గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 107వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

107. ఓం ధీరాయ నమః.

జాగ్రత్ వృత్త గర్బిత సీసము.

1. ఒకమారు నరసింహుఁడ కరుణించుచు ననుఁ - బ్రోవఁగ రావాప్రభూ! మహాత్మ!

భువిపైని భరమా కరి వరదా! కని వర - లం గన లేవా? ఖల పరిహార!

సత్పూజ్య చరణాంబుజ వర సేవలె జయ - మార్గము నాకున్సమస్తమునకు.  

సకల భాసుర సేవిత! కరుణించుటె సుక - రంబది నీకున్వరంబు నాకు.

2. స్థితిఁ గొల్పు జయభారతి శుభ హారతి జయ - దంబగు నీకున్ ఘనంబుగాను.

స్తవనీయ ప్రియముల్ గన వరలింపుము శ్రిత - రక్షక దేవానిరంతరంబు

భవదీయ ప్రియ భక్తుల వర సేవలు ప్రియ - మున్ గను నీకున్ సుపూజ్య దేవ

సుజనాత్మజయ మంగళ జయమంగళ చయ - ముల్ నరసింహా!  ప్రపూర్ణ రూప!

గీ. జాగ్రదసమాన సదవస్థ చక్కఁగనిడు. - కరుణఁ గావుమ గుణ *ధీర*! కామితదుఁడ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

107 సీస గర్భస్థ జాగ్రత్ వృత్తద్వయము. ( గగ .. యతి 11) 

1.నరసింహుఁడ కరుణించుచు ననుఁబ్రోవఁగ రావా! - భరమా కరి వరదా! కని వరలం గన లేవా

చరణాంబుజ వర సేవలె జయమార్గము నాకున్, - సుర సేవిత! కరుణించుటె సుకరంబది నీకున్.

2.జయ భారతి శుభ హారతి జయదంబగు నీకున్ ప్రియముల్ గన వరలింపుము శ్రిత రక్షక దేవా!  

ప్రియ భక్తుల వర సేవలు ప్రియమున్ గను నీకున్ జయ మంగళ! జయమంగళ చయముల్ నరసింహా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! మహాత్మా! కరుణించుచు ననుఁ బ్రోచుటకు ఒకమారు

రావేమి? ఖలపరిహారా! ఒకమారు నన్ను చూచి భూమిపై నేను వరలునట్లుగా చేయుట నీకు భారమా? నాకును

సృష్టి కంతటికిని, నీ పవిత్ర పాద సేవయే జయమార్గము కదా. అంతటను ప్రకాశించుచు సేవింపబడువాడా, మమ్ములను

కరుణించుటయే నీకు సుకరము. మాకది వరము. సత్స్థితిని గొలుపునటువంటి జయప్రద భారతి యొసగెడి శుభప్రదమగు

హారతి నీకు గొప్పగా జయప్రదమగును.. ఆశ్రిత రక్షకా! ఎల్లప్పుడూ పొగడదగినవగు స్థితులను మా యందు వరలింపుము.

పూజ్యపరమాత్మా! నీకు నీ ప్రియ భక్తులు చేయు పూజలు ప్రియముగానొప్పును.సుజనులందాత్మవై యొప్పు దేవా!

నీకు మంగళములు. .సుగుణములతోనొప్పు ధీరా! కామితప్రదా! అసమానమైన జాగ్రదవస్థను మాకు చక్కగా

కల్పింపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.