గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2014, ఆదివారం

అరాజకే హి లోకే உస్మిన్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అరాజకే హి లోకే స్మిన్ సర్వతో విద్రుతే భయాత్
రక్షార్థ మస్య సర్వస్య రాజాన మసృజత్ప్రభుః. 

గీ. రాజు లేనట్టి రాజ్యాన ప్రజలు జడుచు 
కాన రాజ్యంబుఁ గావగ జ్ఞాన భరితు 
రాజుగా చేసె రక్షింప ప్రజలనెల్ల. 
ఎంత దయనీయుడోకదా యీశ్వరుండు!
భావము. రాజ్యంలో రాజు లేకపోతే ప్రజలు అన్నివిధాలా భయంతో విచలితులౌతారు. అందుకే లోకమంతటినీ రక్షించటానికి దైవం రాజును సృష్టించాడు. 
జైహింద్.

30, ఆగస్టు 2014, శనివారం

ఆదౌ చిత్తే తతఃకాయే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆదౌ చిత్తే తతఃకాయే సతాం సంపద్యతే జరా
అసంతాతు పునః కాయే నైవ చిత్తే కదాచ న. 

గీ. సుజన పాళికి వార్ధక్య శోభ మదికి 
చిన్నతనమునె వచ్చును మన్ననముగ.  
వరసు చేతనె పాపికి వచ్చు ముదిమి. 
జ్ఞానమున రాదు వృద్ధత, కానరేల?
భావము. సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది. దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యంరాదు.   (పెద్దరికం రాదు). 
జైహింద్.

29, ఆగస్టు 2014, శుక్రవారం

వినాయక చతుర్థి సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు పరమ పూజ్యమైన వినాయక చతుర్థి. గణ నాథుఁడైన 
ఆ విఘ్నరాజు యొక్క శుభాశీస్సులు కోరుకొనే భక్తజనులందరికీ అందే రోజు. 
ఈ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు
ఆ పార్వతీనందనుని కరుణా కటాక్ష వీక్షణలు మీపై ప్రసరింపఁబడాలని మనసారా కోరుకొంటున్నాను.
శ్రీ గణనాథ! నీకృపను శ్రీకర భక్తుల గావుమయ్య! స
ద్యోగము కూర్చుమయ్య! మహితోజ్వల జీవన భాగ్య మిచ్చి, దు
ర్యోగము బాపుమయ్య! కరుణోజ్వల సజ్జన కల్పవల్లివై
నీ గజ వక్త్రశోభ మది నిల్పి, ప్రశాంతిని కొల్ప వేడెదన్.
జైహింద్.

28, ఆగస్టు 2014, గురువారం

కోஉన్ధో ? యోஉకార్యరతః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. కోన్ధో ? యోకార్యరతః , కో బధిరో ? యో హితాని న శ్రుణోతి 
కో మూకో ? యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి. 
ఆ. చేయ రాని పనులు చేసిన గ్రుడ్డియే. 
హితము వినని వాఁడు క్షితిని చెవిటి. 
పలుక వలయు చోట పలికమి మూగయే. 
తెలిసి మసలుకొనుడు తెలివి చూపి.
భావము. ఎవడు గ్రుడ్డివాడు? కానిపనులు చేసేవాడు! ఎవడు చెవిటివాడు? హితవాక్యాలు విననివాడు! ఎవడు మూగవాడు ? తగిన సమయంలో ప్రియభాషణం చేయటం తెలియనివాడు. 
జైహింద్.

27, ఆగస్టు 2014, బుధవారం

అపహాయ నిజం కర్మ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః
తే హరి ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మయద్ధరేః. 
గీ. తనదు ధర్మము విడనాడి యనవరతము
కృష్ణు తలచునతడు ద్వేషి కృష్ణునకును. 
ధర్మ సంస్థాపనార్థియై తనకు తానె 
యెన్ని జన్మలనెత్తెనాపన్నబంధు.
భావము. తాము చేయవలసిన కర్మలను ఆచరింపక “కృష్ణా, కృష్ణా ” అంటూ కూర్చునేవారు - హరిద్వేషులు, పాపులు అవుతారు. హరి - ధర్మకార్యాచరణకే అనేక జన్మలను(అవతారాలను) ధరించాడుకదా.  
జైహింద్.

వృద్ధకాలే మృతా భార్యా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. వృద్ధకాలే మృతా భార్యా బంధుహస్తే గతం ధనం
భోజనం చ పరాధీనం తిస్రః పుంసాం విడంబనాః. 
గీ. వృద్ధ వయసున నర్థాంగి విడిచి చనుట, 
ధనము బంధుల పాలయి తల్లడిలుట, 
భోజనార్థమన్యులపంచ ముదిమి నుంట, 
మనుజునకు దుఃఖ హేతువుల్ మాన్యులార!
భావము. ముసలితనములో భార్య మరణించుట , ధనమంతయు బంధువుల వశమగుట, భోజనమునకై ఇతరులపై ఆధారపడుట అనే మూడూ మానవులకు దుఃఖహేతువులు. 
జైహింద్.

26, ఆగస్టు 2014, మంగళవారం

బహిర్భ్రమతి యః కశ్చిత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. బహిర్భ్రమతి యః కశ్చిత్ త్యక్త్వా దేహస్థ మీశ్వరం
సో గృహపాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతిః. 
ఆ. దేహమందునున్న దేవుని కానక 
వెదకు నచటనిచట వెఱ్ఱివాఁడు. 
ఇంటనున్నభుక్తినెఱుగక మూర్ఖుఁడు 
బైట ముష్టి కొఱకు భ్రమయునట్లు.
భావము. తన దేహమందే ఉన్న దైవాన్ని వదలి, బయట దైవంకోసం వెతుకుతూ తిరిగేవాడు , తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచి పరగృహాల్లో బిచ్చమెత్తుకునే మతిహీనుడు. 
జైహింద్.

25, ఆగస్టు 2014, సోమవారం

దుర్జన వచనాంగారైర్ధగ్నోஉపి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దుర్జన వచనాంగారైర్ధగ్నోపి న విప్రియం వదత్యార్యః
అగరు రపి దహ్యమానః స్వభావగంధం పరిత్యజతి కిం ను ? 

గీ. దురితు కఠినోక్తులన్ మది మరిగియు నిల 
సుజనుడప్రియంబులు పల్కఁ జూడడు కద!
దహన మౌచును గంధపు తరువు తనదు 
మంచి వాసన పంచును. మహితమదియె.
భావము. దుర్జనుల వచనాగ్నితో దహింపబడినా సజ్జనుడు అప్రియమైన మాటలు మాట్లాడడు. అగరువత్తి తాను కాలిపోతున్నా తన సహజసిద్ధమైన సుగంధాన్ని వదలుతోందా ఏమి? 
జైహింద్.

24, ఆగస్టు 2014, ఆదివారం

సతాం ధనం సాధుభి రేవ భుజ్యతే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సతాం ధనం సాధుభి రేవ భుజ్యతే
దురాత్మభి ర్దుశ్చరితాత్మనాం ధనం
ఆ. శుకాదయ శ్చూతఫలాని భుంజతే 
భవంతి నింబాః ఖలు కాక భోజనాః. 
మంచి వారి ధనము మంచి వారికి చెందు, 
చెడ్డ వారి ధనము చెడుగుఁ జెందు. 
ఆమ్రఫలము చిలుక లారగించుచునుండు. 
కాకి వేప పండ్లె గతుకుచుండు.
భావము. సజ్జనుల సంపద సజ్జనులకే భుక్తమౌతుంది. దుర్జనుల సంపద దుర్జనులకే లభిస్తుంది. మామిడి పండ్లను చిలుకలు, వేప పండ్లను కాకులు భుజిస్తాయికదా! 
జైహింద్.

23, ఆగస్టు 2014, శనివారం

తస్కరేభ్యో నియుక్తేభ్యః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. తస్కరేభ్యో నియుక్తేభ్యః శత్రుభ్యో నృపవల్లభాత్ 
నృపతిర్నిజ లోభాచ్చ ప్రజా రక్షేత్ పితేవ హి. 

గీ. తస్కరుల నుండి, ఉద్యోగి దళమునుండి, 
శత్రువులనుండి, తన ప్రియ సఖుల నుండి, 
స్వీయ లోభము నుండియు ప్రియము తోడ 
జనుల రక్షింప వలె రాజు జనకుని వలె.
భావము. రాజు – దొంగల నుండి, తాను నియమించిన ఉద్యోగుల నుండి, శత్రువుల నుండి, తనకు ఇష్టమైన వారి నుండి, స్వీయ లోభము నుండి ప్రజలను కన్నతండ్రి వలె కాపాడాలి. 
జైహింద్.

22, ఆగస్టు 2014, శుక్రవారం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 505 వ పట్టాభిషేక దినోత్సవ, డా.కోడూరి సాహితీ పురస్కార ప్రదానోత్సవ చిత్రాళి.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 7-8-2014న శ్రీకృష్ణ దేవరాయల 505వ పట్టాభిషేక దినోత్సవము ఘనంగా జరిగింది. అనేకమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాయల వంశమునకు సంబంధించిన వారి ముమ్ముమ్ముమ్ముమ్మనవడు శ్రీకృష్న దేవరాయలు నామాకితులు ఈ సభకు విచ్చేసిన కారణంగా అందరూ చాలా ఆనందించారు. ఈ కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలికను చూడండి.
జైహింద్

21, ఆగస్టు 2014, గురువారం

వృత్తం యత్నేన సంరక్ష్యం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. వృత్తం యత్నేన సంరక్ష్యం విత్తమేతి చ యాతి చ
అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః.

క. ధనమును బ్రోచుట కంటెను 
గుణమును బ్రోచుటయె మిన్న, గుణ ధనములలో 
ధన హీనమే ప్రశస్తము
గుణ హీనముకన్న తెలియగానగు మనకున్.
భావము. ధనాన్ని కంటే ఎక్కువగా సత్ప్రవర్తనను ప్రయత్న పూర్వకంగా సంరక్షించుకోవాలి. ధనం వస్తూ, పోతూఉంటుంది. ధనం క్షీణించినవానికంటే మంచి నడవడికను కోల్పోయినవాడే చెడిన వాడనిపించుకుంటాడు. 
జైహింద్.

20, ఆగస్టు 2014, బుధవారం

విజయవాడ వాస్తవ్యులకు విన్నపము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మీరు నిర్వహిస్తున్న విందు వినోదాలలో ఆహార పదార్థములు మిగిలిపోయినచో మీరు మాకు తెలియజెయ్యండి. ఆకలితో అలమటిస్తున్న అనేక మంది అన్నార్తులకు ఆ ఆహార పదార్థాలు చేర్చి అందించడం ద్వారా వారి అన్నార్తిని అపూటకు తీర్చగలుగుతాము. 
ఆహారం పరబ్రహ్మ స్వరూపం. దానిని సద్వినియోగ పరచడం మానవును కనీస ధర్మంగా భావించ వలసి ఉంది.
దయ చేసి సహకరించగలరని ఆశిస్తున్నాను.
జైహింద్.


మూర్ఖా యత్ర న పూజ్యంతే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. మూర్ఖా యత్ర న పూజ్యంతే, ధాన్యం యత్ర సుసంచితం
దంపత్యో కలహం నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః.
 
క. ఎక్కడ కలహములుండవొ, 
యెక్కడ దుర్గుణు లపూజ్య హీనులగుదురో, 
యెక్కడ ధాన్యము దాచెద 
రక్కడకే సిరియె చేరునడగక ముందే.
భావము. ఎక్కడ మూర్ఖులు పూజింపబడరో, ఎక్కడ ధాన్యం నిలువచేయబడుతుందో, ఎక్కడ దంపతులకు కలహం ఉండదో అక్కడకు సంపదలు తమంతట తాముగా వస్తాయి. 
జైహింద్.

19, ఆగస్టు 2014, మంగళవారం

న నిందాం న స్తుతిం కుర్యాత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. న నిందాం న స్తుతిం కుర్యాత్ , న కించి న్మర్మణి స్పృశేత్
నా 
 తివాదీ భవే త్తద్వత్, సర్వత్రైవ సమో భవేత్. 

క. నెగడకుమెవ్వరినైనను 
పొగడకుమెవ్వరినికూడ, పొందని పలుకుల్
తగదెప్పుడు పలుక పరుల, 
సుగుణంబులతోడ మెలగి శోభిల్లుమిలన్.
భావము. ఎవరినీ నిందించకూడదు, పొగడకూడదు, ఎకసక్కెపు మాటలు మాట్లాడకూడదు. అతి భాషణమూ కూడదు.అన్నిటియందు ,అందరియందు సమభావం కలిగి ఉండాలి. 

జైహింద్.

18, ఆగస్టు 2014, సోమవారం

శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భముగా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
తల్లి ఒడిలోన చల్లగ ఉల్లమలర - సౌఖ్యమందెడి కృష్ణయ్య సజ్జనాళి
నిన్ను కనుగొంచు పొంగుదు రెన్నుచుందు - రన్ని వేళల నీ దయా మన్ననముల.
నీవు జన్మించి భూమిపై నీ ప్రజాళి - కష్ట సుఖములు గాంచిన కన్న తండ్రి!
నిన్ను నమ్మిన భక్తుల నెన్నుమయ్య - నిరతమును కాచి రక్షించు నిరుపమముగ.
తల్లి ఒడినీకు సర్వమ్ము నల్లనయ్య! - యెల్ల భక్తులు నీ ఒడి నుల్ల మలర
సేదతీరగ నెంతురు మోదము గని - కష్టములు బాపి బ్రోవుమా! కన్నతండ్రి!
జైహింద్.

స్వయం తథా న కర్తవ్యం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. స్వయం తథా న కర్తవ్యం స్వగుణాఖ్యాపనం పునః
స్వగుణాఖ్యాపనం యుక్త్యా పరద్వారా ప్రయోజయేత్. 

క. తమ సద్గుణ సంపదలను 
ప్రముదంబున తా వచింప రాదు జగతిలో. 
తమగుణముల నితరులు కని 
ప్రముదంబుగ పొగడ వలయు. భవ్యంబదియే.
భావము. ఎవరును తమ సద్గుణములను మరల మరల తామే చెప్పుకొనకూడదు. యుక్తిగా పరులద్వారా ఆ గుణాలు లోకానికి తెలియజేయాలి. 
జైహింద్.

17, ఆగస్టు 2014, ఆదివారం

గృహస్థస్తు యదా పశ్యేత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. గృహస్థస్తు యదా పశ్యేత్ వళీపలితమాత్మనః
అపత్యస్యైవ చా  పత్యం తదారణ్యం సమాశ్రయేత్. 

క. మనుజుఁడు వార్ధక్యంబును 
గని, మనుమలఁ గని, వనములఁ గడపెడు పగిదిన్ 
తనయింటను గడుపగవలె 
తన తగులములను విడుచుచు, ధర్మంబిదియే.
భావము. గృహస్థు ఎపుడు తన శరీరముపై ముడతలను, తల నెరసిపోవుటను గమనిస్తాడో, తన సంతానానికి పుట్టిన సంతానాన్ని చూస్తాడో అపుడే వనవాసాన్ని ఆశ్రయించాలి. (వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలి) 
జైహింద్.

16, ఆగస్టు 2014, శనివారం

అరావప్యుచితంకార్యం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే 
ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః. 

గీ. అతిథిదేవుఁడు పాత్రుడై యలరు చున్న
తృవైనను మన్నించి చక్క గనుము.
నరకవచ్చిన వానిపైకరుణ జూపి
నీడ నిచ్చునువృక్షము నిరుపమముగ.
భావము. ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి. తనను నరకటానికి వచ్చిన వానికి కూడా చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా. 
జైహింద్.

15, ఆగస్టు 2014, శుక్రవారం

68 వ భాతర స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.

అరవై ఎనిమిదవ భారత స్వాతంత్ర్యదినీత్సవం సందర్భముగా యావద్భారతాంబ సంతతికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
జైహింద్.

యేనాస్య పితరో యాతాః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యేనాస్య పితరో యాతాః,యేన యాతాః పితామహాః
తేన యాయా త్సతాం మార్గం , తేన గచ్ఛన్నరిష్యతే. 

గీ. సుజనులౌ తల్లిదండ్రులు చూపు త్రోవ 
విడువబోకుండ నడచిన ప్రీతితోడ 
హానిఁ గొలుపదదెన్నడు, హాయి గొలుపు. 
మంచి మార్గంబు మనకద్ది మాన్యులార!
భావము. ఏమార్గములో తమ తండ్రులు, తాతలు వెళ్ళారో , ఆ సన్మార్గాన్నే అనుసరించిన వారికి ఏ హాని జరుగదు. 
జైహింద్.

14, ఆగస్టు 2014, గురువారం

ఉత్సాహసంపన్నమదీర్ఘసూత్రం....మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఉత్సాహసంపన్నమదీర్ఘసూత్రం
క్రియావిధిజ్ఞం వ్యసనేష్వసక్తం 
శూరం కృతజ్ఞం దృఢసౌహృదం చ
సిద్ధిః స్వయం గచ్ఛతి వాసహేతోః. 
గీ. కనఁగ నౌత్సాహి, నేర్పరి, ఘన సుగుణుఁడు,
సత్ కృతజ్ఞుఁడు, శౌర్యుఁడు, సమత, స్నేహ 
కలితుఁడైనట్టి వానికి కలుగు జయము. 
కార్య సంసిద్ధి యాతని ఘనత ఫలము.
భావము. ఉత్సాహవంతుడు, పనులలో ఆలస్యం చేయనివాడు, పనిసాధించే పద్ధతి తెలిసినవాడు, చెడు అలవాట్లయందు ఆసక్తి లేనివాడు, శూరుడు, కృతజ్ఞతా బుద్ధికలవాడు, దృఢమైన స్నేహస్వభావం కలవాడు అయితే, అతనికి కార్యసిద్ధి తనంతట తానే కలుగుతుంది. 
జైహింద్.

13, ఆగస్టు 2014, బుధవారం

షోడశాబ్దాత్పరం పుత్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. షోడశాబ్దాత్పరం పుత్రం,ద్వాదశాబ్దాత్పరం స్త్రియం
న తాడయే దుష్టవాక్యైః, పీడయే న్న స్నుషాదికమ్. 
గీ. పదియునారేండ్లు పైపడ్డ మృదుల సుతుని, 
పదియు రెండేండ్లు పైబడ్డ మధుర సుతను 
గౌరవంబుగ చూచుచు ఘనతఁ గనుఁడు. 
కోడలిని గను సుత వోలె. కులము మెచ్చ.
భావము. పదహారు సంవత్సరాల వయసున్న కుమారుని, పన్నెండు సంవత్సరాల కుమార్తెను దుష్టభాషణలతో దండింపకూడదు. కోడళ్ళు మొదలైనవారిని పీడింపరాదు. 
జైహింద్.

12, ఆగస్టు 2014, మంగళవారం

యేషాం తపశ్శ్రీ రనఘా శరీరే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యేషాం తపశ్శ్రీ రనఘా శరీరే, 
వివేచికా చేతసి తత్త్వ బుద్ధిః
సరస్వతీ తిష్ఠతి వక్త్ర పద్మే 
పునంతు తే  ధ్యాపకపుంగవా నః. 
గీ. ఘన తపశ్శోభ దేహాన కలుగు ఘనుఁడు, 
ధరణి సంపూర్ణ సువివేక తత్వ వ్వేత్త, 
వాణివశియించు ముఖపద్మభాగ్యశాలి,
గురువు పదమున కర్హుఁడు ధరణిపైన.
భావము. ఎవరి శరీరమునందు నిర్మలమైన తపశ్శోభ ఉంటుందో, ఎవరి మనస్సులో వివేచనతో కూడిన తత్త్వ బుద్ధి ఉంటుందో, ఎవరి ముఖ పద్మమునందు సరస్వతీదేవి కొలువై ఉంటుందో అట్టి అధ్యాపకశ్రేష్ఠులు మమ్ము పునీతులను చేయుదురుగాక. 
జైహింద్.

11, ఆగస్టు 2014, సోమవారం

అవ్యాకరణమధీతం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అవ్యాకరణమధీతం , భిన్న ద్రోణ్యా తరంగిణీ తరణం
భేషజమపథ్య సహితం త్రయమిదమకృతం వరం న కృతమ్.  
గీ. పూర్ణ విద్యను నేర్వమిన్ పోకు చదువ. 
భిన్నమైనట్టి పడవలో వెళ్ళఁ బోకు. 
పత్యమును చేయ లేనిచో వలదు మందు.
పూర్ణ మనమున పని చేయఁ బూన వలయు.
భావము. వ్యాకరణాన్నిసమగ్రంగా చదవకపోవటం, పగిలిన పడవతో నదిని దాటాలనుకోవటం, పథ్యం లేకుండా ఔషధాన్ని సేవించాలనుకోవటం అనే మూడు పనులకు అసలు సిద్ధపడకపోవటమే మంచిది.
జైహింద్.

10, ఆగస్టు 2014, ఆదివారం

దోషభీతే రనారంభః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దోషభీతే రనారంభః త త్కాపురుష లక్షణం
కిమజీర్ణ భయాద్భ్రత ! భోజనం పరిహీయతే? 
గీ. దోష భీతిచే పని చేయ తోపకునికి 
దుష్ట దుర్మార్గ వర్తన. దోష మరయ. 
తిన నజీర్ణ దుర్భయమొంది తిండిమాను 
జనులు భువి నుందురా కన? సదయులార. 
భావము. ఏదైనా దోషం జరుగుతుందేమో అనే భయంతో ఏ పనినీ ప్రారంభించకపోవటం దుష్టుని లక్షణం. అజీర్ణం చేస్తుందేమో అనే భయంతో ఎవడైనా భోజనం మానుకుంటాడా? 
జైహింద్.

9, ఆగస్టు 2014, శనివారం

అర్థేన కిం కృపణహస్త గతేన తేన ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అర్థేన కిం కృపణహస్త గతేన తేన ?
రూపేణ కిం గుణ పరాక్రమ వర్జితేన ?
జ్ఞానేన కిం బహుజనైః కృత మత్సరేణ?
మిత్రేణ కిం వ్యసనకాల పరాఙ్ముఖేన ? 
గీ. లోభియైనట్టి ధనికుచే లాభమేమి? 
సుగుణ, ధైర్య విహీనుని శోభ యేల? 
కలిత విద్వేష పూర్ణుని జ్ఞానమేల? 
సమయమప్పుడు నిలువని సఖ్యుఁ డేల?
భావము. లోభి చేతిలో ఉన్న ధనం వల్ల ఏమి ప్రయోజనం ? సద్గుణము, పరాక్రమము లేని వాని అందము వల్ల ఏమి ప్రయోజనం ? ఎందరియందో ద్వేషం పెంచుకొనే వాని జ్ఞానం వల్ల ఏమి ప్రయోజనం ?ఆపద సమయంలో ముఖం చాటుచేసే స్నేహితుని వల్ల ఏమి ప్రయోజనం ? 
జైహింద్.

8, ఆగస్టు 2014, శుక్రవారం

ఆంధ్రామృత పాఠకులకు శ్రావణ శుక్రవారం సందర్భముగా శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.
ఈ రోజు మంగళప్రదమైన సర్వ సంపత్ప్రదమైన శ్రావణ శుక్రవారం. ఈ సందర్భముగా విష్ణు వక్షస్థలాలయయైన శ్రీమన్మహాలక్ష్మీదేవికి హృదయ పూర్వకముగా నమస్కరిస్తూ, సహృదయ ఆంధ్రామృత పాఠకాళికి,  సజ్జనాళికి, సుహృన్మిత్రపాళికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శ్రావణ లక్ష్మికిన్ శుభము, శ్రావణ లక్ష్మిని పూజ చేయు సద్
భావన పూర్ణ మిత్రులకు, పండిత కోటికి, స్త్రీజనాళికిన్,
భావిని వెల్గు బిడ్డలకు, బంధు జనాళికి, భారతాంబకున్,
శ్రీవరలక్ష్మిదీవనలు క్షేమము కూర్చుచు తృప్తి కొల్పుతన్.
జైహింద్.

దీపో భక్షయతే ధ్వాంతం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలం చ ప్రసూయతే 
యదన్నం భక్షయతే నిత్యం జాయతే తాదృశీ ప్రజా. 
క. దీపము చీకటిఁ దినుచును 
నేపుగ కాటుకను గను. తినేదే పగిదో  
యాపగిది ప్రభవ మగు కన. 
దీపించెడి నీతిఁ గను సుధీవరులారా!
భావము. దీపం చీకటిని భక్షిస్తుంది. కాటుకను కంటుంది.ఎట్టి ఆహారం నిత్యమూ భక్షిస్తే ,అట్టి సంతానమే కలుగుతుంది. 
జైహింద్.

7, ఆగస్టు 2014, గురువారం

"పండిత" శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు ఇక మనకు లేరు.

3 comments

ఓం నమశ్శివాయ.


అష్టావధాని "పండిత" శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారు  
ఉ:8 గం లకు విశాఖపట్టణంలో శివైక్యం చెందారు న్న వార్తకు దిగ్భ్రాంతి చెందాను.
'పండిత' నేమాని రామజోగి సన్యాసిరావు 'అష్టావధాని'  ఇకలేరు.
ప్రముఖ సాహిత్యవేత్త, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, కవి, పండితులు, అష్టావధాని శ్రీ నేమాని రామజోగిసన్యాసిరావుగారు (70 సంవత్సరాలు) గురువారం ఉదయం 8 గంలకు పరమపదించారు. వీరి సతీమణి బాలాత్రిపురసుందరి కూడా రచయిత్రి. వీరికి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు. సన్యాసిరావుగారు కంపెనీ సెక్రటరీగా అనేకప్రాంతాల్లో పనిచేసి విశ్రాంతి తీసుకున్నారు. చిన్నప్పటి నుండి పద్యరచనమీద వీరికి పట్టుంది. శ్రీరావూరి వేంకటేశ్వరులుగారి ప్రోత్సాహంతో అవధానాలు ప్రారంభించి 25 అష్టావధానాలు చేశారు. వేదాంతశాస్త్రంలో దిట్టతనం, ఛందో వైవిధ్యంతో పద్యంచెప్పగల చేవ వీరి సొంతం. చతుర్విధ కవిత్వంలో వీరికి ప్రవేశముంది. సుప్రభాతం, వాక్ప్రశస్తి, శివానందలహరి, శ్రీగిరిమల్లికార్జున శతకం, సర్వమంగళాస్తోత్రం, ఆనందమయి, శ్రీ లక్ష్మీనృసింహ శతకం మెదలయిన రచనలతో పాటు ఎన్నో పద్యఖండికలను వెలువరించారు. 'ఆచార్య సార్వభౌమ' వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సాహచర్యంతో సంస్కృత అధ్యాత్మరామాయణాన్ని స్వతంత్రమైన బృహత్తర పద్యకావ్యంగా 2400 పద్యాలుగా తెలుగులోకి అనువదించి ఆంధ్రసాహిత్యచరిత్రలో చెరగని ముద్రవేసుకున్నారు. చిత్రకవిత్వంలో వీరికి వీరే సాటి. వీరు ఆశుకవి. సుకవి. విశాఖసాహితి వీరిని 'పండిత' బిరుదుతో సత్కరించింది. అమెరికా, లండన్‌ మొదలయిన దేశాల్లో ఆధ్యాత్మిక, సాహిత్యోపన్యాసాలతో మన సంస్కృతీసంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారు. 
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకొంటున్నాను.
శివశివా.

త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః కిమన్యైర్గుణరాశిభిః 
త్యాగాజ్జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాః 
గీ. త్యాగమొక్కటేశ్లాఘింప తగిన గుణము. 
గుణములితరము లెన్నున్నగొప్ప కాదు. 
శిలలు, వృక్షముల్, పశువులు చెలగు గాదె 
త్యాగగుణమున. కాంచుడీ తత్వమరసి.
భావము. త్యాగగుణం ఒక్కటే మెచ్చదగినది. మిగిలిన గుణసమూహం ఎంతఉంటే ఏమి?ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు ఈ త్యాగం వల్లనే పూజింపబడుతున్నాయి.
జైహింద్.

6, ఆగస్టు 2014, బుధవారం

భుంజానో న బహు బ్రూయాత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. భుంజానో న బహు బ్రూయాత్ , న నిందేదపి కంచన
జుగుప్సిత కథాం నైవ శృణుయాదపి నా వదేత్. 

గీ. భోజనము  చేయునప్పుడు మూగ వగుము. 
పరుల నింపఁ బోకుము. పరమ రోత 
కొలుపు మాటలు వినకుము పలుకఁ బోకు. 
శాంత మతివౌచు భుజియింప సత్ఫలమిడు.
భావము. భోజన సమయంలో అతిగా మాట్లాడకూడదు. ఎవరిని గూర్చియు నిందచేయరాదు. రోత కలిగించే విషయాలను వినకూడదు. ప్రస్తావించకూడదు. 
జైహింద్.

5, ఆగస్టు 2014, మంగళవారం

గురవో బహవస్సంతి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాః
స గరుః దుర్లభో యస్తు ,శిష్య హృత్తాపహారకః. 

గీ. శిష్య విత్తాపహారులై చెలగునట్టి 
గురువులుందరనేకులు, కూర్మిఁ జేరు 
శిష్య హృదయార్తి తొలగించి చెలగునట్టి 
గురువులరుదుగనుందురు నిరుపమముగ.
భావము. శిష్యుల ధనమును కాజేయు గురువులు ఎందరో ఉన్నారు. కానీ, వారి హృదయార్తిని తొలగించు గురువు దుర్లభుడు కదా. 
జైహింద్.

3, ఆగస్టు 2014, ఆదివారం

అకామాన్ కామయతి యః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అకామాన్ కామయతి యః, కామయానాన్ పరిత్యజేత్
బలవంతం చ యో ద్వేష్టి తమాహుః మూఢచేతసమ్. 

క. ఇష్టపడని వారినిష్టపడుచు, తన 
నిష్టపడెడివారినిష్టపడక, 
బలునితోడ వైరములు పెట్టుకొని చెడు 
మూర్ఖుడెపుడు. కనుడు పూజ్యులార!
భావము. ఎవడు తనను ఇష్టపడనివారిని ఇష్టపడతాడో, ఎవడు తనను ఇష్టపడేవారిని వదలుకుంటాడో, ఎవడు బలవంతునితో వైరం పెట్టుకుంటాడో వానిని మూఢాత్ముడు అంటారు. 
జైహింద్.

2, ఆగస్టు 2014, శనివారం

ధృతిః క్షమా దమోஉస్తేయం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ధృతిః క్షమా దమోస్తేయం శౌచమింద్రియనిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్.

గీ. ధైర్యమోర్పును నిష్టయు, తరళ విద్య, 
సత్యమును, దొంగ కాకుంట, సద్గుణంబు,
కోపహీనతేంద్రియజయ గుణము మరియు
శౌచమనుపది ధర్మలక్షణములరయ.
భావము. ధైర్యము,ఓర్పు, నిష్ఠ, దొంగతనము చేయకుండుట, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపరాహిత్యము - ఈ పది ధర్మలక్షణాలు. 
జైహింద్.

1, ఆగస్టు 2014, శుక్రవారం

యౌవనం జీవనం చిత్తం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. యౌవనం జీవనం చిత్తం ఛాయా లక్ష్మీశ్చ స్వామితా
చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్. 
గీ. యౌవనము, నీడ, మనసును, జీవితమును, 
సంపద, ప్రభుత యనునారు చంచలమను 
నిజము నెఱుగుచు సద్వర్తని రతుఁడగుచు 
ధర్మ మార్గము విడఁ బోడు ధన్య జీవి.
భావము. యౌవనము, జీవితము, మనస్సు, నీడ, సంపదలు, ప్రభుత్వము అను ఆరును చంచలమైనవని గ్రహించి మానవుడు ధర్మమునందు ఆసక్తుడు కావాలి. 
జైహింద్.