గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2014, సోమవారం

యద్దదాసి విశిష్టేభ్యో ...మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments


జైశ్రీరామ్. 
శ్లో. యద్దదాసి విశిష్టేభ్యో యచ్చాశ్నాసి దినే దినే
తత్తే విత్తమహం మన్యే శేషమన్యస్య రక్షసి.
గీ. సజ్జనులకిచ్చు ద్రవ్యము సద్ధనంబు
పొట్ట నింపెడి ధనమును పూజ్య ధనము.
మిగులు ధనమది వ్యర్థంబు పగలు రేపు
ధనము సత్కార్యములకీయ ధన్యతనిడు.  
భావము. ఏది ఒక విశిష్టవ్యక్తికి ఇవ్వబడుతుందో, ఏది దినదినమూ ఆహారంగా స్వీకరింపబడుతుందో అదే అసలైన ధనమని భావించాలి. మిగిలినది అన్యులను రక్షించటానికే !(అది సజ్జనులకూ దక్కదు, తనకూ దక్కదు) 

జైహింద్.  

సంత ఏవ సతాం నిత్యం ఆపదుద్ధరణక్షమాః...మేలిమి బంగారం మన సంస్కృతి, 216.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. సంత ఏవ సతాం నిత్యం ఆపదుద్ధరణక్షమాః
గజానా పంకమగ్నానాం గజా ఏవ ధురంధరాః. 
గీ. మంచివారిని కాపాడ మంచివారె                                                                      
తగుదురిలలోన తెలియుడీ! ధరణి పైన 
బురదఁ జిక్కిన నేనుగున్ బురద నుండి 
కావ గలిగిదేనుగే ఘన తరముగ.
భావము. ఎల్లప్పుడూ సజ్జనుల ఆపదలను తొలగించటానికి సజ్జనులే సమర్థులు. బురదలో దిగబడిన ఏనుగునుఏనుగులే బయటకు లాగగలుగుతాయికదా
జైహింద్. 

29, జూన్ 2014, ఆదివారం

గంగా పాపం , శశీ తాపం...మేలిమి బంగారం మన సంస్కృతి, 215.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. గంగా పాపం , శశీ తాపం , దైన్యం కల్పతరుస్తథా 
పాపం తాపం చ దైన్యం చ హంతి సంతో మహాశయాః. 

క. పాపమును బాపు గంగయు, 
తాపంబును బాపును శశి తరు కల్పకమే 
పాపును దైన్యము. సంతులు 
పాపుదురీ మూడు మనకు వారిని చేరన్.
భావము. గంగానది పాపాన్ని ,చంద్రుడు తాపాన్ని ,కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలుగుతాయి.మహాశయులైన సజ్జనులు ఈ మూడింటిని వారే తొలగించగలరు.
జైహింద్.

28, జూన్ 2014, శనివారం

అక్రోధేన జయేత్ క్రోధం...మేలిమి బంగారం మన సంస్కృతి, 214.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధం, అసాధుం సాధునా జయేత్ 
జయేత్ కదర్యం దానేన , జయేత్ సత్యేన చానృతం. 
గీ. కోప విరహిత బుద్ధిచే కోపి మనసు,  
సాధు గుణమున దుష్టునసాధు మతిని, 
లోభినీవిని, మరియు నీ లోని సత్య 
మున నసత్యమున్ విజయించి ముక్తి గనుడు.
భావము. కోపరాహిత్యంతో కోపాన్ని జయించాలి.అసాధువును సాధు బుద్ధితో జయించాలి. లోభిని దానంతో జయించాలి. అసత్యాన్ని సత్యంతో జయించాలి.
జైహింద్.

27, జూన్ 2014, శుక్రవారం

ఉద్యోగః ఖలు కర్తవ్యః...మేలిమి బంగారం మన సంస్కృతి, 213.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఉద్యోగః ఖలు కర్తవ్యః ఫలం మార్జాలవద్భవేత్
జన్మప్రభృతి గౌర్నాస్తి పయః పిబతి నిత్యశః. 

క. ఫల సాధనకై సతమును 
సెలవెఱుగక పిల్లివోలె చెలగుట తగు, తా 
కలుగకపోయియు ఆవును 
వలసిన పాల్త్రాగు పిల్లి. భావించుడయా!
భావము. ఫలితాన్ని పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పుట్టినప్పటినుండి తనకు ఒక ఆవు లేకపోయినా, నిరంతర ప్రయత్నంతో పిల్లి ప్రతిరోజూ పాలను త్రాగుతూనే ఉంది!
జైహింద్.

26, జూన్ 2014, గురువారం

హితోపదేశం శృణుయాత్.... మేలిమి బంగారం మన సంస్కృతి, 212.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. హితోపదేశం శృణుయాత్ కుర్వీత చ యథోదితం
విదురోక్తమకృత్వాభూత్కౌరవః శోకశల్యభాక్. 
ఆ.వె. మంచి మాట చెప్ప మన్నించి వినవలె. 
వినిన దాని నాచరణను పెట్ట 
వలెను. విదురు మాట వినియు, చరింపక 
చెడిరి కౌరవులిల. చెడకు నీవు. 

భావము. హితంకోరేవారు చెప్పే మాటలను శ్రద్ధగా విని, ఆచరించాలి. కురువంశీయుడైన దుర్యోధనుడు - విదురాదులు చేసిన ఉపదేశాలను విన్నాడేగానీ , పాటింపక దుఃఖం అనుభవించాడు. 
జైహింద్.

25, జూన్ 2014, బుధవారం

భద్రం భద్రమితి బ్రూయాత్ ...మేలిమి బంగారం మన సంస్కృతి, 211.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. భద్రం భద్రమితి బ్రూయాత్, భద్రమిత్యేవ వా వదేత్
శుష్క వైరం, వివాదం చ న కుర్యాత్ కేనచిత్ సహ.
ఆ.వె. శుభము, శుభమటంచు శుభమునే పల్కుఁడు. 
శుభము పల్క నీకు శుభము కలుగు. 
శుష్క వైరములకు చూడబోవకుమయ్య. 
వ్యర్థ వాదనంబు వద్దు వద్దు.
భావము. ఎల్లప్పుడూ శుభం, శుభం అంటూనే ఉండాలి. శుభమగుగాక అనే పలుకుతూ ఉండాలి. ఎవరి తోనూ కూడా శుష్క విరోధాలూ, తగవులకు దారితీసే వితండ వాదాలు కూడదు.
జైహింద్.

24, జూన్ 2014, మంగళవారం

న్యాయార్జితధనస్తత్త్వ...మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. న్యాయార్జితధనస్తత్త్వజ్ఞాననిష్ఠోతిథిప్రియః
శాస్త్రవిత్సత్యవాదీ చ గృహస్థోపి విముచ్యతే. 
గీ. న్యాయమార్గ సంపాదన, జ్ఞాన నిష్ట, 
అతిథి ప్రీతియు, శాస్త్రజ్ఞతాసమాన 
సత్యవాక్కులనొప్పెడి సజ్జనుండు 
నయిన సంసారియును ముక్తి నందఁగలఁడు.
భావము. న్యాయంగా ధనాన్ని సంపాదించేవాడు, తత్త్వ జ్ఞాన నిష్ఠుడు, అతిథులయందు ప్రీతి కలవాడు, శాస్త్రజ్ఞుడు, సత్యం పలికేవాడు అయితే గృహస్థు కూడా ముక్తిని పొందుతాడు. (గహస్థాశ్రమం ముక్తికి ఆటంకం కాదు)
జైహింద్.

23, జూన్ 2014, సోమవారం

శతేషు జాయతే శూర:. మేలిమి బంగారం మన సంస్కృతి 210.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. శతేషు జాయతే శూర: , సహస్త్రేషు చ పండిత: 
వక్తా దశసహస్త్రేషు , దాతా భవతి వా న వా .
గీ. నూటి కొకడైన శూరుండు మేటి యుండు. 
వేయికొకడైన పండిన్ వెలయ వచ్చు. 
వక్త పదివేల కొక్కడు ప్రబల వచ్చు.
కోటి కొకడైన దాతగా పాటిఁ గలడె?
భావము. వందలమందిలో ఒక శూరుడుంటాడు. వేలమందిలో ఒక పండితుడు ఉంటాడు.పదివేలమందిలో ఒక వక్త (విశేషంగా మాట్లాడేవాడు)ఉంటాడు. కానీ, నిజమైన దాత ఉంటాడో ఉండడో !
జైహింద్.

22, జూన్ 2014, ఆదివారం

విదేశేషు ధనం విద్యా , మేలిమి బంగారం మన సంస్కృతి 209.

2 comments

జైశ్రీరామ్.
శ్లో. విదేశేషు ధనం విద్యా , వ్యసనేషు ధనం మతి: 
పరలోకే ధనం ధర్మ: , శీలం సర్వత్ర వై ధనమ్.

క. పరదేశంబున విద్యయు, 
నిరుపమ వ్యసనమున బుద్ధి, నిత్యంబగునా
పర లోకమందు ధర్మము, 
వర శీలం బెల్ల యెడల వర ధనములగున్.
భావము. విదేశములో ఉన్నప్పుడు విద్యయే ధనము. కష్టకాలములో బుద్ధియే ధనము. పరలోకములో  ధర్మమే ధనము. అన్ని ప్రదేశములందును అన్ని సమయములందును శీలమే గొప్ప ధనము.
జైహింద్.

21, జూన్ 2014, శనివారం

అర్థానామార్జనం కార్యం,...మేలిమి బంగారం మన సంస్కృతి, 231.

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అర్థానామార్జనం కార్యం, వర్థనమ్ రక్షణం తథా,
భక్ష్యమాణో నిరాదాయః సు మేరురపి హీయతే.
క. ఆర్జింప వలయు ధనమును, 
ఆర్జించిన దాని పెంచి, యరయుచు సుఖమువ్
వర్జించి రక్ష సేయుక,
ఆర్జన విడి తినిచునున్న హరియించుకుపోన్. 
భావము. ధనమునార్జించుట కర్తవ్యము. ఆ ధనమును వృద్ధి చేయుట రక్షించుట అవసరము. సంపాదించకుండా ఉన్నది తింటూ కూర్చున్నచో మేరు పర్వతమైననూ తరిగిపోవును.
జైహింద్.

20, జూన్ 2014, శుక్రవారం

అదండ్యాన్ దండయన్ రాజా...మేలిమి బంగారం మన సంస్కృతి, 230.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అదండ్యాన్ దండయన్ రాజా ,దండ్యాంశ్చైవాప్యదండయన్ 
అయశో మహదాప్నోతి నరకం చైవ గచ్ఛతి.
 
క. దోషిని శిక్షింపక ని 
ర్దోషిని శిక్షించుటరయ దోషాన్విత మీ
దోషము చేసిన నరకము. 
ధ్యాసఁ గలిగి మెలఁగుట మన ధర్మము. కనుడీ.
భావము. నిర్దోషులను దండించి,దండింప దగినవారిని దండింపని రాజు గొప్ప అపకీర్తిని పొందటమే కాక,నరకానికి పోతాడు.
జైహింద్.

19, జూన్ 2014, గురువారం

న ద్విషంతి , న యాచంతే...మేలిమి బంగారం మన సంస్కృతి, 229.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. న ద్విషంతి , న యాచంతే , పరనిందాం న కుర్వతే 
అనాహూత న చాయాంతి , తేనాశ్మనో పి దేవతాః! 
గీ. ద్వేషమెఱుగదు, యాచనతెలియదెపుడు, 
పరులనిందింప నేరదు. పరులకడకు 
పిలువ కుండగ వెళ్ళదు. వీటి వలన 
దైవమైనది రాయియు. తలపరేల?
భావము. ఎవరినీ ద్వేషించటంలేదు, ఎవరినీ యాచించటంలేదు, పరనింద చేయటంలేదు, పిలువని చోటికి వెళ్ళటంలేదు - ఈ కారణాలవల్ల శిలలుకూడా దేవతలౌతున్నాయి !
జైహింద్.

18, జూన్ 2014, బుధవారం

సంహతిః శ్రేయసీ పుంసాం . . . మేలిమి బంగారం మన సంస్కృతి, 228.

1 comments

జైశ్రీరామ్.
శ్లో.సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకైరపి 
తుషేణాపి పరిత్యక్తః తండులో న ప్రరోహతి . 

గీ. అల్పులైనను తనవారి అండ నుండి 
వృద్ధి చెందును సుజ్ఞాని పృథివి పైన. 
అల్ప,మైనట్టి ఊకయందమరకుండ 
తండులంబెటు మొల్చును? ధర్మ మిదియె.
భావము. తనవారు అల్పులైనా సరే , వారితో కలిసి ఉన్నవాడే శ్రేయస్సును పొందగల్గుతాడు. పొట్టు (ఊక) అల్పమైనదే.కానీ అది లేకుండా వడ్లగింజ మొలకెత్తదు కదా !
జైహింద్.

17, జూన్ 2014, మంగళవారం

వేపథుర్మలినం వక్త్రం ,...మేలిమి బంగారం మన సంస్కృతి, 227..

1 comments

జైశ్రీరామ్.
శ్లో. వేపథుర్మలినం వక్త్రం , దీనా వాగ్గద్గః స్వరః
మరణే యాని చిహ్నాని , తాని చిహ్నాని యాచకే.
క. యాచన మృత్యు సమానము. 
యాచించెడు వాని మలినమావనంబౌన్
యాచకు పలుకులు వణకును.
యాచకుఁడును మృతుని పోలు యాచన వేళన్.!

భావము. వణకుతో ముఖం మలినమైపోతుంది , దీన భావంతో వాక్కు గద్గదమౌతుంది. మరణసమయంలో ఏ చిహ్నాలు వస్తాయో అవన్నీ యాచకునిలో కనిపిస్తాయి. (యాచన - మరణంతో సమానం)
జైహింద్.

16, జూన్ 2014, సోమవారం

ఫణినో బహవః సంతి భేక భక్షణ తత్పరాః...మేలిమి బంగారం మన సంస్కృతి, 226.

1 comments

జైశ్రీరామ్.
శ్లో.ఫణినో బహవః సంతి భేక భక్షణ తత్పరాః
ఏక ఏవహి శేషో యం ధరణీ ధరణ క్షమః. 
క. కప్పలను తినెడి ప్లాములు 
తెప్పలుగానుండు కాని దివ్య ధరిత్రిన్ 
గొప్పగ మూపున మోసెడు 
నప్పలువురి లోననొకఁడె యధిపతి యననౌన్. 
భావము. కప్పలను తినటంలో ఆసక్తిగల పాములు చాలాఉన్నాయి. కానీ , భూ భారాన్ని వహించగల సామర్థ్యం , ఓర్పు గలవాడు శేషుడు ఒక్కడే.
జైహింద్.

15, జూన్ 2014, ఆదివారం

పుణ్యస్య ఫలమిచ్ఛంతి ....మేలిమి బంగారం మన సంస్కృతి, 225.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. పుణ్యస్య ఫలమిచ్ఛంతి, పుణ్యం నేచ్ఛంతి మానవాః
న పాప ఫలమిచ్ఛంతి, పాపం కుర్వంతి యత్నతః.  

ఆ. పుణ్య ఫలము కోరు, పుణ్యంబు చేయరు.   
పాప కార్య పరులు. పాప ఫలము
వలదు వలదనంద్రు, వలదన్న వదలునా?
పుణ్యకర్తవగుము పూజ్య సుగుణ!
భావము. మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారేగానీ, పుణ్యకార్యాచరణకు ఇష్టపడరు! పాపఫలాన్ని కోరరు గానీ, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటారు!
జైహింద్.

14, జూన్ 2014, శనివారం

మనీషిణః సంతి న తే హితైషిణః .....మేలిమి బంగారం మన సంస్కృతి, 224.

1 comments

జైశ్రీరామ్
శ్లో. మనీషిణః సంతి న తే హితైషిణః 
హితైషిణస్సంతి న తే మనీషిణః
సహృచ్చల విద్వానపి దుర్లభో నృణాం 
యథౌషధం స్వాదు హితంచ దుర్లభమ్.

ఆ. బుద్ధిమంతులహిత మూర్తులు కావచ్చు. 
హితము కోరు జ్ఞానమతులునరుదు.
హితము కోరు జ్ఞాన మతులుకల్గుటయన్న, 
మందు రుచిగనొప్పి ముందునుంట.
భావము. బుద్ధిమంతులున్నా, వారు హితాన్ని కోరేవారు కాకపోవచ్చు. హితాన్ని కోరేవారున్నా , వారు విద్వాంసులు కాకపోవచ్చు. సహృదయులు,విద్వాంసులు కూడా ఐనవారు – రుచిగల ఔషధం వంటివారు. మానవులలో అలాంటివారు లభించటం చాలా అరుదు.
జైహింద్.

13, జూన్ 2014, శుక్రవారం

ఉగాది స్వరాలులో విజేత డా.ఆచార్య ఫణీంద్ర.

4 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! అంతర్జాల మాస పత్రిక శిరా కదంబం జయ ఉగాది సందర్భంగా నిర్వహించిన ఉగాది స్వరాలు కవిసమ్మేళనంలోవిదిగ్గజ డా. ఆచార్య ఫణీంద్ర వ్రాసిన రెండు కోకిలలు ఉత్తమ కవితగా ఎంపిక చేయబడినట్లు ప్రకటించినారు. 
https://sites.google.com/site/siraakadambam/home/03017
ఈ సందర్భంగా డా. ఆచార్య ఫణీంద్ర గారిని మనసారా అభినందిస్తూ
ఈ ఉగాది స్వరాలలో పాలుపంచుకొన్నవారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. 
ముఖ్యంగా శిరాకదంబం మాస పత్రిక నిర్వాహకులైన శ్రీ శిష్ట్లా రామచంద్రరావు గారి అత్యద్భుతమైన ఆలోచనా సరళిని, అందుకు తగిన రూపకల్పనను, కవులను, పాఠకులను ప్రోత్సహిస్తున్న విధానమును ప్రశంసింపకుండా ఉండలేకపోతున్నాను. 
వారికి నా హృదయ పూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.
జైహింద్.

ఉద్యంతు శతమాదిత్యా....మేలిమి బంగారం మన సంస్కృతి, 223.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఉద్యంతు శతమాదిత్యా ,ఉద్యంతు శతమిందవః 
న వినా విదుషాం వాక్యైర్నశ్యత్యాభ్యంతరం తమః. 

గీ. వంద సూర్యులు, చంద్రులు వందమంది 
మనసు లోపలి తిమిరమ్ము మాప లేరు. 
ఒక్క సుజ్ఞాని సందేశ మొకటి చాలు,  
మనసు లోపలి తిమిరమ్ము మాప గలదు.
భావము. వందమంది సూర్యులు ఉదయించినా, వందమంది చంద్రులు ఉదయించినా - ఒక జ్ఞానియొక్క సత్సందేశం వింటే తప్ప మనస్సులోని చీకటి నశించదు.
జైహింద్.

12, జూన్ 2014, గురువారం

నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జన మిచ్ఛతి...మేలిమి బంగారం మన సంస్కృతి, 222.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. నిజ సౌఖ్యం నిరుంధానో యో ధనార్జన మిచ్ఛతి
పరార్థం భారవాహీవ క్లేశస్యైవ హి భాజనమ్.

ధనమును సంపాదించుచు 
తనకొఱకది వాడుకొనక దాచుచుచునుండున్ 
తనవారి కొఱకు నెవ్వఁడు 
తనసుఖమును వీడు నతఁడు. తనదుఃఖమదే.
భావము. తన సుఖాన్ని కాదనుకొని , ఎవడు ధనాన్ని సంపాదించాలనుకుంటాడో , వాడు - పరులకోసమే బరువులు మోసేవాడై కేవలం దుఃఖపాత్రుడౌతాడు.
జైహింద్.

11, జూన్ 2014, బుధవారం

దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణం...మేలిమి బంగారం మన సంస్కృతి, 221.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. దుర్జనస్య విశిష్టత్వం పరోపద్రవ కారణం !
ఉపోషితస్య వ్యాఘ్రస్య పారణం, పశుమారణమ్ ! 
గీ. దుష్టులందున శాంతము దురిత కరము. 
సమయమునకు వేచి సహించి, సమయఁ జేయు.
ఆకలిగనుండు పులి జంతు వమరు వరకు.
చంపి భక్షించు నమరిన సహజ మదియె.
భావము. దుర్జనుడు సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే , అది పరులకు మరింత హాని చేయటానికే ! ఉపవాసం ఉన్న పులి చేసే పారణం , (ఉపవాసానంతర భోజనం) పశు మారణమే కదా !
జైహింద్.

10, జూన్ 2014, మంగళవారం

అర్థాతురాణాం న గురు ర్న బంధుః,...మేలిమి బంగారం మన సంస్కృతి, 220.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అర్థాతురాణాం న గురు ర్న బంధుః, 
కామాతురాణాం న భయం న లజ్జా,
క్షుధాతురాణాం న రుచి ర్న పక్వం, 
విద్యాతురాణాం న సుఖం న నిద్రా.

క. ధన రతులకు గురు, బంధులు
ననయము కామాతురులకునన భయ, లజ్జల్. 
పెనుక్షుధులకు రుచి, పక్వము, 
ఘన విద్యార్థికి కునుకు సుఖములుండవుగా.
భావము. ధనదాహం గలవాడికి గురువు లేడు, బంధువూలేడు. కామాతురునికి భయము, సిగ్గూ లేవు. ఆకలితో సతమత మౌతున్నవాడికి రుచి లేదు, ఉడికినదా, లేదా ? అనే ప్రశ్నయు లేదు. విద్య కొఱకు ఆతురత పొందువానికి సుఖము, నిద్రా లేవు.
జైహింద్.

9, జూన్ 2014, సోమవారం

అకర్తవ్యేష్వసాధ్వీవ తృష్ణా ప్రేరయతే...మేలిమి బంగారం మన సంస్కృతి, 219.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అకర్తవ్యేష్వసాధ్వీవ తృష్ణా ప్రేరయతే జనం
తమేవ సర్వ పాపేభ్యో లజ్జా మాతేవ రక్షతి. 

ఆ. సాధ్వి కాని వనిత చందమౌనత్యాశ. 
చేయరాని పనులు చేయఁ జేయు.
కన్నతల్లి యట్లు కాపాడు సల్లజ్జ, 
చెడును చేయనీక నడుపు చుండు.
భావము. దుష్ట స్త్రీ వలె , అత్యాశ - మానవులను చేయరాని పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. లజ్జ (సిగ్గు) మాత్రం కన్నతల్లి వలె వారిని సమస్తపాపాలనుండి (చెడు పనులు చేయనీయకుండా) కాపాడుతుంది.
జైహింద్.

8, జూన్ 2014, ఆదివారం

శరీరస్య గుణానాం చ దూరమత్యంత మంతరం....మేలిమి బంగారం మన సంస్కృతి, 218.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. శరీరస్య గుణానాం చ దూరమత్యంత మంతరం
శరీరం క్షణవిధ్వంసి కల్పాంతస్థాయినో గుణాః.

క. దేహము క్షణ భంగురమే.
దేహస్థిత గుణము స్థిరము.దేహస్థులు వ్యా 
మోహము విడనాడుచు తమ 
దేహముతో శుభముఁ గూర్చి దీపించ తగున్.
భావము. శరీరానికీ , గుణాలకూ చాలా అంతరం ఉంది. శరీరం క్షణంలో నశించిపోయేది. గుణాలు మాత్రం కల్పాంతానికి కూడా నిలిచి ఉంటాయి.
జైహింద్.

7, జూన్ 2014, శనివారం

కర్తరీ బంధ కందము. శ్రీవల్లభ కృతము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి కృత కర్తరీ బంధ కందమును తిలకించండి.
జైహింద్.

6, జూన్ 2014, శుక్రవారం

ఖేట బంధ గీతము. శ్రీవల్లభ కృతము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి కృత ఖేట బంధ గీతమును తిలకించండి.
జైహింద్.

5, జూన్ 2014, గురువారం

గుణః భూషయతే రూపం,...మేలిమి బంగారం మన సంస్కృతి, 216.

1 comments

జైశ్రీరామ్.
శ్లో. గుణః భూషయతే రూపం, శీలం భూషయతే కులం 
సిద్ధిః భూషయతే విద్యాం, భోగః భూషయతే ధనమ్.

ఆ. గుణము చేత రూపు, కులమది శీలమున్, 
సిద్ధి చేత విద్య, చిద్గుణోప
భోగమున ధనంబు, భూషణంబగునయ్య.
రమ్య సుగుణ ధామ! రామ కృష్ణ!
భావము. రూపాన్ని గుణము , కులాన్ని శీలము, విద్యను సిద్ధి (విద్య ద్వారా నేర్చిన దాన్ని ఆచరించటం), ధనాన్ని భోగము ( సద్వినియోగం చేయటం) రాణింప జేస్తాయి.
జైహింద్.

4, జూన్ 2014, బుధవారం

వరమసిధారా, తరుతల వాసో...మేలిమి బంగారం మన సంస్కృతి, 215

1 comments

జైశ్రీరామ్.
శ్లో. వరమసిధారా, తరుతల వాసో, 
వరమిహ భిక్షా, వరముపవాసః,
వరమపి ఘోరే నరకే పతనం, 
న చ ధన గర్విత బాంధవ శరణమ్.

గీ. కత్తి యంచున నడచుట, కడగి చెట్ల 
నీడఁ బ్రతుకుట, భైక్ష్యంబుతోడ నుంట,
నిరశనంబున నుండుట, నరకముంట
మేలు ధన గర్వ బంధువు మ్రోల కన్న.
భావము. ధనగర్వంతో మిడిసిపడే బంధువులను ఆశ్రయించటం కంటె, కత్తి అంచు మీద నడవటం, చెట్టు నీడలో నివసించటం, బిచ్చమెత్తుకోవటం, నిరాహారియై ఉండటం , చివరకు నరకంలో పడటమైనా శ్రేష్ఠం.
జైహింద్.

3, జూన్ 2014, మంగళవారం

కరావివ శరీరస్య , ....మేలిమి బంగారం మన సంస్కృతి, 214

1 comments

జైశ్రీరామ్.
శ్లో. కరావివ శరీరస్య , నేత్రయోరివ పక్ష్మణి
అవిచార్య ప్రియం కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే. 
ఆ. దేహమునకు మేలు దేహ భాగములెట్టు 
లప్రయత్నముగనె యరసి చేయు 
నటులె చేయుచుండు నరసి సన్మిత్రుఁడు. 
మిత్రుఁడనిన యతఁడె ధాత్రిపైన.
భావము. శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.
జైహింద్.

2, జూన్ 2014, సోమవారం

గాన గంధర్వుని గాత్రంలో జాషువా గారి శిశువు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మహా కవి జాషువా రచించిన  శిశువు ఖండికను గాన గంధర్వుఁడైన గంటశాల వేంకటేశ్వరరావు గారి గాత్రంద్వారా విని ఆనందించండి.


శిశువు గురించి శ్రీ జాషువా కవి  పద్యాలు
గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర.

ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు
దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?
దివంగతులైయున్న ఇరువురు మహనీయులకు జోహారులు.
జైహింద్.

1, జూన్ 2014, ఆదివారం

యుగాంతే ప్రచలేన్మేరుః ...మేలిమి బంగారం మన సంస్కృతి 213.

1 comments

 జైశ్రీరామ్.
శ్లో. యుగాంతే ప్రచలేన్మేరుః , కల్పాంతే సప్త సాగరాః
సాధవః ప్రతిపన్నార్థాన్న చలంతి కదాచ న. 
క. మేరువు కదిలిన కదులును, 
మేరలధిగమింప వచ్చు మేదిని జలధుల్,
నోరార పలికు మాటలు
మీరరు భువి సాధు జనులు మేరువు పడినన్.
భావము. యుగాంతంలో మేరు పర్వతం చలించవచ్చుగాక. కల్పాంతంలో సప్త సముద్రాలూ తమ మేరలు మీరవచ్చుగాక సజ్జనులు మాత్రం ఏనాడూ తాము పలికిన మాటలనుండి చలించరు.(మాట తప్పరు)
జైహింద్.