గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 49వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

49. ఓం విభవే నమః.

ప్రియకాంతా వృత్తగర్భ సీసము.    

కలియుగ ధర్మంబు కనుచు గర్వింతువ - దేమో కృపాసాంద్ర! శ్రీమహేశ!

తెలిసియునిట్లీవె మలచితే, మాకు మ - హాత్మా! నిరోధించి యాపలేవ?

చలమది నీకేల? కలుష సంహారక! - దేవాది దేవా! ప్రదీప్తినిమ్ము.

ఖల సువిదారుండ! కనుచు కాపాడఁగ - రారా! పరంధామ! రక్షనీవె.     

గీ. అనుపమ *విభవా*! కలియుగమందు కృతము - వరలఁ జేయుమ సుఫలదా! ప్రవరముగను.

భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!

49వ సీస గర్భస్థ ప్రియకాంత వృత్తము. (న య న య స గ .. యతి 11)

కలియుగ ధర్మంబు కనుచు గర్వింతువదేమో!

తెలిసియునిట్లీవె మలచితే, మాకు మహాత్మా! 

చలమదినీకేల? కలుష సంహారక దేవా!

ఖల సువిదారుండ! కనుచు కాపాడఁగ రారా! 

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! కృపాసాంద్రు!ండవైన ఓ మహా దేవా అదెందువలననో

కాని కలియుగ ధర్మమును చూచి నీవు గర్వించుచుందువు. .అన్నియూ తెలిసి కూడా ఈ విధముగా ఎందులకు

సృజించితివి?  ఓ మహాత్మా! వాటిని అడ్డుకొని ఆపలేవా?  ఓ దేవాదిదేవా! ఓ కలుష సంహారకా! నీకు కోపమేల.మాలో దీప్తిని

కలుగఁ జేయుము. ఓ దుష్ట విదారకా! ఓ పరంధాముఁడా! చూచుచు మమ్ము కాపాడగా రా. మాకు రక్ష నీవే సుమా.సాటిలేని

వైభవ సంపన్నుడా! ఓ సుఫలదా! ఈ కలియుగమును నీవు కృతయుగముగా వరలఁ జేయుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.