గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 21వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

21. ఓం అఘోరాయ నమః.

బలభిన్మణి వృత్త గర్భ సీసము

నిరుపముఁడవును శ్రీకరుఁడవు, శాశ్వత - శుభదుఁడవే చూడ, శుభ్రతేజ

యిటనుంటినయ్య! ప్రాకటముగ నన్ వర - లఁ గనుమికన్ దేవ! లాలితముగ.

మనమున నన్నుఁ జేకొనఁగఁ దలంచెడి - కరివరదా! హితకారివీవె.

మలిన హరుండ! నీకిలశుభముల్, నిరు పమ నృహరీ! నన్ను వదలఁబోకు

గీ. నయము, భయమును జగతి విస్మయముఁ గొలుపు - ఘోరదూర! *అఘోరా*ఖ్య! కుజన నాశ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

21 సీస గర్భస్థ బలభిన్మణి వృత్తము. ( .. యతి 7)

శ్రీకరుఁడవు, శాశ్వత శుభదుఁడవే. - ప్రాకటముగ నన్ వరలఁ గనుమికన్.

జేకొనఁగఁ దలంచెడి కరివరదా! - నీకిలశుభముల్, నిరుపమ నృహరీ!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! నీతిని, భయమును,

విస్మయమును కలిగించు ఘోరములను దూరము చేయువాడా! అఘోరాఖుఁడా! దుష్టులను నశింపఁ జేయువాడా!  

ఆశ్రితజనమున ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పవిత్రమైన తేజస్సు కలవాఁడా! నీవు

సాటిలేని వాడవు.. మంగళప్రదుఁడవు. శాశ్వితమైన శుభములు క్జూర్చువాడవే సుమా. ఇక్కడుంటిని. నన్ను వరలునట్లుగా

లాలితముగా చూడుమునీ మదిలో నన్ను చేకొన తలచెడి కరివరదా! నీవే హితకారివి. మాలిన్యములను

హరించువాడా! భూమిపై నీకు శుభములగుగాక. సాటి లేని నరసింహా! నన్ను విడువఁ బోకుము.  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.