గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 94వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్

94. ఓం జగత్పాలాయ నమః.

భూతిలక వృత్త గర్భ సీసము.

నీవట నేనిట నిత్యముండుట నీకు - సమ్మతమా? హరీసత్వ భాస!

భావన చేసిన నీవ నేనను భావ - భాగ్యమె భాగ్యమౌన్ భక్తకల్ప!

నీ వర తేజము నేర్పునే మహనీయ - తత్వము మాకిలన్ ధర్మతేజ

నీవిక నన్ విడ నేరవెన్నఁగ, నిత్య - సత్యము నీవెగాసౌమ్య నృహరి!  

గీ. వినుత భూతిలక సువృత్త వేద్య! నిన్నుఁ - గవితనెంతు *జగత్పాల*! కావ్యమగుము.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

94 సీస గర్భస్థ భూతిలక వృత్తము. ( .. యతి 12)

నీవట నేనిట నిత్యముండుట నీకు సమ్మతమా హరీ!

భావన చేసిన నీవనేనను భావ భాగ్యమె భాగ్యమౌన్ 

నీ వర తేజము నేర్పునే మహనీయ తత్వము మాకిలన్ 

నీవిక నన్ విడ నేరవెన్నఁగ నిత్య సత్యము నీవెగా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా!   సత్వగుణమున భాసించువాఁడా! నీవక్కడ, నే నిక్కడ

నిత్యమూ ఉండుట నీకు సమ్మతమా? భక్తకల్పకమా! భావన చేసినచో నేవే నేను అనెడి భావ భాగ్యమే భాగ్యముకదా.

ధర్మతేజా! మాకు నీ తేజస్సే మహనీయ తత్వబోధ చేయును.  సౌమ్యస్వరూపా! నీవిక నను వీడి చనలేవు. మాయనిదగు

సత్యమున్నచో అది నీవే సుమా. భూతిలకవృత్త పద్యమున తెలియబడు జగత్పాలా! నిన్ను కవితలో భావింతును

కావ్యముగా రూపు దాల్చుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.