జైశ్రీరామ్
96. ఓం మహాకాయాయ నమః.
మంగళమణి గర్భ సీసము.
శ్రీపతి! ననుఁ గాంచు, చెలఁగ శ్రీ శుభము లి - లన్ బెక్కు శోభఁ గొల్పగను నీవు
నా పరమయి మంచి నడత నాకొసఁగుమ - యా! నయ వర్తనన్ హాయిఁ గనుదు.
దీపిత నరసింహ! తెలుపుదే నిజమెఱుఁ - గన్ మదిన్ వెలుగొందు కాంతివీవొ?
నా ప్రభువయి నీ వనయము నన్ గనెదవు - గా సత్కృపన్ లసత్ కమల నయన!
గీ. మంగళమణివృత్తస్థుఁడా మహిని నన్నుఁ - గనుమయా *మహాకాయా*! ప్రకాశమిమ్ము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
96వ సీస గర్భస్థ మంగళమణి. (భ స న జ న గ .. యతి 11)
శ్రీపతి! ననుఁ గాంచు, చెలఁగ శ్రీశుభములిలన్.
నా పరమయి మంచి నడత నాకొసఁగుమయా!
దీపిత నరసింహ! తెలుపుదే నిజమెఱుఁగన్.
నాప్రభువయి నీ వనయము నన్ గనెదవుగా?
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ శ్రీపతీ! మిక్కుటముగా శుభములతో వర్ధిల్లునట్లు నన్ను
చేయుటకు నీవు కృపతో నన్ను చూడుము. నీవు నాపరమయి నాకు మంచి ప్రవర్తననొసంగుము నేను
మంచిగా ప్రవర్తించి
సుఖింతును. ప్రకాశించునట్టి ఓ నరసింహా! నిజము తెలుపుదువా? నా మదిలో వెలుగుచుందువా నీవు? చక్కని
పద్మాక్షుఁడా! నీవెల్లప్పుడూ మంచి కృపతో నన్ను చూచుచుందువు కదా. మంగళమణి వృత్తపద్యమున ప్రకాశించువాఁడా!
ఓ మహా కాయా! నన్ను కరుణతో చూచి ప్రకాశమిమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.