గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 42వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

42. ఓం వికరాళాయ నమః.

సర్వలఘు మధ్యాక్కర గర్భ సర్వలఘు సీసము.  

జనితమగు సకలము నిజ జనితము కదటయ నృ - హరి! కనఁగ ఘనతకద! నిరుపమమిది.

కనుదునయ నిను. కనుమిక కమలనయనుఁడ! ననుఁ - గృపఁ గిలిగి సుగుణ పథ తపన మొసఁగు.

క్షణమయిన నిక విడువక, కనులనిడుకొని కను - మయ దయను. సురవినుత మహితవరద!  

గుణగణననిక మరువకు గురువరుని పగిది సు - లభ! శుభద! గుణము గని, యభయమొసఁగు.

గీ. వేల్పువయి కాచు *వికరాళ*! వేడెద నిను - దౌష్ట్యమడచుచు కావఁగన్ ధర్మమిలను.  

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

42 సీస గర్భస్థ సర్వ లఘు మధ్యాక్కర. (2 ఇం.. 1 సూ.. 2 ఇం.. 1 సూ. .. యతి 4

                                                 గణము 1 అక్షరం. 4పాదములు)

జనితమగు సకలము నిజ జనితము కదటయ నృహరి!

కనుదునయ నిను. కనుమిక కమలనయనుఁడ! ననుఁ గృప.

క్షణమయిన నిక విడువక, కనులనిడుకొని కనుమయ.

గుణగణననిక మరువకు గురువరుని పగిది, సులభ

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పుట్టబడుచున్నవన్నియు నీచే పుట్టింపబడుచున్నవేకదా

ఇది ఘనమైనదే, సాటియు లేనిది. నేను నిన్ను చూచెదను, నీవును నన్ను చూడుము. కృపను కలిగి సుగుణతపనను

నాకొసగుము. దేవతలచే పొగడబడెడి గొప్ప వరదుఁడా! ఇంక క్షణకాలమయినను నన్ను విడువకుండా దయతో నన్ను

చూడుము. సులభుఁడా! శుభదుఁడా! ఇక గురువరుని వలె గుణగణనమును మరువకుము.. గుణము చూచి

నాకభయమొసగుము. .దేవతామూర్తివై కాపాడే వికరాళా! నిన్ను దౌష్ట్యములనణచుచు ధర్మమును కాపాడుమని నిన్ను

వేడుకొందును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.