక సుఖాలు, చిన్న చిన్న కోరికల పట్ల నాకు పూర్తి విరక్తి (వైరాగ్యం) కలిగింది. అలాంటి నాపై ఇతర దేవతలు ఇచ్చే తాత్కాలిక ఫలాలు ఎలాంటి ప్రభావం చూపలేవు. నాకు కావాల్సింది అమ్మ ఇచ్చే మోక్షమే. కామాక్షీ దేవ్యై నమః.🕉️🙏🕉️

చక్కని వివరణనందించిన పతంజలిగారికి ధన్యవాదములు.

జైహింద్.

సంస్కృత … తెలుఁగు … పదాల స్వరూపం. వివరణ … రంగరాజు పద్మజగారు.

0 comments

 జైశ్రీరామ్.

సంస్కృత … తెలుఁగు … పదాల స్వరూపం. వివరణ … రంగరాజు పద్మజగారు.

      పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకైనా , విద్య నేర్చుకొనే చిన్నారులకైనా పెద్ద సమస్య ఏమిటంటే? ఏది సంస్కృత పదం?, ఏది తెలుగు పదం? అని గుర్తించడం, కత్తి మీద సామే . అయితే కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే సంస్కృతం, తెలుగు పదాలును సులభంగా కొనుక్కోవచ్చు. కష్ట పడితే సాధించలేనిది లేదు కదా! తెలుగు, సంస్కృత పదాలను సులభంగా ఎలా తెలుసుకోవచ్చో చేసే చిరు ప్రయత్నం ఇది.

    బాలవ్యాకరణంలో చిన్నయసూరి సంస్కృత సమం , సంస్కృత భవం, ప్రాకృత సమం, ప్రాకృత భవం, దేశ్యాలు గురించి సంజ్ఞాపరిచ్ఛేదంలో చక్కగా వివరించారు. సంస్కృత పదాలను తత్సమాలని, తెలుగు పదాలను ఆచ్ఛికాలని చెప్పారు.ఆచ్ఛిక పరిచ్ఛేదంలో

“సంస్కృత సమేతరంబైన యీ భాష యచ్చనా బడు” అని సూత్రీకరించారు.

అనగా పైన చెప్పిన సంస్కృత సమ పదాలుగాక , సంస్కృత భవం ,ప్రాకృత సమం ,ప్రాకృత భవం ,దేశ్యాలతో కూడిన పదాలను ఆచ్చికపదాలు లేదా తెలుగు పదాలని చెప్పవచ్చని ఫలితార్థంము.

మొదట సంస్కృత పదములను… గురించి తెలుసుకుందాము.

1.సంయుక్తాక్షరములతో కూడిన పదములన్నీ సంస్కృతపదాలు.

ఉదా:-చక్రః , వర్షమ్ , మూర్ఖః ,అర్చన , కర్పూరమ్ ……

ఇవి తెలుగులో చేరునపుడు వీటికి తెలుగు ప్రత్యయాలైన డు, ము ,వు లు చేరి చక్రము,  వర్షము , మూర్ఖుడు , అర్చన , కర్పూరము అని మారుతాయి.

2. సంశ్లిష్టాక్షరములతో కూడిన పదములు సంస్కృత పదాలు….

ఉదా:-స్త్రీ ,రాష్ట్రం ,అర్ఘ్యం ,జోత్స్న ,క్త్వార్థం……

3 మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు సంస్కృత పదాలు…….

ఖరం ,ఘటం ,ఛత్రం ,ఝషం ,కంఠం ,ఢంకా ,కథ ,ధనం ,ఫలం భజన…..

4.విసర్గతో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-దుఃఖం ,అంతఃపురం ,అంతఃకరణ ,తపఃఫలం, మనఃకాయం….

5.ఋ ౠలతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ఋషి  ,ఋణం , ఋతువు ,….

6.శ ,ష ,హలతో కూడినపదాలు సంస్కృత పదాలు….

ఉదా:- శతము ,శంకర ,శశము, శంతనుడు ,ఆశ ,ఆకాశం ,

వేషము, దోషము ,ప్రదోషము ,

హంస ,హలము ,హాలాహలం ,హారం హీనం ,హోమం……

7.డు ,ము,వులు చేరడానికి తగిన పదాలు సంస్కృత పదాలు….( ఇవి తెలుగులోకి చేర్చేటప్పుడు డు ,ము ,వు లు చేరి వస్తాయి.)

రామ, భీమ , భయంకర, కంస

వన, దేశ , ప్రాంత ,ఆవేశ ,

చిత్ర, క్రతు , ధేను, తరు గురు,….

రాముడు, భీముడు , భయంకరుడు, కంసుడు

వనము, దేశము , ప్రాంతము ,ఆవేశము ,

చిత్రము,  క్రతువు , ధేనువు, తరువు గురువు,….

8.ఉపసర్గతో కూడిన పదాలు సంస్కృత పదాలు….

ఉదా:-ప్రతిదినం , ప్రఖ్యాతి , సకుటుంబం , ప్రత్యక్షం , పరోక్షం , దుర్లభం , సంతృప్తి, అపరిశుభ్రం , ,…

9.సంస్కృత సంఖ్యావాచకాలతో కూడినవి సంస్కృత పదాలు….

ఏక ,ద్వి ,త్రి చతు ,పంచ ,షష్టి సప్త, అష్ట, నవ , దశ , శత , సహస్ర….

10. సవర్ణదీర్ఘ ,గుణ ,యణాదేశ వృద్ది , అనునాసిక , విసర్గ , జస్త్వ , శ్చుత్త్వ…. సంధులతో కూడినవి సంస్కృత పదాలు….

అష్టావధానం, కవీశ్వర, గురూపదేశం, పితౄణం వేంకటేశ్వర ,మహర్షి ,ప్రత్యేక, అణ్వస్త్రం, ఏకైక ,పరమౌషదం మనోహరం ,చతుషష్టి……

11 ఋతువుల పేర్లు , తిథులపేర్లు , నక్షత్రాల పేర్లు ,తెలుగు సంవత్సరాలు…. సంస్కృత పదాలు

ఉదా:-వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు….

అమావాస్య ,పాఢ్యమి …..

అశ్వని ,భరణి,…..

ప్రభవ, విభవ….

12. వట్రుసుడితో కూడినవి సంస్కృత పదాలు….

ఉదా:-గృహము ,కౄరుడు , కృపాణము , ధృతరాష్ట్రుడు , దృష్టి , ధృవీకరణ, పృథివి , పృచ్ఛకులు , భృగువు , సవితృ ,ధాతృ ,నేతృ ,భర్తృ కర్తృ …..

13.యకారముతో కూడిన పదాలు తెలుగులో లేవు. అంటే యకారంతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలే.

యమున , యముడు , యజ్ఞము , యంత్రము , యాత్ర.

ఇక తెలుగు పదాల గురించి తెలుసుకుందాము.

1.ద్విత్వాక్షరములతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-అమ్మ, అక్క ,అవ్వ, అత్త , కుక్క, మొగ్గ , వెన్న , కర్ర , నిచ్చెన , గజ్జెలు , పిట్ట….

2 .అరసున్నతో కూడిన పదాలు తెలుగు పదాలు

ఉదా:-తెలుఁగు ,మూఁడు ,చీఁకటి ,పాఁత , కోఁతి మూఁత. కోఁట పేఁట మూఁట……

3.సర్వనామాలన్నీ తెలుగుపదాలు

ఉదా:-నేను, మేము, నీవు మీరు, అతడు , వాడు , వారు , వాడు , వీడు, ఎవడు, ఎంత , అంత , ఇంత,  కొంత, కొన్ని, ఎన్ని , అన్ని , అక్కడ, ఇక్కడ , ఎక్కడ….

4.క్రియలతో కూడినపదాలు తెలుగు పదాలు

ఉదా:-వండు ,తిను,చదువు ,పాడు ,వచ్చు ,పోవు ,అమ్ము , కొను….

(లిఖించు ,భావించు ,భేధించు ,ఖండించు ఇలాంటివి సంస్కృత క్రియలు. సంస్కృత క్రియలు తెలుగులో అలాగే చేరవు. క్రియలు చివరి ఇంచు చేరుతాయి)

5.స.. తో కూడిన పదాలు ఎక్కువగా తెలుగు పదాలు

ఉదా:-సంత, సంచి , సంతకం ,ఆస ,ఆకసం ,పూస, గసగసాలు……

(సంతోషం , సంభవం… ఇలాంటివి సంస్కృత పదాలు)

6.కొన్ని డు, ము, వులతో కూడినవి తెలుగు పదాలు

ఉదా:-వాడు ,వీడు ,పాపడు ,మగడు, కైరుడు, కత్తలుడు , జన్నడు , తమ్ముడు, మనుమడు, ఆటగాడు , జూదగాడు, పాటగాడు , వేటగాడు, బల్లిదుడు, ఱేడు, చెలికాడు , హెగ్గడికాడు , అటమటీడు , కన్నడీడు , కల్లరుడు , పాము , ఇనుము , అల్లము, సున్నము, బియ్యము , అందము, చందము,చెరువు, పరువు, కరువు, దరువు, నిలువు , కొలువు,….

7. సంయుక్తాక్షరంతో గానీ మహాప్రాణాక్షరంతో గానీ కూడినప్పటికి పదం చివర డు ,ము ,వు … చేరితే అవి తెలుగు పదాలుగా మారుతాయి. (కానీ మూలం సంస్కృత పదం) వీటినే తత్సమాలు అంటారు. వీటికి మరొక పేరు ప్రకృతులు.

ఉదా:- ఈశ్వరుడు, భీముడు , పర్వతము, భయము , క్రతువు , తరువు..

భీముడు+ అతడు

పర్వతము + అది

భయము+ఎందుకు

8.ఎ ,ఒ, చ, జ(దంత్యాలతో కూడినవి) లతో కూడినపదాలు తెలుగు పదాలు 

ఉదా:-ఎలుక ,ఎంత ,ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ,ఎరుక, ఎరువు ,ఎరుపు , ఒక , ఒంటె, ఒంటరి, ఒనరు, ఒప్పు, ఒత్తు, ఒద్దిక , చాప, చురక ,చూలు, చందమామ, జడ, జల్లెడ, జముడు ,జాతర ,జున్ను

9.సంఖ్యలన్నీ తెలుగు పదాలు

ఉదా:-ఒకటి ,రెండు,మూడు ,నాలుగు ,ఐదు ,ఆరు…నూరు ,వంద ,ఇన్నూరు ,వేయి,

10. కృదంత ప్రత్యయాలు చేరిన పదములు అచ్చతెలుగు పదాలు

కోయు+త….కోత

కోయు అనేది క్రియ .. క్రియా మీద త అనే కృదంత ప్రత్యయం చేరి కోత అని నామవాచకంగా మారింది.

పండు+ట..పంట

మూయు+త…మూత

పూయు+త…పూత

మండు+ట…మంట

అరుచు+పు…అరుపు

మునుగు+క…మనక

చేరు+ఇక…..చేరిక

కోరు+ఇక…..కోరిక

అలుగు+క….అలక

పోవు+క….పోక

ఊరు+ట….ఊట

11.తద్దిత రూపాలతో ఏర్పడు పదాలు తెలుగు పదాలు.

నామవాచకాల మీద గానీ, విశేషణాల మీద గానీ చేరి నామవాచకంగా మారే పదాలను తద్దినాలు అంటారు.

పెద్దతనము… పెద్ద అనేది విశేషణం. దాని మీద తనము అనే తద్దిత ప్రత్యయం చేరి పెద్దతనంగా మారింది.

 పెద్దఱికము, చుట్టఱికము , కన్నెఱికము, పూజారి, అరమరిక ,చదువరి ,తెంపరీ , తెరువరి ,సుంకరి ,జూదరి,

జాలరి ,టక్కరి ,వగలాడు ,దొమ్మరి ,ముక్కిడి,ఆటగత్తె , మోసగత్తె ,చాకిత ,కఱవత , చిఱుతుక , నాతుక, నెలతుక

12.శకటరేఫములతో ఏర్పడేవి తెలుగుపదాలు.

కఱ్ఱ ,బఱ్ఱె ,తొఱ్ఱ ,గొఱ్ఱె ,ఱంపము ,జుఱ్ఱు ,కఱ్ఱు ,మఱ్ఱి ,,……..

13.కొలమానం తెలుపే పదాలు అచ్చతెలుగుపదాలు….

జాన ,మూర ,బిత్తెడు ,దోసెడు ,మానిక, కుంచం , పడి , సేరు , అణా , దమ్మిడి , రూక ,రూపాయి

గుర్తించుకోవలసినవి….

1.సంయుక్తాక్షర పదములన్నీ సంస్కృతపదాలే కానీ

కర్జము ,సంద్రం ,….మొదలైన పదములు ఆచ్చికపదాలు.

2 వస్తే ,ఇస్తే ,తెస్తే,అరిస్తే మొదలైన చేదర్థకాలతో కూడినవి  ఇవి సంయుక్తాక్షరాలతో కూడినా మూల రూపం వచ్చు ఇచ్చు తెచ్చు అరుచు అనేవి అచ్చతెలుగు పదాలు.

(మూల రూపం వచ్చు+తే… వస్తే)

3.అన్నము వంటి ద్విత్వాక్షర పదాలు సంస్కృత పదాలుగా ఉన్నాయి.

ఇలా తెలుగు, సంస్కృత పదాలను సులభంగా గుర్తించవచ్చు. కానీ అభ్యాసం వలన మరి కొన్నింటిని తెలుసుకోవచ్చును..

పద్మజగారికి ధన్యవాదములు.

జైహింద్.

12, జులై 2026, ఆదివారం

గాన కోకిల జానకి ఇంక మనకు లేరు..

0 comments

ఓం శాంతిః.

ప్రముఖ నేపథ్య గాయిని జానకి గారు

తే. 11 - 7 - 2026న

దివంగతులైనారన్న విషయం తెలియఁజేయుటకు విచారిస్తున్నాను.

సీ.  పసిపాపగొంతులో పారాడు స్వరముతో ముద్దుగా పాడెడి పూజ్యురాలు,

బాలబాలికలట్లు పరవశమ్మున పాడు ప్రఖ్యాత గాయిని పాటల గని,

యువతులు పాడెడి యుదయకోకిలగానమాధురుల్ వెలయించు మధుర గాత్ర,

వృద్ధులట్లుగ పాడి పేరును గన్నట్టి జానకి దివికేగె మౌనముగను,

గీ. గాన కోకిల జాతికే గర్వమరయ,

నట్టి  యీ తల్లి యాత్మకునమరుగాగ

శాంతి, పరమాత్మ పాదాల చెంత చేరి

ముక్తి సామ్రాజ్యమేలుత పుణ్యగతిని.

వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

ఓం శాంతిః శాంతిః శాంతిః.


68. శ్లోII బాణ సృణి పాశ కార్ముకపాణీ ... ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలి మహోదయుల భాష్యము.

0 comments

జైశ్రీరామ్. 

68. శ్లోII  బాణ సృణి పాశ కార్ముకపాణీ మముం కమపి కామ పీఠగతమ్‌ 

ఏణధరకోణచూడం శోణీమ పరిపాకభేద మాకలయే. ౬౮ 

తే.గీ.II  బాణ, సృణి, పాశ, కార్ముకపాణిని, నుత 

కామకోటి పీఠ గతను, శ్రీమదంబ

ననుపమారుణ పరిపాక ఘనయశమును,

చంద్రరేఖా శిరోమణిన్ సన్నుతింతు. 

తాII బాణములు అంకుశము పాశము విల్లును హస్త ములందాల్చి చంద్రవంక శిరము నంబూని కామకోటి పీఠమందున్న యొకానొక ఆరుణ్యపరిపాకమును భావించెదను. 

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలి మహోదయుల భాష్యము.

​అమ్మవారి ఆయుధాలు వాటి వెనుక ఉన్న రహస్యం

​అమ్మవారు (కామాక్షీ దేవి) తన నాలుగు చేతులలో ఐదు బాణాలు, పాశము (త్రాడు), అంకుశము, మరియు ఒక విల్లును ధరించి ఉంటుంది. ఇందులో ఆమె పట్టుకున్న విల్లు చెరకు విల్లు, బాణాలు పూల బాణాలు.

​అమ్మవారు వీటిని ధరించడం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉంది. ఆ రహస్యాలు ఏమిటంటే:

​పాశము (తాశము/త్రాడు): ఇది 'రాగము' (అనురాగం/ఆకర్షణ) లేదా ఇచ్ఛాశక్తికి సంకేతం.

​అంకుశము: ఇది 'క్రోధము' (కోపం) లేదా జ్ఞానశక్తికి సంకేతం.

​జీవుడికి, అమ్మవారికి ఉన్న తేడా:

​మనకు ఎవరి మీద, ఎందుకు ప్రేమ (రాగము) కలుగుతుందో మనకే తెలియదు. మన సొంత ఇష్టంతో రాగము పుట్టదు. అదంతా అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతుంది.

​ మనుషులమైన మన రాగం మన చేతుల్లో ఉండదు. కానీ అమ్మవారి చేతిలో రాగం ఉందంటే, ఆమె దానికి లొంగిపోలేదు; రాగమే ఆమెకు లొంగి ఉంటుంది (స్వాధీనమై ఉంటుంది).

​ మనకు ఒక్కోసారి ఎదుటివారు తప్పు చేయకపోయినా కోపం వస్తుంది, మరికొన్ని సార్లు ఎంత పెద్ద తప్పు చేసినా కోపం రాదు. మనకు కోపం రావడం, రాకపోవడం కూడా అమ్మవారి ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది. కోపం అమ్మవారి చేతిలో ఉందంటే, అది ఆమె అదుపులో ఉందని అర్థం. ఆమె అనుకుంటేనే కోపం వస్తుంది, వద్దనుకుంటే రాదు.

​ఇలా రాగద్వేషాలు (ప్రేమ, కోపాలు) అమ్మవారి అదుపులో ఉంటాయి. ఆమె ఏ జీవుడినైతే అధోగతి పాలు చేయాలనుకుంటుందో, వాని మనస్సులో ఈ రాగక్రోధాలు పుట్టేలా చేస్తుంది.

​మనస్సు మరియు పంచతన్మాత్రల సంకేతాలు

​చెరకు విల్లు (చిత్తము): మన రాగద్వేషాలన్నింటికీ నిలయం మన చిత్తమే (మనస్సు). ఆ చిత్తమే అమ్మవారి చేతిలో చెరకు విల్లుగా మారింది. మన మనస్సు మన మాట వినకుండా ఎప్పుడూ చంచలంగా (అటుఇటు) తిరుగుతూ ఉంటుంది. దానిని ప్రశాంతంగా ఉంచాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ, అసలు ఆ మనస్సే అమ్మవారి చేతిలో ఉంది. కాబట్టి అమ్మవారు దయతలిస్తేనే మన మనస్సు మన అదుపులోకి వచ్చి నిశ్చలంగా ఉంటుంది, లేదంటే చంచలంగానే తిరుగుతుంటుంది. మన మనస్సు మనకు లొంగదు కానీ, అమ్మవారికి పూర్తిగా లొంగి ఉంటుంది.

​ అమ్మవారి చేతిలోని ఐదు పూల బాణాలు ఐదు జ్ఞానేంద్రియాల విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు (వినడం, తాకడం, చూడడం, రుచి, వాసన) సంకేతాలు. మన మనస్సు ఈ ఐదింటి వల్లే ఆకర్షణకు (రాగానికి) లేదా ద్వేషానికి లోనవుతుంది.

​ఇంద్రియాలు బయట ఉన్న వస్తువుల వైపు ఆకర్షించబడటం 'రాగం' వల్ల జరుగుతుంది. వాటి నుండి దూరంగా జరగడం 'క్రోధం' వల్ల జరుగుతుంది. భోగ భాగ్యాలు శాశ్వతం కావని తెలుసుకున్న జ్ఞానులలో ఈ వైరాగ్యం (దూరంగా ఉండటం) శాశ్వతంగా ఉంటుంది. కానీ సాధారణ కోపం వల్ల కలిగే వైరాగ్యం తాత్కాలికంగానే ఉంటుంది. అందుకే అమ్మవారి చేతిలోని అంకుశాన్ని కొందరు 'క్రోధం' అని, మరికొందరు 'జ్ఞానం' అని అంటారు.

​అమ్మవారి ఎరుపు రంగు విశిష్టత (అరుణిమము)

​చెట్ల ఆకులు, కాయలు సూర్యరశ్మి తగలడం వల్ల రంగులు మారుతుంటాయి. దానికి ఆ సూర్యకిరణాల పాకమే (మార్పు) కారణం. అలాగే, పరమశివుని మనస్సులోని ప్రేమే (రాగమే) అమ్మవారి ఒంటి రంగు (ఎరుపు/అరుణిమము). అమ్మవారి దివ్య సౌందర్యం వల్ల ఆ శివుని ప్రేమ ఒక ప్రత్యేకమైన పాకంగా (రూపంగా) మారింది.

​అందుకే అమ్మవారి ఎరుపు రంగును ఒక అద్భుతమైన మార్పుగా (శోణిమపాకభేదము) వర్ణించారు.  ఆ పరమశివుని ప్రేమ యొక్క పరిణామ రూపమే (అరుణిమపాక భేదమే) సాక్షాత్తు అమ్మవారు అని ఈ శ్లోకము చక్కగా తెలియజేసింది🕉️🙏🕉️

డా. తాడేపల్లి పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

11, జులై 2026, శనివారం

67. శ్లోII అధికాంచి వర్తమానా మతులాం ... ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

0 comments

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


67. శ్లోII  అధికాంచి వర్తమానా మతులాం కరవాణి పారణా మక్ష్ణోః  

ఆనంద పాకభేదా మరుణిమ పరిణామ గర్వ పల్లవితామ్‌. 


తే.గీ.II  హ్లాద పాకభేదముతోడ నతులితయును, 

కంచి సంచారి, యరుణిమ క్రమ పరిణతి

గర్వ పల్లవితయునగు కామనేత్రి

యొక్క దర్శనమును బొంది యొప్పుదునిల.


తాII ఆనందపరిపాక విశేషమును, ఎఱుపురంగుయొక్క క్రమపరిణామ గర్వముచే జిగురించుదానిని,  కాంచి యందు వర్తించు దానిని, దర్శించుకొనుదును.


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకమునకు డా. తాడేపల్లి పతంజలి గారి భాష్యము.

అమ్మవారికి గర్వము ఉన్నదని చెప్పవచ్చా? మూక కవి అలా ఎందుకు చెప్పారు?      తాడేపల్లిపతంజలివివరణ.                                 ​ఈ శ్లోకంలో కవి అమ్మవారి అందాన్ని, ఆమె ఇచ్చే ఆనందాన్ని రెండు అందమైన పోలికలతో వివరించారు:

​1. ఆనంద పాక విశేషం (పరమానంద రసం)

​శివుడు నిరంతర ఆనంద స్వరూపుడు. ఆ శివుడి ఆనందమే ఒక స్త్రీ రూపం దాల్చితే, ఆ రూపమే కామాక్షి అమ్మవారు.

​మనం వంట చేసేటప్పుడు పదార్థాలు బాగా పాకం పడితే రుచి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే, శివునిలోని ఆనందం అనే భావం బాగా పక్వానికి వచ్చి (పాకమై), మరింత రుచికరంగా మారిన రూపమే అమ్మవారు.

​ఆ పరమశివుడికే అమితమైన ఆనందాన్ని ఇచ్చే ఆ తల్లి రూపం, మన కళ్లకు దొరికే ఒక పెద్ద విందు భోజనం లాంటిది.2.సాధారణంగా చెట్లకు వచ్చే కొత్త చిగురుటాకులు (పల్లవములు) చాలా లేతగా, ఎర్రగా ఉంటాయి.

​ అమ్మవారు నిలువెత్తు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్నారు. "ఈ ప్రపంచంలో నాకంటే ఎర్రగా, అందంగా ఎవరూ లేరు" అనే ఒక చిన్న గర్వం (అభిమానం) అమ్మవారికి ఉంది.

​ఒకవేళ ఆ గర్వానికి కూడా ఒక రూపం ఉండి, అది కూడా ఎర్రగా మారిపోతే ఎలా ఉంటుంది?  ఎర్రగా ఉన్న చిగురుటాకు మీద, ఈ గర్వం అనే మరో ఎరుపు రంగు వచ్చి చేరినట్లు ఉంది. అంటే... ఎరుపుకు ఇంకొక ఎరుపు తోడైతే అది ఎంత గాఢంగా, ఎంత అందంగా మారుతుందో, అమ్మవారి రూపం అంతటి ఎరుపుదనంతో ప్రకాశిస్తోందని భావం. కవిత్వంలో ఒక వస్తువు యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి "గర్వం" అనే పదాన్ని ఒక అలంకారంగా వాడతారు.

​ఉదాహరణకు: "ఆ పువ్వు అందం ముందు మిగిలిన పువ్వుల గర్వం అణిగిపోయింది" అంటాం. అంటే అక్కడ పువ్వుకు పొగరు ఉందని కాదు, దాని అందం అంత గొప్పదని అర్థం.

​ఇక్కడ కూడా, "అమ్మవారి ఎరుపుదనం ముందు సృష్టిలోని మరే ఎరుపు రంగు సరితూగదు" అని చెప్పడమే ఆ 'గర్వం' యొక్క ఉద్దేశం.మూకకవి వాడిన 'గర్వము' అనేది అహంకారం కాదు; అది "సౌందర్య పరాకాష్ఠ" (అందానికి ఆఖరి హద్దు). అమ్మవారి రూపం అంతటి దివ్యమైన, తిరుగులేని కాంతితో ప్రకాశిస్తోందని చెప్పడానికి కవి భక్తితో, ప్రేమతో వాడిన పదం అది. కాబట్టి కవిత్వ పరిభాషలో దీనిని తప్పుగా భావించనవసరం లేదు🕉️🙏🕉️

శ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

10, జులై 2026, శుక్రవారం

66. శ్లోII దగ్ధషడధ్వారణ్యం దరదలిత ... ఈ శ్లోకమునకు సమీక్ష బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

66. శ్లోII  దగ్ధషడధ్వారణ్యం దరదలిత కుసుంభ సంభృతారుణ్యమ్‌ 

కలయే తవ తారుణ్యం కంపాతట సీమ్ని కిమపి కారుణ్యమ్‌| ౬౬ 

తే.గీ.II  ప్రథిత దగ్ధ షడధ్వరారణ్య,  దరద

ళిత కుసుంభ సంభృత రక్తిమ, తుల లేని

కంప నదికడ వెలసిన కరుణ యనగ

నొప్పు నీ జవ్వనముఁ గొల్తు నొప్పిదముగ.

తాII షడధ్వరారణ్యమును కాల్చిన, కొంచెము వికసించినట్టి కుసుంబ పుష్పముల ఎఱుపును ధరించిన, కంపా తట ప్రదేశమున వెలసినదయా స్వరూపమయిన నీ యౌవన్మును ధ్యానింతును.

నా వివరణము.

ఓం శ్రీమాత్రే నమః.

ఆర్యా! నమస్తే. అల్పజ్ఞుఁడను.

నేను అర్థము చేసుకొనగలిగినంతలో మీకు తెలుపగలను.

ప్రఖ్యాతముగా కాల్చిన షడధ్వము అను అరణ్యము కలిగిన జనని.

షడధ్వములు (షట్ + అధ్వములు) అంటే భగవంతుడిని లేదా బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి, అలాగే ఈ సృష్టి విస్తరించడానికి కారణమైన ఆరు మార్గాలు అని అర్థం. తంత్ర మరియు శాక్తేయ శాస్త్రాల ప్రకారం, ఈ మొత్తం విశ్వం శబ్దము (మాట), అర్థము (రూపము) అనే రెండు విషయాలతోనే నిండి ఉంది.శబ్ద ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శక్తి మయములు):

శబ్ద సంబంధమైనవి (వాచక అధ్వములు):

1. పదాధ్వము: పదాలు లేదా నామరూపాలకు సంబంధించిన మార్గం.

2. మంత్రాధ్వము: మంత్రాలకు సంబంధించినది.

3. వర్ణాధ్వము: అక్షరాలు లేదా వర్ణాలకు సంబంధించినది.అర్థ / ప్రపంచ సంబంధమైనవి (అవాచక అధ్వములు):

4. భువనాధ్వము: విశ్వంలో ఉండే వివిధ లోకాలు లేదా భువనాలకు సంబంధించినది.

5. తత్వాధ్వము: భూమి, జలము, అగ్ని మొదలైన 36 తత్వాలకు సంబంధించినది.

6. కళాధ్వము: సృష్టికి మరియు జీవులకు శక్తినిచ్చే కళలకు సంబంధించినది.

ఆగమ శాస్త్రాల ప్రకారం, ఈ ఆరు మార్గాల గురించిన పరిజ్ఞానం మరియు వాటి శుద్ధి ద్వారానే జీవుడు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శివత్వమును లేదా మోక్షాన్ని పొందగలఁడు.

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

షడధ్వమును కాల్చడం ఏమిటి? అమ్మవారిని కొలవటం కాకుండా అమ్మవారి యవ్వనాన్ని కొలవటం ఏమిటి? ఇందులో ఉండే ఆంతర్యం ఏమిటి?                                             

తాడేపల్లి పతంజలి వివరణ 

షడధ్వములు (షట్ + అధ్వములు) అంటే భగవంతుడిని లేదా బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి, అలాగే ఈ సృష్టి విస్తరించడానికి కారణమైన ఆరు మార్గాలు అని అర్థం. తంత్ర మరియు శాక్తేయ శాస్త్రాల ప్రకారం, ఈ మొత్తం విశ్వం శబ్దము (మాట), అర్థము (రూపము) అనే రెండు విషయాలతోనే నిండి ఉంది.

​శబ్ద ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శక్తి మయములు):

​మన నోటి నుండి వచ్చే ప్రతి మాట, అక్షరం దైవ స్వరూపమే. శబ్ద రూపంలో ఉండే ఆ మూడు మార్గాలు ఇవే:

​వర్ణాధ్వము (అక్షరాలు):

మనం పలికే 'అ' నుండి 'క్ష' వరకు ఉన్న అక్షరాలే వర్ణాలు. సృష్టిలోని ప్రతి మంత్రానికి, ప్రతి మాటకు మూలం అక్షరాలే. భగవంతుడిని అక్షర రూపంలో ధ్యానించడం ఇందులో మొదటి మార్గం.

​పదాధ్వము (పదాలు):

కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది. భగవంతుడిని స్తుతించే పేర్లు (ఉదాహరణకు: శివ, నారాయణ, కామాక్షి వంటి నామాలు) అన్నీ పదాలే. నామస్మరణ ద్వారా భగవంతుడిని చేరుకునే మార్గం ఇది.

​మంత్రాధ్వము (మంత్రాలు):

కొన్ని పదాల కలయికతో శక్తివంతమైన మంత్రాలు ఏర్పడతాయి (ఉదాహరణకు: ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం వంటివి). ఈ మంత్రాలను జపించడం ద్వారా మనస్సును పవిత్రం చేసుకుని భగవంతుడిని పొందే మార్గం ఇది.

​అర్థ/రూప ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు (శివ మయములు):

​మనం కంటితో చూసే రూపాలు, భౌతిక ప్రపంచానికి సంబంధించిన మూడు మార్గాలు ఇవే:

​కలాధ్వము (శక్తులు లేదా విభాగాలు):

ఈ సృష్టి నడవడానికి ఐదు ముఖ్యమైన శక్తులు (కలలు) కారణం అవుతాయి. నివృత్తి, ప్రతిష్ఠ, విద్యా, శాంతి, శాంత్యతీతా కలలు అని వీటిని అంటారు. సృష్టి పుట్టుక నుండి మోక్షం వరకు జరిగే ప్రక్రియను నడిపించే దైవిక శక్తుల మార్గం ఇది.

​తత్త్వాధ్వము (సృష్టి మూలకాలు):

ఈ సృష్టి ఏర్పడటానికి కారణమైన మూలకాలను తత్వాలు అంటారు. మన శరీరం, ఈ ప్రకృతి పంచభూతాలతో (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) మరియు మనస్సు, బుద్ధి, అహంకారం వంటి 36 తత్వాలతో నిర్మితమైంది. ఈ తత్వాలన్నింటిలోనూ భగవంతుడిని దర్శించడం ఈ మార్గం యొక్క ఉద్దేశం.

​భువనాధ్వము (లోకాలు):

మనం ఉంటున్న ఈ భూలోకంతో పాటు పైలోకాలు (స్వర్గ లోకం వంటివి), క్రింది లోకాలు ఇలా విశ్వంలో ఉన్న సమస్త లోకాలను భువనాలు అంటారు. ఈ లోకాలన్నీ భగవంతుని స్వరూపాలే అని భావించి ఉపాసించడం ఈ ఆఖరి మార్గం.

ఈ ఆరు మార్గాలు (అక్షరాలు, పదాలు, మంత్రాలు, శక్తులు, తత్వాలు, లోకాలు) అనేవి భక్తుడు దైవాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే మెట్లు లాంటివి. 

​షడధ్వములను (ఆరు మార్గాలను) కాల్చడం అంటే ఏమిటి?

​ఇక్కడ 'కాల్చడం' అంటే నాశనం చేయడం అని కాదు, 'లయం చేయడం' లేదా 'అజ్ఞానాన్ని తొలగించడం' అని అర్థం.

​లౌకిక బంధాల నుండి విముక్తి: మనం పైన చెప్పుకున్న ఆరు మార్గాలు (అక్షరాలు, పదాలు, మంత్రాలు, శక్తులు, తత్వాలు, లోకాలు) అనేవి ఈ భౌతిక ప్రపంచాన్ని, మన శరీరాన్ని, మనస్సును బంధించి ఉంచే బంధాలు. మనం పూజలు, జపాలు చేసేటప్పుడు ఈ నామ-రూపాల సహాయం తీసుకుంటాం. కానీ మోక్షం కావాలి అంటే ఈ నామ-రూపాలను దాటి వెళ్ళాలి.

​ ఎప్పుడైతే సాధకుడికి అమ్మవారి అనుగ్రహం వల్ల 'ఆత్మజ్ఞానం' కలుగుతుందో, అప్పుడు ఈ సృష్టి అంతా మాయ అనీ, చివరకు మిగిలేది ఒకే ఒక్క పరబ్రహ్మం (అమ్మవారు) అనీ తెలుస్తుంది. నిప్పులో పడిన ఏ వస్తువైనా ఎలా బూడిదైపోతుందో, అలాగే జ్ఞానమనే అగ్ని ముందు ఈ ఆరు మార్గాల భేదాలు (నేను, నాది, ఈ లోకం, ఈ రూపం అనే భ్రమలు) అన్నీ కాలిపోతాయి.

​ అమ్మవారు 'దగ్ధ-షడధ్వ-అరణ్యమ్' (ఆరు మార్గాలనే అడవిని కాల్చినది). అంటే, భక్తుడి మనస్సులోని అజ్ఞానాన్ని, భ్రమలను తన జ్ఞానాగ్నితో పూర్తిగా కాల్చివేసి, అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం.

​అమ్మవారిని కాకుండా, ఆమె 'యవ్వనాన్ని' ధ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి?

​శ్లోకంలో "దయయో అనదగిన నీ యౌవనమును ధ్యానించెదను" అని మూకకవి అన్నారు. ఒక తల్లిని లేదా దేవతను కొలిచేటప్పుడు 'యవ్వనాన్ని' ధ్యానించడం వెనుక మూడు అద్భుతమైన కారణాలు ఉన్నాయి:

​ అమ్మవారి యవ్వనమే 'కరుణ' (దయ)

​లోకంలో స్త్రీలకు దయాగుణం ఎక్కువ. అందులోనూ యవ్వనంలో ఉన్న స్త్రీ హృదయం మరింత కోమలంగా, ప్రేమతో నిండి ఉంటుంది. ఇక్కడ పరమశివుని యొక్క 'కరుణ' అనే గుణమే అమ్మవారిగా అవతరించింది. ఆ కరుణ ఎంత గొప్పదో చెప్పడానికి కవి... "అమ్మా! నీ యవ్వనం మరేదో కాదు, సాక్షాత్తు 'దయ' అనే గుణమే నీ శరీరంలో యవ్వనంగా మారిందా అన్నట్లుంది" అన్నారు. అంటే ఇక్కడ యవ్వనాన్ని ధ్యానించడం అంటే, అమ్మవారి అమితమైన కారుణ్య గుణాన్ని ధ్యానించడమే.

​ ఎప్పటికీ తరిగిపోని సృష్టి శక్తి .

​'యవ్వనం' అనేది ఉత్సాహానికి, నిరంతర శక్తికి, సృజనాత్మకతకు ప్రతీక. బాల్యం దాటిపోతుంది, ముసలితనం వల్ల శక్తి క్షీణిస్తుంది. కానీ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి ముసలితనం ఉండదు. ఆమె ఎల్లప్పుడూ నిరంతర శక్తితో ప్రకాశించే 'త్రిపురసుందరి' (నిత్య యవ్వనవతి). సృష్టిని నిరంతరం నడిపించే ఆ అఖండమైన దైవ శక్తిని కొలవడమే అమ్మవారి యవ్వనాన్ని ధ్యానించడం.

​ గుణ-గుణి అభేదం 

​ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం భగవంతుడికి, భగవంతుని గుణాలకి తేడా లేదు (ఉదాహరణకు: అగ్నికి, దాని వేడికి తేడా లేనట్లు). అమ్మవారు కేవలం అందమైనది మాత్రమే కాదు, ఆమె అందం (ఆరుణ్యం). ఆమె యవ్వనం (తారుణ్యము). ఆమె దయ (కారుణ్యము). కాబట్టి ఆమె యవ్వనాన్ని ధ్యానించడం అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే ధ్యానించడం.

సాధకుడు అమ్మవారి రూపాన్ని చూస్తూ, ఆమెలోని అనంతమైన దయాగుణాన్ని (యవ్వనాన్ని) నమ్ముకుని శరణు వేడితే... ఆమె తన జ్ఞానాగ్నితో సాధకుడి చుట్టూ ఉన్న అజ్ఞానపు అడవిని (షడధ్వములను) కాల్చివేసి, తనలో లీనం చేసుకుంటుంది. ఇదే ఈ శ్లోకం యొక్క పరమార్థం.🕉️🙏🕉️

బ్రహ్మశ్రీ పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

9, జులై 2026, గురువారం

65. శ్లోII కుసుమశర గర్వసంప త్కోశగృహం ఈ శ్లోకమునకు డా.తాడేపల్లి పతంజలిగారి వివరణము.

0 comments

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

65. శ్లోII  కుసుమశర గర్వసంప త్కోశగృహం భాతి కాంచి దేశగతమ్‌ 

స్థాపిత మస్మి న్కథమపి గోపిత మంత ర్మయా మనోరత్నమ్.

తే.గీ.II  మన్మథుని గర్వసంపద మందిరమ్ము

కంచియందొకటున్నది ఘనతరముగ,

నా మనంబను రత్నమున్ బ్రేమనెటులొ

దాచిపెట్టితి నచ్చట తత్త్వమరసి.

తాII మన్మథగర్వసంపదకు భాండాగార మొకటి కాంచి మధ్య దేశమందు ప్రకాశించుచున్నది. నా మనస్సు అనెడి రత్నమును దానియందు దాపరిక మొనర్చితిని.

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకానువాదము పఠించిన బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు ఈ విధముగా వ్యాఖ్యానించియున్నారు.

శివుడు తన మనసును ఎంతో నిగ్రహించుకోగలడు. కానీ అమ్మవారిని చూడగానే ఆయన యోగసాధనలన్నీ పక్కన పెట్టి, ఆమె ప్రేమలో పడిపోతారు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. శివుడంతటి ఇంద్రియ నిగ్రహం గలవాడు లేడంటారు.మరి మూకకవి "మన్మథ గర్వ సంపద" అనే పదం ద్వారా వ్యంగ్యంగా శివుని ఇంద్రియ నిగ్రహాన్ని ఎందుకు తక్కువ చేశారు? తాడేపల్లి పతంజలి జవాబు    శివుడి ఇంద్రియ నిగ్రహాన్ని తక్కువ చేయడం కవి ఉద్దేశం కాదు; శివుడి నిగ్రహాన్ని సైతం కరిగించగల అమ్మవారి దివ్య సౌందర్యం, సర్వవ్యాప్త శక్తి ఎంత గొప్పవో కొనియాడడమే మూకకవి గారి ముఖ్య ఉద్దేశం.శ్లోకం చివరి భాగంలో కవి "తస్మిన్ మయా అంతః స్థాపితం మనోరత్నమ్" (అందులో నా మనసనే రత్నాన్ని దాచాను) అన్నారు. దీనికి కారణం:

​ శివుడి అంతటి మహా యోగిని సైతం కట్టడి చేయగల శక్తి ఒక్క అమ్మవారికే ఉంది. అంతటి శక్తివంతురాలైన అమ్మవారి పాదాల చెంత లేదా ఆమె హృదయంలో తన మనసును దాచితే, ఇక ఏ లౌకిక మాయలు, కామక్రోధాలు ఆ మనసును దొంగిలించలేవు.

​ మన మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటూ కోరికల వైపు పరిగెడుతుంటుంది. దాన్ని నిగ్రహించడం ఎవరికైనా కష్టమే. అందుకే కవి తన చంచలమైన మనసును అమ్మవారికి అప్పగించేశాడు. శివుడి మనసునే కరిగించిన అమ్మవారు, తన మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుందని కవి నమ్మకం. మనలని కూడా అలా చేయమని ఉత్తమ సందేశం🕉️🙏🕉️

చక్కని వివరణనందించిన పతంజలి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్.

6, జులై 2026, సోమవారం

ధ్వజస్థంభం యొక్క కథ కమామిషు ... శ్రీ ఆర్వీయస్ సుబ్రహ్మణ్యం.

0 comments

జైశ్రీరామ్. 

ధ్వజస్థంభం పుట్టుక

     మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

     భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

     ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

     శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

     మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాఽస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

శ్రీ ఆర్వీయస్ సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు.

జైహింద్.

మూకపంచశతి రచించిన మూకకవి అనఁబడే మూక శంకరుల వృత్తాంతము.

0 comments

జైశ్రీరామ్.

మూకకవి (మూక శంకరుడు) కాంచీ కామకోటి పీఠానికి చెందిన 20వ పీఠాధిపతి మరియు గొప్ప భక్త కవి. పుట్టుకతోనే మూగవాడైన ఆయన, కాంచీపురము లోని శ్రీ కామాక్షీ అమ్మవారి అనుగ్రహం వల్ల మాటలు వచ్చి, ఆ తల్లి పై 500 శ్లోకాలతో అద్భుతమైన ‘మూక పంచశతి’ అనే స్తోత్ర గ్రంథాన్ని రచించారు. 

ఈ గ్రంథం ఐదు శతకాలుగా విభజించబడింది : 

1.ఆర్యా శతకం

2.పాదారవింద శతకం

3.స్తుతి శతకం

4.కటాక్ష శతకం

5.మందస్మిత శతకం 


మూక శంకరుల జీవిత చరిత్ర

మూక శంకరులు (మూకకవి) అమ్మవారి పరమ అనుగ్రహంతో గొప్ప పీఠాధిపతిగా మరియు అద్భుతమైన మహాకవిగా మారిన వృత్తాంతం ఆయన జీవిత చరిత్ర. 

జననం మరియు బాల్యం

తల్లిదండ్రులు: కాంచీపురానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, గణితజ్ఞుడైన శ్రీ విద్యావతి  మరియు ఆయన ధర్మపత్ని.వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. 

పుట్టుకతోనే మాట్లాడే మరియు వినే శక్తి లేకపోవడంతో ఈయనను అందరూ ‘మూక’ (మూగవాడు) అని పిలిచేవారు. 

మాట్లాడలేకపోయినా, ఈయన ప్రతిరోజూ కాంచీపురంలోని [శ్రీ కామాక్షీ అమ్మవారి] ఆలయానికి వెళ్ళి, అమ్మవారి సన్నిధిలో సాష్టాంగ నమస్కారాలు చేస్తూ గడిపేవారు. 

అమ్మవారి అనుగ్రహం – కవితా ప్రవాహం

ఒకరోజు ఆలయంలో మూకకవి ఒక పక్కన ధ్యానంలో ఉండగా, కామాక్షీ అమ్మవారు ఒక సాధకుడిని అనుగ్రహించడానికి ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షమయ్యారు. 

అమ్మవారు తాంబూలాన్ని చర్వణం చేస్తూ (నములుతూ), ఆ తాంబూల ప్రసాదాన్ని మొదట అక్కడ ఉన్న వేరొక సాధకుడికి ఇచ్చారు.

కానీ ఆ సాధకుడు ఆమెను సామాన్య స్త్రీగా భావించి, ఎంగిలి అనే భ్రమతో ఆ ప్రసాదాన్ని తీసుకోలేదు.వెంటనే జగన్మాత ఆ తాంబూల ప్రసాదాన్ని మూగవాడైన ఈ బాలుడికి అందించగా, ఆయన దానిని పరమ పవిత్రమైన మహా ప్రసాదంగా భావించి స్వీకరించారు.ఆ మరుక్షణమే అమ్మవారి అనుగ్రహంతో ఆయన నాలుకపై బీజాక్షరాలు అక్షరాలై, మూగవోయిన నోటి నుండి అద్భుతమైన కవితా ప్రవాహం పెల్లుబికింది. ఆశువుగా అమ్మవారిని స్తుతిస్తూ 500 శ్లోకాలతో కూడిన ప్రసిద్ధ ‘మూక పంచశతి’ గ్రంథాన్ని రచించి మహాకవి అయ్యారు.పీఠారోహణ మరియు గురు పరంపరబాలుడిలోని అపారమైన దైవజ్ఞానాన్ని, పాండిత్యాన్ని గమనించిన నాటి కాంచీ కామకోటి పీఠం 19వ పీఠాధిపతి శ్రీ మార్తాండ విద్యాఘన సరస్వతి స్వామివారు, ఈయనకు సన్యాస దీక్షను ఇచ్చారు.సన్యాస ఆశ్రమంలో ఈయనకు ‘శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి’ (మూక శంకరులు) అనే నామకరణం చేసి, కాంచీ పీఠానికి 20వ జగద్గురువులుగా అభిషేకించారు.పీఠాధిపతి అయిన తర్వాత ఆయన వేద వేదాంగాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు.మహిమలు మరియు వైభవంశ్రీ మూక శంకరులు ఎంతటి తపోసంపన్నులంటే, ఆయన సంకల్పం మాత్రంచేతనే గుర్రాలను కాసేవారు, ఏనుగులను చూసుకునే సామాన్యులు సైతం గొప్ప పండితులుగా, కవులుగా మారిపోయేవారు. కాశ్మీర రాజైన మాతృగుప్తుడు, ప్రవరసేనుడు వంటి మహారాజులు సైతం ఈయనను దర్శించుకుని సేవలు చేసుకునేవారు. వీరు దాదాపు 39 సంవత్సరాల పాటు పీఠాన్ని అధిష్టించి, లోకకల్యాణాన్ని గావించారు.శ్రీ మూక శంకరుల జీవితానికి సంబంధించిన ఏ ఇతర అంశాన్ని మనం మరింత లోతుగా చర్చిద్దాం?మూక పంచశతి విశిష్టత మరియు పారాయణ నియమాలుఆయన రచించినట్లుగా చెప్పబడే ఇతర గ్రంథాలు (ఉదాహరణకు: ప్రాచీన శంకర విజయము).

జైహింద్.