గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 95వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్

95. ఓం జగన్నాథాయ నమః

 తారక వృత్త గర్భ సీసము.

నిరుపమా! కననుంటి నిను మనోజ్ఞుఁడ! కావ్య - గతిని దేవా! నాదు కృతిని నిలుమ!

దుస్థితిన్ విన వేడుదు కమలాక్షుఁడ! వేద - ననిక ప్రేమన్ బాపి, నన్ను నిలుపు.

ఉరుగుణ! కనిపించియుఁ గనిపించక క్రాలు - నయమేనా నీకు? ఘన సుచరిత!

శుభదుఁడ! వినిపించుచు కనిపించుము విశ్వ - మున మహాత్మ! నీకు ప్రణుతులిడుదు.

గీ. తారకస్థ! *జగన్నాథ*! తలపు నీది. - కవిగ నే పొందు సత్కృతిన్ ఘనత నీది.

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

95 సీస గర్భస్థ తారక. ( గగ .. యతి 11)

కననుంటి నిను మనోజ్ఞుఁడ! కావ్య గతిని దేవా!

విన వేడుదు కమలాక్షుఁడ! వేదననిక ప్రేమన్.

కనిపించియుఁ గనిపించక క్రాలుట నయమేనా?

వినిపించుచు కనిపించుము విశ్వమున నృసింహా

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సాటిలేనివాఁడా! నిన్ను కావ్యమున చూడనుంటిని

నా కవ్యమగుము. కమలాక్షా! ప్రేమతో నా బాధలను విని పారద్రోలుము. గొప్పగుణములచే ప్రకాశించువాడా! గొప్ప

సచ్చరిత కలవాడా! నాకు కనిపించీ కనిపించనట్లు ఉండుటన్నది తగునా? శుభదుఁడా! నీవు మాకు లోకమునందు

సుశబ్దరూపమున వినిపించుచు కనిపించుము.తారకవృత్తపద్యస్థా! జగన్నాథా! రచన విషయమున ఆలోచన నీదే,

కవిగా  నేను పొందెడి సకృతిలో ఘనతయు నీదే

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.