జైశ్రీరామ్
67. ఓం సురేశ్వరాయ నమః.
ప్రహరణకలిత వృత్త గర్భ సీసము.
దీన బంధు నృహరి! తెలియ నీ నిజ ఘన - త నిలన్. బ్రభా పూర్ణ! దర్ప హరుఁడ!
కలిగినట్టి సహన ఘనతచే జయములు - కనితిన్ గదా నీదు కరుణ చేత.
గొప్పదైన యిహము కొలుపు నీహృదయమ - ది భువిన్ పరాత్పరా! త్రిభువనేశ!
జ్ఞాన మిచ్చి, మహిమఁ గనునటుల్ మలచుమ - మములన్ మహాదేవ! మా నృసింహ!
గీ. పాప ప్రహరణ గుణగణ శ్రీపతివయ! - జయము ధీరా! *సురేశ్వరా*! జయము జయము.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
67వ సీస గర్భస్థ ప్రహరణకలిత వృత్తము. (న న భ న వ .. యతి 8)
నృహరి! తెలియ నీ నిజ ఘనత నిలన్.
సహన ఘనతచే జయములు కనితిన్ .
యిహము కొలుపు నీహృదయమది భువిన్.
మహిమఁ గనునటుల్ మలచుమ మములన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! దీనబంధూ! నీ ఘనత తెలిసికొనుట కొఱకు నాకు
కలిగియున్న సహనము యొక్క గొప్పతనము చేతజయమునందితిని, అది నీకరుణచేతనే సుమా. ఓ త్రిభువనేశా! నీ
గొప్ప మనసు ఇహమును ప్రాప్తింప చేయుట కోసము మాకు జ్ఞానమును ప్రసాదించి, మహిమమును కనునట్టుల
మమ్ములను మలచుము. పాప ప్రహరణ గుణగణుఁడవయిన లక్ష్మీపతివి, ఓ సురేశ్వరా! నీకు జయము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.